సంపాదకీయం

దుండగులకు దండన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోద్రా దగ్ధకాండ జరిగిన తరువాత గుజరాత్‌లో హింసాకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తున్న న్యాయప్రక్రియలో ఇది మరో ఘట్టం. ఆహమ్మదాబాద్ సమీపంలోని గుల్‌బర్గ్‌లో దహనకాండ జరిపిన నేరస్థులకు శుక్రవారం అహమ్మదాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం కారాగార శిక్షను విధించడం దేశంలో పరిఢవిల్లుతున్న సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ స్ఫూర్తికి నిదర్శనం. సర్వమత సమభావ వ్యవస్థ పరిరక్షణ, సర్వమత సమభావ వ్యవస్థ విధ్వంసం-ఈ రెండూ 1947 నాటి అఖండ భారత విభజనలో ముడివడి ఉన్న అంశాలు. అఖండ భారత్ నుండి విడిపోయిన పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లో సర్వమత సమభావం విధ్వంసమై పోవడం, అవశేష భారత్‌లో అనాదిగా కొనసాగిన రీతిలోనే సర్వమత సమభావ వ్యవస్థ జాతీయ జీవన విధానమై ఉండడం నిరాకరించజాలని నిగ్గుతేలిన నిజాలు. అందువల్లనే దేశ విభజన తరువాత పాకిస్తాన్ లోను బంగ్లాదేశ్‌లోను అల్పసంఖ్యాకులుగా మారిన హిందువులను నిరంతరం నిర్మూలించారు, నిర్మూలిస్తున్నారు. దేశ విభజన తరువాత అవశేష భారత్‌లో అల్పసంఖ్యాకులుగా మారిన ఇస్లాం మతస్థులు హాయిగా జీవించగలుగుతున్నారు. మతకల్లోలాలకు పాల్పడుతున్న వారిని అల్పసంఖ్యాకులను నిరంతరం హత్య చేస్తున్న వారిని పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను న్యాయస్థానాలు శిక్షించడం లేదు. అవశేష భారత్‌లో అల్పసంఖ్యాకులైన వారిపై అధిక సంఖ్యాక ప్రజలు దాడులు జరపడమే లేదు. గోద్రాలో రైలు పెట్టెలోని రామభక్తులను సజీవ దహనం చేసిన తరువాత గుజరాత్‌లో అల్పసంఖ్యాకులపై జరిగిన భయంకరమైన దాడులు అపవాదం మాత్రమే. అంతకుముందు కాని తరువాత కాని ఇలా సామూహికంగా అల్పసంఖ్యాకులపై దాడు లు జరగలేదు. అయినప్పటికీ అలా దాడులు జరగడం మానవత్వానికి కళంకం, ఈ దేశపు మూల భూత స్వభావమైన సర్వమత సమభావానికి విరుద్ధం. అందువల్లనే గోద్రా దహనకాండ తరువాత, ఆవేశంలో చెలరేగి హత్యాకాండ జరిపిన దుర్మార్గులను న్యాయస్థానాలు కఠినంగా శిక్షిస్తున్నాయి. ఇదివరకే గోద్రా దహనకాండ అనంతర హింసాకాండను జరిపిన అనేక మంది హంతకులను న్యాయస్థానాలు శిక్షించాయి. 2011 నవంబర్ 9వ తేదీన ముప్పయి ఒక్కమంది నేరస్థులకు యావజ్జీవ కారాగార శిక్షను విధించడంతో ఈప్రక్రియ మొదలైంది. 2002 ఫిబ్రవరి 27న గోద్రాలో రైలుపెట్టెను తగులబెట్టిన బీభత్సకారులు యాబయి ఏడుమంది రామభక్తులను హత్యచేశారు. ప్రతిక్రియగా గుజరాత్ అంతటా చెలరేగిన దుండగులు అసాంఘిక శక్తులు గోద్రా ఘటనతో సంబంధం లేని వందలాది ఇస్లాం మతస్థులను హత్య చేశారు. ఇలా మూడు చోట్ల హత్యాకాండ జరిపిన నేరస్థులను న్యాయస్థానాలు ఇదివరకే శిక్షలు విధించాయి. గుల్‌బార్గ్ అన్న చోట 69 మందిని సజీవదహనం చేసిన 24 మంది నేరస్థులను ప్రత్యేక న్యాయస్థానం ఇప్పుడు శిక్షించింది.
