సంపాదకీయం

ఎన్నికల విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశయంతో కార్యాచరణ పోటీ పడింది. సాధించాల్సిన లక్ష్యానికి లంగరేసే రీతిలోనే ప్రధాని మోదీ రెండో మంత్రివర్గ విస్తరణ సాగింది. కుల, మత ప్రాంతాల అనివార్యతలకూ అనేక కోణాల్లో అద్దంపట్టింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికలను పరిగణనలోకి తీసుకునే కొత్త మంత్రులను మోదీ ఎంపిక చేసుకున్నారని చెప్పాలి. మంత్రివర్గ సహచరులను ఎంచుకోవడంలో ప్రధాని భారీ కసరత్తే చేశారు. సంకీర్ణ ప్రభుత్వాల మాదిరిగా మిత్రపక్షాల ఒత్తిడులు, భాగస్వామ్య పార్టీల బెదిరింపులు లేకపోయినా, రానున్న శాసనసభ ఎన్నికలను ఓవైపు, ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలను మరోవైపు గమనంలోకి తీసుకుని కుడిభుజం అమిత్‌షాతో కలసి రెండు నెలలపాటు సుదీర్ఘమైన కసరత్తు చేశారు. మంత్రుల పనితీరును స్వయంగా బేరీజు వేశారు. నమ్మినబంట్లు అమిత్‌షా, వెంకయ్యలతో దఫదఫాలుగా మంతనాలు సాగించారు. కడకు మంత్రులతోనూ ముఖాముఖీ భేటీ అయి, వారి పనితీరును స్వయంగా అడిగి తెలుసుకున్నాకే విస్తరణకు శ్రీకారం చుట్టారు. మంత్రివర్గ విస్తరణకోసం ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ఇంతగా కసరత్తు చేయడం బహుశా ఇటీవలికాలంలో ఇదే మొదటిసారి. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలకు మోదీ జరిపిన తొలి మంత్రివర్గ విస్తరణలో 21మందికి చోటు కల్పించగా, తాజాగా 19మందికి స్థానమిచ్చారు. కేబినెట్‌నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికిన ఆయన, ప్రకాశ్ జవడేకర్ ఒక్కరికే ప్రమోషన్ ఇవ్వడం గమనించదగ్గ అంశం. వాస్తవానికి పదోన్నతికి అవకాశం ఉన్నవారిలో పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌ల పేర్లే బాగా వినిపించాయి. అలాగే 75 ఏళ్లు పైబడిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించకూడదనే తన నియమాన్ని మోదీ ఈసారి పక్కన పెట్టినట్టు కనిపించింది. ఇదే కారణంపై సీనియర్ నేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, బిసి ఖండూరీ వంటి వారిని దూరంగా పెట్టిన మోదీ... నజ్మా హెప్తుల్లా (76), కల్‌రాజ్ మిశ్రా (75)ల జోలికి పోకపోవడం ఆశ్చర్యకరమే. నిజానికి వయసు పైబడిందనే కారణంపైనే మధ్యప్రదేశ్‌లో ఇద్దరు సీనియర్లను మంత్రివర్గంలో కొనసాగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ససేమిరా అన్న విషయం గమనార్హం. మిశ్రా కొనసాగింపునకు యూపీ ఎన్నికలే కారణం కావచ్చునన్న విశే్లషణలను కొట్టిపారేయలేం. ఆ రాష్ట్రంలో 13 శాతం ఓట్లున్న బ్రాహ్మణ వర్గానికి మిశ్రా ప్రతినిధి. న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ, వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌లపై వేటు తప్పదని మీడియా అంతా కోడై కూసినా అలా జరగలేదు. ప్రధాని నినాదం ‘గావ్..గరీబ్...కిసాన్’ (పల్లెలు...పేదలు ...రైతులు) వ్యవసాయంతో ముడిపడి ఉన్నా, పనితీరు సరిగా లేదని ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న వ్యవసాయ మంత్రిని కొనసాగించడంలో ఆంతర్యం ఏమిటో బోధపడదు. శాఖల మార్పిడిలోనూ ఆయన పోర్ట్ఫోలియో పదిలంగానే ఉండటం మరో విశేషం. జైట్లీనుంచి సమాచార, ప్రసార శాఖను తొలగించి, వెంకయ్యకు అప్పగించడం ఆర్థిక మంత్రిపై పనిభారం తగ్గించేందుకే. సదానంద గౌడనుంచి న్యాయ శాఖను తప్పించడం కూడా అంతా ఊహించిందే. ‘మంత్రివర్గం చిన్నదిగా ఉండాలన్నది నా అభిమతం’ అని రెండేళ్ల కిందట ప్రమాణ స్వీకారానికి ముందు చెప్పిన ప్రధాని ఆ విషయంలో రాజీ పడ్డారన్న సంగతి తాజా జంబో కేబినెట్‌ను చూస్తే తెలుస్తుంది. నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 82మంది వరకూ మంత్రులు ఉండాల్సి ఉండగా ఆ సంఖ్యకు రెండే తక్కువగా విస్తరణ జరపడం విడ్డూరమే.
