సంపాదకీయం

తీరుమారని ‘తోడేలు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌లోని సిక్కులపై దాడులు జరగడం లేదని అక్కడి ప్రభుత్వం బుకాయించడం ‘శతాబ్దపు అత్యంత ఘోరమైన అబద్ధం’. పాకిస్తాన్ ప్రభుత్వం ఇలా బుకాయిస్తున్న సమయంలోనే పాకిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతంలోని పెషావర్ నగరంలో ప్రవీందర్ సింగ్ అనే ఇరవై ఐదేళ్ల సిక్కు యువకుడిని ఆదివారం నాడు ‘జిహాదీ’ హంతకులు కాల్చి చంపేశారు. పాకిస్తాన్ పంజాబ్‌లోని నంకానా సాహిబ్‌లోని ‘శ్రీ జన్మ ఆస్థాన్ గురుద్వారా’పై శుక్రవారం జరిగిన పైశాచిక విధ్వంసకాండ పెషావర్‌లో జరిగిన హత్యకు నేపథ్యం. నంకానా సాహిబ్ సిక్కు మత స్థాపకుడైన నానక్ గురుదేవుని జన్మస్థలం. లాహోర్ నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నంకానా సాహిబ్ పాకిస్తాన్ తూర్పు ప్రాంతంలో ఉంది. పెషావర్ వాయువ్య ప్రాంతంలో ఉంది. పాకిస్తాన్ అంతటా ‘అల్పసంఖ్య’ మతస్థులపై కొనసాగుతున్న బీభత్సకాండకు ఈ రాక్షస ఘటనలు రెండు ఉదాహరణలు మాత్రమే! ఉదాహరణలు అసంఖ్యాకం. గత సెప్టెంబర్‌లో పాకిస్తాన్ దక్షిణ ప్రాంతమైన ‘సింధు’లోని లార్కానాలో ‘నర్మిత చాందిని’ అన్న వైద్య విద్యార్థిని చంపేశారు. ఈ హిందూ బాలిక మృతదేహాన్ని ఆమె ‘హాస్టల్’ ప్రాంగణంలో పారేసి వెళ్లారు. ‘నంకానా సాహిబ్’లోనే గత ఆగస్టులో ఒక సిక్కు బాలికను జిహాదీలు అపహరించుకొని వెళ్లి బలవంతంగా ‘ఇస్లాం’లోకి మార్చారు, మరో ‘జిహాదీ’కి ఇచ్చి బలవంతంగా పెళ్లి కూడ చేశారు. ఇలా పాకిస్తాన్ అంతటా సిక్కులపైన, ఇతర హైందవ మతాల వారిపైన దశాబ్దులుగా జరిగిపోతున్న పైశాచిక బీభత్సకాండకు వర్తమాన ఘట్టం పెషావర్‌లో ఆదివారం జరిగిన ప్రవీందర్ సింగ్ హత్య. పాకిస్తాన్ నుంచి అల్పసంఖ్య మతస్థులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని మన దేశానికి పరిగెత్తుకొని వచ్చి శరణార్థులుగా జీవిస్తుండడానికి ఇదీ నేపథ్యం. ఈ జిహాదీల బీభత్సకాండ 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతోంది. 2014 డిసెంబర్ 31వరకూ మన దేశానికి వచ్చిన శరణార్థులకు మన దేశంలో నివసించడం తప్ప గత్యంతరం లేదు. ఇలాంటి నిస్సహాయులకు, అభాగ్యులకు మన దేశపు పౌరసత్వం కల్పించడం మానవీయ చర్య. ఈ మానవీయ కర్తవ్యాన్ని మన ప్రభుత్వం నిర్వర్తిస్తోంది. ‘‘పౌరసత్వ సవరణ చట్టం’’- సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్- సిఏఏ- ను రూపొందించింది. నిజానికి 2014 తరువాత కూడ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ‘అల్పసంఖ్య’ హిందూ మతాలవారు తరిమివేతకు గురి అవుతున్నారు. ఇలా 2014 తరువాత కూడ మన దేశానికి వచ్చిన హిందూ మతాల శరణార్థులకు, ఇతర ఇస్లామేతర మతాల వారికి సైతం మన దేశపు పౌరసత్వాన్ని ప్రదానం చేయాలి! ‘సిఏఏ’ను వ్యతిరేకించడం అందువల్ల అమానవీయం, పైశాచికం, రాక్షసత్వం! వ్యతిరేకిస్తున్న వారు పరోక్షంగా పాకిస్తాన్‌లో ‘అల్పసంఖ్య’ మతాల వారిపై జరిగిపోతున్న రాక్షసకాండను సమర్ధిస్తున్నారు, పాకిస్తాన్‌లోని ‘ఇస్లాం ఏకమత రాజ్యాంగ వ్యవస్థ’ను సమర్ధిస్తున్నారు, సర్వమత సమభావ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారు.
