సంపాదకీయం

పెరగనున్న పచ్చదనం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చదనం మళ్లీ విచ్చుకుంటుందన్న ఆశలు అంకురిస్తున్నాయి. క్షతగాత్ర అయిన ప్రకృతికి స్వస్థత సమకూరగలదన్న విశ్వాసం విస్తరిస్తోంది. కేంద్ర పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ వారు రూపొందించిన జాతీయ అటవీ విధానం-నేషనల్ ఫారెస్ట్ పాలసీ-ఎన్‌ఎఫ్‌సి-ఈఆశలు పల్లవిస్తుండడానికి భూమిక, ఈ విశ్వాసం పల్లవిస్తుండడానికి ప్రాతిపదిక. పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు రూపకల్పన చేసిన ఈ ముసాయిదా విధానం ప్రభుత్వం ఆమోదాన్ని పొందగలిగినట్టయితే కాలుష్యపు కౌగిలిలో చిక్కి ఉన్న భూమాతకు విముక్తి లభిస్తుంది, భరతావని నలుచెరగులా పరిమళ పవన భరిత సతత హరిత శోభలు సభలు తీరనున్నాయి. దేశంలోని మొత్తం భూభాగంలో కనీసం మూడవ వంతు అడవులు వర్ధిల్లాలన్నది ఈ నూతన అటవీ విధానం లక్ష్యం. బ్రిటన్ ప్రభుత్వం వారి దురాక్రమణ ఆరంభం అయ్యేనాటికి దేశంలో సగభాగం సతతహరిత అరణ్యాలతో నిండి ఉంది...వందల ఏళ్లనాటి మహా వృక్షాలతో ఆరోగ్యవర్ధకమైన ఓషధులతో, ఓషధుల సారం నిండిన నదుల నీటితో భారతీయ జనజీవనం పరిపుష్టం కావడం అప్పటి ప్రాకృతిక స్వభావం. బ్రిటన్ తదితర విదేశాలవారు మన అడవులను నరికి కలపను తమ దేశాలకు తరలించుకొనిపోయారు, ఈ చెట్లను నరికి కలపను కొల్లగొట్టుకుపోయే విదేశీయుల షడ్యంత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. మన ఎర్రచందనం వృక్షాలు నరికివేతకు గురి అవుతునేఉన్నాయి. ఎర్ర చందనం కలప చైనా వంటి విదేశాలకు భారీగా దొంగ రవాణా అవుతోంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మన అడ వుల హనన క్రియ పరాకాష్ఠకు చేరడం చరిత్ర. ఇలా నిరంతరం చెట్లను నరికి కలపను విదేశాలకు తరలించిన కారణంగా 1947లో బ్రిటన్ బీభత్సకారులు మన దేశంనుండి నిష్క్రమించే నాటికి అడవులు హరించుకునిపోవడం ఊపందుకుంది. ప్రస్తుతం మన భూభాగంలోని నాలుగవ వంతు కంటె తక్కువ ప్రాంతంలో మాత్రమే అడవులు పెరుగుతున్నాయి. దట్టమైన అడవుల విస్తీర్ణం సంరక్షిత అటవీ ప్రాంత విస్తీర్ణం మరింత తక్కువ! అందువల్ల మళ్లీ ముప్పయినాలుగు శాతం భూభాగంలో అడవులు, ఆకుపచ్చని అందాలు అలరారగలదన్నది జన మానస క్షేత్రాన్ని ప్రహర్ష పరిప్లుతం చేస్తున్న పరిణామం!
చిట్టడవులు, చిన్న చిన్న పొదలు తీగెలు విస్తరించడం కూడ భూమికి ఆకుపచ్చని హాయిని కలిగిస్తుంది. కానీ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి, కాలుష్యాన్ని తొలగించి స్వచ్ఛమైన గాలిని, మంచి నీటి వాగులను సమకూర్చగలిగింది దట్టమైన అడవులు మాత్రమే. ఇలాంటి దట్టమైన అడవులు కనీసం ముప్పయి నాలుగు శాతం భూభాగంలో ఏర్పడినట్టయితే అనావృష్టి పలాయనం చిత్తగించక మానదు, సకాల వర్ష సమృద్ధి సస్య సమృద్ధిని కలిగించక మానదు. ఇలా బీడును అడవిగా మార్చడానికి వీలుగా వలసిన నిధులను సమకూర్చడాన్ని కొత్తగా హరిత శుల్కాన్ని-గ్రీన్ టాక్స్-విధించాలని కూడ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందట! ప్రభుత్వం ప్రభుత్వేతర భాగస్వామ్యం పేరుతో బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు ప్రభుత్వం వారు అనేక ప్రగతి కార్యక్రమాలను అప్పగిస్తున్నారు. రహదారులను మొదలు విమానాశ్రయాల వరకు ఈ ప్రభుత్వేతర సంస్థలు నిర్మించి నిర్వహిస్తుండడం ప్రపంచీకరణలో భాగం. ఇలా పరిశ్రమల స్థాపన పేరుతో కాలుష్యాన్ని పెంచుతున్న ప్రభుత్వేతర సంస్థలకు అడవులను పెంచే పథకాలను సైతం ప్రభుత్వం ఎందుకు అప్పగించరాదు? రహదారులను విమానాశ్రయాలను నిర్మించి వినియోగదారులనుండి వివిధ రకాల సుంకాలను శుల్కాలను దండుకుంటున్న ప్రభుత్వేతర సంస్థలు అడవులను పెంచి హరిత శుల్కాలను కూడ ప్రజలనుండి రాబట్టుకోవచ్చు!