ఉత్తరప్రదేశ్‌కే విస్తరణలో పెద్దపీట వేస్తారని భావించినా మూడే స్థానాలతో మోదీ సరిపెట్టారు. అందుకు కారణం ఆయనతో సహా ఇప్పటికే యూపీకి చెందిన ఎనిమిదిమంది మంత్రివర్గంలో కొనసాగుతుండటం. అదే రాష్ట్రానికి చెందిన రామ్ శంకర్ కటారియా తాజాగా ఉద్వాసనకు గురైనా, మరో ముగ్గురికి కొత్తగా చోటు కల్పించడంతో యూపీ ప్రాతినిథ్యం పదికి పెరిగింది. దళితులు, గిరిజనుల ఓట్లే లక్ష్యంగా కొత్త మంత్రుల్లో ఐదుగురు ఎస్‌సి వర్గానికి, ఇద్దరు ఎస్‌టిలకు చెందినవారు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఓటు బ్యాంక్‌ను గంప గుత్తగా ‘కొల్లగొట్టే’వారికి కూడా విస్తరణలో మోదీ స్థానం కల్పించారు. అప్నాదళ్ ఎంపి అనుప్రియ పటేల్‌ను మంత్రివర్గంలోకి ఆహ్వానించడానికి అదే కారణం. ఉత్తరప్రదేశ్‌లో ప్రాబల్యం గల కుర్మీ కులస్థులకు ప్రాతినిథ్యం వహిస్తున్న అనుప్రియ పటేల్ (అప్నాదళ్ ఎంపి) చేరిక వచ్చే ఎన్నికలలో లాభిస్తుందనే ముందాలోచనతోనే మంత్రివర్గంలో చోటు కల్పించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఇదే కులానికి చెందినవారు. యూపీ ఎన్నికల్లో ఇతర వెనుకబడిన కులాలవారిని, మరీ ముఖ్యంగా కుర్మీ కులస్థులను ప్రభావితం చేసేందుకు నితీశ్ రంగంలోకి దిగే అవకాశాలు ఉండటంతో మోదీ ముందుగానే అనుప్రియకు రెడ్ కార్పెట్ పరిచారు. అయితే తల్లి కృష్ణ పటేల్ (అప్నా దళ్ అధ్యక్షురాలు)తో అనుప్రియ విభేదించి, సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో కుమార్తెకు మంత్రి పదవి ఇస్తే, మిత్రపక్షమైన బిజెపితో తెగతెంపులు చేసుకుంటానని కృష్ణ పటేల్ బెదిరించిన దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రత్యర్థులతో జత కలిస్తే కమలనాథుల పరిస్థితి ఏమిటన్నది ఆలోచించాల్సిన విషయం. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో రాజస్థాన్‌లో బిజెపి ‘స్వీప్’కు కారణమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజెను సంతృప్తి పరచేందుకే ఆ రాష్ట్రానికి అత్యధికంగా నాలుగు కేబినెట్ పదవులు కేటాయించినట్టు తెలుస్తోంది. ఇటీవలికాలంలో మోడువారిన మోదీ-అమిత్ షా, వసుంధరల స్నేహం ఈతాజా మార్పుతో చివుళ్లు తొడుగుతుందని భావించవచ్చు.
ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ ధ్యేయంగా పోరాటం ప్రారంభించిన మోదీ, ఆ దిశగా కొంతవరకూ విజయం సాధించారనే చెప్పాలి. ఎన్డీఏ పాలన మొదలయ్యాక జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, అస్సాంలలో ఒంటరిగానో, మిత్రపక్షాల సాయంతోనో బిజెపిని మోదీ గెలుపు బాట పట్టించారు. అయితే ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట మాత్రం ఆ పార్టీ పప్పులు ఉడికిన దాఖలాలు ఇంతవరకూ లేవు. యూపీలో గెలుపే లక్ష్యంగా ఇప్పుడు మోదీ దండెత్తనున్న సమాజ్‌వాదీ కూడా ప్రాంతీయ పార్టీయే. అయితే పెచ్చరిల్లిన హింసాకాండ, అవినీతి అక్రమాలతో అప్రతిష్ఠను మూటగట్టుకున్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ కంటే బిజెపికి మరో ప్రాంతీయ పార్టీ బహుజన్ సమాజ్ ప్రధాన ప్రత్యర్థి కావచ్చు. ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ల కిందట జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో 80కి 71 ఎంపీ సీట్లను గెలుచుకున్న బిజెపి, అసెంబ్లీలోనూ పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో దేశాన్ని ప్రగతి బాట పట్టించడంలోనైనా, పదహారేళ్ల కిందట చేజారిన యూపీ శాసనసభను కమలానికి తిరిగి కట్టబెట్టేందుకైనా కొత్తగా మంత్రివర్గంలో స్థానం సంపాదించిన ‘డూయర్స్ అండ్ పెర్‌ఫార్మర్స్’ (కార్యశూరులు, ప్రగతి సాధకులు) ఏమేరకు కృషి చేస్తారో వేచి చూడాల్సిందే.