సంపాదకీయం

విషాదం.. పైశాచికం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ రాజధాని లండన్ సమీపంలోని ఒక వాహనం- ట్రక్-లో ముప్పయి తొమ్మిది మంది చైనీయుల మృతదేహాలు బయటపడడం భయంకర విషాదం. ఈ చైనా పౌరులను ‘‘ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎందుకు హత్య చేశారన్న’’ విషయమై బ్రిటన్ ప్రభుత్వం పరిశోధనను ఆరంభించిందట. బల్గేరియా దేశానికి చెందిన ఈ ‘ట్రక్కు’లోని పెద్ద ‘శీతల పేటిక’- రిఫ్రిజరేటర్-లో ఈ మృతదేహాలను కనుగొన్నారట. ‘ట్రక్కు’ను నడిపిన ఉత్తర ఐర్‌లాండ్ ప్రాంతానికి చెందిన ఇరవై ఐదేళ్ల బ్రిటన్ పౌరుడిని బుధవారం పోలీసులు అరెస్టుచేశారట. ఐరోపా తూర్పు చివరన ఉన్న బల్గేరియానుంచి ఈ ‘ట్రక్కు’, పశ్చిమ చివరన ఉన్న బ్రిటన్‌కు మృతదేహాలతో తరలిరావడం విచిత్రమైన వ్యవహారం. ఈ ‘ట్రక్కు’ను పెద్ద పడవ పైకెక్కించి సముద్రాన్ని- అట్లాంటిక్ సముద్రంలో మిగిలిన ఐరోపాకు బ్రిటన్ దీవులకు మధ్య ఉన్న ఇంగ్లీష్ ఛానల్‌ను- దాటించి లండన్ సమీపానికి చేర్చినట్టు బుధ, గురువారాలలో ప్రచారమైంది. దక్షిణ ప్రాంతంలోని లండన్ పరిసరాలనుంచి ఉత్తర ప్రాంతమైన ‘ఐర్‌లాండ్’కు ఈ ట్రక్కును తరలిస్తూ ఉండి ఉండవచ్చునట. అందువల్ల ఉత్తర ఐర్‌లాండ్‌లోని ఈ ‘వాహన చోదకుని’-ట్రక్కు డ్రయివర్- సంబంధీకులను కొందరిని కూడ బ్రిటన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారట. ‘‘మృతదేహాల’’గమ్యస్థానం బహుశా ఉత్తర ఐర్‌లాండ్ కావచ్చునన్నది పోలీసుల అనుమానమట. ఇతర దేశాలనుంచి అక్రమ ప్రవేశకులను తమ దేశంలోకి తరలించికొని వచ్చి నివసింపచేయడానికి యత్నిస్తున్న ‘దళారీ’ ముఠాలు ఈ చైనీయులను తమ దేశంలోకి చేరవేసి ఉంటారన్నది బ్రిటన్ ప్రభుత్వంవారి అనుమానం! అయితే ఈ అక్రమ ప్రవేశకులను ఇలా ‘‘పైశాచికంగా హత్యచేయడం’’మాత్రం అంతుపట్టని వ్యవహారం. లండన్‌లోని చైనా దౌత్య అధికారులు సైతం ‘‘ఘటనా’’స్థలానికి చేరి వివరాలను సేకరిస్తున్నారట. ముప్పయి తొమ్మిది మంది మృతులలో ఎనిమిది మంది మహిళలు! వీరందరూ స్వచ్ఛందంగా చైనానుంచి పారిపోయారా? లేక దళారీ ముఠాలు వంచనతో వీరందరినీ తరలించుకొని వచ్చారా అన్నది కూడ అంతుపట్టని వ్యవహారం. ఎలా అయినప్పటికీ ఇంతమంది ఒకేసారి అసువులను కోల్పోవడం విస్మయకరం. వీరందరూ ప్రమాదవశాత్తు మరణించారా? లేక హత్యలకు గురిఅయ్యారా అన్నది కూడ తేలవలసి ఉంది. గతంలో 2000వ సంవత్సరంలో యాబయి ఎనిమిది మంది చైనావారు ఒకేసారి మరణించినట్టు బ్రిటన్‌లో వెల్లడికావడం అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంగ్లాండ్‌లోని ‘డోవర్’ ప్రాంతంలో ఆ యాబయి ఎనిమిది మంది మృతదేహాలు ఒక పెద్ద ‘ట్రక్కు’లో బయటపడినాయి. వారందరూ చైనాలోని ‘్ఫజీ’ ప్రాంతంనుంచి బయలుదేరి బెల్జియం దేశపు తీరానికి చేరారట. బెల్జియం బ్రిటన్‌కు సమీపంలో ఉన్న ఐరోపా దేశం! వారందరూ స్వచ్ఛందంగా చైనాను వదలివచ్చినట్టు అప్పుడు వెల్లడైంది. కానీ వారి మృతికి కారణాలు వెల్లడికాలేదు. ఆ ఘోరానికి ఇప్పుడు బుధవారం, గురవారం వెల్లడయిన ఘోరాలు పునరావృత్తి.
