సంపాదకీయం

పంటకు ప్రగతి తెగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమి విస్తీర్ణం పెరగదన్నది జనమెరిగిన వాస్తవం. జనం పెరుగుతున్న కొద్దీ దేశంలో కాని ప్రపంచంలో కాని జనాభాలోని ఒక్కొక్క వ్యక్తికి లభిస్తున్న సగటు భూమి వాటా తగ్గిపోతోంది. అంతేకాదు, ప్రతి చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభా సాంద్రత పెరిగిపోతోంది. 1947 ఆగస్టు 15న అఖండ భారత్ విభజన జరిగిన తరువాత అవశేష భారత్‌లో దాదాపు పనె్నండున్నర లక్షల చదరపు మైళ్ల లేదా దాదాపు ముప్పయి మూడు లక్షల చదరపుకిలోమీటర్ల భూమి మిగిలింది. అంటే మొత్తం భూమి విస్తీర్ణం దాదాపు ముప్పయిమూడు కోట్ల హెక్టారులు లేదా ఎనబయి మూడు కోట్ల ఎకరాలు. అంటే దేశ జనాభా ముప్పయికోట్ల కంటె తక్కువ ఉండిన 1940 దశాబ్ది చివరిలోను అంతే భూమి ఉంది, నూట ఇరవై ఐదుకోట్లకు పైబడిన ప్రస్తుత జనాభాకు ఇంతే భూమి ఉంది. అంటే ఒక్కొక్క వ్యక్తికి లభించే సగటు భూమి విస్తీర్ణం నాలుగు రెట్లకు పైగా తగ్గింది. ఇది మొత్తం భూమి కథ. వ్యవసాయ భూమి విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుండడం పాలకులకు ప్రజలకు ఆందోళన కలిగించవలసిన పరిణామం. ఈ ఆందోళన ధ్యాస ఉభయులకూ లేకపోవడం వల్ల ప్రమాదాన్ని నిరోధించడానికి ప్రయత్నం జరగడంలేదు. దేశవ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్నవారు క్రమంగా తగ్గిపోతున్నారు. పరిశ్రమలు, వాణిజ్యం, సేవలు, పట్టణాలలో ఉద్యోగాలు నిర్వహిస్తున్నవారి సంఖ్య పెరగడమే ఇందుకు కారణమన్న కృత్రిమమైన సంతృప్తి పాలకులను ప్రజలను ఆవహించి ఉంది. ఎక్కువమంది వ్యవసాయంపై కాక, ఇతర రంగాలపై ఆధారపడి జీవించడం ప్రగతి చిహ్నమన్నది దశాబ్దుల తరబడి జరుగుతున్న ప్రచారం. వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారి సంఖ్య తగ్గిపోవడం వల్ల వ్యవసాయదారులకు లభించే భూమి సగటు వాటా పెరగాలి. అది జరగడంలేదు. గ్రా మీణులకు గ్రామీణ వ్యవసాయదారులకు లభిస్తున్న సగటు భూమి విస్తీర్ణం కూడ ఇరవై ఏళ్లలో 1993వ 2013వ సంవత్సరాల మధ్య సగానికి తగ్గిపోయినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వారి గణాంకాలు నిరూపించాయి. అంటే వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య తగ్గడం కంటె ఇబ్బడి ముబ్బడి వేగంతో వ్యవసాయానికి లభిస్తున్న భూమి విస్తీర్ణం తగ్గిపోతోంది. వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య తగ్గి, వ్యవసాయానికి లభించే భూమి విస్తీర్ణం పెరిగినప్పుడు కనీసం యథాతథంగా ఉన్నప్పుడు మాత్రమే వ్యవసాయదారుల సగటు జీవన ప్రయాణాలు పెరుగుతాయి. కానీ దేశం మొత్తం మీద వ్యవసాయ భూమి తగ్గిపోయింది, తగ్గిపోతోంది. దేశంలోని గ్రామీణ వ్యవసాయ కుటుంబాలలో ఎనబయి శాతానికి ఒక హెక్టారు-దాదాపు రెండున్నర ఎకరాలు- కంటె తక్కువ వ్యవసాయ భూమి ఉంది. కేవలం ఏడు శాతం మందికి రెండు లేదా అంతకంటె ఎక్కువ హెక్టారుల భూమి ఉండడం 2013 నాటి మాట. గ్రామీణ వ్యవసాయ కుటుంబాల సగటు భూమి విస్తీర్ణం ఒక హెక్టారని 1992లో ధ్రువపడింది. కానీ 2013 నాటికి ఒక్కొక్క కుటుంబానికి సగటున అర్థ హెక్టారుకంటె కొంచెం అధికంగా మాత్రమే భూమి ఉంది.
