సంపాదకీయం

‘చేదు’కక్కుతున్న చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అణు సరఫరాల బృందం-న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్-ఎన్‌ఎస్‌జి-లో మన ప్రవేశాన్ని చైనా వ్యతిరేకిస్తుండడం ఆశ్చర్యం కాదు. ఈ వ్యతిరేకతను అతిక్రమించి ఈ బృందంలో సభ్యత్వాన్ని పొందడానికి మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా? అన్నదే ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తున్న అంశం! ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం పొందడానికి మన దేశానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మన సభ్యత్వాన్ని చైనా బాహాటంగా వ్యతిరేకిస్తుండడానికి ఏకైక కారణం మన ఎదుగుదల! అంతర్జాతీయంగా మన దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యం చైనా కడుపులో మంటలను చెలరేగుతున్నాయి. గతంలో కూడ చైనా అనేక అంశాలలో మనపట్ల తీవ్ర వ్యతిరేకతను వెళ్లగక్కింది. కానీ ఆ వ్యతిరేకత ప్రత్యక్షమైనది కాదు, ప్రచ్ఛన్నమైనది. ఎందుకంటే అనేక అంతర్జాతీయ సమస్యల విషయంలో మన ప్రభుత్వం చైనాకు అనుకూలంగా ప్రవర్తించింది. ఆత్మహత్యా సదృశమైన ఈ విధానాన్ని మన ప్రభుత్వం అవలంబించిన సమయంలో కూడ చైనా పరోక్షంగా మన దేశాన్ని వ్యతిరేకించడానికి కారణం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని చైనా ప్రభుత్వానికి మన దేశం పట్ల కల సహజమైన శత్రుత్వం. ఆసియా అభివృద్ధి బ్యాంక్ వారు మన అరుణాచల్ ప్రదేశ్‌లో సంక్షేమ, ప్రగతి పథకాలను అమలు జరుపడానికి వీలుగా పదేళ్ల క్రితం ఋణాలను మంజూరు చేసారు. కానీ మంజూరైన ఋణాలను చైనా ప్రభుత్వం రద్దు చేయించింది. మన లక్ష ద్వీపాలకు నైరుతి దిశలోని హిందు మహాసముద్ర గర్భంలో అపురూప సంపద కోసం అనే్వషణ జరపడానికి వీలుగా చైనా ప్రభుత్వానికి అంతర్జాతీయ సముద్ర గర్భ సంస్థ అనుమతిని మంజూరు చేసింది. ఈ ప్రాంతంలో అనే్వషణ జరిపే అవకాశం మనకు ఇవ్వాలని మన ప్రభుత్వం పదేళ్లకు పైగా చేసిన ప్రయత్నాన్ని ఐదేళ్ల క్రితం వమ్ము చేయగలిగింది! గతంలో 2008లో మనకు అమెరికాకు మధ్య శాంతి ప్రయోజనాల అణు సహకార అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ఎన్‌ఎస్‌జి సభ్య దేశాల మధ్య మాత్రమే కుదరాలన్నది అంతర్జాతీయ నిబంధన. సభ్యత్వం లేని మన దేశానికి మినహాయింపును ఇవ్వడానికి ఎన్‌ఎస్‌జి అంగీకరించింది. ఈ మినహాయింపును ఇవ్వరాదని కూడ 2008లో చైనా తెరవెనుక కుట్రను కొనసాగించింది! అప్పుడు చైనా వ్యూహం ఫలించలేదు...ఇప్పుడు చైనా మన ఎన్‌ఎస్‌జి సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తోంది. అయితే ఇప్పుడు కూడ ఎన్‌ఎస్‌జిలో చైనా ఒంటరి అయిపోవడం ఖాయం...ఎందుకంటే అమెరికా ఐరోపా దేశాలు మన సభ్యత్వానికి బాహాటంగా మద్దతును ప్రకటించాయి.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక వ్యవస్థ-న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ-ఎన్‌పిటి-లో మనకు సభ్యత్వం లేదన్నది తన వ్యతిరేకతకు చైనా చెబుతున్న సాకు. ఎన్‌పిటి ఒప్పందంపై సంతకం చేసే వరకు మనదేశాన్ని ఎన్‌ఎస్‌జిలో చేర్చుకోరాదని చైనా వాదిస్తోంది. కానీ అసలు కారణం మన దేశం ఎన్‌ఎస్‌జిలో ప్రవేశించడం వల్ల పాకిస్తాన్ అక్రమ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఈ విషయాన్ని చైనీయ ప్రచార మాధ్యమాలు బాహాటంగానే అంగీకరించాయి. ఎన్‌పిటిలో మనం చేరలేదన్నది కేవలం సాకు. ఎందుకంటే ఎన్‌ఎస్‌జిలో చేరడానికి ఎన్‌పిటి సభ్యత్వం ఉండి తీరాలన్న నిబంధన లేదు. ఎన్‌పిటి సభ్యత్వం ఐచ్ఛికం మాత్రమే. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి మద్దతు ఇస్తున్న దేశాలకు ఎన్‌ఎస్‌జిలో చేరడానికి అర్హత ఉంది. మన దేశం ఇలా మద్దతునిస్తోంది. ఎన్‌పిటి నిబంధనలు వివక్షతో కూడి ఉన్నందువల్ల మాత్రమే మన దేశం ఈ వ్యస్థలో చేరలేదు. అమెరికా చైనా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్‌లు తప్ప మిగిలిన దేశాలు అణుపాటవ పరీక్షలు జరుపరాదన్నది ఎన్‌పిటి నిబంధనలోని వివక్ష! అందరికీ సమానమైన నియమం ఏర్పడే వరకు అణ్వస్త్ర వ్యాప్తినిరోధక వ్యవస్థలో చేరరాదన్న మన వాదం సహజ న్యాయ సూత్రాలకు అనుగుణం. అయినప్పటికీ ఇకపై అణ్వస్త్ర నిర్మాణ పాటవ పరీక్షలు జరపరాదని మన ప్రభుత్వం స్వచ్ఛందంగా నిర్ణయించింది. అణు సరఫరాల బృందం నిర్దేశించిన మేరకు శాంతి ప్రయోజన సాధన కోసం పదార్ధ, పరిజ్ఞాన, పరికరాలను సరఫరా చేయగల సామర్ధ్యం ఉండడం ఈ బృందంలో చేరడానికి వౌలికమైన అర్హత, ఈ అర్హత మనకుంది. అమెరికా ఫ్రాన్స్ రష్యా జపాన్ ఆస్ట్రేలియా దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకున్న తరువాత మన పాటవం మరింత పెరిగింది...
