సంపాదకీయం

వదలని వైపరీత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్లాస్టిక్’ కీర్తి పతాకం అంబరాన్ని చుంబించడం ‘మకర సంక్రాంతి’ సందర్భంగా దేశమంతటా ఆవిష్కృతమైన దృశ్యమాలిక! తెలంగాణ రాజధాని ప్రాంగణంలో జరిగిన ‘పతంగుల పండుగ’లో కూడ ‘ప్లాస్టిక్’ ప్రాభవం మరోసారి ప్రస్ఫుటించడం ప్రాధాన్య చిహ్నం. జన జీవన వ్యవహారంలో ‘ప్లాస్టిక్’ వస్తువులకు ‘పదార్థపరంపర’కు కొనసాగుతున్న ప్రాధాన్యం ఇది! ఈ ‘ప్రాధాన్యం’గిట్టనివారు ‘ప్లాస్టిక్’పై చేస్తున్న ‘యుద్ధం’ నవ్వులాటగా మారి ఉండడం నడుస్తున్న చరిత్ర. ‘ప్లాస్టిక్’ లేకపోయినట్టయితే క్షణం కూడ బతుకు ముందుకు సాగదు- అన్నది అధికాధిక ప్రజల అంతరంగం! అందువల్లనే ‘మందం’తక్కువ ఉందా? ఎక్కువ ఉందా? అన్న ‘‘మైక్రాన్ల’’ విచికిత్సను జనం పట్టించుకోవడం లేదు... నిశ్చింతంగా ‘‘మందం తక్కువ ఉన్న ‘ప్లాస్టిక్’ పదార్థాలను ప్రధానంగా సంచులను వాడేస్తున్నారు. మందం ఎక్కువ ఉన్న పదార్థాలపై నిషేధమే లేదు. అందువల్ల వాటిని యథావిధిగా వాడేస్తున్నారు. గాంధీ మహాత్మునికి ఘనంగా నివాళిని ఘటించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘‘ఒకసారి వాడి పారేసే’’-సింగిల్ యూజ్- ప్లాస్టిక్‌ను నిషేధించింది. ఈ ‘సింగిల్ యూజ్’ ప్లాస్టిక్ పదార్థాల ‘మందం’ తక్కువగా ఉందన్నది జరిగిన జరుగుతున్న ప్రచారం! అయితే ‘‘చర్మం మందంగా ఉన్న’’వారి చెవులకు ఈ ప్రచారపు హోరు వినబడలేదు, వారి మనస్సులకు ఈ సంగతి అవగతం కాలేదు! అందువల్ల గత అక్టోబర్ రెండవ తేదీనుంచి ఒకటి రెండు రోజులపాటు, మహాఅయితే ఒకటి రెండు వారాలపాటు, ‘‘సింగిల్ యూజ్’ప్లాస్టిక్’’ను నిషేధించారట- అన్న ప్రచారం జరిగింది, ఆ తరువాత యథాపూర్వంగా ఈ సంగతిని అందరూ మరచిపోయారు! చర్చ జరిగిన సమయంలోను ఆ తరువాత కూడ ఈ ‘మందం తక్కువ’ ప్లాస్టిక్ సంచుల ఇతర వస్తువుల వినియోగ విన్యాసాల ‘జోరు’ ఏమాత్రం తగ్గలేదు... కూరగాయల ‘సంత’లలోను, పండ్ల విక్రయ కేంద్రాలలోను, కిరాణా దుకాణాలలోను, కిళ్లీ కొట్లలోను ‘ప్లాస్టిక్’ సంచులలో బట్వాడా ఏమాత్రం తగ్గినట్టు దాఖలా లేదు!! ఎవరో ఒకరిద్దరు కొనుగోలుదారులు బట్ట సంచీలను, జనుపనార సంచీలను పనికట్టుకొని దుకాణాలకు, సంతలకు తీసుకొని వెడుతున్న దృశ్యాలు కనిపించి ఉండవచ్చు! ఇలాంటివారి సంఖ్య మొత్తం జనంలో ఒక శాతం కూడ లేదు. కూరగాయలను, పండ్లను మాత్రం ‘ప్లాస్టిక్’ సంచులలో పడకుండా నిరోధించి నేరుగా తమ బట్ట సంచులలోకి ఈ ‘‘ఒకరిద్దరు’’నింపుకుంటున్నారు. కానీ ‘కిరాణా’ దుకాణాలలో ఈ వెసులుబాటు లేదు. మనం పెద్ద జనుపనార సంచీని, బట్ట సంచీని తీసుకొని వెళ్లినప్పటికీ దుకాణందారుడు వివిధ వస్తువులను ‘ప్లాస్టిక్’ సంచులలోనే నింపి మన సంచిలో పెడతాడు! అందువల్ల ‘ప్లాస్టిక్’ను నిర్మూలిస్తున్నామని ‘‘నిక్కుతూ నీల్గుతూ’’ ఆర్భాటం చేస్తున్నవారికి ఈ కిరాణా దుకాణాలలో ‘తగిన శాస్తి’జరుగుతోంది. ఉద్యమం నీరుకారిపోవడం ఈ ‘‘తగినశాస్తి’’!! పెద్ద గుడ్డసంచితోపాటు పది పదిహేను వివిధ రకాల కొలతల బట్ట సంచులను కూడ తీసుకొని వెడితే తప్ప మన ప్లాస్టిక్ వ్యతిరేక యుద్ధం విజయవంతం కాదు...
