సంపాదకీయం

నిధులు చాలని ‘రక్షణ’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ రక్షణ విభాగానికి తగినన్ని నిధులు లేవన్న వాస్తవానికి చైనా ‘విస్తరణ’ విచిత్రమైన నేపథ్యం. చైనా తన సైనిక పాటవాన్ని నిరంతరం విస్తరిస్తోంది, వాణిజ్య దురాక్రమణను కొనసాగిస్తోంది, దౌత్య దౌర్జన్యకాండను తీవ్రతరం చేస్తోంది, వ్యూహాత్మక బీభత్సకాండను వ్యవస్థీకరిస్తోంది. ఈ చతుర్ముఖ విస్తరణకు ప్రధాన లక్ష్యం మన దేశం. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అన్ని ప్రముఖ దేశాలలోను ప్రధానంగా అన్ని ప్రజాస్వామ్య దేశాలలోను చైనా గూఢచర్యం పెరిగిపోవడం ‘విస్తరణ’లో సరికొత్త విపరిణామం! ‘పాత’ పెట్టుబడుల స్థావరాలైన ఐరోపా, అమెరికాల ప్రాబల్యం తగ్గిపోవడం, చైనా ‘కొత్త’ ‘పెట్టుబడుల అడ్డా’గా అవతరించడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్-వల్ల సంభవించిన వైపరీత్యం. పాతికేళ్ల ‘ప్రపంచీకరణ’ తరువాత మన దేశం విదేశాల పెట్టుబడుల కోసం దేబిరిస్తూ ఉంది, చైనా తన పెట్టుబడులను విదేశాలకు తరలిస్తోంది! మన ‘రక్షణ’కు తగినన్ని ఆయుధాలు కొనడానికి నిధుల కొరత ఏర్పడి ఉండడానికి ప్రధాన కారణం ఈ పాతికేళ్ల ప్రపంచీకరణ! మన ప్రధాన శత్రువు చైనా. 1959వరకు మనకు ఉత్తర దిశ నుండి దురాక్రమణ ప్రమాదం లేదు, వేల ఏళ్లుగా లేదు. అందువల్ల ఉత్తర దిశా ‘సీమాంతర’ ప్రదేశ రక్షణకు మన ప్రభుత్వం పెద్దగా నిధులను ఖర్చుపెట్టవలసిన అవసరం ఉండేది కాదు. ఉత్తరపు సరిహద్దుకు ఆవల ఉన్న టిబెట్ స్వతంత్ర దేశానికీ మన దేశానికీ మధ్య ‘కాపలా లేని’, కాపలా అవసరం లేని సరహద్దు సహస్రాబ్దుల తరబడి నెలకొని ఉండేది. 1959 వరకు మనకు ఉత్తరపు సరిహద్దులో సైనికులను పెద్దఎత్తున నెలకొల్పవలసిన అవసరం ఉండేది కాదు. సైనిక వ్యయం అవసరం అయ్యేది కాదు. కానీ టిబెట్‌ను 1959లో చైనా దురాక్రమించిన తరువాత ‘్భరత టిబెట్ సరిహద్దు’ ‘్భరత చైనా సరిహద్దు’గా మారిపోయింది, చరిత్రలో మొదటిసారిగా మనకు చైనా దురాక్రమణ ప్రమాదం ఏర్పడిపోయింది. నాలుగువేల నూట అరవయి కిలోమీటర్ల ఉత్తరపు సరిహద్దు వెంబడి చైనా దురాక్రమణను నిరోధించడానికి వీలుగా సైనికుల సంఖ్యను, అనుబంధ సైనిక దళాల సంఖ్యను, సైనిక వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా మాత్రమేకాక పది రెట్లుగా పెంచవలసిన అనివార్యం మన దేశానికి ఏర్పడింది. కానీ మనం నిధులను పెంచుతున్నకొలదీ మనకంటె చాలా ఎక్కువగా చైనా ప్రభుత్వం సైనికులను, సైనిక వ్యయాన్ని పెంచుతోంది. దశాబ్దుల తరబడి మన రక్షణ విభాగానికి నిధులు సరిపడకపోవడానికి ఇదీ కారణం. ఆధికారిక గణాంకాల ప్రకారం చైనా ప్రభుత్వం మనకంటె నాలుగున్నర రెట్లు సైనిక వ్యయం చేస్తోంది. చైనాలో ఏకపక్ష నియంతృత్వం నెలకొని ఉంది. అందువల్ల చైనా ప్రభుత్వం పనితీరులో పారదర్శకత లేదు. రహస్యంగా మరిన్ని లక్షల కోట్ల రూపాయలను చైనా సైనిక సమర పాటవాన్ని పెంపొందించడానికి ఖర్చుచేస్తున్నట్టు పాశ్చాత్య దేశాల ‘నిఘా’విభాగాలు ధ్రువపరిచాయి...
తూర్పున బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నుంచి బర్మా శ్రీలంక మాల్‌దీవుల మీదుగా పాకిస్తాన్‌లోని గ్వాడార్ వరకు విస్తరించి ఉన్న సముద్ర ప్రాంతమంతా చైనా నౌకాదళ విన్యాసాలకు స్థావరంగా మారి ఉంది... మన సముద్రపు సరిహద్దులకు ముప్పు ముంచుకొని వస్తోందన్నది మనం గ్రహించవలసిన పాఠం. అందువల్ల మనకు మరిన్ని యుద్ధ నౌకలు, గస్తీనౌకలు, విమాన వాహక యుద్ధనౌకలు, జలాంతర్గాములు, నౌకాదళంలో పనిచేసే యుద్ధవిమానాలు మరిన్ని అవసరమన్నది బహిరంగ రహస్యం. శత్రుదేశాల జలాంతర్గాములను సముద్ర ఉపరితలం నుంచి పసికట్టగల- సబ్‌మెరైన్ హంటింగ్- విమానాలను సేకరించుకొనడం అనివార్యమని నౌకాదళం వారు నిర్ధారించి ఉన్నారట. వీటిని దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’ వెచ్చించి అమెరికా నుంచి కొనుగోలు చేయాలట. అయితే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం అయిన ‘ఉపకరణ సేకరణ సంఘం’వారు గురువారం నాడు దాదాపు ఇరవై మూడువేల కోట్ల రూపాయల విలువైన ‘సమర సామగ్రి’ని కొనడానికి సైనిక దళాలకు అనుమతినిచ్చారట! అందువల్ల ఇరవై రెండు వేల కోట్లకు పైబడి ఈ ‘సబ్‌మెరైన్ హంటింగ్’ విమానాలకు సరిపోతే మిగిలిన యుద్ధోపకరణాల కొనుగోలుకు నిధులు చాలవట. ఫలితంగా ఈ ‘పి-81’ రకం జలాంతర్గామి అనే్వషక యుద్ధవిమానాలను ఆరింటిని మాత్రమే కొనుగోలు చేయాలని ‘రక్షణ సామగ్రి సేకరణ సంఘం’ నిర్ధారించిందట. చైనా మూడువైపుల నుంచి సముద్ర జలాలలో మన దేశంపై గురిపెట్టిఉన్న తరుణంలో మన నౌకాదళానికి నిధుల కొరత ఎందుకు ఏర్పడాలి? రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచకపోవడం ఇందుకు ఏకైక కారణం...
పాకిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవును చైనా నిర్వహిస్తోంది. ఇలా నిర్వహించడాన్ని బలూచిస్థాన్ ప్రాంతం ప్రజలు నిరసిస్తున్నారు. గ్వాడార్‌లో చైనా నౌకాదళం తిష్ఠవేయడం కేవలం మన దేశపు పడమటి తీరంపై గురిచూసి ఉండడం.. కానీ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించాలని ఉద్యమిస్తున్న బలూచీస్థాన్ ప్రజలు తమగడ్డపై చైనా ‘సైనిక తిష్ఠ’వల్ల తమ ఉద్యమానికి ఎదురుదెబ్బ తగులుతుందని భయపడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో మన దేశపు వ్యతిరేకులను బహిరంగంగా రెచ్చగొడుతోంది, విద్రోహాన్ని పెంపొందిస్తోంది. బీభత్స జిహాదీ హంతకులను నిరంతరం ఉసిగొల్పుతోంది. ఇందుకు ప్రతిచర్య పాకిస్తాన్ బీభత్స ప్రభుత్వాన్ని శిక్షించడం. ఇందులో భాగంగా మన ప్రభుత్వం కూడ ‘బలూచీస్థాన్’లోని స్వాతంత్య్ర ఉద్యమకారులకు సహాయం చేయడం అన్యాయం కాదు, అతార్కికం కాదు. కానీ మన ప్రభుత్వం ఆ పనికి పూనుకోకపోవడం యుగయుగాల హైందవ జాతీయ స్వభావానికి అనుగుణం! భారతదేశం నిరంతరం దురాక్రమణను ప్రతిఘటించడం చరిత్ర, దురాక్రమించిన చరిత్ర భారతదేశానికి లేదు. హైందవ జాతీయ స్వభావం ఇది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మన దేశాన్ని వ్యూహాత్మకంగా దిగ్బంధం చేయడానికి చైనా యత్నిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంతో చైనాకు ఎలాంటి సంబంధం లేదు. మాల్ దీవులలోను, శ్రీలంకలోను చైనా తిష్ఠవేయడం కేవలం భారత వ్యితిరేక చర్య. మాల్‌దీవుల ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం గతంలో భారత వ్యతిరేక చర్యలను ప్రోత్సహించాయి. ప్రస్తుతం మాల్‌దీవుల ప్రభుత్వం చైనా విస్తరణను అనుమతించడం లేదు. కొత్తగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడు గోతబయ రాజపక్ష కూడ శుక్రవారం ఢిల్లీలో ‘మనతో మైత్రి’ని పెంపొందించుకొనే మాటలు మాట్లాడాడు! కానీ ఆఫ్రికా ఖండంలోని ‘జిబౌటీ’లో సైతం సైనిక స్థావరం స్థాపించిన చైనా ప్రమాదం నానాటికీ తీవ్రతరం అవుతోందన్నది మనం గ్రహించదగిన పాఠం...
అందువల్ల రక్షణ పటిమను నిధుల కొరత నిలదీయకుండా నిరోధించడం మన ప్రభుత్వ కర్తవ్యం. ప్రస్తుత స్థాయి కంటె మన రక్షణ వ్యయాన్ని రెట్టింపు చేయవలసిన అవసరం ఉంది. తదుపరి ‘బడ్జెట్’ రూపకల్పన సమయంలో మన ప్రభుత్వానికి రక్షణ ధ్యాస పెరగాలి. శత్రుదేశమైన చైనాతో మనం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పూర్తిగా రద్దుచేసుకున్నట్టయితే సాలీనా మన దేశానికి దాదాపు రెండున్నర లక్షల కోట్ల ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’ ఆదా అవుతుంది. చైనా శత్రుత్వాన్ని బహిరంగంగానే ప్రదర్శిస్తోంది. ఉదాహరణలు అనేకం. లడక్‌లోకి ‘చొఱబడే’ యత్నాలను చైనా నిరంతరం సాగిస్తుండడం ఒక ఉదాహరణ మాత్రమే!