సంపాదకీయం

చైనా కొత్త ఎత్తుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పీఓకే-లో చైనా దళాలు తిష్ఠవేసి ఉండడం పాతబడిన సమాచారం. చైనా, పాకిస్తాన్ దళాలు ఉమ్మడిగా ‘సరిహద్దు’ వెంబడి గస్తీ తిరుగుతుండడం సరికొత్త వ్యూహంలో భాగం. లడక్‌లో మన భద్రతా వ్యవస్థ పటిష్ఠమవుతున్న నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తలపెట్టిన సరికొత్త కవ్వింపు చర్య ఇది. చైనాకు, పాకిస్తాన్‌కు మధ్య సహజమైన సరిహద్దు లేదు. లేని సరిహద్దును పాకిస్తాన్ 1948-49వ సంవత్సరాలలో కృత్రిమంగా కల్పించగలిగింది. ఈ కృత్రిమమైన సరిహద్దును ఆ తరువాత వెడల్పు చేయగలిగింది. ఇదంతా మన ప్రభుత్వం 1960వ దశకం వరకు కూలబడి ఉండిన ఫలితం, దురాక్రమణకు ముందు మోకరిల్లిన ఫలితం. ఈ మోకరిల్లిన విధానం 2004-2014వ సంవత్సరాల మధ్య పునరావృత్తం అయింది. అందువల్లనే చైనా ప్రభుత్వం పదమూడు వేలమంది తన సైనికులను 2010లోనే పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోకి పంపగలిగింది. ఇలా పాకిస్తాన్‌కు సంబంధం లేని జమ్మూకశ్మీర్‌లోని కొంత భాగంలో చైనా దళాలు తిష్ఠవేయడం కొనసాగుతున్న కవ్వింపు పన్నాగం. భారత ప్రభుత్వం ఎలా ప్రతిస్పందించగలదన్నది నిర్ధారించుకొనడానికి చైనా చేస్తున్న ప్రయత్నంలో ఈ తిష్ఠ భాగం..2014 మే 26 వరకు మన ప్రభుత్వం నిష్క్రియంగా ఉండిపోయింది. ఈ నిష్క్రియత్వాన్ని వ్యూహత్మక వౌనంగా ప్రచారం చేసిన వారు ఉన్నారు. ‘‘అదేమిటి సిద్దప్పా! పంచాయతీ సభలో గోడకానుకుని కూచొని అలా నిద్ర పోతున్నావు, ఉలకవు పలకవు..!’’ అని సాటి పంచాయతీ పెద్దలు కుదిపి లేపారు. ‘‘అబ్బే నిద్రపోవడం లేదు..ఊహ చేస్తున్నాను’’ అన్నది ఉలిక్కిపడిన సిద్దప్ప చెప్పిన సమాధానం. అందువల్ల 2004వ, 2014వ సంవత్సరాల మధ్య మన ప్రభుత్వాన్ని ఆవహించి ఉండిన నిష్క్రియా పరాయణత్వాన్ని వ్యూహాత్మక వౌనంగానే భావించాలి. గతజల సేతుబంధనం వల్ల ప్రయోజనం లేదు కాబట్టి...ఏమయినప్పటికీ 2014, మే 26వ తేదీ తరువాత మన ప్రభుత్వ విధానం మారిపోయింది. ఆర్భాటం లేకుండా లడక్‌లో మన భద్రతా వ్యవస్థ పటిష్టమవుతోంది. చైనావారి మరో కవ్వింపు చర్యకు ఇదీ కారణం. పాకిస్తాన్‌తో కలిసి చైనా దళాలు ఉమ్మడిగా గస్తీ తిరగడం ఈ మరో రకపు కవ్వింపు చర్య.
