సంపాదకీయం

ఉల్లి ‘కంట‘ నీరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉల్లిగడ్డల ధరలు భయంకరంగా పెరిగినప్పుడు వినియోగదారుని కళ్లలో నీరు తిరిగింది. ఇప్పుడు ధరలు ఆకాశంనుండి భూమి మీదకి కుప్ప కూలినందుకు ఉల్లిగడ్డ విలపిస్తోంది! టన్నులకొద్దీ ట్రక్కులకొద్దీ తరలివస్తున్న ఈ ఎర్రగడ్డలను మార్కెట్‌లో అడిగేవాడు లేడు! అందువల్ల ఆరు బయట ఆచ్ఛాదన లేకుండా పొర్లుదండాలు పెడుతున్న నీరుల్లి మరింతగా నీరుకారిపోతోంది! ఆరు నెలల క్రితం ఉల్లి గడ్డ కిలో ధర వంద రూపాయల వరకు పలికింది,. ఎనబయి రూపాయలకు తగ్గకుండా వినియోగదారుడిని ఏడిపించింది. ఉల్లి పకోడీలు, ఉల్లి పెసరట్లు, ఉల్లిగడ్డ కూర బందయిపోయాయి..మధ్యతరగతి వారి ఇళ్లల్లో!! ఉల్లి స్పర్శ లేని బంగాళా దుంపల సాగు పూరీల రుచిని చెడగొట్టేసింది! ఇలా ధరలు పెరగడం రైతుల వద్దనుండి మొత్తం గడ్డలు మార్కెట్‌లోకి వచ్చిన తరువాత జరిగిన పరిణామం! అందువల్ల టన్ను పదిహేను వందలకు ఇంకా తక్కువకు-కిలో పదిహేను రూపాయలకు అమ్ముకున్న రైతులు దేశవ్యాప్తంగా విస్తుపోయారు. దళారీలు కిలోకు యాబయినుండి డెబ్బయి రూపాయల వరకు దోచేశారు. దోపిడీకి గురి అయింది వినియోగదారుడు! ఇలా ధరలు భయంకరంగా పెరగడంతో తమ పంటకు కూడ అధిక లాభం వస్తున్నది రైతులకు ఐదు నెలల అంకురించిన ఆశ! ఈ ఆశ వేల ఎకరాలలో ఉల్లిపాయలను పండించింది! ఈ లోగా దళారీలు దాచి వుంచిన ఉల్లిని మార్కెట్‌లోకి విడుదల చేసి ధరలను ముప్పయి రూపాయల స్థాయికి దించారు! కొత్తగా మార్కెట్‌కు తరలి వచ్చిన ఉల్లిగడ్డలకు అందువల్ల గిరాకీ తగ్గిపోయింది! రైతులకు టన్నుకు ఐదు వందల-కిలో ఐదు రూపాయలు-నుంచి పదకొండు వందల-కిలో పదకొండు రూపాయలు-వరకు మాత్రమే లభించడానికి ఇదీ కారణం! ఇప్పుడు దోపిడీకి గురైంది వ్యవసాయదారుడు! అప్పుడు ఇప్పుడు కూడ లాభపడింది దళారీలు మాత్రమే! కృత్రిమ కొరతను సృష్టించడం ధరలను పెంచడం రైతులకు లాభాల భ్రాంతిని కల్పించడం ధరలను పాతాళ పతనం చేయడం-ఇదంతా ప్రపంచీకరణ దళారులు అమలు జరుపుతున్న వాణిజ్య వ్యూహం! 1998లోనే ఉల్లిధరలు కిలో వంద రూపాయలకు చేరడం ప్రపంచీకరణ ప్రభావం! ఇప్పుడు పది రూపాయలకు మూడు కిలోలు ఉల్లిగడ్డలు అమ్ముతున్నట్టు కూడ ప్రచారమైపోతోంది! అవును ఉల్లిగడ్డల ధరలు, టమాటాల ధరలు, కూరగాయల ధరలు ఇంతలో పెరుగుతాయి అంతలో తగ్గుతాయి..రాద్ధాంతం దేనికి? అని అంటూ పాలకులు సమస్యను తేలిక చేయడం నిత్యకృత్యం. కానీ ఈ పెరుగుదలను తగ్గుదలను ప్రపంచీకరణ శక్తులు నియంత్రిస్తుండడం నిజమైన సమస్య...
