సంపాదకీయం

ఆగని భూహననం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర రహదారి రవాణా సంస్థ-ఆర్టీసీ-కి చెందిన మిగులు భూములను వాణిజ్య కలాపాలకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ శివారులలోని వేల ఎకరాల భూములను ప్రభుత్వేతర సంస్థలు కాజేశాయి. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకోసం వేల ఎకరాలు వ్యవసాయ భూములను సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల మిగులు భూమిని వేలం వేసి ప్రభుత్వేతర సంస్థలకు విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ మిగులు భూమిని భూనిధిగా ఏర్పాటు చేస్తోంది. నీటిపారుదలకోసం, జలవిద్యుత్ ఉత్పత్తికోసం నిర్మిస్తున్న జలాశయాలు వేల లక్షల ఎకరాలు, పంట భూమిని ముంచివేస్తున్నాయి. భూమిని కోల్పోతున్న రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనకు, అలజడికి గురవుతున్నారు. మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్ జలాశయం కోసం తెలంగాణ ప్రభుత్వం భూమి సేకరిస్తున్న తీరు ఈ అలజడికి సరికొత్త ఉదాహరణ...వాణిజ్య పారిశ్రామిక వాటికలు పచ్చదనాన్ని దిగమింగుతుండడం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురౌతోంది. పట్టించుకోని కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు యథావిధిగా హరిత హనన పథకాలను అమలు జరిపేస్తున్నాయి. హరిత హననం వల్ల వాస్తవానికి భూహననం జరుగుతోంది. పర్యావరణం పాడైపోతోంది. భూమి సేకరణ-ల్యాండ్ అక్విజేషన్-, భూమి సమీకరణ-ల్యాండ్ పూలింగ్-, భూనిధి- ల్యాండ్ బ్యాంక్, వంటి పేర్లతో అటవీ భూములను, వ్యవసాయ క్షేత్రాలను ప్రభుత్వేతర సంస్థలకు, ప్రధానంగా బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు అప్పగించే కార్యక్రమాలను ప్రభుత్వాలు అతి ఉత్సాహంగా అమలు జరుపుతున్నాయి. భూమి సేకరణ అనగానే భూమిని అక్రమ ప్రయోజనాలకోసం మళ్లించడమన్న అనుమానం సామాన్య జనమానస సమీమలలో అంకురించడం, సహజ పరిణామక్రమం. అవసరాలకు మించి వేల ఎకరాలను కబ్జా చేయగలుగుతున్న ప్రభుత్వేతర సంస్థలు ఆ భూమిని నిర్దిష్ట పథకాలకు కాక ఇతర అక్రమ ప్రయోజనాలకోసం దుర్వినియోగం చేస్తున్నారు. ప్రధానంగా పరిశ్రమల భూమిని స్థిరాస్థి వాటిక-రియల్ ఎస్టేట్-లుగా మార్చి ప్రభుత్వేతర సంస్థలు, విదేశీయ సంస్థలు వేల కోట్ల రూపాయల ఆశ్రయ లాభాలను దండుకొనడం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాక, దేశమంతటా ఆవిష్కృతవౌతున్న వికృత వాణిజ్య దృశ్యం. హైదరాబాద్ శివారులో ఎమ్మార్ వంటి సంస్థలు జరిపిన మళ్లింపు కలాపాలు ప్రతీక మాత్రమే. హైదరాబాద్ శివారులోనే ఇలా ప్రభుత్వేతర సంస్థలు దుర్వినియోగం చేస్తున్న పనె్నండు వేల ఎకరాల వ్యవసాయ భూమిని గత ఏడాది ఆగస్టులో గుర్తించిందట. పరిశ్రమలను నెలకొల్పేసాకుతో ప్రత్యేక ఆర్థిక మండలాల పేరుతో ప్రభుత్వేతర సంస్థలు ప్రభుత్వ మాధ్యమంగా ఏళ్లతరబడి ఈ భూమిని దురాక్రమించాయి.
