సంపాదకీయం

‘నూలు’తో నివాళి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్లాస్టిక్ పదార్థాలను వాడడం పూర్తిగా మానివేయడం మహాత్ముడైన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీకి దేశ ప్రజలు ఘటించగల నిజమైన నివాళి. ఒకసారి వాడి పారేసే ‘ప్లాస్టిక్’ సంచులను, పలుచని పటలాలను, విస్తళ్లను, కప్పులను, డిప్పలను, చిప్పలను వాడరాదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం బుధవారం నాడు- కలియుగం ఐదువేల నూట ఇరవై ఒకటవ సంవత్సరం ఆశ్వయుజ శుక్ల చవితినాడు- గాంధీ మహాత్ముని నూట యాబయి ఒకటవ జయన్తి నాడు ఆధికారికంగా అమలులోకి వచ్చింది. గాంధీ మహాత్మునికి నూట యాబయి ఏళ్లు నిండాయి, నూటయాబయి ఒకటవ పుట్టినరోజు పండుగనాడు మహాత్ముని స్మృతికి దేశ ప్రజలు మరోసారి పునరంకితులు కావడం బుధవారం నాటి శుభ పరిణామం. స్వచ్ఛతకు మించిన శుభపరిణామం మరొకటి లేదు. భౌతిక స్వచ్ఛత, బౌద్ధిక స్వచ్ఛత రెండూ వికసించడానికి మరోసారి అంకురార్పణ జరగడం ఈ శుభపరిణామం. భౌతిక స్వచ్ఛత స్వరూపానికి సంబంధించినది, బౌద్ధిక స్వచ్ఛత స్వభావానికి సంబంధించినది. ఒకటి ‘నడక’, రెండవది ‘నడత’. ఈ ‘అంకురార్పణ’ గత ఐదేళ్లకు పైగా కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు స్వచ్ఛ్భారత పునర్ నిర్మాణం కోసం సాగిస్తున్న కృషికి నిర్ణయాత్మక ఘట్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినట్టు దేశం ‘‘బహిరంగ మలమూత్ర విసర్జన వికృతి’’నుంచి విముక్తం అయింది. ‘‘సౌష్ఠవ భారత్’’ను సాధించే దిశగా అడుగులు వడివడిగా కదులుతున్నాయి. ఇదంతా స్వరూప స్వచ్ఛతను, భౌతిక స్వచ్ఛతను సాధించడంలో భాగం. ‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’. స్వచ్ఛ జలం, స్వచ్ఛ వాయువు, స్వచ్ఛ పరిసరాలు, స్వచ్ఛ జీవన పద్ధతులు, స్వచ్ఛ ఇంధన ఉపయోగం, స్వచ్ఛ ఆహారం.. ఇలా భౌతిక స్వచ్ఛత పెంపొందాలన్నది నడుస్తున్న ప్రచారం. ‘యోగం’, శక్తి ప్రదాయకుడైన సూర్యుని ఉపాసన వంటివి బౌద్ధిక స్వచ్ఛతకు సోపానాలు. భౌతిక శారీరక సౌష్ఠవం, బౌద్ధిక నైతిక నిష్ఠ పెంపొందడం స్వచ్ఛ భారతం.. మహాత్ముని వంటి అనేక మహాపురుషుల జీవన స్వప్నం ఈ స్వచ్ఛ్భారతం. ఈ ‘స్వచ్ఛ’ సాధనలో గాంధీజీ ధరించిన స్వజాతీయ ఆయుధం రాట్నం-చరఖా-! ‘చరఖా’పై నూలు వడకడం, వడికిన నూలును ‘మగ్గం’పై వస్త్రంగా మార్చడం గాంధీ మహాత్ముడు ప్రచారం చేసిన ఆర్థిక భౌతిక వికేంద్రీకృత సమగ్ర ప్రగతి. ఈ మార్గం ద్వారా భారతీయ బుద్ధిని మళ్లీ భారతీయ సాంస్కృతిక నిష్ఠతో నిబద్ధం చేయడం స్వభావ పరివర్తన.. మహాత్ముడు కేవలం ప్రచారం చేయలేదు. భారతీయ జీవన పద్ధతులను సమాచరించి సాకారం చేయగలిగాడు...