మానవులను ఒక దేశంనుంచి మరో దేశానికి అక్రమంగా రవాణాచేయడం ఆధునిక కాలంలో అంతర్జాతీయ సమాజాన్ని పీడిస్తున్న భయంకర దురాచారం. శతాబ్దులకు పూర్వం అరబ్బీ జిహాదీలు, ఐరోపా వర్తకులు ఇలా మానవులను అపహరించి ఇతర దేశాలకు తరలించి బానిసలుగా అమ్మడం చరిత్ర. ఐరోపా, అరబ్ సమాజాలలోని సంపన్నులు ఇలాంటి ‘బానిసల’ను కొనుగోలుచేసి- పశువులను సంతలలో కొన్నట్టు- వారి పట్ల ఆజీవనం అమానుషంగా రాక్షసంగా ప్రవర్తించడం కూడ చరిత్ర. ఈ జాడ్యం ఆ తరువాత అమెరికా ఖండానికి వ్యాపించింది. ఆఫ్రికా ఖండంలోని నల్లజాతి వారిని దశాబ్దులపాటు, శతాబ్దులపాటు అమెరికా ఖండానికి తరలించడం క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దివరకూ జరిగిన ఘోరం. ఈ ఆఫ్రికా ‘నల్ల’జాతి వారిని అమెరికా ఖండంలోని వివిధ దేశాలలోని ఐరోపీయ సంకర జాతుల ‘తెల్ల’వారు చిత్రవిచిత్ర జీవన హింసలకు గురిచేశారు. గత శతాబ్ది మధ్యభాగం వరకూ నల్లజాతులవారు అమెరికాలో ద్వితీయ తృతీయ తరగతుల పౌరులుగా జీవించవలసి వచ్చింది. పద్దెనిమిదవ, పంతొమ్మిదవ శతాబ్దులలో బ్రిటన్ దురాక్రమణకారులు మన దేశంనుంచి వేల సంఖ్యలో వ్యవసాయ శ్రామికులను మారిషస్, ఫిజీ, గయానా, సూరినమ్ వంటి విదేశాలకు తరలించడం మరో భయంకర విషాద చరిత్ర. కానీ ఐరోపా జాతుల దురాక్రమణకు గురిఅయిన దాదాపు అన్ని ప్రపంచ దేశాలు ఇరవై శతాబ్దిలో బానిసత్వంనుంచి విముక్తమై స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. అందువల్ల ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగిన ‘మానవుల బలవంతపు తరలింపు’ వర్తమాన సమాజంలో చట్టవ్యతిరేకం, అంతర్జాతీయ నియమాలకు విరుద్ధం! స్వచ్ఛందంగా లక్షలాది మంది ఇప్పటికీ ఒక దేశంలోనుంచి మరో దేశంలోకి చొరబడుతున్నారు. ఈ కథ వేఱు! కానీ ఒక దేశంనుంచి జనాన్ని అపహరించి ఇతర దేశాలకు ఇప్పటికీ ఎలా తరలిస్తున్నారన్నది అంతుపట్టని వ్యవహారం. ఈ మానవుల అక్రమ రవాణా తమకు పెద్ద సమస్యగా మారిందని బ్రిటన్ ప్రభుత్వం చెబుతోంది...