అంత ‘ఓపిక’, ‘సామర్థ్యం’ ఎంత చిత్తశుద్ధికల ప్లాస్టిక్ వ్యతిరేకికైన ఉండడం దాదాపు అసంభవం!! అందువల్ల ప్రభుత్వం నిషేధించిన ‘సింగిల్ యూజ్’ ప్లాస్టిక్ వాడకం ‘‘బహుళార్ధ సాధకం’’గా అప్రతిహతం అయిపోయింది! ‘‘ఏమండీ ప్రభుత్వం ఈ ‘ప్లాస్టిక్’ సంచుల వాడకాన్ని నిషేధించింది కదా!’’అని అడిగిన వారికి ‘‘ఉన్న సరకు-స్టాకు- అయిపోయేవరకు వాడుకోవచ్చునట...’’అన్న సమాధానం లభిస్తోంది! ‘‘ఉన్న సరకు’’అని అంటే ఎక్కడ ఉన్న సరకు...??’’అన్నది ప్రశ్న... ‘‘దుకాణంలో ఉన్న సరుకా? లేక టోకు విపణిలో ఉన్న సరుకా?’’- ఎందుకంటె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘‘సింగిల్ యూజ్’’ ప్లాస్టిక్ నిషేధం అమలులోకి వచ్చినట్టు ప్రకటించిన తరువాత మూడునెలలు గడిచిపోయాయి. ఇప్పటికీ ఈ ‘‘నిషిద్ధ’’వస్తువులు ప్రసిద్ధంగా వివిధ దుకాణాలలో వినియోగం అవుతూనే ఉన్నాయి. గాంధీ మహాత్ముని సార్ధ శతతమ- నూటయాబయ్యవ- జయన్తి సంవత్సరం సందర్భంగా ఈ నిషేధం ‘‘అమలు జరుగుతోంది...’’. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు, వివిధ సంస్థలు విధించిన ‘నిషేధం’ అమలుజరుగలేదు! ఈ చరిత్ర పునరావృత్తం అవుతుండడం నడుస్తున్న చరిత్ర... అరవై శాతం ‘‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’’నశించిపోయిందని, డెబ్బయి శాతం వాడకం తగ్గిందని జరిగిన ప్రచారం అంతరించి పోయింది. ‘‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’’ యథావిధిగా అవతరించింది. కృతయుగంలో దుర్గాదేవి ‘మహిష’రాక్షసునిపై యుద్ధం చేసింది. ఆమె అస్తశ్రస్త్రాలు తగిలిన చోటల్లా ‘మహిష’దనుజుని దేహంనుండి రక్తం కారిందట! కానీ ప్రతి రక్తం చుక్కనుండి మరో ‘మహిష’ రక్కసుడు పుట్టాడట! అలా అసంఖ్యాక ‘మహిష’అసురులు అవతరించారట! ఆ కథ ఇప్పుడు ‘‘ప్లాస్టికాసురుని’’ విషయలో పునరావృత్తం అవుతోంది! మహిషాసుర నిర్మూలనం చివరకు జరగడం అలనాటి కథ! కానీ ‘ప్లాస్టిక్’ నిర్మూలన జరుగుతుందన్న విశ్వాసం మాత్రం ప్రస్తుతం కలగడం లేదు!! హైదరాబాద్‌లో జరిగిన ‘‘అంతర్జాతీయ పతంగ ఉత్సవం’’-గాలిపటాల ఉత్సవం- ఇందుకు నిదర్శనం...
