సంపాదకీయం

మత్తెక్కిన ‘చిత్తం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ‘జాతీయ పంచాంగం’- నేషనల్ కాలెండర్- గురించి మనకు ధ్యాస లేకపోవడం కొనసాగుతున్న భావదాస్యం.. ఆంగ్ల సంవత్సరాది ఆరంభ సమయంలో జనంలో దాదాపు సగం మద్యం తాగి మత్తెక్కి వీథులలో పడి తైతక్కలాడడానికి ప్రధాన కారణం ఈ భావదాస్యం! మన కేంద్ర ప్రభుత్వం దాదాపు ఐదేళ్లుగా ‘స్వచ్ఛ భారత’ పునర్ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు జరుపుతోంది. బహిరంగ స్థలాలలో మలమూత్ర విసర్జనకు స్వస్తి చెప్పడం, వీథులలోని చెత్తకుప్పలు తొలగించడం ఈ ‘స్వచ్ఛ భారతం’లో రెండు ప్రధాన అంశాలు!- అని ప్రచారం జరిగింది, జరుగుతోంది! కానీ ‘స్వచ్ఛత’ను ఎప్పటికప్పుడు భంగపరుస్తున్న మహావైపరీత్యం మద్యపానం!- అన్న కఠోర వాస్తవానికి మాత్రం ప్రచారం లేదు. ఆంగ్ల సంవత్సరాది కాని భారతీయ, జాతీయ సంవత్సరాదులు కాని శుభ సందర్భాలు! అందువల్ల ‘సంవత్సరాది’ సందర్భంగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేవారు స్వరూప స్వభావాలు స్వచ్ఛంగా ఉండాలన్నది తరతరాల భారత జాతీయ నీతి! కానీ మద్యం తాగి మత్తెక్కి, ఊగుతూ, తూగుతూ, జోగుతూ ఉన్నవారు ఈ ‘స్వచ్ఛత’కు దూరంగా ఉంటున్నారు! సూర్యోదయం కంటె ముందు నిద్రలేచి, స్నానం చేసి ప్రకృతికి, భూమికి కృతజ్ఞతలు చెప్పడం అనాదిగా మన జీవనం! అందువల్ల నూతన సంవత్సరాది రోజున అయినా ఈ పద్ధతి పాటించడం కనీస ధర్మం.. భూమి, ప్రకృతి సకల జనులకు మాత్రమే కాదు, సకల ప్రాణికోటికి జీవన అస్తిత్వాన్ని, అభ్యుదయాన్ని ప్రసాదిస్తుండడం ప్రత్యక్ష అనుభవం! భూమి మాతృదేశం.. ప్రకృతి జాతీయ సంస్కృతి! ప్రపంచంలోని ప్రతి దేశానికి వర్తిస్తున్న సనాతన సత్యం ఇది.. ‘సనాతన సత్యం’ అని అంటే ‘శాశ్వత వాస్తవం’- ఆంగ్ల భాషలో ‘ఎటర్నల్ ట్రూత్’- అని అర్థం. కానీ ఆంగ్ల సంవత్సరాది నాడు జనం అర్ధరాత్రి ఆరగిస్తున్నారు, మద్యం తాగుతున్నారు. మరికొందరు బరితెగించి ‘‘నోళ్లు ముక్కులు కార్చుకుంటూ’’ అశ్లీల పదజాలాన్ని ఆవిష్కరిస్తూ తందాన లాడుతున్నారు, వీథుల పైకి వచ్చి మద్యం సీసాలను పగలగొట్టి ఇతరులపై దాడులు చేస్తున్నారు, పోలీసులను సైతం దూషించి దౌర్జన్యకాండకు పూనుకుంటున్నారు. ఇలా ‘నిశాచర’- రాత్రి యందు సంచరించే పిశాచాల, రాక్షసుల- ప్రవృత్తికి ‘‘జనంలో దాదాపు సగం’’ లోనవుతుండడం ‘‘ఆంగ్ల సంవత్సరాది’’ వేళ ఆవిష్కృతవౌతున్న దృశ్యం. ప్రతి ఏటా ఇది పునరావృత్తం.. ఈ ఏడు కూడ!! ఇలా మద్యం మత్తెక్కినవారు రాత్రి మూడువంతులు ముగిసేవరకు వికృత విన్యాసాలు చేసి, అప్పుడు నిద్రలోకి జారుకుంటున్నారు, పగలు సగం గడిచేవరకు నిద్ర లేవరు!! ఇదంతగా భారతదేశపు భౌతిక స్వచ్ఛత భంగపడుతున్న తీరు! ‘‘బహిరంగ మలమూత్ర విసర్జన’’కు స్వస్తి చెప్పించడమే భౌతిక స్వచ్ఛత కాజాలదు, మద్యం ఉత్పత్తి ప్రక్రియ, మద్యపాన ప్రక్రియ కూడ భౌతిక కాలుష్యాన్ని పెంచుతున్నాయి. అందువల్ల ‘ప్లాస్టిక్’తోపాటు మద్యాన్ని కూడ నిర్మూలించడం భౌతిక స్వచ్ఛతకు అనివార్యమన్న పాఠాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడైన గ్రహించ గలగాలి!!
