సంపాదకీయం

‘పర్షియా’ మంటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పర్షియా’ సింధు శాఖ ప్రాంతంలోను, పశ్చిమ ఆసియా ప్రాంతంలోను ఉద్రిక్తతలు ఉద్ధృతం అవుతుండడానికి వౌలిక కారణం ఏమిటన్నది కొనసాగుతున్న మీమాంస! దశాబ్దుల తరబడి ఇరాన్ ప్రభుత్వం కొనసాగించిన ‘రహస్య అణ్వస్త్ర నిర్మాణ కార్యక్రమం’ ప్రస్తుతం కొనసాగుతున్న ‘‘ప్రభుత్వ బీభత్సకాండ’’కు దీర్ఘకాల ప్రాతిపదిక! తమ దేశానికి వ్యతిరేకంగా ‘‘అమెరికా ప్రభుత్వం బీభత్సకాండ జరుపుతున్నట్టు’’ ఇరాన్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ‘‘ఇరాన్ ప్రభుత్వమే పెద్ద బీభత్స వ్యవస్థ’’అన్నది అమెరికా చేస్తున్న ప్రచారం. గత శుక్రవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం సమీపంలో అమెరికా దళాలు జరిపిన దాడులలో ఇరాన్ దళాలకు చెందిన ఉన్నత సేనాని- మేజర్ జనరల్- కాసిమ్ సులేమనీ హతుడయ్యాడు. ఈ కాసిమ్ సులేమనీ ‘బీభత్సకారుడు’-టెర్రరిస్ట్- అన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య. ఈ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దళాలు మంగళవారం ఇరాక్‌లోని అమెరికా సైనిక దళాల స్థావరాలపై దాడులు జరిపాయి. ఈ దాడులలో ఎనబయి మంది అమెరికా సైనికులు హతులైనట్టు బుధవారం ఉదయం ప్రచారమైంది. ఈ ఎనబయి మంది అమెరికా సైనికులూ ‘బీభత్సకారుల’’న్నది ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం. ఇలా శత్రుదేశానికి చెందిన సైనికులను కాక- శత్రు దేశానికి చెందిన బీభత్సకారులను మాత్రమే తాము హతమార్చుతున్నట్టు అమెరికా, ఇరాన్ ప్రభుత్వాలు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకున్న వ్యవహారం. శుక్రవారంనాడు కాసిమ్ సులేమనీ- అమెరికా దృష్టిలో బీభత్సకారుడు- హత్యకు ప్రతీకార చర్యలకు ఇరాన్ పాల్పడినట్టయితే ఇరాన్‌లోని యాబయి రెండు ‘‘చారిత్రక స్థలాల’’ను, ‘‘సాంస్కృతిక స్థలాలను ధ్వంసం చేయగలమని అమెరికా అధ్యక్షుడు ఆదివారం బెదిరించాడు. ఈ బెదిరింపులను ఇరాన్ లెక్కచేయడం లేదన్నది మంగళవారం ధ్రువపడిన వ్యవహారం. మంగళవారం రాత్రి ఎనబయి మంది అమెరికా సైనికులను- ఇరాక్‌లోని అమెరికా స్థావరాలలో ఉంటున్నవారిని- ఇరాన్ హత్యచేయడం ఈ ధ్రువీకరణ. ఇప్పుడు అమెరికా ప్రతీకార చర్యలకు పాలుపడినట్టయితే పర్షియా సింధుశాఖ ప్రాంతంలోని పశ్చిమ ఆసియాలోని నూట నలబయి అమెరికా స్థావరాలను తాము ధ్వంసం చేయగలమని ఇరాన్ ప్రభుత్వం బెదిరించింది. బుధవారం ఈ బెదిరింపును ఇరాన్ ప్రభుత్వం ఆవిష్కరించిన సమయంలోనే అమెరికా ప్రతీకార చర్యలకు సన్నద్ధం అవుతోందన్న ప్రచారం జరిగింది... పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత ఉద్ధృతం కావడం ఖాయమన్నది బుధవారంనాటి ఆందోళన...
