సంపాదకీయం

అమెరికాతో జట్టు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికీ అమెరికాకూ మధ్య రక్షణ సదుపాయాల సహకారపు ఒప్పందం-లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ కుదరడం అనివార్యమైన దౌత్య పరిణామం. 2014 మే 26న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం పాలనా బాధ్యతలను స్వీకరించినప్పటినుంచి దేశ రక్షణకు పెరుగుతున్న ప్రాధాన్యం ఈ అపూర్వ పరిణామానికి ప్రాతిపదిక! చైనా వారి యుద్ధ నౌకలు మనదేశానికి చుట్టూ ఉన్న బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్ ఓడరేవులలో తిష్ఠ వేసి ఉండడం మన దేశ భద్రతకు ముంచుకొస్తున్న ప్రమాదం. ఈ దురాక్రమణ వహ్నిని నిరోధించడానికి వీలుగా ప్రతిఘటనాగ్నిని సంధించడం అనివార్యమన్న వాస్తవానికి అద్దం మంగళవారం ఢిల్లీలో మనకూ అమెరికాకు మధ్య కుదిరిన ఈ సూత్రప్రాయ అంగీకారం. ఏ దేశంతోను ఎలాంటి సైనికపరమైన ఒప్పందాలను చేసుకోరాదన్నది అలీన విధానానికి అనుగుణమైన మన దీర్ఘకాల రక్షణ వ్యూహం! ఇతర దేశాలకు వ్యతిరేకంగా సైనిక కూటములను ఏర్పాటు చేయరాదన్నది మాత్రమే అలీన విధానానికి నిజమైన అర్ధం. ఇలాంటి అలీన విధానాన్ని ఇతర దేశాలపై దురాక్రమణను జరపని విధానాన్ని భారత జాతి అనాదిగా పాటిస్తోంది. మనదేశానికి పదే పదే దురాక్రమణకు గురి అయిన చరిత్ర ఉంది, దురాక్రమణను తిప్పికొట్టిన చరిత్ర కూడ ఉంది. కానీ ఇతర దేశాలను దురాక్రమించిన చరిత్ర మాత్రం మనకు లేదు! అందువల్ల అమెరికాతో ఇప్పుడు మనం కుదుర్చుకున్న ఒప్పందం కేవలం మన సరిహద్దులను భద్రంగా ఉంచుకొనడానికేనన్నది జగమెరిగిన సత్యం, చైనా సైతం నిరాకరించలేని వాస్తవం! ఈ ఒప్పందం కారణంగా మనకూ అమెరికాకు మధ్య రక్షణ వ్యూహాత్మక, దౌత్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడినాయి...
అమెరికా రక్షణ మంత్రి యాష్ కార్టర్ మన దేశంలో జరిపిన పర్యటన సందర్భంగా కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఉభయ దేశాల యుద్ధ నౌకలు విమానాలు ఉభయ దేశాలలోని స్థావరాలలోకి ప్రవేశించవచ్చునట! ఉభయ దేశాలు రక్షణ సదుపాయాలను ఇచ్చి పుచ్చుకోనున్నట్టు యాష్ కార్టర్‌తో చర్చలు జరిపిన తరువాత మన రక్షణ వ్యవహారాల మంత్రి మనోహర్ పారికర్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రకటించారు. అయితే ఇది రక్షణ సదుపాయాల వినిమయానికి సంబంధించిన ఒప్పందం మాత్రమే...ఇది ఉమ్మడిగా ఇతర దేశాలపై యుద్ధం చేయడానికి వీలు కల్పించే ఒప్పందం కానేరదు! అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధనౌకలు మన స్థావరాలలో విడిది చేయవచ్చు. ఇంధనం నింపుకోవచ్చు, మరమ్మత్తులు చేసుకోవచ్చు. మన యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు కూడ అమెరికా స్థావరాలలోకి ప్రవేశించవచ్చు, ఇంధనం నింపుకోవచ్చు. అందువల్ల ఇది రక్షణ సదుపాయాల పరస్పర వినిమయానికి సంబంధించిన ఒప్పందం. ఇలాంటి ఒప్పందాలను చైనా ఇదివరకే బంగ్లాదేశ్‌తోను బర్మాతోను శ్రీలంకతోను పాకిస్తాన్‌తోను కుదుర్చుకుంది. పాకిస్తాన్‌తో కలిసి చైనా సముద్ర జలాలలో ఉమ్మడిగా గస్తీ కూడ తిరుగుతోంది. అందువల్ల మన దేశాన్ని గతంలో దురాక్రమించిన చైనా కలాపాలను సమతుల్యం చేయడానికి వీలుగా అమెరికా వైమానిక నౌకాదళ వాహనాలు మన సరిహద్దుల సమీపంలో అప్పుడప్పుడు సంచరించడం మేలు! పాకిస్తాన్ చైనాలు ఉమ్మడిగా గస్తీ తిరిగిన రీతిలో మన దళాలు అమెరికాతో కలిసి ఉమ్మడి విన్యాసాలను ప్రదర్శించబోరని కూడ ఒప్పందంలో స్పష్టం చేసారట! అమెరికా వైమానిక దళం వారు కాని, సైనికులు కాని, నావికులు కాని దేశంలో తిష్ఠ వేయడానికి లేదు. కానీ చైనా నౌకాదళం యుద్ధ నౌకలు మూడునుంచి నాలుగు నెలలపాటు శ్రీలంకలోని ఓడ రేవులలో తిష్ఠ వేస్తున్నాయి. పాకిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవును శాశ్వత ప్రాతిపదికపై చైనా ప్రభుత్వమే నిర్వహిస్తోంది! ఇప్పుడు కొలంబో ఓడరేవును కూడ చైనా స్వాధీనం చేసుకుంటోంది. శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింగ ఈ నెల 10వ తేదీన చైనా రాజధాని బీజింగ్‌లో చర్చలు జరిపిన తరువాత ఈ సంగతి బయటపడింది! ప్రతి వ్యూహానికీ ప్రతివ్యూహాన్ని రచించాలన్న రక్షణ నిష్ఠకు మనదేశం అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం అనురూపం...
