సంపాదకీయం

‘కలత’తీరిన కశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉండడం నడుస్తున్న చరిత్ర. సూర్యుని వెలుగును చూడని గుడ్లగూబలవలె దేశంలోని ‘కొంతమంది’ జమ్మూకశ్మీర్‌లో మానవ అధికారాలకు విఘాతం ఏర్పడిపోయిందని విలపిస్తున్నారు. ఈ అంతర్గత శత్రువుల ఏడుపుల ‘ఎక్కిళ్ల’ ధ్వనులు దేశ సరిహద్దులను దాటుకొని అంతర్జాతీయ వేదికలపై మరింత వికృతంగా వినిపిస్తున్నాయి. అందువల్లనే భారతదేశపు బాహ్య శత్రువులు గత మూడునెలలుగా ‘జమ్మూ కశ్మీర్’ గురించి చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మిత్రదేశంగా ముద్రవేయించుకుంటున్న అమెరికా దేశపు ‘దొరతనం’ సైతం కశ్మీర్‌లో ‘‘ఏదో జరగరానిది జరిగిపోయిందన్న’’ ధ్వనిని వెలయించింది. మన దేశానికీ పాకిస్తాన్‌కూ మధ్య ‘లేని’జమ్మూకశ్మీర్ సమస్య గురించి రాయబారం నడపడానికి అమెరికా అధ్యక్షుడైన అహంకారి డొనాల్డ్ ట్రంప్ పదే పదే ముస్తాబయ్యాడు, ముఖం వెళ్లబెట్టాడు, మన ప్రభుత్వం ముఖంమీద కొట్టడంతో ట్రంపు‘కంపు’ మూన్నాళ్ల ముచ్చటగా ముగిసింది. ‘ఐరోపా సమాఖ్య’వారు సమష్టిగాను విడివిడిగాను జమ్మూకశ్మీర్‌లో ‘వేలు’పెట్టడానికి యత్నించి ‘‘చేతులు కాల్చుకొని’’ వెనక్కి తీసుకున్నారు. మైత్రి మాటలు మాటాడుతూనే చిత్ర విచిత్రంగా కశ్మీర్ వ్యవహారాలలో అక్రమ ప్రమేయం కల్పించుకొనడానికి బ్రిటన్ వంటి ఐరోపా దేశాల ప్రభుత్వాలు ఉవ్విళ్లూరడం గత మూడునెలల చరిత్ర. జమ్మూకశ్మీర్‌లో కల్లోలకాండకు ఒక ప్రధాన కారణమైన దశాబ్దుల వైపరీత్యం ఆగస్టు ఐదవ తేదీన తొలగిపోయినప్పటినుంచి అంతర్గత, అంతర్జాతీయ ప్రచ్ఛన్న ప్రత్యక్ష విద్రోహులు వెక్కివెక్కి విలపిస్తూనే ఉన్నారు. వైతొలగిన వైపరీత్యం భారత రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణం! ఈ అధికరణం రద్దుకావడంతో జమ్మూకశ్మీర్‌కు ‘విచ్ఛిన్నకరమైన’ ప్రత్యేకప్రతిపత్తి తొలగిపోయింది. ప్రశాంతికి దోహదం చేస్తున్న సమాన ప్రతిపత్తి సమకూడింది, జమ్మూకశ్మీర్ ప్రాంతం దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సమాన స్థాయిని పొందడం రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దయిపోయిన ఫలితం! ఇదంతా మన అంతర్గత వ్యవహారం. కానీ అంతర్జాతీయం చేయడానికి పాకిస్తాన్ బీభత్స మతోన్మాద ప్రభుత్వం యత్నిస్తోంది...