మహాత్ముడు ప్రతిరోజూ గంటసేపు రాట్నంపై నూలు వడకడం ఈ సమాచరణ! ‘‘అధీతి బోధ ఆచరణైః ప్రసంగైః..’’ అన్నది భారతీయుల అనాది జీవన రీతి! ‘‘తెలుసుకొనడం, తెలియచెప్పడం, ఆచరించడం...’’ ఇవి జరిగిన తరువాతనే నాలుగవదైన ‘‘ప్రచారం చేయడం!’’ అందువల్ల స్వచ్ఛ భారత పునర్ నిర్మాణం కోసం స్వచ్ఛ పద్ధతులను ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో ఆచరించడం వౌలికమైన అనివార్యం! ఈ స్వచ్ఛతకు గాంధీజీ ఎంపికచేసిన ప్రతీక, ప్రాతిపదిక పత్తి..! పత్తితో నూలు వడకడం! ఈ స్వచ్ఛతను పాశ్చాత్యులు ప్రధానంగా బ్రిటన్ దురాక్రమణకారులు పాడుచేశారు. పత్తి పండే పొలాలను ‘పొగాకు’పాలు చేసిపోయారు. పత్తితో తయారయ్యే సహజమైన స్వచ్ఛమైన వస్త్రాలను అపహరించి కృతకమైన కృత్రిమమైన ‘నైలాన్’వంటి వస్త్రాలను అంటగట్టారు. ‘ప్లాస్టిక్’ దురాక్రమణ పరాకాష్ఠ. ‘పత్తి’ స్వచ్ఛతకు చిహ్నం. ‘ప్లాస్టిక్’ కాలుష్యానికి కారకం! గాంధీజీ తెల్లవారుజామున మూడుగంటలకు నిద్ర లేచే వాడన్నది చరిత్ర. ఉదయం నాలుగు గంటలనుంచి ఐదువరకు నూలు వడికేవాడట, ఐదునుంచి ఆరుగంటల వరకు నడిచే వాడట! మొదటిది భౌతిక స్వచ్ఛత, భౌతిక ప్రగతి. రెండవది బుద్ధిని, మనస్సును, శరీరాన్ని ప్రకృతితో ‘సుప్రభాత అనుసంధానం’చేయగల యోగం, స్వచ్ఛ స్వభావం! ‘పత్తి’ని ‘ప్లాస్టిక్’ దిగమింగింది.. ఉదయ పరిక్రమ- సూర్యుని ఉదయం కంటె ముందు నిద్రలేచి నడిచే పద్ధతి-ని సోమరితనం దిగమింగింది! సూర్యుడు ఉదయించిన తరువాత కూడ నిద్రపోతున్న సోమరులు స్వభావ స్వచ్ఛతకు శత్రువులు! మహాత్మా గాంధీకి వారు నివాళిని ఎలా ఘటించగలరు?? సౌరశక్తి సౌష్ఠవాన్ని ఎలా సాధించగలరు? ‘‘అధీతి, బోధాచరణ ప్రసంగైః...’’