గతంలో ఎన్‌ఎస్‌జిలో మన సభ్యత్వాన్ని అమెరికా, ఐరోపా దేశాలు కూడ వ్యతిరేకించడం చరిత్ర. 1998లో మన రెండవ సారి అణుపాటవ పరీక్షలు నిర్వహించినపుడు అమెరికా ప్రభు త్వం సైతం మనపై ఆంక్షలను విధించింది. భారత్ వల్ల దక్షిణాసియా ఆగ్నేయ ఆసియా ప్రాంత దేశాలకు అణ్వస్త్ర ప్రమాదం ముంచుకొని వస్తోందని చైనా ప్రచారం చేసింది. ఐదేళ్లపాటు ఆసియాన్‌తో మన స్నేహసంబంధాలు క్షీణింపచేయడానికి చైనా ప్రభుత్వం విజయవంతంగా కృషి చేసింది. కానీ వియత్నాంకు తూర్పుగా, ఫిలిప్పీన్స్‌కు పశ్చిమంగా ఉన్న సముద్రంపై చైనా తన గుత్త్ధాపత్యాన్ని నెలకొల్పడానికి యత్నిస్తుండడంతో ఆసియాన్-ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి- చైనాను వ్యతిరేకించడం ఆరంభమైంది. ఈ కూటమి దేశాలు సహజంగానే చైనాకు వ్యతిరేకంగా మన దేశంతో జట్టుకడుతున్నాయి. చైనాకు తూర్పుగాను, జపాన్‌కు దక్షిణంగాను ఉన్న సముద్ర ప్రాంతం కూడ గత కొనే్నళ్లుగా కల్లోల గ్రస్తమైపోయింది. ఈ ప్రశాంత సాగర క్షేత్రంలో గగనంలో చైనా ప్రభుత్వం ఏక పక్షం గా రక్షణ మండలాన్ని ఏర్పాటు చేసింది. తన అనుమతి లేకుండా ఇతర దేశాల నౌకలు విమానాలు ఈ రక్షణ క్షేత్రంలోకి చొరబడరాదని చైనా నిర్దేశిస్తోంది. ఇలా అంతర్జాతీయ సముద్ర జలాలను చైనా తన సార్వభౌమ జలాలుగా మార్చుకొనడానికి యత్నిస్తోంది. ఈ ప్రయత్నాన్ని అమెరికా, జపాన్, ఆగ్నేయ ఆసియా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. చైనా వారి ఈ వ్యూహాత్మక దురాక్రమణను ప్రతిఘటించడానికి వీలుగా జపాన్, దక్షిణ కొరియా, ఆసియాన్ దేశాలు మన దేశపు సహకారాన్ని కోరుతున్నాయి. మన దేశం ప్రాధాన్యం పెరుగుతుండడానికి ఇదీ నేపథ్యం...
అందువల్లనే గతంలో మన ఎన్‌ఎస్‌జి సభ్యత్వాన్ని వ్యతిరేకించిన అమెరికా సైతం 2008లో మనతో అణు సహకారపు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అప్పుడు మన ఎన్‌ఎస్‌జి మినహాయింపు ఇవ్వకుండా అడ్డుపడిన చైనా ఒంటరి అయిపోయింది! ఇప్పుడు ఎన్‌పిటి సభ్యత్వం లేకపోయిననప్పటికీ మనకు ఎన్‌ఎస్‌జి సభ్యత్వం ఇప్పించడానికి అమెరికా తహతహలాడుతోంది. చైనా విస్తరణ వాదానికి సమగ్రమైన ప్రతిఘటన ఏర్పడడానికి మన దేశం సహకారం అనివార్యమని అమెరికా గుర్తించింది. అమెరికా ఐరోపా సంస్థలు మన దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తికి భారీ కర్మాగారాలను స్థాపిస్తుండడం ఈ ప్రతిఘటన వ్యూహంలో భాగం! బలహీన ప్రత్యర్థిని పట్టించుకోకపోవడం దౌత్యనీతి. ఈ ప్రత్యర్థి బలపడుతున్నకొద్దీ బాహాటంగా వ్యతిరేకించడం కూడ దౌత్యనీతి! ప్రత్యర్థి తనతో సమాన బలం సంపాదించడం మైత్రిని అభినయించడం దౌత్యనీతిలో చివరి దశ. భారత్‌ను పట్టించుకోని స్థితి గతం. ఎందుకంటే భారత్ చైనాకు దీటుగా ఎదుగుతోంది....అందుకే చైనా బాహాటంగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోంది....ఇది వర్తమానం!