సంపాదకీయం

వాణిజ్య ‘అనివార్యం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిహాదీ బీభత్సకాండకు ‘స్ఫూర్తి’ ప్రాంగణమైన సౌదీ అరేబియాతో మన సంబంధాలు ‘వాణిజ్య అనివార్యం’గా మారి ఉండడం మన ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో జరిపిన రెండురోజుల పర్యటనకు నేపథ్యం. ఉభయ దేశాల మధ్య ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ వికసించడానికి భూమిక ఏర్పడిందన్న ప్రచారం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ, ఇరవై తొమ్మిదవ తేదీలలో మోదీ జరిపిన పర్యటన సందర్భంగా ప్రస్ఫుటించిన ప్రధాన అంశం. ఉభయ దేశాల ఉమ్మడి ‘వ్యూహాత్మక భాగస్వామ్య మండలి’ ఏర్పాటునకు సంబంధించిన అంగీకార పత్రంపై మంగళవారం సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో మన ప్రధాని మోదీ, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ సంతకాలు చేశారట. ఈ వ్యూహాత్మక మండలి ఏర్పాటువల్ల ఉభయ దేశాల సంబంధాలు ’కొనుగోలు-అమ్మకం’ పరిధిని అతిక్రమించి అనేక రంగాలకు విస్తరించనున్నట్టు జరుగుతున్న ప్రచారం కేవలం ‘ఉపచార వాక్యం’.. దౌత్య లాంఛనం! నిజానికి సౌదీ అరేబియాతో మన సంబంధాలు అనివార్యం కావడానికి ప్రధాన ప్రాతిపదిక ఆ దేశం ‘చమురు’ను మనకు అమ్ముతుండడం, అమెరికా విధించిన ఆంక్షల కారణంగా మన ప్రభుత్వం ఇరాన్ నుంచి ‘ఇంధన తైలం’, ఇంధన వాయువుల కొనుగోళ్లను తగ్గించి వేసింది. అందువల్ల సౌదీ అరేబియా నుంచి భారీఎత్తున మనం ‘ఇంధనం’- ముడి చమురును- కొనవలసిన అగత్యం ఏర్పడింది. అమెరికాకు ఇరాన్ ప్రస్తుతం శత్రు దేశం, సౌదీ అరేబియా అమెరికాకు అతి సన్నిహిత మిత్ర దేశం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆంక్షలు విధించడానికి ఇదీ అసలు లక్ష్యం! ‘‘ఇరాన్ చమురుకు అంతర్జాతీయంగా గిరాకీ పడిపోవాలి, ఆ దేశం ఆర్థికంగా దివాలా తీయాలి’’. తద్వారా ఇరాన్‌కు ప్రధాన ప్రాంతీయ ప్రత్యర్థి అయిన సౌదీ అరేబియాకు లాభం చేకూరాలి. ఇరాన్ ‘చమురు’కు గిరాకీ తగ్గుతున్నకొద్దీ అంతర్జాతీయంగా సౌదీ అరేబియా ‘చమురు’ అమ్మకాలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల సౌదీ అరేబియా ప్రభుత్వానికి, సౌదీ అరేబియాలోని సంపన్నులకు, అమెరికాకు చెందిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’కు లాభాల వర్షం కురుస్తోంది. ఇదంతా అమెరికా ప్రభుత్వ వ్యూహం! ఇలా లాభాలను పెంచుకుంటున్న సౌదీ అరేబియా ప్రభుత్వం పాకిస్తాన్‌కు భారీగా ఆర్థిక సహాయం అందిస్తోంది, సౌదీ అరేబియాలోని సంపన్నులు భారీగా పాకిస్తానీ జిహాదీలకు నిధులను అందచేస్తున్నారు. ఈ ‘జిహాదీ’ల ప్రధాన లక్ష్యం మన జమ్మూ కశ్మీర్‌లోకి చొఱబడి బీభత్సకాండ సాగించడం. దివాలా తీస్తున్న పాకిస్తాన్‌కు ‘ఆర్థిక శ్వాస’ను అందిస్తున్నది ప్రధానంగా సౌదీ అరేబియా, మరికొన్ని అరబ్ దేశాలు! ఇదంతా సౌదీ అరేబియా విధానంలో నిహితమై ఉన్న భారత వ్యతిరేకత! అయినప్పటికీ మనం సౌదీ అరేబియా నుంచి భారీగా ‘చమురు’ను కొనుగోలు చేయవలసి రావడం వాణిజ్య అనివార్యం! అందువల్ల ఉభయ దేశాల ‘మైత్రి’కేవలం వాణిజ్యానికి పరిమితం కావడం లేదని, బహుముఖంగా మైత్రి విస్తరించి చిగురిస్తోందని ‘మారాకులు’ తొడుగుతోందని జరిగిన ప్రచారం కేవలం ‘లాంఛనం’! ‘‘సౌదీ అరేబియా పాకిస్తాన్‌కు వెన్నుదన్ను’’అన్న వాస్తవం మన ప్రభుత్వానికి తెలుసు..