బిహార్ ప్రభుత్వం మద్యపానాన్ని, ఉత్పత్తిని నిషేధించింది. దీనివల్ల రాష్ట్రానికి రావలసిన ఆదాయం తగ్గిపోయినప్పటికీ, వేలాది ‘మద్యం’ అభియోగాలను విచారించి తీర్పులు చెప్పడం మరింత ఖర్చుతో కూడిన న్యాయ ప్రక్రియ అయినప్పటికీ బిహార్ ప్రభుత్వం భరించగలుగుతోంది. మూడేళ్లకు పైగా మద్యనిషేధం అమలు జరగడంవల్ల, ఉల్లంఘించిన ‘‘తాగుబోతుల’’కు, ఉత్పత్తిదారులకు వ్యతిరేకంగా రెండు లక్షల అభియోగాలు వివిధ న్యాయస్థానాలలో విచారణ దశలో ఉన్నాయట. ఈ మూడున్నర ఏళ్లలో బిహార్ పోలీసులు ఆరు లక్షల చోట్ల దాడులు జరిపి యాబయి రెండు లక్షల ‘లీటర్’ల మద్యాన్ని పట్టివేసి, ధ్వంసం చేశారట. స్వచ్ఛ భారత్ నిజంగా ఏర్పడాలంటే ఇదే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ మద్య నిషేధానికి నడుం బిగించాలి. గుజరాత్‌లో మాత్రమే చాలాకాలంగా మద్య నిషేధం అమలులో ఉందట! 2015 నుంచి కేరళ ప్రభుత్వం, 2017 నుంచి తమిళనాడు, గత ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మద్యం’ ఉత్పత్తిని, పానాన్ని కొంతవరకు నియంత్రిస్తున్నాయి. కానీ మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలు నడుములను బిగించడం లేదు. ఆంగ్ల సంవత్సర ప్రారంభ శుభవేళ.. ప్రతి సంవత్సరం మద్యం విక్రయాలు భయంకరంగా పెరిగిపోతున్నాయి, ఆదాయం పెరుగుతుందన్న భావంతో ప్రభుత్వాలు మురిసిపోతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో మాత్రమే డిసెంబర్ 31వ తేదీన రెండు వందల పది కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని తాగుబోతులు కొనేశారట. తెలంగాణలో అదే రోజున మూడువందల యాబయి కోట్ల రూపాయల విలువైన ఈ ‘‘తీయటి విషం’’ అమ్ముడుపోవడం మరో వాస్తవం...
దేశమంతటా ఇదే తీరు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వం వారికి ‘‘మద్యం వల్ల స్వచ్ఛతకు జరుగుతున్న విఘాతం’’ గురించి ధ్యాస కలుగకపోవడం జాతీయ వైపరీత్యం.. ఆరోగ్యానికి హానికరమైన మద్యపానాన్ని మాదక సేవనాన్ని మాన్పించడం కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని నలబయి ఏడవ అధికారణం నిర్దేశిస్తుండడం ఈ రాజ్యాంగ స్ఫూర్తి! గాంధీ మహాత్ముని ‘సార్థ శత జయన్తి’- నూట యాబయ్యవ పుట్టినరోజు- సంవత్సరంలో అంటే 2018-2019వ ఆర్థిక వత్సరంలో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి వర్తించే మద్య నిషేధ చట్టం చేసి ఉండవచ్చు! ‘మద్యపానం’ కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోనిదా?? రాష్ట్రాల పరిధిలోనిదా?? ఉమ్మడి పరిధిలోనిదా?? - అన్న మీమాంస ప్రధానం కాదు!! అలా ‘చట్టం’ చేయడం ఇప్పుడైన గాంధీ మహాత్మునికి నిజమైన శ్రద్ధాంజలి కాగలదు. మద్యపానం మన దేశపు స్వరూప స్వచ్ఛతను మాత్రమే కాదు, స్వభావ స్వచ్ఛతను కూడ భంగం కలిగిస్తోందన్నది కఠోర వాస్తవం! వాహనాలను అడ్డదిడ్డంగా నడిపి ప్రాణాలు తీస్తున్నవారు, లైంగిక బీభత్సకారులై బాలికల, మహిళల మానాన్ని హరిస్తున్నవారు మద్యపానం కల్పిస్తున్న స్వభావ కాలుష్యానికి కొన్ని ఉదాహరణలు...