చైనాకు, పాకిస్తాన్‌కు మధ్య కృత్రిమమైన సరిహద్దు ఏర్పడడానికి కారణం 1947 అక్టోబర్‌లో జమ్మూకశ్మీర్‌లోకి పాకిస్తాన్ దళాలు చొరబడడం. జమ్మూ కశ్మీర్ వైశాల్యం, దాదాపు రెండు లక్షల ఇరవై మూడు వేల చదరపు కిలోమీటర్లు. ఉత్తర కశ్మీర్‌ను ఆనుకొని సింకియాంగ్-జింఝియాంగ్- ఉంది. ఈ జింఝియాంగ్ క్రీస్తుశకం పద్ధెనిమిదవ శతాబ్ది వరకు స్వతంత్ర దేశం. కానీ ఆ తరువాత చైనా ప్రభుత్వం సింకియాంగ్‌ను తమ దేశంలో కలిపేసుకుంది. అందువల్ల భారత-సింకియాంగ్ సరిహద్దు భారత చైనా సరిహద్దుగా మారింది. సింకియాంగ్ స్వతంత్ర దేశంగా ఉండినట్టయితే కశ్మీర్‌లో మనకు చైనాతో సరిహద్దు లేదు. 1947లో దాడి చేసిన పాకిస్తాన్ దళాలను మన సైనికులు తిప్పికొట్టారు. అయితే ఈ పాకిస్తానీ జిహదీ తండాలను జమ్మూ కశ్మీర్ నుండి పూర్తిగా వెళ్లగొట్టకపోవడం మన ప్రభుత్వం 1948-49లో ఒడిగట్టిన చారిత్రక మహాపరాధం. అందువల్ల జమ్మూకశ్మీర్ పశ్చిమ వాయువ్య ఉత్తర ప్రాంతాలలోని ఎనబయిమూడు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం పాకిస్తాన్ అక్రమ ఆధీనంలో మిగిలివుంది. ఈ పాకిస్తాన్ దురాక్రమణలో ఉన్న మన జమ్మూకశ్మీర్‌కూ, మనకు మిగిలి ఉన్న జమ్మూ కశ్మీర్‌కు మధ్య ఆధీన రేఖ-లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసి- ఏర్పడి ఉంది. తన దురాక్రమణలోని మన ఉత్తర కశ్మీర్‌లోని దాదాపు ఆరువేల చదరపు కిలోమీటర్లను పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకు అప్పగించి ఉంది. పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో చైనా ఉనికికి ఇదంతా చారిత్రక నేపథ్య వైపరీత్యం..
పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌కు ఉత్తరంగా ఇప్పుడు ఇలా చైనా నెలకొని ఉంది. ఈ సరిహద్దునకు ఇరువైపులా ఇటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోను అటు సింకియాంగ్‌లోను జిహాదీ ఉగ్రవాద శిబిరాలు నెలకొని ఉండేవి. జింఝియాంగ్‌లో ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతంలో ఉయఘర్ తెగవారు జిహాదీ కలాపాలకు పాల్పడేవారు. అలాగే పాకిస్తాన్ వైపు నుంచి కూడ జిహాదీ ఉగ్రవాదులు సింకియాంగ్‌లోకి చొరబడేవారు. సింకియాంగ్‌లో ఒకప్పుడు బౌద్ధమతం, వైదిక సంస్కృతి విస్తరించి ఉండేవి. ఎనిమిదవ తొమ్మిదవ శతాబ్దులలో ఈ ‘హూణ’ ప్రాంతంలోకి చొరబడిన జిహాదీలు ఈప్రాంతానికి తూర్పు టర్కిస్తాన్ అని పేరు పెట్టారు. తరువాత ఈ ప్రాంతాన్ని చైనా కబళించింది. గత కొనే్నళ్లుగా చైనా నుండి ఈ ప్రాంతాన్ని విముక్తం చేయాలన్న లక్ష్యంతో జిహాదీలు తూర్పు టర్కిస్తాన్ ఇస్లామీ ఉద్యమం-ఇటిఐఎం- పేరుతో బీభత్సకాండ సాగించారు. పాకిస్తాన్ జిహాదీ ముఠాలు కూడ సహకరించాయి. ఈ జిహాదీ ఉగ్రవాదాన్ని చైనా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదాలతో తొక్కి అణచివేసింది. చైనా ఒత్తిడితో పాకిస్తాన్ ప్రభుత్వం కూడ తన దురాక్రమణలోని కశ్మీర్‌లోని ఉగ్రవాదులను చైనాలోకి ఉసిగొల్పడం మానింది. ఫలితంగా ఈ ఉగ్రవాదులు కూడ మన వైపునకు చొరబడుతున్నారు. ఏమయినప్పటికీ చైనాకిప్పుడు జిహాదీ ఉగ్రహంతకుల బెడద లేదు. జిహాదీలు తమ దేశానికి వ్యతిరేకంగా బీభత్సకాండను జరుపనంతవరకూ వారి ని సమర్ధించాలన్నది చైనా ప్రభుత్వ విధానం. పాకిస్తాన్‌తో చైనా జట్టుకట్టి ఉండడం ఇందుకు కారణం. అందువల్లనే భారత వ్యతిరేక జిహాదీ ఉగ్రవాదులకు చైనా ప్రచ్ఛన్న సహాయాన్ని సమకూర్చుతోంది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ప్రేరిత భారత వ్యతిరేక బీభత్సకాండను సమర్థిస్తోంది. సింకియాంగ్ ప్రాంతంలో ఉయిఘర్ జిహాదీలు చెలరేగినప్పుడు చైనా ప్రభుత్వం పాకిస్తాన్‌తో కలిసి ఉమ్మడి గస్తీ తిరగలేదు. ఇప్పుడు ఉయిఘర్ జిహాదీలు అణగారిపోయిన తరువాత ఉత్తర కశ్మీర్, సింకియాంగ్‌ల మధ్యన ఉన్న సరిహద్దులో పాకిస్తాన్, చైనా దళాలు ఉమ్మడిగా గస్తీ తిరుగవలసిన అవసరం ఏమిటి? మన జమ్మూకశ్మీర్‌లోని తూర్పు, ఈశాన్య భాగమైన లడక్‌లోని అనేక ప్రాంతాలను 1962లోను అంతకు పూర్వం చైనా ఆక్రమించి ఉంది. చైనా దురాక్రమిత ప్రాంతాన్ని, మన ఆధీనంలోని మన భూమికీ మధ్య ‘వాస్తవాధీనరేఖ’-ఎల్‌ఏసి- ఏర్పడి ఉంది.
ఈ ఎల్‌ఏసిని దాటి చైనా దళాలు మనదేశంలోకి పదేపదే చొరబడడం దశాబ్దుల చరిత్ర. కానీ 2014, మే 26 తర్వాత ఇలా చొరబడిన చైనా సైనికులను మన భద్రతాదళాలు రేఖ ఆవలికి నెట్టివేస్తున్నారు. అందువల్ల చైనా చొరబాట్లను తగ్గించింది. భారత్ వౌనంగా ఉండిపోదన్నది చైనా గ్రహించిన వాస్తవం. మనదేశం ప్రస్తుత దశలో చైనాను ఓడించలేకపోవచ్చు. తాము కూడా భారత్‌ను ఓడించలేమన్నది చైనా కమ్యూనిస్టు పాలకులు గ్రహించిన వాస్తవం. అందువల్ల చైనా కొత్త ఎత్తుగడలకు పూనుకొంది. పాకిస్తాన్‌తో కలిసి ఉమ్మడి గస్తీ తిరగడం ఆరంభించింది. ఉయిఘర్ జిహాదీలను అదుపు చేయడానికి ఈ ఉమ్మడి గస్తీ అవసరమని చైనా అంటోంది. కానీ అణగారిన తీవ్రవాదులను ఇప్పుడు కొత్తగా అదుపు చేయాల్సిన పని ఏమిటి? మన సరిహద్దులలో తన సైనికులను పెంచడానికి మాత్రమే చైనా ఈ కొత్త ఎత్తుగడను ఎత్తింది..