అందువల్ల ‘ప్లాస్టిక్’ భూతాన్ని పరిమార్చినట్టయితే బతుకులు ఎలా సాగుతాయి?? అన్న భయం అభారతీయం.. ‘పత్తి’ని పునరుద్ధరించాలి. జనపనార, కాగితం వంటివి ‘పత్తి’కి కవలలు, ‘ప్లాస్టిక్’కు ప్రత్యామ్నాయాలు! ‘ప్లాస్టిక్’లు ముంచెత్తడానికి పూర్వం- జీవన వ్యవహారం, పారిశ్రామిక వాణిజ్యాలు, వైద్య చికిత్సలు, గృహ కలాపాలు కొనసాగాయి, అనాదిగా కొనసాగాయి. బట్ట సంచులను, మట్టి డిప్పలను, కుండలను, పాత్రలను, చిప్పలను వాడేవారు. జనపనారతో తయారైన సంచులు విరివిగా లభించేవి. చిన్నచిన్న ‘తిత్తులు’వాడేవారు. ‘సీసా’- గాజుపాత్ర-లలో ఔషధాలను నిలువచేశారు. ‘అశ్వపు సంచులు’అన్నవి భారతీయ సంచార వైద్యంలోను, సంచార వాణిజ్యంలోను విరివిగా ఉపయోగపడ్డాయి. గుర్రాల మీద సామగ్రిని తరలించే సమయంలో గుడ్డతో కుట్టిన ఈ ‘అశ్వపు సంచుల’లో ఆయా సామగ్రిని నింపేవారు. వెదురుతోను, కలప తీగలతోను, కలప గుజ్జుతోను, గట్టి లతల తీగెలతోను తయారుచేసిన తట్టలు, బుట్టలు, ‘గుల్ల’లు, ‘జల్ల’లు, ‘పుటికె’లు ఇళ్లల్లోవాడే వారు. పాత కాగితాలతో సైతం గృహిణులు తమంత తాముగా బుట్టలను తయారుచేసిన చరిత్ర కొనసాగింది. లోహపు, గాజు పాత్రలలో నీరు తాగడం, ఈ పాత్రలలో నీరు నింపి వంట ఇళ్లలోను, స్నానాల గదులలోను ఉంచుకొనడం కూడ సహస్రాబ్దులు సాగిన జీవన వ్యవహారం. ‘ప్లాస్టిక్’ భూతాన్ని నిర్మూలించినందువల్ల మనకు ఎలాంటి అసౌకర్యం జరగబోదన్నదానికి ఈ చరిత్ర సాక్ష్యం. ప్లాస్టిక్ సీసాలలోని నీరు, ‘ప్లాస్టిక్’ సంచులలోని పాలు తాగుతున్నవారిని ‘ప్లాస్టిక్’ కాలుష్య ప్రభావం ఆవహిస్తోంది. క్రమక్రమంగా విష రసాయనం కడుపులోకి చేరుతుంది. మర్రి ఆకులతోను, మోదుగ ఆకులతోను ‘విస్తళ్లు’కుట్టి అమ్మి జీవించిన లక్షల మంది ‘ప్లాస్టిక్’ కారణంగా జీవన ఉపాధిని కోల్పోయారు. కాగితం కప్పులను, గాజు కప్పులను, మట్టి డిప్పలను కాఫీ, తేనీరు సరఫరా చేయడానికి ‘రైలు’పెట్టెలలోను, ‘స్టేషన్’లలోను వాడేవారు. క్రమంగా ‘ప్లాస్టిక్’కప్పులు తప్ప మరొకటి వాడడం లేదు. ‘ప్లాస్టిక్’ను నిర్మూలించి ‘మట్టి’, ‘గాజు’, ‘లోహపు’ పాత్రలను వాడాలన్న ప్రతిపాదనలు అమలుకాకుండా ‘ప్లాస్టిక్’ బట్టీలవారు, ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’వారు అడ్డుతగులుతుండడం నడుస్తున్న చరిత్ర...
నైనం ఛిన్దన్తి శస్త్రాణి, నైనం దహతి పావకః, న చైనం క్లేదయన్తి ఆపః నశోషయతి మారుతః- ఆయుధాలు హతం చేయలేవు, అగ్ని కాల్చివేయలేదు, నీరు కరగించి వేయలేదు, గాలి ఆర్పివేయలేదు!-అన్న సనాతన వాస్తవం విచిత్రంగా ‘ప్లాస్టిక్’కు అన్వయం అవుతోంది. ఒకసారి ఉత్పత్తి అయిన ‘ప్లాస్టిక్’ నశించడం లేదు, కరగిపోవడం లేదు, ప్రకృతిని, అంతరిక్షాన్ని నిరంతరం ముంచెత్తుతోంది. అన్ని రకాల ‘ప్లాస్టిక్’లను ఉత్పత్తిచేయకుండా నిరోధించడం మాత్రమే పరిష్కారం. అలా సమగ్రంగా ప్లాస్టిక్‌ను నిషేధిస్తే ప్లాస్టిక్ పరిశ్రమల యజమానులే అనివార్యంగా నూలు, జనపనార, కాగితం, మట్టి ఉపకరణాలను తయారుచేసి విరివిగా సరఫరా చేస్తారు...