ఐదువందల యాబయి ఏళ్ల క్రితం నానక్ గురుదేవుడు జన్మించే నాటికి అఖండ భారత్‌లో ఉండిన ‘నంకానా సాహిబ్’ 1947 తరువాత పాకిస్తాన్‌లో చేరింది. గురునానక్ దేవుడు ఎక్కువ కాలం జీవించిన ‘కర్తార్‌పూర్’ కూడ పాకిస్తాన్‌లో కలసిపోవడం ‘అఖండ భారత’ విభజన సృష్టించిన చారిత్రక వైపరీత్యం. గురునానక్ దేవుని ‘సార్థ పంచమ శతతమ’-ఐదువందల యాబయ్యవ- జయంతి వత్సర ఉత్సవాలు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్‌లోని సిక్కు మతస్థులకు వ్యతిరేకంగా ఇలా ‘జిహాదీ’లు చెలరేగడం పాకిస్తాన్ ప్రభుత్వం అమలు జరుపుతున్న ‘బీభత్స వ్యూహం’లో భాగం! ఇస్లామేతర మతాల పట్ల ఏమాత్రం మక్కువ ప్రదర్శించినప్పటికీ పౌర ప్రభుత్వ నిర్వాహక రాజకీయ వేత్తలను ‘జిహాదీ’శక్తులు క్షమించవు. పాకిస్తాన్ అస్తిత్వమే ‘జిహాదీ’ భూమికపై ఏర్పడి ఉంది. ఈ ‘జిహాదీ’లు సైనిక దళాలను నిర్దేశిస్తున్నారు. సైనిక దళాల అదుపాజ్ఞలలో ‘పౌర ప్రభుత్వం’ పనిచేయడం పాకిస్తాన్‌లోని విచిత్ర రాజ్యాంగ వ్యవస్థ! అందువల్ల నానక్ గురుదేవుని జయంతి ఉత్సవాల కోసం మన దేశపు సరిహద్దు నుంచి దాదాపు మూడున్నర కిలోమీటర్ల నూతన ‘రహదారి’ని నిర్మించడం జిహాదీలకు నచ్చని వ్యవహారం. మన దేశపు సరిహద్దు నుంచి పాకిస్తాన్‌లోని ‘కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా’ వరకు ఈ రహదారి ఏర్పడింది. గత నవంబర్‌లో మన దేశం నుంచి యాత్రికులు ‘కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా’కు వెళ్లి నానక్ గురుదేవునికి పూజలు చేశారు. ఈ మత సామరస్య చర్య నచ్చని ‘జిహాదీ’లు సమాంతరంగా నానక్ గురుదేవుని జన్మస్థలం ‘నంకానా సాహిబ్’లో మత విద్వేషం వెళ్లగక్కారు. సిక్కు బాలిక అపహరణ ఈ విద్వేష కృత్యాలలో ఒకటి మాత్రమే! ఇప్పుడు ‘నంకానాసాహిబ్’ గురుద్వారాపై దాడులు చేయడం మాత్రమేకాక పెషావర్‌లో సిక్కు యువకుడిని కాల్చి చంపడం పాకిస్తాన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో జరుగుతున్న బీభత్సకాండ...