రాజకీయవాదులు, ప్రభుత్వ అధికారులు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలతో భుజం భుజం కలిపి పారిశ్రామిక ప్రగతి గీతాలను వికృతంగా వినిపిస్తుండడం ప్రపంచీకరణ యుగధర్మమైపోయింది. వ్యవసాయ భూములను కాక బంజరు భూములను చిట్టడువులను పరిశ్రమల స్థాపనకోసం ఉపయోగించవచ్చు. కానీ బంగారం పండుతున్న మాగాణి భూములను, సతత హరిత శోభలకు ఆలవాలమైన దట్టమైన అడవులను పారిశ్రామిక కాలుష్య వాటికలకోసం కట్టబెడుతున్నారు. ఎందుకని ఇలా జరిగిపోతోందన్నది సామాన్యులకు అంతుపట్టని వ్యవహారం. ఒరిస్సాలోని జగత్‌సింగ్ పూర్ జిల్లాలో పోస్కో వారి ఉక్కు ఫ్యాక్టరీకోసం వేలాది ఎకరాల వరిపొలాలను ప్రభుత్వ అధికారులు రైతుల కళ్లముందే దగ్ధం చేశారు. తమలపాకుల తోటలను ధ్వంసం చేశారు. అమరావతి నిర్మాణం కోసం ముప్పయికి పైగా వేల ఎకరాల పంట పొలాలను ధ్వసం చేస్తున్నారు. చిన్నచిన్న పారిశ్రామిక వాటికలను రాష్టమ్రంతటా, దేశమంతటా విస్తరింపచేయడం ద్వారా పారిశ్రామిక ప్రగతిని సాధించవచ్చు. కాలుష్యాన్ని నిరోధించవచ్చు. పచ్చదనాన్ని కాపాడుకోవచ్చు. కానీ పరిశ్రమలను ప్రధానంగా కేంద్రీకృతం చేస్తున్నారు. ఈ కేంద్రీకరణకు మాధ్యమాలు ప్రత్యేక ఆర్థిక మండలాలు. ఈ సెజ్‌ల వల్లనే కాలుష్యం కేంద్రీకృతమవుతోంది. ఇనుప ఖనిజం తవ్వుతున్న చోటునే ఉక్కుప్యాక్టరీ నిర్మాణం అవుతోంది. ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నచోటునే ఉత్పత్తులను తరలించడానికై ఓడరేవును నిర్మిస్తారట. ఒరిస్సాలోని జగత్ సింగ్‌పూర్ జిల్లాలోని ‘పోస్కో’ పథకం ఇది. ఇలా భూమి సేకరణ వ్యవహారం సామాన్య ప్రజలకు ఏవగింపును కలిగిస్తోంది. జలాశయాల నిర్మాణాలు అనివార్యం, పచ్చదనం పెరగడానికి నీటి పారుదల దోహదం చేస్తుంది. కానీ భూమి సేకరణ, హడలెత్తిస్తున్న తీరు జలాశయాల నిర్మాణం పట్ల కూడ ప్రజలలో వ్యతిరేకతను కలిగిస్తోంది. మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ వివాదం ఇందుకు సరికొత్త ఉదాహరణ,...
రాష్ట్ర రహదారి రవాణా సంస్థ వారి ప్రాంగణాలు ఇప్పటికే వాణిజ్య వాటికలుగా మారి ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోను ప్రధాన నగరాలలోని పట్టణాలలోని బస్‌స్టేషన్‌లు సూపర్ మార్కెట్‌లను తలపిస్తున్నాయి. ప్రయాణికులు నిలువడానికి స్థలం లేక, కూర్చొనడానికి బెంచీలు, అరుగులు లేక పొంగి పొరలుతున్నారు. అందువల్ల ప్రతి బస్‌స్టేషన్‌ను విస్తరించవలసిన అనివార్యం ఏర్పడివుంది. ఇందుకోసం ఉన్న స్థలాలు చాలవు, కొత్తగా స్థలాలను సేకరించుకోవాలి. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మిగు లు స్థలాలను ప్రభుత్వేతర సంస్థలకు ఐదు దశాబ్దుల పాటు లీజ్‌కు ఇవ్వనున్నదట. లీజ్‌ను మళ్లీ మళ్లీ పొడిగించడమే కాని స్థలాన్ని వెనక్కి తీసుకోవడం కదురదు. ఆర్‌టిసి నష్టాల ఊబిలో కూరుకొని పోయి ముందునకు సాగడం లేదు. అందువల్ల అర్‌టిసి వారి నష్టాలు భర్తీ కావడం ఇలా మిగులు భూమిని వాణిజ్య కలాపాలకు కేటాయిస్తారట. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌టిసికి రూ.530కోట్లు నష్టం వచ్చిందట. ఆంధ్రప్రదేశ్‌లో అందువల్ల ఇలా భూమిని లీజ్‌కిచ్చి నష్టాన్ని భర్తీ చేసుకుంటారట. నడుస్తున్న సంవత్సరంలోను, వచ్చేఏడు, ఇలా ప్రతి ఏడు నష్టాలు వస్తే ఏమి చేస్తారు? లీజ్‌కి ఇవ్వడానికి స్థలాలు ఉండవు. బస్సుస్టేషన్‌ల విస్తరణకోసం అవసరమైన స్థలాలు ఉండవు. బస్సు స్టేషన్లను విస్తరించడం మానేస్తారా? నిరంతరం పెరుగతున్న ప్రయాణికులకు ఉన్న ప్లాట్‌ఫారాల మీదనే కూరి పారేస్తారా? నిర్వహణ లోపం వల్ల మాత్రమే ఆర్‌టిసికి నష్టాలు వస్తున్నాయి. పనితీరును మెరుగు పరచడం వల్ల ప్రయాణికుల అభిమానాన్ని చూరగొడం వల్ల మాత్రమే నష్టాలు తగిగిపోగలవు. అంతేగాని ఉన్న స్థలాలను అమ్ముకుంటే పనితీరు మెరుగుపడదు..
ప్రభుత్వాలు ప్రభుత్వ పథకాలకోసం, సర్వజన ప్రయోజనకరమైన కార్యకలాపాలకోసం మాత్రమే భూమిని సేకరించే పద్ధతిని పునరుద్ధరించడం మేలు...ప్రభుత్వేతర వాణిజ్య పారిశ్రామిక సంస్థలకోసం ప్రభుత్వాలు భూమిని సేకరించిపెడుతున్న తీరువల్ల జరుగుతున్న భారీ ఉత్పత్తులు, ‘అవినీతి’, ‘అక్రమాలు’! బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వద్ద డబ్బు ‘గతికిన’వారు, బొక్కుతున్నవారు రాజకీయవాదులుగా, ప్రభుత్వ అధికార్లుగా, చెలామణి అవుతుండడం ఈ ఉత్పత్తులకు ప్రధాన కారణం. ఏదైనా పెరగవచ్చు కాని భూమి పెరగదు!