చారిత్రక, సాంస్కృతిక స్థలాలపై దాడులను జరుపుతామన్న అమెరికా అధ్యక్షుని బెదిరింపును ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు నిరసిస్తున్నారట. కానీ అమెరికా బెదిరింపులో తప్పులేదన్న ప్రచారం కూడ జరుగుతోంది సమాంతరంగా...! సైనికులపై సైనిక స్థావరాలపై మాత్రమే శత్రు సైనికులు దాడులు జరపాలన్నది యుద్ధ నీతి. కానీ ఈ నీతిని ‘నాగరిక’ ప్రభుత్వాలు ‘ప్రత్యర్థి’నాగరిక ప్రభుత్వాల విషయంలో మాత్రమే పాటించాలన్నది ఈ సమాంతర ప్రచారం. ఇరాన్ ప్రభుత్వం నాగరిక స్వభావాన్ని ఏళ్లక్రితమే కోల్పోయిందన్నది అమెరికా సమర్థకుల వాదం. 1979లో ఇరాన్ రాజధాని టెహరాన్‌లో అమెరికా రాయబారి కార్యాలయానికి చెందిన యాబయి ఇద్దరు దౌత్యవేత్తలను, సిబ్బందిని ఇరాన్ ప్రభుత్వం నిర్బంధించింది, అంతర్జాతీయ దౌత్య నియమాలకు విరుద్ధంగా అనేక నెలలపాటు ఈ దౌత్యవేత్తలను బందీలను చేసింది! ఇరాన్ ప్రభుత్వం నాగరిక ప్రభుత్వాలు పాటించవలసిన దౌత్య మర్యాదలను కాని, ఐక్యరాజ్యసమితి నిబంధనలను కాని పాటించడం లేదన్నది అప్పుడు జరిగిన ధ్రువీకరణ. తమ దౌత్య సిబ్బందిని విడిపించుకొనడానికై అమెరికా ప్రభుత్వ దళాలు జరిపిన మెరుపుదాడి ఘోరంగా విఫలమైంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ ఎర్ల్‌కార్టర్ రెండవసారి అధ్యక్ష పదవికి ఎన్నిక కాలేక పోవడానికి ఇదీ ప్రధాన కారణం. 1980నాటి ఎన్నికలలో ఈ జిమీకార్టర్ - డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు-ను ‘రిపబ్లికన్’ పార్టీకి చెందిన రొనాల్డ్ రీగన్ ఓడించాడు. రీగన్ పదవీకాలంలో ఈ అమెరికా సిబ్బందిని ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసింది.
ఇలా దౌత్య నియమాలను, యుద్ధ నియమాలను ఉల్లంఘించిన ఇరాన్ పట్ల దౌత్య నియమ నిబద్ధతతో వ్యవహరించవలసిన అవసరం లేదన్నది అమెరికా వాదం. న్యూయార్క్‌లో జరుగుతున్న ‘ఐక్యరాజ్యసమితి’ సర్వప్రతినిధి సమావేశానికి హాజరుకావలసి ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ ఝరఫ్ తమ దేశంలో ప్రవేశించడానికి వీలులేదని అమెరికా ప్రభుత్వం ప్రకటించడం కూడ దౌత్య నియమాలు భగ్నమవుతున్న తీరునకు నిదర్శనం. ‘‘తోడేళ్లు, గుంటనక్కలు’’ పరస్పరం తలపడిపోతున్న సమయంలో ‘‘్ధర్మం అధర్మం’’ గురించి విచికిత్స అనవసరమన్నది చారిత్రక పాఠం. 