సౌదీ అరేబియా వారు తమ ‘ముడి చమురు’ అమ్మకాలకు ప్రధాన ప్రతిబంధకంగా పరిణమించడం ఇరాన్‌కు గిట్టని వ్యవహారం. అందువల్లనే ఇరాన్ ప్రభుత్వం సౌదీ అరేబియాలోని ‘చమురు’ స్థావరాలపై దాడులు చేస్తోంది, ‘చమురు’ను రవాణాచేస్తున్న నౌకలను ధ్వంసం చేయడానికి యత్నిస్తోంది. గత సెప్టెంబర్‌లో ఇలా దాడులు జరిగిన తరువాత ముడి చమురు ధరలు ‘అంతర్జాతీయ విపణి’లో పెరిగిపోయాయి. సౌదీ అరేబియా నుంచి ‘సరఫరాలు’ తాత్కాలికంగా తగ్గిపోవడం ఇందుకు కారణం! ఇలా దాడులు జరపడం వల్ల, ప్రతీకారంగా మళ్లీ ప్రత్యర్థులు దాడులు జరపడం వల్ల సింధు శాఖ ప్రాంతంలోను, పశ్చిమ ఆసియాలోను తమ ‘వాణిజ్య సంస్థల’ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అమెరికా ప్రభుత్వానికి తెలుసు. అందువల్లనే ఇరాన్‌పై దాడులు జరుపకుండా అమెరికా సంయమనం పాటిస్తోంది. మన దేశం 2018-2019 ఆర్థిక సంవత్సరంలో ఇరవై రెండు కోట్ల అరవై లక్షల టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకొంది. ఇందులో దాదాపు ఐదవ వంతు చమురు సౌదీ అరేబియా నుంచి దిగుమతి అయింది. ఇలా సౌదీ అరేబియా మన దేశానికి అతి పెద్ద ‘చమురు’ విక్రేతగా అవతరించడం వాణిజ్య అనివార్యం. ఇప్పుడు కుదిరిన ‘వ్యూహాత్మక భాగస్వామ్య అంగీకారం’లో భాగంగా సౌదీ ‘సంస్థలు’ మన దేశంలో పెట్టుబడులను పెడతాయట. కానీ ‘చమురుశుద్ధి’ రంగంలో సైతం సౌదీ అరేబియా వాణిజ్య సంస్థలు మన దేశంలో పెట్టుబడులను పెడతాయన్న ప్రచారం కూడ మొదలైంది. సౌదీ అరేబియాలోని ‘ముడి చమురుశుద్ధి’ కర్మాగారాలను అమెరికా తదితర విదేశాల సంస్థలు నిర్వహిస్తున్నాయి. అందువల్ల ‘‘సౌదీ సంస్థలు’’ మన దేశంలో ‘చమురుశుద్ధి’ నిర్వహించడం ఏమిటో?