పెషావర్‌లో హత్యకు గురైన ప్రవీందర్ సింగ్‌కు త్వరలో పెళ్లికావలసి ఉంది. ఖైబక్‌సాంగ్లా జిల్లాలోని చాకేశ్వర్ పట్టణానికి చెందిన ఈ యువకుడు పెళ్లికోసం బట్టలు కొనుగోలు చేయడానికై పెషావర్ నగరానికి వచ్చాడట. బట్టల దుకాణం ప్రాంగణంలోనే ఈ యువకుడిని ‘జిహాదీలు’ కాల్చి చంపారు. నంకానా సాహిబ్‌లో శుక్రవారం ‘శ్రీజనమ్ ఆస్థాన్ గురుద్వారా’పై జిహాదీ దుండగులు దాడులు చేసి విధ్వంసం సృష్టించిన రెండు రోజులకే ఇలా సిక్కు యువకుడి నిండు జీవితం బలైపోయింది! పాకిస్తాన్‌లో ఏళ్లతరబడి సగటున వారానికోసారి ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అంతర్జాతీయ ‘మానవ అధికారాల’ సంఘాలు కాని, ఐక్యరాజ్యసమితి వారు కాని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అభిశంసించిన చరిత్ర లేదు! అరకాన్-రఖైన్- ప్రాంతం బర్మాలో ఉంది. బర్మాలో బౌద్ధులు అధిక సంఖ్యలో ఉన్నారు. కానీ ‘అరకాన్’లో మాత్రం ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ‘అరకాన్’ను బర్మా-మ్యాన్‌మార్- నుంచి విడగొట్టి ‘ప్రత్యేక ఇస్లాం’దేశంగా ఏర్పాటుచేయడానికి ఈ ప్రాంతంలోని ‘జిహాదీ’లు దశాబ్దులుగా బీభత్సకాండ సాగిస్తున్నారు, బౌద్ధులను ఇతర హిందువులను సామూహికంగా హత్యచేశాను. ఈ ‘రోహింగియా’ బీభత్సకారులను బర్మా ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది. కానీ ‘బీభత్సకారుల’కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రభుత్వ చర్యలను సామాన్య ముస్లింల- రోహింగియాలు- పై జరుగుతున్న దమనకాండగా అంతర్జాతీయ ప్రచారం జరిగింది. అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానానికి బర్మా ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవలసి వస్తోంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం సామాన్య ‘అల్పసంఖ్య’ మతాల ప్రజలను బీభత్సకాండకు గురిచేస్తోంది! ఈ ‘అల్పసంఖ్య’ మతాల హిందువులు ఎలాంటి ‘పాకిస్తాన్ వ్యతిరేక చర్యల’కూ పాల్పడలేదు, ఎలాంటి నేరాలూ చేయడం లేదు. కానీ అమాయకులూ నిస్సహాయులూ అయిన ఈ సిక్కులను, హిందువులను హత్యచేయిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇంతవరకు ‘ఐక్యరాజ్యసమితి’ కాని అంతర్జాతీయ న్యాయస్థానం కానీ ఎందుకని అభిశంసించడం లేదు?? దీనికి ఏకైక కారణం మన ప్రభుత్వం ఈ మారణకాండ గురించి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయకపోవడం. మన ప్రభుత్వం పదే పదే ఫిర్యాదుచేయాలి... అది మన ప్రభుత్వం వారి బాధ్యత!!
నంకానాసాహిబ్‌లోని గురుద్వారాపై జిహాదీలు పైశాచిక కాండ జరిపి విధ్వంసం సృష్టించిన దృశ్యాలు మాథ్యమాలలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ‘గురుద్వారా’పై దాడులు జరగలేదని బుకాయించడం హేయమైన నిర్లజ్జకు నిదర్శనం. వాస్తవాలు బయటపడినప్పటికీ ఇలా బుకాయించడం అంతర్జాతీయ సమాజం పట్ల పాకిస్తాన్ అవమానకరమైన విధానానికి నిదర్శనం. పాకిస్తాన్‌ను బీభత్స రాజ్యాంగ వ్యవస్థ- టెర్రరిస్ట్ రిజీమ్-గా ‘ఐక్యరాజ్యసమితి’ ద్వారా ప్రకటింపచేయడానికి మన ప్రభుత్వం ఇప్పుడైన చర్యలను ఉద్ధృతం చేయాలి..