సబ్ ఫీచర్

విశ్వమానవ కల్యాణమే లక్ష్యం (నేడు అంతర్జాతీయ యోగదినం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శారీరక అనారోగ్యం, మానసిక వత్తిడి నుంచి విముక్తి కలిగించి ప్రేమ, శాంతి సౌఖ్యాన్నిచ్చి, సాత్విక సాధన, నిశ్చల మనస్సును అందించేది- యోగ అదే.. జీవన యోగం. మానవజాతి సంక్షేమాన్ని కాంక్షిస్తూ భారతీయ తత్త్వజ్ఞాన సంపద ఈ విశ్వంలో ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప చేసి, జీవన సరళిని సుగమం సుసంపన్నం చేసే యోగ విద్య, యోగాభ్యాసం యోగాచరణను అందించింది.
మానవ జీవితాన్ని పూర్ణత్వ మొందించే అసలైన సంపద ఐశ్వర్యం-యోగ. అనారోగ్యం పాలవని శరీరం, అహింసాయుత సమాజం స్వార్ధరహిత భావనలతో ఉండే సమిష్టి తత్వాన్ని ఇచ్చేది యోగ. ఇంత మహిమాన్వితమైనది కనుకనే అంతర్జాతీయ దినోత్సవంగా యోగను నిర్వహించాలన్న భారతదేశ ప్రతిపాదనను, 193 సభ్య దేశాలతో కూడిన యునైటెట్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 177 దేశాలు ఆమోదించాయి. ఇందులో 47 ముస్లిం దేశాలు కూడా, భారతదేశ ప్రతిపాదనను సమర్ధించడం వారి విశాల హృదయాన్ని సూచించడమే కాక, భారతీయ యోగ ప్రాముఖ్యాన్ని ప్రస్ఫుటీకరిస్తుంది. ఇది భారతదేశానికి లభించిన సాంస్కృతిక ఆధ్యాత్మిక విజయం. ఇది 2015నుంచి అమలులోకి వచ్చి, ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. యోగ అనేది ఒక జీవన విధానం. వివిధ మతాల మధ్య విభిన్న భాషల మధ్య అనేక వర్ణ వర్గ జాతుల మధ్య వైరుధ్యాన్ని, వైమనస్యాల్ని రూపుమాపి సమన్వయంతో విశ్వ మానవ కల్యాణాన్ని వీక్షింపచేసేది-యోగం.
యోగ కేవలం ఆసనాలకు, ప్రాణాయామానికి, ధ్యానానికి మాత్రమే పరిమితమైంది కాదు. దాని పరిధి చాలా విస్తృతమైంది. ‘యోగ’ అనే మాట చాలా తరుచుగా వినే మాటలలో ఒకటి. పూర్వం రోజుల్లో సమాచారాలన్నీ ఎక్కువగా తపాలా శాఖ ద్వారా తెలియజేయబడేవి. దూరంగా వున్నవాళ్లు ఎలా ఉన్నారో తెలిసికోవడానికి పోస్టుకార్డు మీద ‘‘ఇక్కడ అంతా క్షేమం. మీ ‘యోగ’ క్షేమాలు తెలియపరచండి’’ అని వ్రాసేవాళ్లు. అలాగే వాళ్లు సమాధానం వ్రాసేవారు. ఉత్తరాల బట్వాడా చేసే తపాలా శాఖ వారి సిబ్బంది కోసం మధ్యాహ్నం కాగానే ముఖ్యంగా పెద్దవాళ్లు ఎదురు చూసేవాళ్లు. అదొక ఆత్మీయతానుబంధం. అక్కడ ‘యోగ’ పదాన్ని వాడారు. లోక వ్యవహారంలో, ‘‘ఏ పని చేసినా వాడికి కలిసిరావడం లేదండీ, వాడి ‘యోగం’ బాగాలేదని, ‘‘వాడు పట్టిందల్లా బంగారమేనండీ, వాడి ‘యోగం’ అద్భుతంగా ఉంది, అని అంటూ ఉంటాం. మరి ఇక్కడా యోగం అనే మాటను ఉపయోగిస్తున్నాం.
భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలకు పద్దెనిమిది ‘యోగ’లని పేరు పెట్టాడు వ్యాసభగవానుడు.ఇందులో గమనించవలసిన విషయమేమిటంటే, విషయాలెక్కడికక్కడ మారుతున్నా, అన్నింటినీ ‘యోగ’మనే పేర్కొన్నాడాయన. విషాదమూ యోగమే, కర్మా యోగమే, జ్ఞాన విజ్ఞానాలు యోగమే. ‘శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సుబ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగ నామ ప్రధమోధ్యాయః’’ అని అధ్యాయం చివర వ్రాశాడు గదా.
యోగానికి ఒక శాస్త్ర గ్రంథానే్న ప్రత్యేకంగా రచించాడు-పతంజలి మహర్షి. అదొక దర్శనం, పాతం జల యోగదర్శనం. తరువాత వచ్చిన యోగ వాజ్మయానికంతటికీ మూలస్థానమైంది. అందులో మొట్టమొదట్లోనే యోగం ఏమిటో లక్షణం చెప్పాడు పతంజలి మహర్షి. ‘యోగశ్చిత్త వృత్తి నిరోధః’ అని సూత్రం. మనసులో కలిగే భావావలన్నింటినీ అరికట్టి మూట కట్టి పారేయాలి. అదే యోగమన్నాడు. ఇది నెరవేరాలంటే ‘అష్టాంగ యోగ’మనే పేరుతో ఎనిమిది భూమికల్ని వర్ణించి చెప్పాడు మహర్షి. అవే-యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి యోగములు. భౌతికమైన శారీరక ఆరోగ్యం, మానసిక స్వస్థత నుంచి తనలోతాను లయం అయ్యే ‘సమాధి’ దాకా సాగే ఎనిమిది యోగ ప్రక్రియలు.
మనసు కోతివలె చంచల స్వభావం కలిగి ఎంతటి వారికైనా నిగ్రహించడం అంత తేలిక కాదు. దాని సంచారమును నిలిపి, ప్రాణనాడీ శుద్ధి కలిగి, చిన్మయమై నాద శరీరముగల దివ్యమూర్తిని దర్శింపచేసేది-యోగ. కుండలినీ యోగశక్తిని చెప్పక చెప్తూ ‘చందురు వర్ణుని యంద చందమును హృదయార విందమున జూచి బ్రహ్మానందమనుభవించువారు..’ చరణాన్ని మనకందించారు త్యాగరాజస్వామి.
స్థూల శరీరమునకు శుద్ధిని కల్పించినట్లే, మానసిక శరీరమునకు కూడా వైజ్ఞానికముగా శుచిత్వాన్ని సంపాదించుకోవాలి. ధనురాకారముగానున్న కనుబొమల మధ్యస్థానానే్న ధనుష్కోటి అని, నదులవలె ప్రవహించు నాడీ ద్వారములకు ఇది కేంద్రము, ధ్యాన యోగ లక్ష్యమని భ్రూమధ్య స్థానాన్ని యోగులు భావిస్తారు. కనుక, ఓ మనసా- కోటి నదులు ధనుష్కోటి భ్రూమధ్య స్థానమందే ఉండగా ఏటికి తిరిగెదవని హెచ్చరించారు త్యాగరాజస్వామి తోడి రాగ కీర్తనలో. ఈ కీర్తన నేడు మనం జరుపుకునే ప్రపంచ యోగ దినోత్సవానికి సంపూర్ణ స్ఫూర్తిని దీప్తిని ఇస్తుంది.
ఆది శంకరాచార్యులు రచించిన ఆణిముత్యం ‘యోగ తారావళి’ గ్రంథం. చిన్న గ్రంథం, కాని యోగం గురించి అద్భుతమైన విశేషాలను భారతీయ యోగ విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసి మనకందించారు. ప్రపంచ యోగ దినోత్సవం రోజున జ్ఞప్తి చేసికోవలసిన, చదవ వలసిన గ్రంథం. మనిషిలోని పశుత్వాన్ని రాక్షసత్వాన్ని అణచి, మానవతా విలువలను పెంపొందించి, సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కల్యాణాన్ని కాంక్షిస్తూ విశ్వశాంతిని చేకూర్చేది యోగ.

- పసుమర్తి కామేశ్వరశర్మ సెల్: 9440737464