అలీన విధానమంటే ఆత్మరక్షణకు సైతం సైనిక వ్యూహాలు, సైనిక చర్యలు అనవసరమన్న భ్రమ మన విదేశాంగ నీతిని ఆవహించడం 1950వ దశకం నాటి వ్యథ. అలీన ఉద్యమ-నాన్ అలైన్‌మెంట్-రూపశిల్పిగా కీర్తిగడించిన అప్పటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దేశ భద్రత పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం వహించారు! సైనిక దళాల ఉనికి కూడ తమ అలీన విధానానికి విఘాతకరమన్న భ్రాంతికి నెహ్రూ గురయ్యారు. అయితే అలీన ఉద్యమ ప్రథమ మహాసభ 1961లో జరిగిన కొన్ని రోజులకే ఈ భ్రమ పటాపంచలమయింది. ప్రమత్తత వహించి ఉండి మన దేశాన్ని చైనా 1961లో ఘోరంగా వంచించింది, దురాక్రమణ జరిపింది. మన అనేక భూభాగాలు ఇప్పటికీ చైనా అధీనంలో ఉండిపోవడానికి తప్పుదారి పట్టిన అలీన విధానం కారణం! అందువల్లనే అలీనం-నాన్ అలైన్‌మెంట్-అని అంటే జాతీయ ప్రయోజనాలపట్ల తాటస్థ్యం- న్యూట్రాలిటీ-కాదని 1970 వ దశకంలో అప్పటి ప్రధా ని ఇందిరాగాంధీ స్పష్టం చేసింది, మైత్రి ఒప్పందం కుదుర్చుకొనడం ద్వారా సోవియట్ రష్యాతో జట్టుకట్టింది...మారిన ప్రస్తుత అంతర్జాతీయ స్థితి మనం అమెరికాతో రక్షణ బంధం పెంపొందించుకొనడం తప్పనిసరి అయింది! సోవియట్ సామ్రాజ్యం 1991లో విచ్ఛిన్నం కావడంతో రష్యాకు, చైనాకు మధ్య అప్పటివరకు నెలకొని ఉండిన అతి దీర్ఘమైన సరిహద్దు అదృశ్యమైంది. ఆ రెండు దేశాలకూ మధ్య మాజీ సోవియట్ సామ్రాజ్యంలోని మధ్య ఆసియా దేశాలు నెలకొన్నాయి. సరిహద్దు బాగా తగ్గిపోవడంతో సరిహద్దు వివాదం సహజంగా పరిష్కారమైంది. రష్యాకు ప్రస్తుతం మనకంటె చైనా సన్నిహితమై ఉంది! పాకిస్తాన్‌తో సైతం రష్యా-చరిత్రలో మొదటిసారిగా-రక్షణ ఒప్పందం కుదుర్చుకుని ఆయుధాలను విక్రయిస్తోంది! అందువల్ల మనకున్న ప్రధాన ప్రత్యామ్నాయం అమెరికా చెలిమి!
అమెరికా మన దేశం పట్ల మక్కువతో కాక తన ప్రాబల్య విస్తరణ వ్యూహంలో భాగంగా మాత్రమే ఇప్పుడీ ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నది కూడ నిరాకరింప జాలని నిజం! అంతర్జాతీయ సమాజంపై ఆర్థిక రాజకీయ వ్యూహాత్మక ఆధిపత్యం కోసం చైనా, అమెరికా మధ్య పోటీ కొనసాగుతోంది! మనతో అత్యంత సన్నిహితంగా మెలగుతున్న అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఆయుధాలను, సమర శకటాలను విక్రయించడం మాత్రం మానడంలేదు. భారత పాకిస్తాన్‌లు తమ అణ్వస్త్రాలను తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల పిలుపును కూడ ఇచ్చాడు. అంటే అమెరికా దృష్టిలో మనమూ, పాకిస్తాన్ సమానమన్నమాట! కానీ రక్షణ అనివార్యం మనం ఇప్పుడీ ఒప్పందాన్ని కుదుర్చుకొనడానికి నేపథ్యం...