1979లో అమెరికా మద్దతు కలిగిన ఇరాన్ ప్రభుత్వాన్ని ‘‘ఇస్లాం మతోన్మాద’’ రాజకీయవేత్తలు, సైనికులు కూలదోసినప్పటినుంచి ఈ చరిత్ర నడుస్తోంది! ఇరాన్‌లో ‘మతోన్మాద రాజ్యాంగ వ్యవస్థ’ కొనసాగడం ఆ తరువాత నడిచిన చరిత్ర. ఇప్పటికి కూడ ఇరాన్‌లో ఇస్లాం మత పెద్దలు, పౌర ప్రభుత్వాన్ని నిర్దేశిస్తున్నారు. సర్వోన్నత మత నాయకుని అదుపునకు ఆజ్ఞలకు లోబడి ఇరాన్ ప్రభుత్వం పనిచేస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఎన్నికయిన అధ్యక్షుడు, ఎన్నికయిన పార్లమెంటు ఈ సర్వోన్నత మత నాయకుని కనుసన్నలలో మెలగిరావడం ఇరాన్‌లోని ‘రాజ్యాంగ వ్యవస్థ’. ప్రస్తుతం ఈ సర్వోన్నత మత నాయకుడు అయెతుల్లా అలీ ఖమేనీ! అమెరికాతో నడుస్తున్న యుద్ధంలో ఇరాన్ తరఫున విధాన ప్రకటనలను ఖమేనే ఆవిష్కరిస్తుండడం నడుస్తున్న చరిత్ర! ఇరాన్‌లో కరడుకట్టిన మతోన్మాదులు, ఉదారవాదులు కూడ అధ్యక్ష పదవికి ఎన్నికవుతున్నారు. మతోన్మాదులు అధ్యక్ష పదవిని నిర్వహించిన సమయంలో ఇతర దేశాలకు, శత్రు దేశాలకు వ్యతిరేకంగా బీభత్స ప్రకటనలు వెలువడుతున్నాయి. 2013 జూన్ వరకు అధ్యక్షుడుగా ఉండిన మొహమ్మద్ అహ్మదీ నేజాద్ పదే పదే ఇలాంటి బీభత్స ప్రకటనలను చేసేవాడు. ‘‘ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేస్తాము. ప్రపంచ పటంలో ఇజ్రాయిల్‌కు స్థానం లేకుండా చేస్తాము’’అన్న ‘చారిత్రక’ ప్రకటనను అహ్మదీ నేజాద్ పదే పదే ఆవిష్కరించాడు...
అహ్మదీ నేజాద్ పదవీ సమయంలోనే మన దేశం పలుసార్లు వంచనకు గురి అయింది. ఇరాన్‌నుంచి పాకిస్తాన్‌కు మన దేశానికి ‘ఇంధన వాయువు’ను సరఫరాచేసేందుకు 2000వ సంవత్సరంలో కుదిరిన ఒప్పందాన్ని అహ్మదీ నేజాద్ అమలుజరపలేదు. చివరికి ఈ ‘‘ఇండియా పాకిస్తాన్ ఇరాన్’’ గొట్టపు మార్గం - పైప్‌లైన్- నిర్మించే పథకం మూలపడింది. ఈ త్రైపాక్షిక ‘ఒప్పందం’ అమలుకాలేదు. పాకిస్తాన్‌కు మాత్రమే ‘ఇంధన వాయువు’లను సరఫరాచేయడానికి ఇరాన్ నిర్ణయించింది. గొట్టపు మార్గం పాకిస్తాన్ వరకు మాత్రమే నిర్మాణం అవుతోంది! 2013లో హాసన్‌రౌహణీ ఇరాన్ అధ్యక్షుడుగా ఎన్నికయిన తరువాత ఇరాన్ విధానంలో హర్షణీయ పరివర్తన వచ్చిందన్నది జరిగిన ప్రచారం. ఇరాన్‌లోని ‘చౌబహార్’ ఓడ రేవును అభివృద్ధిచేసే కార్యక్రమంలో మన దేశానికి భాగస్వామ్యం లభించింది. ఈమేరకు మన దేశానికీ ఇరాన్‌కూ మధ్య 2014లో ఒప్పందం కుదిరింది. కానీ చైనాకు, పాకిస్తాన్ కూడ ఈ ‘చౌబహార్’ పథకంలో భాగస్వామ్యం కల్పిస్తున్నట్టు ఇరాన్ 2018లో ప్రకటించింది. పాకిస్తాన్‌లో మన దేశానికి వ్యతిరేకంగా చైనా నిర్మిస్తున్న ‘‘ఆర్థిక ప్రాంగణ పథం’’- ఎకనామిక్ కారిడార్-లో ఇరాన్‌కు భాగస్వామ్యం లభించింది!! ఏమయినప్పటికీ ‘అణ్వస్త్రాల’ను నిర్మించబోమని రౌహణీ ప్రకటించాడు. ఫలితంగా 2016లో అమెరికాకు ఇరాన్‌కు మధ్య సయోధ్య కుదిరింది. ఈ సయోధ్యను డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా రద్దుచేశాడు. ఉద్రిక్తతలు రాజుకొనడానికి అదీ అంకురార్పణ!!