సౌదీ అరేబియా వంటివి మనకు ప్రచ్ఛన్న శత్రు దేశాలు. ‘‘నోరు మాట్లాడుతూనే ఉంది, నొసలు వెక్కిరిస్తూనే ఉంది...’’అన్న చందంగా సౌదీ అరేబియా ప్రభుత్వం మనపట్ల ‘‘ద్వంద్వ విధానం’’ అవలంబిస్తోంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో మన ప్రధాని నరేంద్ర మోదీ జరుపుతున్న ‘స్నేహయాత్ర’కు ఈ ‘‘ద్వంద్వ విధానం’’విచిత్ర నేపథ్యం! ‘‘దరహాసపు తెరల వెనుక దాగిన విషహృదయం’’ సౌదీ అరేబియా ప్రభుత్వం. గత మూడునెలలుగా సౌదీ అరేబియా దొరతనంవారు పరోక్షంగాను ప్రత్యక్షంగాను జమ్మూకశ్మీర్ వ్యవహారంలో పాకిస్తాన్ వికృత విన్యాసాలకు వంతపాడింది! మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దయిన తరువాత మన అంతర్గత వ్యవహారాన్ని అంతర్జాతీయం చేయడానికి పాకిస్తాన్ యత్నిస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్ గురించి మనకూ పాకిస్తాన్‌కూ ఎలాంటి వివాదం లేదు. జమ్మూకశ్మీర్‌లో ఏకైక సమస్య పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న బీభత్స మతోన్మాదపు జిహాదీలు హత్యాకాండ సాగిస్తుండడం. ఈ సమస్యను పరిష్కరించడంలో భాగంగానే మన ప్రభుత్వం మూడువందల డెబ్బయ్యవ అధికరణాన్ని రద్దుచేసింది. పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్ గురించి మాత్రమే మనకూ పాకిస్తాన్‌కూ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ వివాదాన్ని కూడ ఉభయ దేశాలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని మూడవ దేశం ప్రమేయం ఉండరాదని ‘సిమ్లా’ ఒప్పందం నిర్దేశిస్తోంది. 1972లో మనకూ పాకిస్తాన్‌కు మధ్య ఈ ఒప్పందం కుదిరింది. అందువల్ల సౌదీ అరేబియా వంటి దేశాల ప్రభుత్వాలు నోరుమూసుకొని ఉండాలి. కానీ సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయమంత్రి ‘ఏడ్చెన్‌బిన్ అహ్మద్ అల్‌జుబీర్’ సెప్టెంబర్ నాలుగవ తేదీన పాకిస్తాన్‌కు వచ్చి జమ్మూకశ్మీర్ గురించి పాకిస్తాన్‌తో చర్చలు జరిపి పాకిస్తాన్‌కు సమర్ధనను ప్రకటించి వెళ్లాడు. తాను వచ్చిన విమానంలో ‘ఐక్య అరబ్ సంస్థానాల’- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్- యుఏఇ- విదేశాంగ మంత్రి ‘షేక్ అబ్దుల్లా బిన్ ఝరుూద్‌బిన్ సుల్తాన్ ఆల్ నాకెన్’ను కూడ ఎక్కించుకొని పాకిస్తాన్‌కు చేరిన ఈ సౌదీ మంత్రి పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించి వెళ్లాడు. న్యూయార్క్‌లో జరిగిన ఇటీవలి ‘ఐక్యరాజ్యసమితి’ ప్రతినిధుల సమావేశం సందర్భంగా అక్కడ గుమికూడిన ‘ఓఐసి’ మంత్రుల బృందంవారు జమ్మూకశ్మీర్‌లో మన ప్రభుత్వం మానవ అధికారాలకు విఘాతం కలిగిస్తోందని ‘‘కనిపెట్టడం’’తదనంతర విపరిణామం. ‘ఓఐసి’-ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్- ఇస్లాం మత ప్రభుత్వాలున్న దేశాల సమాఖ్య-లో సౌదీ అరేబియా తిరుగులేని ఆధిపత్యం వహిస్తోంది. అందువల్ల ‘ఓఐసి’ప్రకటన ‘కర్త’నిజానికి సౌదీ అరేబియా అన్నది బహిరంగ రహస్యం ‘ఐరోపా సమాఖ్య’వారు కూడ గత మూడు నెలలుగా ‘జమ్మూకశ్మీర్’లో జరగరానిదేదో జరిగిపోతున్నట్టు గొంతులు చించుకున్నారు. ఇప్పుడు ‘జమ్మూకశ్మీర్’లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించడానికి ఇరవై ఏడుగురు ‘ఐరోపా సమాఖ్య’ పార్లమెంటు సభ్యులు విచ్చేసి ఉన్నారు. మన ప్రధాని సౌదీ అరేబియాలో పర్యిటిస్తుండడం, ఈ ఐరోపా ‘తెల్ల’ప్రముఖులు జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తూండడం సమాంతర పరిణామాలు...
