సంపాదకీయం

తేజరిల్లిన తెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదరాసు హైకోర్టు సోమవారం చెప్పిన తీర్పుతో, తెలుగుభాషకున్న ‘వెలుగు’ హోదాకు పట్టిన గ్రహణం తొలగింది. ఈ తెలుగు వెలుగు రెండువేల ఎనిమిది వందల ఏళ్లుగా భారత జాతీయ చరిత్రగతిని ఉజ్వలం చేసింది. దేశభాషలన్నింటిలోను తెలుగు విశిష్టమైనది, విలక్షణమైనది. అందువల్ల సంస్కృత భాషకు వలెనే తెలుగునకు క్లాసికల్ ప్రతిపత్తి శతాబ్దులుగా సహజమైనది. ఈ సహజమైన విద్వత్ భాషా ప్రతిపత్తిని తెలుగువారు మాత్రమే కాక ఇతర భాషలవారు సైతం ప్రస్తుతించి ఉన్నారు. విశిష్ట ప్రతిపత్తి లేదా విద్వత్ భాషా ప్రతిపత్తి- క్లాసికల్ స్టేటస్- ఒక భాష స్వరూప సౌందర్యానికి స్వభావ మాధుర్యానికి ప్రతీక. ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స..’’ అని తెలుగు వల్లభుడైన శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు పలకడం అతిశయోక్తి కాదు. ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలు పలికించడం అతిశయోక్తి కాదు. ఆంధ్రులైన వీరికి తమ భాషను ప్రస్తుతించడం సహజం కూడ. కానీ తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి వంటి పర భాషా పండితులు సైతం తెలుగు వెలుగును ప్రశంసించడం తెలుగు గరిమకు తెలుగు ఘనతకు నిదర్శనం. తమిళనాడులోని కాంచీపురం ప్రాం తంలో నివసించిన మహాకవి, లాక్షణికుడు ‘దండి’ ‘‘మహారాష్ట్రాశ్రయాం భాషా ప్రకృష్టం ప్రాకృతం విదుః’’ అని శతాబ్దులకు పూర్వం ప్రశంసించడం తెలుగు విశిష్టతకు మరో చారిత్రక నిదర్శనం. తెలుగుసీమలు, మహారాష్ట్ర విదర్భ సీమలు కలసి ఉండిన సమయంలో ఈ ప్రాంతమంతటా పరిఢవిల్లిన ప్రాకృత భాష దేశంలోని అన్ని ప్రాకృత భాషలన్నింటిలోను విశిష్టమై ఉన్నదన్నది ‘దండి’ చెప్పిన మాట. ఆయన తెలుగువాడు కాదు. ఈ ప్రకృష్టమైన ప్రాకృతము హాల శాతవాహనుని కాలం నాటిది, తెలుగువారి, త్రిలింగముల చుట్టూ విస్తరించిన ప్రాంతం వారు మాట్లాడినది. ఆంధ్రుల గాథలకు ఆలవాలమైనది. ఈ ప్రాకృతం సం స్కృత భాషనుంచి రూపాంతరం చెందినది, శతాబ్దుల తరబడి స్వరూప, పరిణామ పరివర్తన చెంది తెలుగుగా, కన్నడగా వికసించినది. హాలుని నాటి ప్రకృష్టమైన ప్రాకృతము నేటి తేట తెలుగు. ఈ ప్రకృష్టమైన ప్రాకృతమే, సంస్కృత భాష నుంచి ప్రభవించిన ఈ ప్రాచీన భాషే మరో రూప పరిణామక్రమం పొంది మూల ద్రావిడ భాషగా మారింది. ఆ మూల ద్రావిడం తమిళంగా, మలయాళంగా వికసించడం చారిత్రక వాస్తవం. అందువల్ల ప్రాకృత భాషా మాధ్యమం ద్వారా సంస్కృత భాషకు తెలుగు భాష తమిళం కంటె దగ్గరైనది. ఈ దగ్గరితనం వల్లనే తమిళం కంటె తెలుగు మరింత ప్రాచీనమైనది. ఎందుకంటె ఈ నాలుగు భాషలకు సమానమైన మూల ప్రాకృతం తెలుగుగా మారినప్పటికి తమిళం లేదు..మూల ద్రావిడం మాత్రమే ఉంది. ఒకవేళ సమాన ప్రాకృత భాష నుండి తెలుగు, కన్నడ భాషలు కవలపిల్లల వలె పుట్టిన సమయంలోనే అదే ప్రాకృతానికి మరో రూపమైన మూల ద్రావిడం నుండి తమిళం, మలయాళం విడివడి ఉండవచ్చు. అలా జరిగి ఉండినప్పటికీ తెలుగునకు తమిళంతో సమాన వయస్సు ఉంది.