అధికాధిక ప్రజల స్వభావ స్వచ్ఛత ప్రధానంగా విద్యాధిక ‘విబుధ దైత్యుల’ స్వభావ స్వచ్ఛత చెడిపోయి ఉండడానికి ప్రధాన కారణం బ్రిటన్ బీభత్స ‘‘పాలకులు’’ మనచేత తాగించి వెళ్లిన ‘‘వికృత భావ మధువు’’. ఈ భావదాస్య సురాపానం ‘‘నిర్వాహకుల’’ స్వభావాన్ని ఇప్పటికీ ప్రభావితం చేస్తోంది. అందువల్లనే బ్రిటన్ భౌతిక దాస్యం నుంచి మన దేశం విముక్తిని సాధించినప్పటికీ బ్రిటన్ బౌద్ధిక మానసిక దాస్యం నుంచి మనం ఇప్పటికీ విముక్తులం కాలేకపోతున్నాము. సూర్యోదయ శుభవేళ ఉత్సవాలు జరుపడం భారతీయ సంస్కృతి! ‘‘వెలుగు’’తో ప్రారంభించింది ‘‘వెలుగు’’తో పరిసమాప్తి కావడం ఈ పద్ధతి! కానీ అర్ధరాత్రి పూట తినడం, తాగడం, ఎగరడం, ఉత్సవం జరపడం బ్రిటన్ బీభత్స ‘పాలన’ వల్ల దాపురించిన భావదాస్యం.. చీకటితో మొదలుకావడం, చీకటితో ముగిసిపోవడం ఈ భావదాస్యం! బ్రిటన్ విముక్త భారతదేశానికి క్రీస్తుశకం 1957 నుంచి అధికార ‘జాతీయ శకం’ ఏర్పడి ఉంది. ఈ ఆధికారిక జాతీయ శకం నిజానికి 1941 ఏళ్లుగా మన దేశంలో అమలులో ఉన్న శాలివాహన శకం! సింధునదిని దాటి వచ్చి దేశంలో బర్బర బీభత్సకాండను ప్రారంభించిన విదేశీయ ముష్కర, తస్కర తండాలను తరిమికొట్టిన భారత సమ్రాట్ శాలివాహనుడు జాతీయ విజయసూచకంగా ఈ శాలివాహన శకాన్ని ప్రారంభించాడు. అందువల్ల శాలివాహన శకం జాతీయ విజయచిహ్నం.. ‘‘సాయన సౌరమానం’’ ప్రాతిపదికగా ఏర్పడిన మన జాతీయ శకం ‘చైత్రం’ నుంచి ఫాల్గున మాసం వరకూ గల పనె్నండు నెలల సంవత్సరం ప్రాతిపదికగా నడుస్తోంది. ఈ ‘అధికార జాతీయ శకం’ ప్రాతిపదికగా చైత్రమాసపు ఒకటవ రోజున దేశమంతటా భారతీయ సంవత్సరాదిని జరుపుకోవాలి. జరుపుకోకపోవడం కొనసాగుతున్న ‘బ్రిటన్ భావదాస్యం’...
భావదాస్య మధువు క్రోలి,
స్వభావాన్ని మరచి సోలి,...
స్వభూమీయ మతి తప్పిన
స్వజాతీయ స్మృతి తప్పిన,
తన సంతతి ‘‘స్వాతంత్య్రం
వచ్చిందని’’ వదరుచుంటె,
‘‘ఏదీ ఎక్కడ ఉందని?’’
వెదకుచున్నదోయ్ భారతి!