ఈ తెల్ల ప్రతినిధుల ముఖాలు, జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన తరువాత, మరింత ‘తెల్ల’గా పాలిపోవడం ఖాయం. ఎందుకంటె కశ్మీర్‌లో అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడి ఉన్నాయని ‘‘కనిపెట్టడానికి’’ వీరంతా కట్టకట్టుకొని కదలివచ్చారు. కశ్మీర్‌లో ‘‘ప్రభుత్వ దమనకాండ కొనసాగుతోందని’’ కనిపెట్టడానికి వీరంతా వచ్చారు. అలాంటిది ఏమీలేదని, ప్రజాజీవితం నిర్నిరోధంగా సాగిపోతోందని జమ్మూకశ్మీర్‌లో మామూలు పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఈ ఐరోపా ప్రతినిధులు కనిపెట్టనున్నారు. అందువల్ల ‘కంగుతిని’తెల్లముఖాలను మరింత ‘తెల్ల’గా చేసుకొని తిరిగి తమ దేశాలకు వెళ్లనున్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఎలాంటి దమనకాండను సాగించడం లేదన్నది సూర్యుని వెలుతురు వలె స్పష్టంగా ప్రస్ఫుటిస్తున్న వాస్తవం. ఈ ఐరోపా ప్రతినిధులు ఈ సంగతిని స్వయంగా గుర్తించాలన్నది బహుశా మన ప్రభుత్వ విధానం. అందువల్లనే వారి పర్యటనను అనుమతించింది! చైనాలోవలె పాకిస్తాన్‌లో వలె మన దేశంలో ప్రజలపై ప్రభుత్వాల దమనకాండ జరగడం లేదు. టిబెట్‌లోను హాంకాంగ్‌లోను దమనకాండ జరిపి ప్రజాఉద్యమాలను అణచివేయడానికి చైనా నియంతలు యత్నించారు, యత్నిస్తున్నారు. అందువల్లనే ఏళ్లతరబడి చైనా ప్రభుత్వం టిబెట్‌లో విదేశీయులను పర్యటించనివ్వడం లేదు. బలూచిస్థాన్‌లోను ఉత్తరకశ్మీర్- గిల్గిత్ బాల్టీస్థాన్-లోని పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక నియంతలు సాగిస్తున్న బీభత్సకాండను ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఇందుకు పూర్తి భిన్నంగా జమ్మూకశ్మీర్‌లో సైనికులు, అనుబంధ సాయుధ దళాలవారు ప్రజలకు బీభత్సకారులనుంచి రక్షణ కల్పిస్తున్నారు. బీభత్సకారులతో, జిహాదీ హంతకులతో, పాకిస్తానీ తొత్తులతో మన భద్రతా దళాలవారు నిన్న నేడు కూడ తలపడడం ప్రజాహిత ప్రభుత్వ స్వభావానికి నిదర్శనం. అందువల్లనే జమ్మూకశ్మీర్‌లో జరగని ‘‘ప్రభుత్వ దమనకాండ’’ను జరిగినట్టు ప్రచారంచేస్తున్న అంతర్గత శత్రువులను జనం ఛీకొడుతున్నారు. అంతర్జాతీయ సమాజం సైతం పాకిస్తాన్ ప్రభుత్వం పన్నాగాన్ని పాకిస్తాన్ సమర్ధకుల వంచన క్రీడను నిరసిస్తోంది...
‘కశ్మీర్ లోయ ప్రాంతం’లోని తొంబయి తొమ్మిది శాతం భూభాగంలో ప్రజల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలులేవని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించడం వాస్తవ స్థితికి దర్పణం. దూరవాణి సంభాషణలపై కూడ ఎలాంటి ఆంక్షలు లేవు. జనం సంతోషంగా ఉన్నారన్న దానికి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తొంబయి ఎనిమిదిన్నర శాతం ‘వోటర్ల’-మతదాతలు- తమ వోట్లువేయడం. రాజధాని శ్రీనగర్‌లో వంద శాతం ‘మతదాతలు’ మత ప్రదానం చేయడం కేంద్ర ప్రభుత్వ విధానానికి అద్భుత విజయం. బడి పిల్లలు పరీక్షలు కూడ వ్రాస్తున్నారు. కల్లోల సీమ కలతనుంచి విముక్తం అయింది, ప్రశాంత నిశాంత ప్రజాస్వామ్య ప్రభాత కాంతులు ప్రజాజీవనాన్ని సముజ్వలం చేస్తున్నాయి! ఇదీ జమ్మూకశ్మీర్ వర్తమాన దృశ్యం...