ప్రత్యేక ఆర్థిక మండలుల-స్పెషల్ ఎకనామిక్ జోన్స్- సెజ్జులు-ను ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రభుత్వేతర, విదేశీయ సంస్థల లక్షల ఎకరాల భూమిని అప్పచెపుతున్న ప్రభుత్వాలు ప్రత్యేక హరిత మండలుల-స్పెషల్ గ్రీన్ జోన్స్-ను కూడ ఏర్పాటు చేయవచ్చు. అలా వేలాది ఎకరాలలో ప్రత్యేకంగా మొక్కలను నాటి అడవులను ఏర్పాటు చేయడంవల్ల పచ్చదనం పారిశ్రామిక ప్రగతి సమాంతరంగా వికసించడానికి వీలు కలుగుతుంది! ఇలా ప్రత్యేక అటవీ మండలాలను ఏర్పాటు చేసి పదేళ్ల పాటు పదిహేను ఏళ్లపాటు అడవులను పెంచే ప్రభుత్వేతర సంస్థలు ఆతరువాత కొన్ని ఏళ్లపాటు అటవీ సంపదలో వాటాను పొందవచ్చు. ఇలాంటి విధానాన్ని ప్రభుత్వం ఎందుకని వ్యవస్థీకరించరాదు? ఈ పచ్చని ప్రగతి కోసం విదేశీయుల మహా పరిజ్ఞానం కాని, భారీ పెట్టుబడులు కాని అవసరం లేదు. స్వదేశీయ సంస్థలకు భూమిని సేకరించి ఇస్తే సరిపోతుంది! లేదా ప్రత్యేక ఆర్థిక మండలాలలో పరిశ్రమలను ఏర్పాటు చేయగల పారిశ్రామిక వాణిజ్య సంస్థలు విధిగా హరిత మండలాలలోని కొంత ప్రాంతంలో అడవులను పెంచి తీరాలన్న నిబంధనను రూపొందించాలి. ఇలా పారిశ్రామిక ప్రగతితో పచ్చదనం విస్తరణను జోడించడంవల్ల ప్రస్తుతం ఉన్న స్థాయిలో నైనా అడవులు పెరిగే అవకాశం ఉంది. ముప్పయి నాలుగు శాతం భూభాగంలో అడవులు ఏర్పడడం తరువాతి సంగతి. ప్రతి ఏటా అడవుల మొత్తం విస్తీర్ణం తగ్గిపోతుండడం దశాబ్దుల ప్రహసనం. విస్తీర్ణాన్ని పెంచడం సంగతి ఎలా ఉన్నప్పటికీ ఇకపై మొత్తం భూమిలో అటవీ సీమల శాతం తగ్గకుండా నిరోధించడం తక్ష ణ కర్తవ్యం. నూతన హరిత విధానం దాన్ని సాధించగలిగితే విధానం విజయవంతం అయినట్టే.దేశంలోని అడవుల విస్తీర్ణం ప్రతిరోజు నూట ముప్పయి ఐదు హెక్టార్ల మేర తగ్గిపోతున్నట్టు 2013లోనే వెల్లడైంది. అంటే సగటున సాలీన నాలుగు వందల ఎనబయి ఆరు చదరపు కిలోమీటర్ల అడవులు ధ్వంసమైపోతున్నాయి. అడవుల పెంపకం గురించి, సామాజిక వన వాటిక ఏర్పాటు గురించి ప్రభుత్వాలు శ్రద్ధ వహించడం మొదలైన దశాబ్దుల తరువాత నెలకొన్న వైపరీత్యం. నూతన అటవీ విధానం వల్ల ఇకపై అడవుల విస్తీర్ణం తగ్గకుండా యథాతథ స్థితి అయినా నెలకొనడం అభిలషణీయం. అంటే పరిశ్రమల కోసం అటవీ భూమి నష్టమవుతున్న మేర ఇతర చోట్ల ఎప్పటికప్పుడు కొత్త అడవులు పెరగాలి. మూడవ వంతు భూభాగం అటవీమయం కావాలంటే నష్టవౌతున్న అడవికంటె ఎక్కువ విస్తీర్ణంలో కొత్త అడవులు పెరగాలి...చిత్తశుద్ధి పెరిగితే ఈ లక్ష్యం మరికొన్ని దశాబ్దుల తరువాతనైనా నెరవేరి తీరుతుంది...
పారిశ్రామిక ప్రగతి, పచ్చదనం పరస్పర విరుద్ధమన్నది ఇంతవరకు ధ్రువపడిన వాస్తవం. వాణిజ్య ప్రపంచీకరణ, కాలుష్య పర్యావరణాన్ని కల్పిస్తోంది! హరిత నియమావళిని అతిగా అమలు జరపడంవల్ల ప్రగతి స్తంభించిపోతుందని మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ గతంలో చెప్పి ఉన్నారు. అందువల్ల పరిశ్రమల స్థాపన కోసం దేశమంతటా అడవులు ధ్వంసమైపోయాయి. పాలనా బాధ్యతలను స్వీకరించిన తరువాత ప్రస్తుత ప్రభుత్వం ఈ నూతన విధానం ముసాయిదాను రూపొందించడానికి రెండేళ్లుపట్టింది. ఆలస్యంగానైనా ఈ విధాన ఆవిష్కరణ జరగడం హర్షణీయం. ఖనిజాలను తవ్వడం కోసం, పరిశ్రమలను స్థాపించడం కోసం అటవీ సీమను హత్య చేయరాదన్నది కొత్తముసాయిదా ప్రధాన అంశం! అమలు జరుగుతుందా అన్నది వేచి చూడదగిన పరిణామం...