సంపాదకీయం

నరేంద్రుని ప్రభావముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండేళ్ల కాలవ్యవధిలో మన ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు నాలుగుసార్లు ద్వైపాక్షిక అధికార యాత్ర జరపడం ఉభయదేశాల మధ్య పెరుగుతున్న మైత్రికి ప్రబల నిదర్శనం. ప్రధానమంత్రి పదవీ బాధ్యతను స్వీకరించిన తరువాత 2014, సెప్టెంబర్‌లోమోదీ మొదటిసారి అమెరికాకు వెళ్లివచ్చారు. ఇప్పుడు, జూన్ ఏడవ దేదీన నాలుగవసారి అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అధ్యక్షుడు ఒబామాను నాలుగవసారి కలుసుకున్నారు. గతంలో ‘‘నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించే’’ విధానాన్ని అవలంబించిన అమెరికా ప్రస్తుతం చిత్తశుద్ధితో మనపట్ల మైత్రిని పాటిస్తోందన్న విశ్వాసం నరేంద్ర మోదీ ప్రస్తుత పర్యటనకు నేపథ్యం. పాకిస్తాన్‌కు ‘ఎఫ్-16’ అత్యాధునిక యుద్ధ విమానాలను సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ఆపివేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించడం మోదీ పర్యటనకు పూర్వరంగం..మనదేశం నుండి దొంగతనానికి గురైన ప్రాచీన విగ్రహాలను, కళారూపాలను అమెరికా ప్రభుత్వం ఏడవ తేదీన మోదీకి అప్పగించడం పెరిగిన మైత్రికి మరో గుర్తు. మనదేశానికి అంతర్జాతీయ సమాజంలో పెరుగుతున్న ప్రాధాన్యం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పడమటి దేశాలతో జరుపుతున్న పర్యటన సందర్భంగా ఇలా మరోసారి ధ్రువపడింది. హిందూ మహాసముద్రంలో విస్తరిస్తున్న చైనా వ్యూహాత్మక దురాక్రమణను నిరోధించడానికై మనదేశంతో మైత్రిని పెంచుకోవడం అనివార్యమన్న వాస్తవాన్ని ఐరోపా, అమెరికా ఇప్పుడు మరింతగా గుర్తించాయి. చైనా ప్రభుత్వం అంతర్జాతీయంగా మనదేశాన్ని వివిధ రంగాల్లో నిరోధించడానికి యత్నిస్తుండడం ఈ గుర్తింపునకు నేప థ్యం. అణు సరఫరాల బృం దం-ఎన్‌ఎస్‌జి-లో మన ప్రవేశాన్ని నిరోధించడానికి చైనా ఇప్పుడు బాహాటంగానే పావులు కదుపుతోంది. స్విట్జర్లాండ్ ప్రభుత్వం మన సభ్యత్వానికి మద్దతు పలకడం నరేంద్ర మోదీ ఆ దేశంలో జూన్ ఆరవతేదీన జరిపిన పర్యటన సాధించిన విజయం. స్విట్జర్లాండ్ ప్రతీక మాత్రమే. ‘‘వివాదాల’’కు లేదా ‘‘వివాదాలు’’గా కల్పించే దౌత్య వ్యవహారాలకు దూరంగా ఉండే స్విట్జర్లాండ్ ఇలా చైనాను లెక్క చేయని రీతిలో మనదేశానికి మద్దతు పలకడం ఐరోపా దేశాల సమష్టి అభిప్రాయానికి సంకేతం. అమెరికా ఆమోదం కూడా ఈ మొత్తం వ్యవహారంలో నిహితమై ఉంది. ఎన్‌ఎస్‌జి నుండి మన దేశాన్ని దూరంగా ఉంచాలనే ప్రయత్నంలో చైనా ఒంటరి అయిపోతుండడం మోదీ అమెరికాలోను, స్విట్జర్లాండ్‌లోను పర్యటించిన సందర్భంగా సంభవించిన పరిణామక్రమం..
పారిస్‌లో గత ఏడాది కుదిరిన అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ వ్యవహారాల ఒప్పందాన్ని మనదేశంతో పాటు అమెరికా కూడ ధ్రువీకరిస్తుండడం గమనార్హం. మనదేశంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం ఈ ధ్రువీకరణ లాంఛనం. మంత్రివర్గం నిర్ణయించడమే ధ్రువీకరణ. కానీ అమెరికాలోని అధ్యక్ష ప్రజాస్వామ్య సంప్రదాయం మేరకు అమెరికా కాంగ్రెస్-పార్లమెంట్-ధ్రువీకరించవలసి ఉంది. అదొక సుదీర్ఘ ప్రహసనం. అయినప్పటికీ నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం, ద్వైపాక్షిక స్నేహం దృఢపడుతోందన్న వాస్తవానికి మరో నిదర్శనం. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో నరేంద్రమోదీ ప్రసంగించడం అమెరికా స్నేహ చిత్తానికి మరో నిదర్శనం. గతంలో మరో ఐదుగురు భారత ప్రధానమంత్రులకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. మనదేశానికి క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థలో-ఎమ్‌టిసిఆర్-సభ్యత్వం లభించడానికి మార్గం సుగమం కావడం కూడా మోదీ అమెరికా పర్యటన సందర్భంగా సంభవించిన మరో అనుకూల పరిణామం. అంతర్జాతీయ వ్యవస్థలో కొత్త దేశాలను చేర్చుకొనడానికి ప్రస్తుత సభ్యదేశాలన్నీ అంగీకరించాలన్న విచిత్ర నిబంధన వల్ల ఇంతవరకు మనదేశానికి ప్రవేశం లభించలేదు. గత ఏడాది ముప్పయిమూడు దేశాలు అంగీకరించినప్పటికీ ఇటలీమాత్రం మన సభ్యత్వాన్ని వ్యతిరేకించింది. మన జాలర్లను హత్య చేసిన తమ పౌరులను శిక్షించరాదన్నది ఇటలీ కోరిక. ఇద్దరు హంతకులూ ఇప్పుడు మనదేశం నుండి ఇటలీ వెళ్లిపోయారు. ఇప్పుడు ఇటలీ తన భారత వ్యతిరేకతను ఉపసంహరించుకున్నదట. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉంది. ఈ ప్రమేయం మనదేశానికి అనుకూలాంశం కావడం నరేంద్ర మోదీ దౌత్య విజయం...