ప్రాచీన తమమైన భాషలో కంటె ప్రాచీన తరమైన భాషలో ముందుగా సాహిత్య రూపాలైన గ్రంథాలు పుట్టడానికి అవకాశం ఉంది. ఒక భాష వికాసక్రమం మొదలైన తరవాత వెయ్యేళ్ల వరకు ఆ భాషలో సాహిత్య గ్రంథాలు వెలువడకపోవచ్చు. మరో భాషలో వికాసక్రమం మొదలైన తరువాత మూడు నాలుగు వందల ఏళ్లకే సాహిత్య గ్రంథాలు రూపొందవచ్చు. అందువల్ల ‘శిలప్పదికారం’, ‘మణిమేఖల’ వంటి తమిళ సాహిత్య గ్రంథాలు ఆంధ్ర మహాభారతం కంటె ముందు పుట్టి ఉండవచ్చు. కానీ తెలుగుకంటె తమిళం ప్రాచీన తరమని చెప్పడానికి ఇది ప్రాతిపదిక కాజాలదు. ఇతర ప్రాతిపదికలు ఉన్నట్టయితే అది వేరే సంగతి. కానీ తెలుగునకు కన్నడ భాషకు మలయాళ, ఒడిస్సా భాషలకు ‘విద్వత్ ప్రతిపత్తి’ లేదా ‘విశిష్ట ప్రతిపత్తి’ ఇవ్వరాదని హైకోర్టుకెక్కినవారి లక్ష్యం. భాషల మధ్య తులనాత్మక ఉత్కృష్టతను నిర్ధారించడం కాదు. ఎందుకు సకల భారతీయ భాషల స్వరూప స్వభావాలు లక్షణాలు లక్ష్యాలు సమానమైనవి? ఈ భాషలన్నీ కూడ సంస్కృత భాషకు వైవిధ్య రూపాలు. సంస్కృత భాషా మాధ్యమంగా అనాదిగా భారతీయ జాతీయ సంస్కృతి ప్రస్ఫుటించింది. అందువల్ల సంస్కృత భాషా వైవిధ్యాలయిన అన్ని భారతీయ భాషల ద్వారా కూడ కొలంబో నుండి కైలాసం వరకు ఒకే భారతీయ సంస్కృతి అనాదిగా ప్రస్ఫుటించింది. ఈ జాతీయతా సమైక్య స్ఫూర్తిని భగ్నం చేయడం మదరాసు హైకోర్టుకెక్కిన భాషా విద్వేషవాదుల అసలు లక్ష్యం..
ఈ లక్ష్యం బ్రిటన్ సామ్రాజ్యవాదులు బిగించి వెళ్లిన విభజన విష వ్యూహంలో భాగం. నల్లటి హృదయాలు తెల్లని ముష్కరుల రాజకీయ బీభత్సం నుండి దేశానికి విముక్తి కలిగినప్పటికీ వారు సృష్టించిన బౌద్ధిక బీభత్సం కొనసాగుతూనే ఉంది. బ్రిటన్ వారి బౌద్ధిక వారసులు కొనసాగిస్తున్నారు. తెలుగు భాషకు మంచి జరిగితే, కన్నడ భాషకు మేలు జరిగితే ఓర్వలేని తమిళులు కొందరు ఉండడం ఈ కొందరు మొత్తం తమిళ భాషా జనసముదాయానికి తాము ప్రతినిధులమని ప్రచారం చేసుకోవడం ఈ బ్రిటన్ వారసత్వపు కొనసాగింపులో భాగం. అన్ని భారతీయ భాషలూ సంస్కృత భాషా రూపాంతరాలన్నది అనాది వాస్తవం కాగా, దక్షిణ భారతీయ భాషలు సంస్కృతం నుండి రూపొం దలేదని బ్రిటన్ మేధావులు, బిషప్ కాల్ట్‌వెల్ లాంటి వారు, సిద్ధాంతీకరించారు. ఈ కృతక సిద్ధాంతం విభజనకుట్రలో భాగం. ఆ సేతు శీతనగం అనాదిగా ఒకే భారతజాతి కావడం సనాతన వాస్తవం. కానీ దక్షిణ భారతీయులు, ద్రవిడ జాతి అని, ఉత్తర భారతీయులు ఆర్య జాతి అని బ్రిటన్ మేధావులు భిన్న జాతులను కల్పించి పోయారు. అద్వితీయ జాతీయతా వాస్తవాన్ని దశాబ్దుల తరబడి ముక్కలు ముక్కలు చేస్తున్న ఈ రెండు కల్లబొల్లి సిద్ధాంతాలూ ద్రవిడ కజగం వారి విద్వేషపు ఉద్యమానికి ప్రతీకలు. ద్రవిడ కజగం వికృత వాదం ప్రాతిపదికగా రాజకీయ రంగంలోని వచ్చిన ద్రవిడ పక్షాలు, ఈ సాంస్కృతిక విభజనను మరింత విస్తృతం చేశాయి.
ఇలా విస్తృతం చేయడంలో భాగంగానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్ కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె వారు తమిళ భాషకు మాత్రమే క్లాసికల్ హోదా కావాలని 2004లో ప్రతిపాదించారు. 2004 నాటి సంకీర్ణ రాజకీయాల నేపథ్యంలో మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రి నాయకత్వంలోని ఐక్య ప్రగతి కూటమి-యుపిఎ- ప్రభుత్వం కేవలం తమిళ భాషకు క్లాసికల్ ప్రతిపత్తిని కట్టబెట్టింది. తమిళ భాషకు లభించిన ఈ ప్రతిపత్తిని తెలుగు వారు నిరసించలేదు. ఈ స్ఫూర్తితో తమకు కూడ అదే ప్రతిపత్తి కావాలని మాత్రమే తెలుగువారు కోరారు. ఉద్యమించారు, సాధించారు. కానీ ద్రవిడ కజగం విద్వేష భావజాలం నెత్తికెక్కినవారు తెలుగు గరిమను, కన్నడ ఘనతను, మలయాళ పటిమను, ఒడియా ఉత్కృష్టతను గర్తించమంటున్నారు..సూర్యుని వెలుగును గుర్తించమంటున్న గుడ్లగూబలు వారు..మదరాసు హైకోర్టు వారి వాదాన్ని తిరస్కరించడం ద్వారా వారికి తగిన శాస్తి చేసింది. తెలుగు, కన్నడ, తమిళ, మరాఠీ, హిందీ, వంగ భాషలన్నీ భారత భారతీ రూపాలు..సంస్కృతికి మాధ్యమాలు, సంస్కృతానికి వైవిధ్య రూపాలు! తెలుగు మరింత సముజ్వల రూపం, జాతీయతా పరిమళ దీపం!!