సంపాదకీయం

‘తోక’ పార్టీ ముద్ర పోయేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెపి రాష్ట్ర నేతల్లో పరివర్తన వచ్చింది. అంతే కాదు సమయమూ కలిసి వచ్చిందన్న భావన కలిగింది. 20 ఏళ్ళలో ఎప్పుడూ లేనంతగా బలమైన ప్రతిపక్షం లేకుండా రాజకీయ శూన్యత ఏర్పడినందున, దానిని తమకు అనుకూలంగా మలచుకోవాలన్న ఆరాటమూ ఆరంభమైంది. ముప్పయి ఏళ్ళుగా తోక పార్టీగానే ముద్ర పడినందున, ఇక స్వతహాగా బలపడాలన్న ఆలోచన చేస్తున్నారు బిజెపి నాయకులు. తోక పార్టీ అనే ముద్రను తొలగించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల నుంచి మొదలుకుని 1994, 1999, 2004, 2009లో మహాకూటమిలో కలిసి పని చేసినంత వరకూ తోక పార్టీగానే ముద్ర పడింది. ప్రజాకర్షణ కలిగిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్న తర్వాత కూడా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోలేకపోతే ఎలా? అనే అభిప్రాయానికి నాయకులు వచ్చారు. పైగా అస్సాంలోనే అధికారాన్ని చేపట్టినప్పుడు, తెలంగాణలో విపక్షాలు బలహీనపడి ఏర్పడిన రాజకీయ శూన్యతను అవకాశంగా చేసుకోలేకపోతే మళ్లీ ఇటువంటి అవకాశం రాదన్న భావనతో వారున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో ‘జత’ కడితే తమిళనాడు తరహాలో పార్టీ భూస్థాపితం అవుతుందన్న భయమూ లేకపోలేదు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత టిడిపి, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆ పార్టీలోకి వలస బాట పట్టారు. ఇంకా ఎంత మంది చేరుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసలు ప్రారంభంకావడంతో అది తమకే లాభం కలుగుతుందన్న భరోసాకు బిజెపి రాష్ట్ర నేతలు వచ్చేస్తున్నారు. ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్, టిడిపిలు బలహీనపడడంతో ప్రత్యామ్నాయ శక్తిగా బలపడేందుకు అవకాశాలు పెరుగుతాయని వారు సంతోషిస్తున్నారు. నిజానికి సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి 15 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా, ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలే మిగిలారు. మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఎంపి మల్లారెడ్డి కూడా టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పంచన చేశారు. వీరిలో 13 మంది మాత్రమే మిగిలారు. లోక్‌సభకు ఇద్దరు ఎంపికైతే ఒక్కరే మిగిలారు. ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి టిఆర్‌ఎస్ ‘కారు’ ఎక్కారు.
దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలాన్ని పెంచుకోవాలని బిజెపి అగ్రనాయకత్వం దృఢ సంకల్పంతో ఉంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిన ఎక్కడైనా సీట్లు తగ్గినా, ఆ సంఖ్య దక్షిణాది రాష్ట్రాల నుంచి నింపుకోవాలని ఆలోచన. ఇందులో భాగంగానే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు అవకాశం ఉందని పార్టీ అగ్రనాయకత్వం బలంగా విశ్వసిస్తున్నది. అందుకే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నెల రోజుల క్రితం శంషాబాద్‌లో మండల పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పక్షం రోజులు తిరగకుండానే సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మళ్లీ సెప్టెంబర్ నెలలో రాబోతున్నారు. అంతేకాదు తరచూ తెలంగాణలో పర్యటించేందుకు సన్నాహాలూ చేస్తున్నారు. ఇటీవల పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 90 వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయంగా ఇచ్చామని కేంద్రం ప్రకటించడంతోనే టిఆర్‌ఎస్ భగ్గుమన్నది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రతిస్పందిస్తూ 90 వేల కోట్లు కాదు ఇచ్చింది 35 వేల కోట్లేనని అన్నారు. మంత్రి ఈటెల సవాల్‌ను స్వీకరిస్తూ వెంటనే బహిరంగ చర్చకు పిలుపు ఇచ్చి ఉంటే బాగుండేదని పార్టీ రాష్ట్ర నాయకుల మనోగతం. హైదరాబాద్‌లో ఐసిస్ ఉగ్రవాదులను ఎన్‌ఐఎ అరెస్టు చేయడంతో, ఆ ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపైనా వెంటనే స్పందించి ఆ పార్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. మజ్లిస్‌ను నిషేధించాలని, అసద్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఇసి వద్ద పిటీషన్ దాఖలు చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం లేకపోలేదు. ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు వెంటనే ఉపయోగించుకోవడంలో మున్ముందు జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు.
ఇక కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న చందంగా టిడిపి, కాంగ్రెస్‌ను టిఆర్‌ఎస్ అణగదొక్కడంతో, ప్రతిపక్షాల్లో మూడో స్థానంలో ఉన్న తాము మొదటి స్థానానికి వచ్చామని బిజెపి నేతలు సంతోషిస్తున్నారు. ఎన్‌సిసి వరుసలో వెనకాల ఉన్న స్టూడెంట్ పీచేముడ్ అనడంతో మొదటి వ్యక్తి అయినట్లే ప్రతిపక్షాల్లో తామూ ముందు వరుసకు వచ్చామన్న సంతోషం బిజెపి నేతల్లో కనిపిస్తున్నది. వివిధ పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ప్రజాప్రతినిధులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తానన్న హామీని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతున్నది. వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుంచి 153కు పెరుగుతాయన్న భరోసా కల్పిస్తున్నారు.
ఒకవేళ సిఇసి అందుకు అంగీకరించక, ఏదైనా సాంకేతిక, న్యాయ పరమైన చిక్కులతో ఆ ప్రయత్నం బెడిసి కొడితే టిఆర్‌ఎస్‌లో చేరిన వివిధ పార్టీల ఎమ్మెల్యేల సంగతేమిటీ? అప్పుడు అక్కడా అసంతృప్తి జ్వాల రగులుతుంది. సీట్లు రావు అనుకున్న నేతలు ప్రత్యామ్నాయ శక్తిగా నిలదొక్కుకున్న బిజెపిలోకి రాక తప్పదని, రాలేని వారు అక్కడే కుంపట్లు పెట్టి తమకు టిక్కెట్ రాకుండా మరొకరికి ఇచ్చిన అభ్యర్థిని ఓడించే ప్రయత్నం చేస్తారని, ఫలితంగా బిజెపికి మేలు జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుల అంచనా. సీట్లు పెరిగినా నష్టం లేదని, మెజారిటీ సీట్లలో పోటీ చేసి ప్రధాన ప్రతిపక్ష స్థాయికైనా ఎదగవచ్చని అంచనా. కాలం కలిసి వస్తే అధికారంలోకి రావచ్చని, లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా నిలదొక్కుకుని 2024 ఎన్నికల నాటికైనా అధికారం చేపట్టవచ్చని బిజెపి నేతలు లెక్కలు వేస్తున్నారు.
వీటితో పాటు పార్టీ నిర్మాణానికీ సమగ్ర ప్రణాళికతో రోడ్ మ్యాప్ రూపొందించే దిశలో రాష్ట్ర పార్టీ నాయకులు నిమగ్నమయ్యారు. తెలంగాణలోని 32 వేల బూత్‌లకు వెంటనే పార్టీ కమిటీలు నియమించాలని, ఈ నెలాఖరులోగా జిల్లా, మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకుని ఆగస్టు నుంచి ప్రజా సమస్యలపై విజృంభించి పోరాటం చేయాలని బిజెపి భావన.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి