సంపాదకీయం

నల్లని ప్రజాస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడులోని రెండు శాసనసభా నియోజకవర్గాల ఎన్నికల కార్యక్రమం రద్దయిపోవడం నల్లడబ్బు గురించి నకిలీ డబ్బు గురించి మరోసారి ధ్యాస పెరగడానికి విచిత్రమైన నేపథ్యం. నల్లడబ్బు నకిలీ డబ్బు విచ్చలవిడిగా చెలామణి అవుతుండడం తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారం మాధ్యమంగా మరోసారి ధ్రువపడింది. కాని తమిళనాట నల్లడబ్బు వికృత తాండవం చేయడం ప్రతీక మాత్రమే. నల్లడబ్బు పెట్టుబడుల రూపంలోను విరాళాల రూపంలోను చేతులు మారుతుండడం దేశమంతటా నెలకొని ఉన్న దుస్థితి. నల్లడబ్బు దేశంలో నుండి బయటికి తరలిపోయింది. పోతోంది. ఇలా తరలిపోయిన మనదేశంలోని నిధులే మళ్లీ పేరు మార్చుకొని విదేశీయ సంస్థల పెట్టుబడుల రూపంలో దేశంలోకి తరలివస్తున్నాయట. మన ప్రభుత్వాలు మాత్రం భారీగా విదేశీ సంస్థల పెట్టుబడులు-‘ఎఫ్‌డిఐ’- మన ఆర్థిక రంగానికి లభిస్తున్నట్టు మురిసిపోతున్నాయి. పదిహేను ఏళ్లలో దేశానికి లభించిన ఎఫ్‌ఐడిలో సగం రెండు చిన్న దేశాలు-మారిషస్, సింగపూర్-లకు చెందిన సంస్థల నుంచి వచ్చిందట. ఎలా వచ్చింది? దేశం నుండి తరలిపోయిన నల్లడబ్బు ఈ దేశాలలో బ్యాంకులలోను, వ్యాపార పారిశ్రామిక సంస్థలలోను జమ అయి తెల్లడబ్బుగా మారింది. అదే డబ్బు అంటే-మనదేశానికి చెందిన డబ్బు-ఎఫ్‌డిఐ- అవతారం ధరించి మళ్లీ మనదేశానికి వస్తోంది. ఎఫ్‌డిఐ డొల్లతనం మాత్రమే కాక మన ఆర్థిక నిఘా వ్యవస్థలోని కన్నం కూడా ఇలా తేటతెల్లమైంది. పాకిస్తాన్‌లో ముద్రిస్తున్న నకిలీ భారత కరెన్సీ నోట్లు మనదేశంలో చెలామణి అయిపోవడం ఏళ్ళతరబడి కొనసాగుతున్న ఆర్థిక బీభత్సం. పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ నకిలీ కరెన్సీనోట్లను మనదేశంలోకి తరలిస్తోంది. ఈ నకిలీ డబ్బు మనదేశంలోకి రాకుండా నిరోధించాలని మన ప్రభుత్వం 2011లో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడ. పాకిస్తాన్ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం ‘గూఢచర్య’ విభాగమైన ఐఎస్‌ఐవారు వివిధ జిహాదీ ముఠాల ద్వారా ఈ నకిలీ డబ్బును పంచిపెట్టారు. ఒక్కొక్క వైపరీత్యం గురించి కొంతకాలం ప్రచారం జరుపుతోంది. ఆ తరువాత ప్రభుత్వాలు, ప్రసార మాధ్యమాలు ఆ వైపరీత్యాన్ని గురించి మరచిపోతున్నాయి. మరచిపోయినంత మాత్రాన సమస్య పరిష్కారం అయినట్టు కాదు. దేశంలోని అన్ని ప్రాంతాలలోను నకిలీ నోట్లను విరివిగా అధికారులు పసికడుతూనే ఉన్నారు. బ్యాంకులు ఎటిఎమ్‌ల ద్వారా తీసుకున్న డబ్బులో కూడ నకిలీ నోట్లు బయటపడినట్టు ప్రచారమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం పాలనా బాధ్యతలను స్వీకరించినప్పటినుంచి నల్లడబ్బును వెలికి తీయడానికి కృషి చేస్తోంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక పరిశోధక బృందం -సిట్-నల్లడబ్బును పసికట్టడానికి గత రెండేళ్లుగా శ్రమిస్తోంది.
అరవకురుచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో జరుగవలసి ఉండిన ఎన్నికలను రద్దు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించడానికి రాజకీయ పార్టీలు భారీగా డబ్బును పంపిణీ చేశాయన్న ఆరోపణ ప్రధాన కారణం. మిగిలిన 232 నియోజకవర్గాలకు మే 16న ఎన్నికలు జరుగగా ఈ రెండు చోట్ల మాత్రం ఎన్నికలు మే 23కు వాయిదా పడ్డాయి. ఆ తరువాత జూన్ 13న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల కార్యక్రమాన్ని ఇలా దాదాపు నాలుగువారాల పాటు వాయిదా వేయడం వల్ల అక్రమంగా వోటర్లకు డబ్బు పంపిణీ చేయడం ఆగిపోతుందని, ఎన్నికల కమిషన్-ఇసి- భావించిందట. అయితే అక్రమంగా డబ్బును పంపిణీ చేయడాన్ని రాజకీయ పార్టీలు ఆపకపోవడంతో ఎన్నికలను రద్దు చేసినట్టు ఇసి శనివారం ప్రకటించింది. ప్రజాస్వామ్య ప్రక్రియ గొప్పగా పరిణితి చెందినట్టు జరుగుతున్న ప్రచారానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వోటర్లకు డబ్బును వెదజల్లుతున్న తీరునకు పొంతన కుదరడం లేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రమే కాదు, తమిళనాడులోని అన్ని నియోజకవర్లాలోను అధికార అన్నాడిఎంకె వారు, ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకెవారు కోట్లాది రూపాయలను వెదజల్లి వోటర్లను కొంటున్నట్టు ఈ ఉభయ పక్షాల వారు పరస్పరం ఆరోపించుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉభయ పక్షాల స్థావరాల నుంచి మద్దతు దారుల స్థావరాల నుంచి కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇలా వందలకోట్ల రూపాయలకు పైగా రాజకీయ పార్టీల నల్లబ్బు పట్టుబడింది.
అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాలలో ఈ ధన ప్రవాహం మరింతగా వరదలెత్తడం గురించి కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. తంజావూరు నియోజకవర్గంలో ఒకే రోజున ఒక అభ్యర్థి ఆరుకోట్ల రూపాయలను వోటర్లకు పంచిపెట్టాడట. ‘బూత్’ల వారీ వార్డుల వారీగా ఒక్కొక్క వోటరుకు ఐదువందల చొప్పున పంపకం చేయడానికి వివరాలతో సహా డబ్బును సంచులలో పెట్టి వివిధ గ్రామాలకు బస్తీలకు తరలించారట. పట్టుబడిన సంచులు కొన్ని మాత్ర మే... పట్టుబడని సంచులు ఈ రెండు చోట్ల, తమిళనాడు, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎన్నివేలో..? రద్దయిన రెండు చోట్ల ఇసి మళ్లీ ఎన్నికలను నిర్వహించక తప్పదు. కానీ డబ్బును పంచకుండా నిరోధించడం ఎలా? ఎన్నికలంటే అభ్యర్థులు తమకు ఎంతో కొంత ముట్టచెబుతారని వోటర్లలో అధికాధికులు ఎదురు చూడడం పెరిగిన అవగాహనకు చిహ్నం. అక్రమార్జన గురించి ఈ అవగాహనను పెంచడానికి దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అవిరళ కృషి చేస్తుండడం దశాబ్దుల ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. రాజకీయ పార్టీలు శాసనసభ ఎన్నికల సమయంలో లోక్‌సభ ఎన్నికల సమయంలోను వసూలు చేస్తున్న విరాళాలలో చెక్కుల ద్వారా, అధికశాతం సేకరించడం ఇటీవలి పరిణామం. కానీ 2004-2014 మధ్యకాలంలో అరవై శాతానికి పైగా విరాళాలను నగదు రూపంలో వసూలు చేశారట. నగదు రూపంలో ఎంత పుచ్చుకొంటున్నారు? ఎంత లెక్కలలో చూపిస్తున్నారు? అన్నది ఎప్పటికీ తేలదు సమాచారం హక్కు చట్టాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వర్తింపచేసే ప్రక్రియ ఇప్పటికీ కూలబడి ఉంది. ఈ లోగా విదేశీయ సంస్థలనుంచి కూడ రాజకీయ పార్టీలు విరాళాలను పుచ్చుకోవడానకి వీలు కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించిందట. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాలలో 2010నాటి విదేశీయ విరాళాల నియంత్రణ చట్టంలోని సంబంధిత నియమాలను సవరిస్తూ బిల్లును ఆమోదించారట. ఈబిల్లును భాజపా, కాంగ్రెస్ రెండూ సమర్ధించడం వల్ల లోక్‌సభలో పెద్ద చర్చగాని, రచ్చగాని జరగలేదు. స్వదేశీయ వాణిజ్య సంస్థలలో విదేశీయులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారట. అందువల్ల కంపెనీల చట్టం ప్రకారం దాదాపు అన్ని పెద్ద స్వదేశీయ వాణిజ్య సంస్థలూ, విదేశీయ నిర్వచనం పరిధిలోకి వచ్చేశాయట. అందువల్ల సవరణ అవసరమైందట!
ఈ సవరణ వల్ల ఇలా విదేశీయ నిర్వచనం పరిధిలోకి వచ్చే స్వదేశీయ సంస్థల నుంచి విరాళాలను సేకరించడానికి రాజకీయ పార్టీలకు వీలవుతుందట. కానీ బిల్లులోమాత్రం విదేశీయ సంస్థలు రాజకీయ పార్టీలకు విరాళాలను ఇవ్వవచ్చునని స్పష్టంగా నిర్దేశించారట. ఏది నిజం..?