సంపాదకీయం

మాతృ మాధ్యమ బోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాథమిక విద్యకు ఆంగ్లభాషా దాస్యం నుండి విముక్తి లభించగలదన్న ఆశలు మళ్లీ అంకురిస్తున్నాయి. క్రమంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రాథమిక విద్యను మాతృభాషా మాధ్యమంగా మాత్రమే బోధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు మాధ్యమాలలో ప్రచారవౌతోంది. దేశవ్యాప్తంగా మాతృభాషా మాధ్యమ ప్రాథమిక విద్యాబోధనకు వీలుగా జాతీయ విధానాన్ని రూపొందించాలన్న ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించనుందట. కేంద్ర ప్రభుత్వం తనంత తానుగా ఇలాంటి విధానాన్ని రూపొందించి ఉండాలి. బ్రిటిష్ రాజకీయ దురాక్రమణ నుండి దేశానికి విముక్తి కలిగినప్పటికీ ఆంగ్లభాషా ప్రాబల్యం నుండి దేశ ప్రజలకు విముక్తి కలుగకపోవడం దశాబ్దులు వైపరీత్యం. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించిన రోజులలో దేశంలోని మేధావులలోను విద్యావంతులలోను ప్రస్ఫుటించిన భారతీయ భాషాభిమానం వారు నిష్క్రమించిన తరువాత క్రమంగా అంతరించిపోవడానికి కారణం భావదాస్యం. ఈ భావదాస్యం నుండి విముక్తి కలుగుతోందని, క్రమంగా భారతీయ భాషలకు విద్యాబోధనలో ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తుండిన తరుణంలో ప్రపంచీకరణ వాణిజ్య వ్యవస్థ మన నెత్తికెక్కి కూర్చుంది. ప్రపంచీకరణ ఫలితంగా విద్య వ్యాపారం కావడం ఒక వైపరీత్యం. ఇలా విద్యా వ్యాపారం వ్యవస్థీకృతం కావడం జాతీయ వ్యథలో సగం మాత్రమే. ఆంగ్లభాషా మాధ్యమ బోధన అట్టడుగు స్థాయి నుండి మొదలై పోవడం రెండవ వైపరీత్యం. ఫలితంగా అమ్మను మరచిన బుడతలు మమీ నామ జపం చేస్తున్నారు. బ్రిటిష్ వారు నిష్క్రమించిన తరువాత అనేక దశాబ్దుల పాటు శిశు తరగతి-కె.జి- నుండి స్నాతకోత్తర తరగతి-పి.జి- వరకు భారతీయ భాషలలో, మాతృభాషలలో విద్యాబోధన జరగాలన్న ఉద్యమాలు జరిగాయి. ప్రభుత్వేతర, ప్రభుత్వ విద్యా సంస్థలలో ఆంగ్ల మాధ్యమంతో పాటు మాతృభాషలలో సైతం ప్రాథమిక మాధ్యమిక ఉన్నత విద్యాబోధన మొదలైంది. హిందీ భాషను మాట్లాడే రాష్ట్రాల్లో ఇంగ్లీషు మీడియం దాదాపు అరుదైపోయింది. ఇతర రాష్ట్రాలలో సైతం ఇంగ్లీషు మీడియంలో చదివిన వారికంటె మాతృభాషలు మాధ్యమంగా విద్య నేర్చుకున్న వారి సంఖ్య అధికమైంది. అఖిల భారత సేవలకు సంబంధించిన పోటీ పరీక్షలను సైతం తెలుగులోను ఇతర ప్రాంతీయ భాషలలోను వ్రాసిన అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇలా ఆంగ్లంతో సమానంగా భారతీయ భాషలు వికసించడం మూడు దశాబ్దుల ముచ్చట. న్యాయస్థానాలలో తెలుగును, ఆయా ప్రాంతాలలో ఆయా ప్రాంతీయ భాషలను ఉపయోగించాలన్న ఉద్యమ స్ఫూర్తి కూడ విస్తరించింది. తమిళనాడు వంటి చోట్ల జిల్లా న్యాయస్థానాలలోను, కింది స్థాయి న్యాయ స్థానాలలోను భారతీయ భాషలు అధికార భాషలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడ తెలుగును సర్వ ప్రభుత్వ రంగాలకు విస్తరింప చేయాలన్న ఆర్భాటం జరిగింది. కానీ ఈ ఆర్భాటమంతా ప్రపంచీకరణ మొదలైన తరువాత ఆవిరి అయిపోవడం రెండు దశాబ్దుల చరిత్ర.