ఉల్లిగడ్డల ధరలు దారుణంగా పడిపోవడానికి కారణం సంప్రదాయ వ్యవసాయ వ్యవస్థ ఛిన్నాభిన్నమై ఉండడం... ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి జరగడం సంప్రదాయ వ్యవసాయ వ్యవస్థ! అక్రమ వాణిజ్య విస్తరణను ఈ వ్యవస్థను దశాబ్దులపాటు దిగమింగింది, హననం చేసింది! కృత్రిమ కొరతలను సృష్టించే వాణిజ్య వ్యవస్థను నడుపుతున్న వారు వ్యవసాయ రంగాన్ని నియంత్రిస్తుండడం నడుస్తున్న వ్యథ! వాణిజ్య మాయాజాలంలో చిక్కుకుని పోతున్న వ్యవసాయదారులు ఒకే పంటను తమ మొత్తం భూమిలో పండించి నష్టపోతున్నారు. వివిధ రకాల పంటలను తనకున్న పొలంలో సమాంతరంగా రైతు పండించడం సంప్రదాయ వ్యవసాయం! అలాగే ఒకే గ్రామంలోని రైతులందరు తమ పొలాలలో వివిధరకాల పంటలను పండించేవారు! ఇప్పుడు ఈ వ్యవస్థ హతమైంది గతమైంది! రెండవది ఒకే పొలంలో ఐదారురకాల ధాన్యాలను పప్పులను కూరగాయలను మిశ్రమ పద్ధతిలో పండించేవారు! ఈ మిశ్రమ పంటల విధానం కూడ ఇప్పుడు నామరూపాలు లేకుండా నశించిపోయింది! ఒక గ్రామం మొత్తం బిటి పత్తిని పండిస్తున్నారు. ఇలా పక్క పక్క వున్న అనేక గ్రామాలవారు ఈ పత్తిని పండిస్తున్నారు! అలాగే మైళ్లకొద్దీ విస్తరించిన పొలంలో టమాటాలను ఉత్పత్తి చేస్తున్నారు...మరో పంట లేదు! ఒక వ్యవసాయ ఉత్పత్తి ధరలు వాణిజ్య వాటికలో ఆకాశం అంటాయన్న వార్త ప్రచారం కాగానే వందలాది గ్రామాల రైతులు ఆ ధర పెరిగిన కూరగాయలను వేల ఎకరాలలో పండించడానికి పూనుకుంటున్నారు. కానీ ఈ పంట కోతకు వచ్చేసరికి నాలుగు నెలలైనా పడుతుంది. ఈలోగా ఆ ఉత్పత్తి ధరలు తగ్గుతాయి. అవసరానికి మించిన రీతిలో మితిమీరిన ఉత్పత్తులకు గిరాకీ ఉండదు. ధర పాతాళపతనం అవుతోంది..ఉల్లిగడ్డ విషయంలో ఇప్పుడిదే జరిగింది!
ఉల్లిగడ్డల ధరలతోపాటు టమాటాల ధరలు కూడ పడిపోయాయి. కంది పప్పు ధరలు తగ్గవు కనుక ఉల్లి, టమాటాలను ఉడకబెట్టి ఆరగించడమన్నది ప్రభుత్వాల విధానం! ధరలు పెరిగిన కందిపప్పును భారీ ప్రమాణంలో ఎందుకని దిగుమతి చేసుకోవడంలేదు? ధరలు తగ్గిన ఉల్లిని, టమాటాలను విదేశాలకు ఎగుమతి చేయలేకపోవచ్చు గాక..కందిపప్పును ఎందుకని దిగుమతి చేసుకోరాదు? కందిపప్పు ధర గత జూన్‌నుండి మూడు రెట్లు పెరిగింది. మే నెలలో కిలో డెబ్బయి ఐదు రూపాయలకు లభించిన కందిపప్పును ఇప్పుడు రెట్టింపు ధరకు కొంటున్నాము! ఉల్లిపాయలు, టమాటాల ధరలు ఇట్టేపెరిగి అట్టే తగ్గుతాయి కాబట్టి ప్రభుత్వానికి పెద్ద ప్రమేయం లేదట! మరి కందిపప్పు ధర విషయంలో కూడ ప్రభుత్వానికి ప్రమేయం లేదా? విచిత్రమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి పంట తగ్గినప్పటికీ ధరలెందుకు తగ్గిపోయాయి! పొరుగున మహారాష్టన్రుంచి వందలాది ట్రక్కులలో గడ్డలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయి..అందుకని! అంటే తెలంగాణ మార్కెట్‌లో కంటె మహారాష్ట్ర మార్కెట్లలో మరింతగా ఉల్లిధరలు దిగజారిపోయాయన్నమాట! ట్రక్కులతో ఉల్లిని తరలించుకుని వస్తున్న రైతులకు మార్కెట్ల దళారీలు చేస్తున్న వాగ్దానాలు భంగపడుతున్నాయి. వాగ్దానం చేసిన ధరకంటె చాలా తక్కువ మొత్తాన్ని దళారీలు రైతులకు చెల్లిస్తున్నారు! రైతుల వద్దకు దళారీలు వచ్చి కొనుగోలుచేయడం వల్ల రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది! కానీ మార్కెట్ వద్దకు తమ ఉత్పత్తిని మోసుకుని వెడుతున్న వ్యవసాయదారుడు దళారీ చెప్పిన ధరకు తెగనమ్ముకోవాలి! ఈ పద్ధతి మారేది ఎప్పుడు?
ఉభయ తెలుగు రాష్ట్రాలలోను టమాటాలను, ఉల్లిగడ్డలను పండిస్తున్నవారు తరచు గిట్టుబాటు కాక పంటలను పొలంలోనే వదిలేస్తున్నారు! టమాటా కిలోకు అర్ధరూపాయి కూడ లభించని స్థితి చిత్తూరు జిల్లాలో ఏర్పడుతోంది బళ్లారి ప్రాంతాంలో ఏర్పడుతోంది, మెదక్ జిల్లాలో ఏర్పడి ఉంది! తెంపడానికి అయ్యే ఖర్చు కూడ గిట్టని పరిస్థితి. కూరగాయలను నిలువ చేయగల శీతల గృహాలను నిర్మిస్తామని ప్రభుత్వాలు వాగ్దానాలు చేస్తూనే ఉన్నాయి. ఆ శీతల గృహాలు కూడ గ్రామాల్లో ఏర్పడవు, పొలం వద్ద ఏర్పడవు...అందువల్ల సంప్రదాయ వ్యవసాయ పునరుద్ధరణ వల్ల మాత్రమే ఉల్లికి టమాటాకు విలువ పెరుగుతుంది!