ప్రభుత్వ ఆధ్వర్యవంలో జరిగిన ఈ ‘పతంగ్’ల ప్రదర్శనలో వేలకొలదీ ‘ప్లాస్టిక్’ గాలిపటాలు వినువీధులలో విహరించాయన్నది ఈ నిదర్శనం. ఈ నిషిద్ధ పతంగ గగన విహారం గొప్ప ‘‘చారిత్రక ఘటన’’! నాటకంలో ఉప నాటకం లాగ ఈ ప్లాస్టిక్ పతంగుల- గాలిపటాల- విస్తరణ చైనావారి వాణిజ్యంతో ముడివడి ఉంది. చైనానుంచి దిగుమతి అయిన ‘‘ప్లాస్టిక్ మాంజా’’- ప్లాస్టిక్ దారం- మన దేశపు గాలిపటాలను ఎగురవేయడం ఏళ్లతరబడి నడచిన అంతర్ నాటకం! మన దేశంలో సంప్రదాయ సిద్ధంగా ‘నూలు దారం’తో గాలిపటాలను తరతరాలుగా ఎగురవేశారు. ప్రస్తుతం తరం తప్పింది. చౌకగా లభిస్తోందన్న మోహంతోను, ప్రత్యర్థుల గాలిపటాలను సులభంగా కోసేసి పడగొట్టవచ్చునన్న విశ్వాసంతోను మన దేశంలోని జనాలు ఈ చైనా దారాన్ని విపరీతంగా కొనేశారు. ఈ చైనావారి ‘మాంజా’-దారం-లో గాజు పెంకుల పొడి, ఇతర విష రసాయనాలు మిళితమై ఉండడం జగమెరిగిన సత్యం. అందువల్ల ఈ దారం తగిలి గొంతులు తెగిన పావురాలు, ఇతర ‘గగన చరాలు’-పక్షులు- హతమైపోయాయి.. అనేకమంది పిల్లల వేళ్లకు, కాళ్లకు, గొంతులకు ఈ దారం ‘స్పర్శ’తో గాయాలు కూడ అయ్యాయి! అయినప్పటికీ ఈ దారాన్ని కొనడం మనవారు మానలేదు. ప్రకృతిని కలుషితం చేసిన ఈ ‘‘చైనీయ సూత్రం’’వల్ల మన భాగ్యనగరంలో మాత్రమేకాక దేశమంతటా అనేకమంది స్థానిక ఉత్పత్తిదారులు జీవన ఉపాధిని కోల్పోయారు. చివరికి ప్రభుత్వాలు ఈ చైనా దారాన్ని వాడరాదని నిర్దేశించాయి. ఈ ‘ప్లాస్టిక్’ ‘మాంజా’ నిషేధం అమలుజరుగుతోందా? అన్నది సమాధానం లేని ప్రశ్న. ‘ప్లాస్టిక్’ పతంగ్‌లే నిర్భయంగా ఆకాశంలో విన్యాసాలు చేస్తున్నాయి. ఇక, ‘మాంజా’-దారం- గురించి ఎవరు పట్టించుకుంటారు??
గాంధీ మహాత్ముడు స్వచ్ఛత గురించి జపించాడు, తపించాడు, పాటుపడ్డాడు. ‘ప్లాస్టిక్’కట్టలుగా గుట్టలుగా పేరుకొని పోతుండడం నడుస్తున్న వ్యథ, స్వచ్ఛతను భంగపరుస్తున్న కథ! ‘ప్లాస్టిక్’ కాలుష్యానికి విరుగుడు పత్తి, జనుపనార, కాగితం... విజయవాడ అయోధ్యనగర్‌లో ‘ఎమ్.బి.ఏ.’ చదివిన ఒక యువకుడు ‘చిల్లర’ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అతగాడు ప్రధానంగా స్వదేశీయ ఉత్పత్తులను అమ్ముతున్నాడు, ‘జిఎస్‌టి’-వస్తు, సేవల, పన్నుల- వ్యవస్థలో నమోదయి కచ్చితంగా పన్నులు చెల్లిస్తున్నాడు! ఇది మానసిక స్వచ్ఛత, స్వభావ స్వచ్ఛత!! అతడు-వినియోగదారులు రానప్పుడు- కాగితం సంచులను తయారుచేస్తున్నాడు. రెండేళ్లక్రితమే స్వచ్ఛందంగా ‘ప్లాస్టిక్’ను నిషేధించాడు. సరకులను కాగితం సంచులలో నింపి బట్వాడా చేస్తున్నాడు. ఇది స్వరూప స్వచ్ఛత! ‘ప్లాస్టిక్’ మహిష రక్కసుని నిర్మూలనకు ఇలాంటివారు లక్షల సంఖ్యలో విస్తరించాలి!!