గోద్రా దహనకాండకు ప్రతిక్రియగా ఆవేశంతో రెచ్చిపోయిన హంతకులు జరిపిన హత్యాకాండ ఘోరమైనది, పైశాచికమైనది. తొమ్మిది చోట్ల భయంకరమైన మారణకాండ జరిగింది. ఈ మారణకాండకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం వారు పరిశోధన జరిపారు. ఏడుచోట్ల జరిగిన హత్యాకాండలకు సంబంధం లేని న్యాయ ప్రక్రియ ఇదివరకే పూర్తయింది. 188 మందికి న్యాయస్థానం శిక్షలు విధించింది. వీరిలో సగంమందికి పైగా యావజ్జీవ కారాగార శిక్షకు గురయ్యారు. గుల్‌బర్గ్ హత్యాకాండ ఎనిమిదవ ఘటన. 2002, ఫిబ్రవరి 27న గోద్రా దహనకాండ జరుగగానే రెచ్చిపోయిన వారు 2002, ఫిబ్రవరి 28న, మార్చి ఒకటవ తేదీన ఈ హత్యాకాండలకు పూనుకున్నారు. గుల్‌బర్గ్‌లో దుండగులు ఇషాన్ జాఫ్రీ అనే మాజీ పార్లమెంట్ సభ్యుని ఇంటి ప్రాంగణాన్ని ఫిబ్రవరి 28న చుట్టుముట్టి దహనకాండ జరిపినట్టు గత మూడవ తేదీన న్యాయమూర్తి పిబి దేశాయ్ ధ్రువపరిచారు. ఈ దహనకాండ ఫలితంగా ఇషాన్ జాఫ్రీ సహా 69 మంది ప్రాణాలు కోల్పోవడం దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఈ దురంతం జరిపిన పదకొండు మందికి ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం యావజ్జీవ కారాగార వాసం విధించింది. ఒకరిని పదేళ్లపాటు పనె్నండుగురు నేరస్థులకు ఏడేళ్లపాటు, నిర్బంధంలో ఉంచాలని న్యాయమూర్తి తీర్పు చెప్పడం హర్షణీయ పరిణామం. హంతకులు, వారికి సహాయపడినవారు, పథకం ప్రకారం కాక గోద్రా ఘటనకు ప్రతీకారంగా తాత్కాలిక ఆవేశంలో ఈ పైశాచిక కాండకు పూనుకున్నారు. బహుశా అందువల్లనే న్యాయస్థానం హత్యాకాండ జరిపిన వారికి మరణదండన విధించలేదు. ఇందుకు విరుద్ధంగా గోద్రాలో రైలు పెట్టెను కాల్చినవారు పథకం ప్రకారం బీభత్సకాండ జరిపినట్టు న్యాయస్థానాలు ఇదివరకే నిర్ధారించాయి...
గోద్రా కాండకు ప్రతిక్రియగా జరిపినప్పటికీ ఈ మారణకాండను జరిపిన వారు సర్వమత సమభావ వ్యవస్థకు కళంకం కలిగించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అల్పసంఖ్యాకుల నిర్మూలన ఆయా దేశాలలోని అధిక సంఖ్యాక ప్రజలకు సమష్టి స్వభావానికి చిహ్నం. మనదేశంలో అనాదిగా వ్యవస్థీకృతమైన సర్వమత సమభావం హైందవ జాతీయ సహజ స్వభావం. అందు గోద్రాదగ్ధకాండ తరువాతి అల్లర్లు కల్లోలాలు హత్యాకాండ ఈ స్వభావానికి అపవాదం. అందువల్లనే జాతిమొత్తం హంతకుల చర్యలను గర్హించింది. న్యాయస్థానాలు నేరస్థులను శిక్షించాయి,శిక్షిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలు గోద్రాలో అంతమందిని పొట్టన పెట్టుకున్నారు. కానీ జిహాదీల దుశ్చర్య వల్ల ఈ ఘటనతో సంబంధం లేని ఇస్లాం మతస్థులు బలిపశులయ్యారు. ఆ మతకల్లోలాల జ్వాలల్లో అనేకమంది హిందువులు కూడ ఆహుతైపోయారు. అవశేష భారత్‌లో వలె పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను సర్వమత సమభావ వ్యవస్థలు పరిఢవిల్లకపోవడం అసలు సమస్య. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న దాదాపు ప్రతి దేశంలోను జిహాదీలు అల్పసంఖ్యాకులైన ఇతర మతాలవారిని నిర్మూలిస్తుండడం జగమెరిగిన వాస్తవం. కశ్మీర్ లోయ ప్రాంతం నుండి అల్ప సంఖ్యాకులైన హిందువులను సమూలంగా పెకలించి వేయడం కూడ ఈ జిహాద్‌లో భాగం. బంగ్లాదేశ్‌లో గత 18 నెలల వ్యవధిలో 48 మంది హిందువులు ఐఎస్‌ఐఎస్ జిహదీ ఉన్మాదులు హత్య చేశారట. ‘్భరత్ పారిపొండి. లేదా మిమ్మల్ని ఉరివేస్తాము..’’ అని అల్పసంఖ్యాకులను బంగ్లాదేశ్‌లోని ఐఎస్‌ఐఎస్ బెదిరిస్తుండడం వర్తమాన ఘట్టం...బంగ్లాదేశ్‌లోని ‘రామకృష్ణ మిషన్’ను మూసివేయాలని ‘ఐఎస్‌ఐఎస్’ ఆదేశించిందట.
గోద్రా తరవాత తప్ప అల్పసంఖ్యాకులపై దాడి జరిగిన మరో ఘటన మనదేశంలో జరుగలేదు. కశ్మీర్ లోయ ప్రాంతం మాత్రమే అపవాదం..ఈ గోద్రా అనంతర ఘటనల దోషులను మన వ్యవస్థ దండించింది. శుక్రవారం నాటి తీర్పు ఇందుకు మరో ధ్రువీకరణ. కానీ బంగ్లాదేశ్‌లోను, పాకిస్తాన్‌లోను అల్ప సంఖ్యాకులపై దాడులు 1947 నుండి జరుగుతూనే ఉన్నాయి. హత్యలు, అత్యాచారాలు, బలవంతపు మతం మార్పిడులు, తరిమివేయడాలు, అపహరణల ద్వారా హిందువులను నిర్మూలిస్తున్న వారిని పాకిస్తాన్, బంగ్లాదేశ్ న్యాయస్థానాలు శిక్షించిన చరిత్ర లేదు. ఇదీ అంతరం. అందువల్ల అవశేష భారత్‌లోవలె పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కూడ సర్వమత సమభావ వ్యవస్థలు ఏర్పడడానికి కృషి జరగాలి...జరగడం లేదు.