అంటే చిన్న సన్నకారు వ్యవసాయ దారుల కుటుంబాల సంఖ్య పెరిగి ఉండాలి, లేదా వ్యవసాయ భూమిని ఇతర ఉపయోగాలకోసం మళ్లించి ఉండాలి. ఇలా మళ్లిస్తున్నది ప్రభుత్వాలు, బహుళజాతి వాణిజ్య సంస్థలు, స్థిరాస్థి-రియల్ ఎస్టేట్- కామందులు, సిమెంటు కట్టడాల నిర్మాతలు, ప్రత్యేక ఆర్థిక మండల-సెజ్- నిర్వాహకులు. ఇలా ఎందరో..? ఇటీవలి కాలంలో భూనిధి-ల్యాండ్ బ్యాంక్- పేరుతో ప్రభుత్వేతర సంస్థలు గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ భూమిని, అటవీ భూమిని, పశువులు మేయడానికి వీలుగా గ్రామాలలో సమష్టిగా వదలి పెట్టిన పచ్చిక బయళ్లను స్వాహా చేస్తున్నాయి. ఒకచోట ప్రభుత్వం నుంచి భూమిని పొందగలిగిన పారిశ్రామిక సంస్థలు మరోచోట అంతే విస్తీర్ణంలో భూమిని బదలాయించాలన్నది ప్రభుత్వేతర భాగస్వామ్యం-పిపిపి-లోని ఒక వాణిజ్య వ్యూహం. అందువల్ల మూడు పంటలు పండే మాగాణి భూములను అరటితోటలు, కొబ్బరి తోటలు, మామిడి తోటలు తమలపాకుల తోటలు పెరిగిన భూములను పారిశ్రామిక ప్రయోజనాలకోసం ప్రభుత్వ మాధ్యమంగా కాజేస్తున్న బహుళ జాతి వాణిజ్య సంస్థలు ఇతర పారిశ్రామిక వేత్తలు మరోచోట పనికిరాని ఊసర క్షేత్రాలను కొని ప్రభుత్వానికి అప్పగిస్తారట. ఈ ఊసర క్షేత్రాలలో అడవులు, తోటలను పెంచాలన్నది లక్ష్యం. వ్యవసాయానికి పనికిరాని ఊసర క్షేత్రాలలోనే పరిశ్రమలు పెట్టవచ్చు. పంట భూములను సుక్షేత్రాలను కాపాడవచ్చు...కానీ ప్రభుత్వాలకు ఈ ధ్యాస కూడ కలగడంలేదు.
అన్ని రాష్ట్రాలలో వలెనే తెలుగు రాష్ట్రాలలో సైతం ప్రభుత్వాలు నడుములను బిగించి, వేల, లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని పారిశ్రామిక వాటికలకోసం సేకరించి పెడుతున్నాయి. నీటి పారుదల, ప్రజల మంచినీటి అవసరాల కోసం నదులపై, ఉపనదులపై ఆనకట్టలు నిర్మించి బృహత్ జలాశయాలను ఏర్పాటు చేయడం దేశమంతటా కొనసాగుతున్న ప్రగతి. ఇలాంటి పథకాలకోసం వ్యవసాయ భూమిని సేకరించడం న్యాయం కావచ్చు. కానీ సిమెంటు కట్టడాలను, కాలుష్య పరిశ్రమలను కేంద్రీకరించడం కోసం పచ్చని పొలాలను పాడుపెడుతున్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధానిని కేవలం పరిపాలన కేంద్రంగా వెయ్యిలేదా గరిష్ఠంగా రెండు వేల ఎకరాలలో నిర్మించుకొని ఉండవచ్చు. కానీ ముప్పయిమూడు వేల ఎకరాలకు పైగా పంట పొలాన్ని సేకరించారు. ఓడరేవు నిర్మాణానికి, ఉన్న ఓడరేవుల విస్తరణకు వెయ్యి ఎకరాలు అవసరమైన చోట ఐదు నుంచి పదివేల ఎకరాలను సేకరిస్తున్నారు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2002వ, 2014వ సంవత్సరాల మధ్య దాదాపు ఏడున్నర లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని పారిశ్రామిక తదితర ప్రయోజనాల కోసం మళ్ళించారట ప్రభుత్వం వారు...
ప్రవర్థమాన దేశాలలోని వ్యవసాయ రంగాన్ని పాడుపెట్టి, ఆయా దేశాలు తిండిగింజలకోసం సంపన్న దేశాలపై శాశ్వతంగా ఆధారపడే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈ సంపన్న దేశాల బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ఏళ్ల తరబడి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నం పేరు కార్పొరేట్ వ్యవసాయం. ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాలలో దాదాపు నలబయిఐదు శాతం వ్యవసాయ భూమిని ఈ బహుళ జాతి సంస్థలు ఇదివరకే కొనుగోలు చేశాయట. ఈ కార్పొరేట్ వ్యవసాయ క్షేత్రాలలో హరిత ఇంథనం-గ్రీన్ ఫ్యూయల్-, తదితర తినడానికి పనికిరాని ఉత్పత్తులను చేస్తున్నారు. మనదేశంలో సైతం దాదాపు పదిహేను దేశీయ, విదేశీయ, బహుళ జాతి సంస్థలు ఇలా పెద్ద ఎత్తున వాణిజ్య వ్యవసాయం మొదలు పెట్టాయట. కలసి వెరసి ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయే దిశగా వ్యవసాయాన్ని నియంత్రించి నడిపించడం ప్రపంచీకరణ మాయాజాలంలో భాగం. కేరళలోని పాలక్కాడు జిల్లాలో రెండు దశాబ్దులలో వరిపొలాల విస్తీర్ణం సగానికి తగ్గిపోవడం ఈ మాయాజాలానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలోని మొత్తం వరిపొలాలలో ముప్పయి ఎనిమిది శాతం ఈ జిల్లాలోనే ఉన్నాయట. ఈ ముప్పయి ఎనిమిది శాతం పొలాలలో అరవైరెండు శాతం ఉత్పత్తి జరుగుతోందట. అలాంటి బంగారు భూమిని ఇరవై ఏళ్లలో సగానికి పైగా పరిశ్రమలకోసం, నిర్మాణాల కోసం కేటాయించేశారట. దేశంలో రోజుకు సగటున నూటముప్పయి ఐదు హెక్టారుల అడవులు ధ్వసం అవుతుండడం వేరే కథ.