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్భాటం లేకుండానే అమెరికా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తోంది. అమెరికా ఒత్తడికి మన ప్రభుత్వం లొంగిపోవడం ఏళ్ల తరబడి నడచిన చరిత్ర. 2012లో అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని మన ప్రభుత్వం చిల్లర వ్యాపారాన్ని విదేశీయ సంస్థలకు అప్పగించడం అమెరికా ప్రభుత్వం ఒత్తిడికి పరాకాష్ఠ. నరేంద్రమోదీ ప్రభుత్వం ఆరంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ పారిశ్రామిక ఉద్యమాన్ని అమెరికా, ఐరోపా సమాఖ్య, చైనా, దక్షిణ కొరియాలు వ్యతిరేకిస్తుండడం కూడ నడుస్తున్న కథ. మనదేశం ఈ దేశాల ఉత్పత్తులను అమ్మే సంతగా మారిపోవడం ప్రపంచీకరణ ప్రభావం. ప్రపంచీకరణకు విరుగుడుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కనిపెట్టిన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా...తొలిదశలో దీన్ని పరోక్షంగా నిరసించిన అమెరికా ఇటీవల మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. 2008లో ఉభయ దేశాల మధ్య కుదిరిన శాంతి ప్రయోజనాల అణు సహకార అంగీకారం ఇప్పటికీ అమలు కాలేదు. ఇందుకు కారణం అణు ప్రమాదాల సమయంలో ఆయా నిర్వాహక సంస్థలు బాధ్యతను అంగీకరించి పరిహారం చెల్లించాలన్న చట్టం. అమెరికా ఒత్తడికి మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం నిర్వాహక సంస్థల ప్రమాద బాధ్యతను నామమాత్రం చేసింది. ఈ నామమాత్ర బాధ్యత కూడ తమకు ఉండరాదన్నది బహుళ జాతీయ వాణిజ్య సంస్థల గొంతెమ్మ కోరిక. అయితే ఈ కోరికను మన ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ అణుబాధ్యతను అంగీకరించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2008 నాటి ఒప్పందం మేరకు అమెరికా సంస్థలు గుజరాత్‌లో నిర్మించ తలపెట్టిన అణువిద్యుత్ కేంద్రం పని మొదలుకానున్నదట. చైనా చంకనెక్కి తమను వెక్కిరిస్తోన్న పాకిస్తాన్‌ను దూరంగా ఉంచి, మనదేశంతో కలసిమెలసి అంతర్జాతీయ గతిని నిర్దేశించాలన్నది ఇప్పుడు అమెరికా వ్యూహం. వాషింగ్టన్‌లో మోదీ ఒబామా చర్చల తరువాత వెలువడిన ప్రకటనలో ఈ వ్యూహం ధ్వనించింది. మన దేశానికి వ్యతిరేకంగా వినియోగించగల ‘ఎఫ్-16’ యుద్ధ విమానాలను బహుశా అమెరికా పాకిస్తాన్‌కు అమ్మదు..
ఈ వ్యూహాత్మక దౌత్య ఆర్థిక రక్షణ సంబంధాలకు మాత్రమే మోదీ అమెరికా పర్యటన పరిమితం కాలేదు. వేల సంవత్సరాల క్రితం మనదేశంలో రూపొందిన వేలాది దేవతా మూర్తులను, ఇతర కళారూపాలను అమెరికా ప్రభుత్వం నరేంద్ర మోదీ సమక్షంలో మనదేశానికి అప్పగించడానికి అంగీకరించింది. రెండు వందల ప్రాచీన కళారూపాలను ఏడవతేదీన మోదీకి సమర్పించారు. మరో మూడువేల విగ్రహాలను కళారూపాలను కూడ అమెరికా మనకు అప్పగించనున్నదట. కోట్ల రూపాయల విలువైన ఈ భారతీయ సంపదను శతాబ్దులుగా దొంగలు తస్కరించారు. చివరికి అవి అమెరికా చేరాయి. మోదీ వెంట దాదాపు పదిహేను వందల ఏళ్ల నాటి విగ్రహరూప వినాయకుడు తిరిగి స్వదేశానికి వస్తున్నాడు...