రియాధ్‌లో జరిగిన ‘వాణిజ్య భాగస్వామ్య భవిష్యత్ కార్యాచరణ’ శిఖర సభలో నరేంద్ర మోదీ ప్రసంగించాడు. ఇదంతా వాణిజ్యపు అనివార్యాలతో ముడివడిన వ్యవహారమే! అందువల్ల కుదిరిన పనె్నండు ఒప్పందాలు కూడ వాణిజ్య విస్తృతికి దోహదం చేయగలవు. సాంస్కృతిక, చారిత్రక, స్వభావాల ప్రాతిపదికగా మన దేశానికి సౌదీ అరేబియాకు మధ్య ఎలాంటి సామ్యం లేదు, సమానత్వం లేదు, సైద్ధాంతిక అనుసంధానం లేదు. మన దేశంలో అనాదిగా సర్వమత సమభావ వ్యవస్థ, వైవిధ్య పరిరక్షక రాజ్యాంగ వ్యవస్థ పరిఢవిల్లుతోంది. సహిష్ణుత, సమన్వయం మన దేశపు సనాతన జాతీయ స్వభావం! ఇందుకు పూర్తి విరుద్ధంగా సౌదీ అరేబియాలో ‘ఏకమత ఇస్లాం రాజ్యాంగ వ్యవస్థ’ పరిఢవిల్లుతోంది. తమ ‘మతం’కాని ప్రతి ఇతర మతాన్ని ధ్వంసం చేయాలన్న ‘జిహాదీ’ స్వభావానికి ఈ ‘ఏకమత వ్యవస్థ’ప్రాతిపదిక! ఆప్ఘనిస్థాన్‌లోని ‘తాలిబన్’లు, పాకిస్తాన్‌లోని లష్కర్లు, ఇరాక్- సిరియాలోని జిహాదీ బీభత్సకారులు పుట్టుకొని రావడానికి సైద్ధాంతిక స్ఫూర్తి సౌదీ అరేబియా నుంచి లభించింది. నిన్న మొన్న సిరియాలో హతమైన ‘జిహాదీ’ హంతకుడు, మతోన్మాద పిశాచి ‘ఐసిస్’ముఠా నాయకుడు అబూబకర్ అల్ బాగ్దాదీ వంటివారు శతాబ్దుల చరిత్రలో వందల వేల మంది ఉన్నారు. క్రీస్తుశకం 712లో మన దేశంలోకి చొఱబడి పైశాచిక బీభత్సకాండ సృష్టించిన మహమ్మద్ బిన్ కాసిమ్ నుంచి నిన్నమొన్నటి ఒసామా బిన్ లాడెన్ వరకూ- జిహాదీ హంతకులు ప్రబలడానికి సైద్ధాంతిక భూమిక సౌదీ అరేబియా! కానీ పైకి మాత్రం సౌదీ అరేబియా ప్రభుత్వం ‘‘అంతర్జాతీయ బీభత్సకాండ’’ను అమెరికాతో కలసి నిరసిస్తోంది! నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా సౌదీ అరేబియా ప్రభుత్వం మరోసారి ‘బీభత్సకాండ’ను ఖండించడం ఆశ్చర్యకరం కాదు! ‘వాణిజ్య అనివార్యం’లో ఇదంతా భాగం! చమురు అమ్ముకోవాలి మరి!!
మనది అనాదిగా వైవిధ్య రాజ్యాంగ విధానం... మన దేశం పరిణతి చెందిన, అతిపెద్ద ప్రజాస్వామ్యం! సౌదీ అరేబియాలో ఇందుకు పూర్తి విరుద్ధంగా నిరంకుశ రాజరికం ప్రజలను దమనపాలన చేస్తోంది. ప్రత్యర్థులను ప్రభుత్వమే హత్యచేయించడం ‘సౌదీ అరేబియా’ రాజ్యాంగ స్వభావం! తనను విమర్శించిన ప్రముఖ పత్రికా రచయిత ‘జమాల్ ఖషోగ్గీ’ని తామే చంపించినట్టు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అంగీకరించడం మానవత్వానికి కళంకం! గత ఏడాది అక్టోబర్‌లో టర్కీలోని ఇస్తాంబుల్‌లోని తమ రాయబారి కార్యాలయానికి ఖషోగీని పిలిపించిన సౌదీ ప్రభుత్వం కార్యాలయంలోనే ఖషోగ్గీని ముక్కలుగా నరికి చంపించింది. ఇదీ సౌదీ అరేబియా బీభత్స రాజ్యాంగ స్వరూపం! మానవీయ సంస్కార సనాతన మందిరమైన, వైవిధ్య పరిమళ భరిత నందనమైన భారతదేశపు ప్రధాని సరసన మహమ్మద్ బిన్ సల్మాన్ వంటివాడు నిలబడగలగడం కేవలం వాణిజ్యపు అనివార్యం..