సార్వభౌమ దేశాల నిఘా విభాగాలు తమ దేశంలోకి సరకులు, మానవులు అక్రమంగా రవాణాకాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. కానీ తమ దేశాలనుంచి ఇతర దేశాలకు ఈ అక్రమరవాణా జరుగకుండా అదే స్థాయి జాగ్రత్తలు తీసుకొనడం లేదన్నది స్పష్టం. కొన్ని దేశాల ప్రభుత్వాలు తమ దేశంనుంచి లక్షల, కోట్ల మంది పొరుగు దేశాలలోకి చొఱబడడాన్ని ప్రోత్సహిస్తున్నాయి కూడ. మరికొన్ని దేశాలు అపురూపమైన వస్తువుల అక్రమ రవాణాను బహిరంగంగా ప్రోత్సహిస్తున్నాయి. చైనా ప్రభుత్వం మన దేశంనుంచి తమ దేశానికి పులుల అక్రమ రవాణాను దశాబ్దుల తరబడి ప్రోత్సహిస్తోంది. మన అడవులలో పులులను చంపించి గోళ్లను, ఎముకలను, చర్మాలను తమ దేశానికి తరలించుకొని పోవడం చైనా ప్రభుత్వ విధానంగా మారి ఉంది. కొన్ని సందర్భాలలో పులులను సజీవంగా తరలించుకొని పోతున్నారు. పులులను వధించే ప్రాంగణాల- టైగర్ హార్వెస్టింగ్ సెంటర్స్-లో చైనాలో పుట్టిపెరిగిన పులుల కంటె ఎక్కువ సంఖ్యలో మన దేశపు పులులను బలిపెట్టడం చరిత్ర. ఈ ‘పులుల’ ‘అక్రమ’రవాణాను, పులుల అవయవాల ‘అక్రమ’రవాణాను అరికట్టవలసిందిగా మన ప్రభుత్వం దశాబ్దుల తరబడి అనేకసార్లు చైనా ప్రభుత్వానికి విజ్ఞప్తులను చేసింది కూడ! ‘కమ్యూనిస్టు’ ఆర్థిక సిద్ధాంతాలను వదలించుకున్న తరువాత చైనాలో ‘కొత్త సంపన్నులు’తయారయ్యారు. ‘ప్రపంచీకరణ’వల్ల అత్యధికంగా లాభపడింది, ఇతర దేశాలను భారీగా దోపిడీ చేయగలుగుతున్నది చైనా మాత్రమే! అందువల్ల చైనాలోని కొత్త సంపన్నులకు మన దేశంలోని ఎఱ్ఱగంధపు వస్తువులు కావలసి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఎఱ్ఱచందనం వృక్షాలను అక్రమంగా నరికివేసి, కలపను చైనాకు తరలించే ముఠాలు ఏర్పడినాయి. చైనా పౌరులైన అనేకమంది ‘ఎఱ్ఱచందనం’ దొంగల ముఠాలుగా ఏర్పడి ఉన్నారు. ఇలాంటి దొంగలు మన దేశంలో పట్టుబడినారు కూడ! చైనా అధ్యక్షుడు ఛీజింగ్‌పింగ్ 2014లో ఆఫ్రికాలోని టాంజానియాలో పర్యటించాడు. అధ్యక్షుడు పయనించిన విమానంలోనే అనేక పెట్టెల నిండా ఏనుగు దంతాలు చైనాకు అక్రమంగా తరలివచ్చినట్టు అప్పుడు ప్రచారమైంది. దొంగ రవాణాఅవుతున్న ఏనుగు దంతాలలో అధిక శాతం చైనాకు చేరుతున్నాయన్నది 2014లో జరిగిన ప్రచారం...
అందువల్ల చైనానుంచి ఇప్పుడిలా ముప్పయి తొమ్మిది మంది ‘బయట పడడం’’ వారు అసహజ మరణాలకు లేదా హత్యలకు గురికావడం అంతుపట్టని వ్యవహారం. చైనా ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను సైద్ధాంతిక విరోధులను దశాబ్దుల తరబడి దమనకాండకు గురిచేస్తోంది. ‘హాంకాంగ్’నుంచి నిందితులను చైనాకు తరలించి విచారించి శిక్షించడానికి ఉద్దేశించిన ‘‘చట్టం’’ ఈ దమనకాండలో భాగం. ‘హాంకాంగ్’ ప్రజల నిరసనలకు తలఒగ్గి చైనాప్రభుత్వం ఈ పైశాచిక చట్టాన్ని ఉపసంహరించుకొంది. ఈ ‘‘ఉపసంహరణ’’ ప్రకటన వెలువడిన రోజుననే ఈ ముప్పయి తొమ్మిది మంది చైనీయుల ఘోర విషాదాంతం వెల్లడికావడం విధి విలాపం... హృదయమున్న వారందరికీ బాధాకరం!