ప్రపంచీకరణ ఫలితంగా దేశాల సరిహద్దులు చెరిగిపోయాయన్న భ్రాంతి పెరిగింది. సరిహద్దులు లేని అంతర్జాతీయ సమాజంలో ఉపాధి పొందడానికి ఆంగ్లభాష మాత్రమే కాక ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన కూడ అనివార్యం అన్నది ఇరవై ఏళ్లుగా జరుగుతున్న ప్రచారం. ఈ ప్రచారాన్ని ప్రభుత్వాలు సైతం చేయించాయి, చేశాయి. అమెరికా యాసలో ఇంగ్లీషు మాట్లాడటం వల్ల మాత్రమే గౌరవం, హుందాతనం, కీర్తి, ఆర్థిక స్థాయి పెరుగుతాయన్నది అధికాధిక విద్యావంతుల అభిప్రాయం. ఇదంతా ప్రపంచీకరణ మాయా మృగజాలంలో భాగం...అందువల్ల గ్రామీణ నిరుపేదలు సైతం తమ పిల్లలను మూడవ ఏటనుంచి ఇంగ్లీషు బడులకు పంపించడం మొదలైంది. కార్పొరేట్ కామందులు కానె్వంట్ స్థాయి నుండి కాలేజీ స్థాయి వరకు భారీగా ఫీజులను గుంజడం మొదలైంది. అయినప్పటికీ కూలి పని చేసుకునేవారు సైతం ప్రభుత్వేతరులు నిర్వహిస్తున్న ఇంగ్లీష్ స్కూళ్లకే తమ పిల్లలను పంపిస్తున్నారు. ఇంగ్లీషును నేర్చుకొని అమెరికాకు వెళ్లి ఉద్యోగాలను వెలగబెట్టాలన్నదే అందరి ధ్యేయం కావడానికి సమాచార సాంకేతిక రంగాల్లో వచ్చిన విప్లవ విస్ఫోటనాలు కారణం. గ్రామీణ ప్రాంతాలలోని నిరక్షరులు సైతం సెల్‌ఫోన్ వాడుతున్నారు. తద్వారా ఇంగ్లీషు పదజాలానికి అలవాటు పడిపోయారు. ఒకప్పుడు ప్రాథమిక ఉన్నత పాఠశాలల విద్యార్థులు తెలుగులోను ఇతర ప్రాంతీయ భాషలలోను నేర్చుకున్న పదాలకు ఇంగ్లీషు సమాన పదాలను గురించి అనే్వషించేవారు. నిఘంటువులను చూసేవారు. ఇతరులను, ఉపాధ్యాయులను అడిగేవారు. ఇప్పుడు మొత్తం తలకిందులైంది. ఇంగ్లీషు పదాలను మాతృభాషలో సమాన శబ్దజాలం తెలియని శిశువులు బాలబాలికలు భావి భారత పౌరులు...
గ్రేప్స్, మ్యాంగో, బనానా, వాటర్ మిలన్ అన్న పదాలు తమ మాతృభాషలోనివేనన్నది కానె్వంట్ పిల్లల విశ్వాసం. అవి ఇంగ్లీషు పదాలని తెలిసిన ఇంజినీర్లకు, డాక్టరకు మాతృభాషలోని సమాన పదాలను తెలుసుకోవాలన్న ధ్యాస కలగడం లేదు. వెడ్‌నస్‌డే అన్నది బుధవారమన్న స్పృహ ఉన్నత పాఠాలల విద్యార్థులకు లేదు. వారాలు, అంకెలు, ఇంటిలోని వస్తువులు, గదులు, ఇలా జీవన సర్వస్వం ఆంగ్లీకరణకు గురి అయి ఉండడం ప్రపంచీకరణ యుగం. డోర్ పెట్టుకో అని అంటారు కాని, తలుపు మూసుకో అన్న ప్రయోగం వినబడడం లేదు. నిరక్షరాస్యులు సైతం క్రియా పదాలకు మాత్రమే తెలుగును ఇతర భారతీయ భాషలను వాడుతున్నారు. మిగిలిన సమస్త వ్యవహార శబ్దజాలం ఆంగ్లమైపోయింది. భారతీయ భాషా ప్రపంచం సంకరమైపోయింది. బ్రిడ్జి అంటే వంతెన, వారథి అన్న పదాలు పెద్దలకే తెలియవు. జాతీయ సంస్కృతికి, జాతీయుల వ్యవహారానికి మధ్య వారథి భాష. ఏ దేశానికైనా ఏ జాతికైనా అన్వయించే జీవన వాస్తవమిది. ఈ భాష మాతృభాష అయినప్పుడు మాత్రమే శిశువుల బాలికల భావజాలం మాతృసంస్కృతికి నిబద్ధం అవుతుంది. మాతృదేశ మమకార నిష్ఠను అలవరచుకొంటుంది. ఈ భాష విదేశీయ భాష అయినప్పుడు చిన్నారుల భావాంబర వీధి విదేశీయ సంస్కృతి గ్రహణ గ్రస్తమవుతుంది. ఇదంతా తెలిసిన మేధావులు, విద్యావేత్తలు, వాణిజ్యవేత్తలు, ప్రభుత్వ నిర్వాహకులు పనికట్టుకొని మన విద్యను నిరంతరం ఆంగ్లీకరిస్తుండడం ఈ దేశానికి వ్యతిరేకంగా నడచిపోతున్న ప్రహసనం...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెట్టాలని 2009లో నిర్ణయించడం ఈ మాతృభాషా హనన ప్రక్రియకు పరాకాష్ఠ.
ఈ వైపరీత్యాన్ని సరిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించడం అందువల్ల మాతృభాషా మమకార హృదయం కలవారికి హర్షం కూర్చే పరిణామం. ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే కాక ప్రభుత్వేతర పాఠశాలలో కూడ ఐదవ తరగతి వరకు మాతృభాషా మాధ్యమంలోనే విద్యను బోధించానికి వీలైన జాతీయ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా రూపొందించాలి. కానీ అలా రూపొందించే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురు చూడవలసిన పనిలేదు. తమ రాష్ట్రాలలో ఈ విధానాన్ని తప్పనిసరి చేస్తూ శాసనసభలో బిల్లును ఆమోదించవచ్చు. కర్నాటక ప్రభుత్వం గత జనవరిలో ఇలాంటి బిల్లును రూపొందించింది. శాసనసభ ఆమోదించింది. తెలంగాణ శాసనసభ మాత్రమే కాక, ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడ ఇలాంటి బిల్లును ఆమోదించవచ్చు..