సంపాదకీయం

పెట్టుబడుల ‘వల’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ భావనిష్ఠ ప్రగతికి ఏకైక మాధ్యమమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మన ప్రధాని నరేంద్ర మోదీ జరుపుతున్న అమెరికా యాత్ర సందర్భంగా పునరావిష్కృతమైన మహా విషయం. ‘‘్భవిష్యత్తు జాతీయ భావనిష్ఠ కలవారిది, అంతేకాని ప్రపంచీకరణవాదుల- గ్లోబలిస్టుల-ది కాదు’’అన్నది నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో ఉన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ ‘‘బద్దలుకొట్టిన కుండ..’’ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఇలా ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్-ను ‘అభిశంసించాడు’. ఇరవై ఆరేళ్ల క్రితం ‘‘ప్రపంచీకరణ వ్యవస్థ’’ను వివిధ దేశాల నెత్తిన రుద్దడానికి అమెరికా ప్రభుత్వం యత్నించడం చరిత్ర. ఆ ప్రపంచీకరణను అమెరికా ఇప్పుడు తీవ్రంగా నిరసిస్తోంది! ప్రపంచీకరణ వల్ల తమ దేశానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోందని అమెరికా గుర్తించడం ఇందుకు కారణం. 2008లో అమెరికా ఆర్థిక, వాణిజ్య సంస్థలు దివాలా తీయడం ఈ ‘‘గుర్తింపు’’నకు ఆరంభం. తేలుకుట్టిన దొంగవలె ఎనిమిదేళ్లకు పైగా ‘ప్రపంచీకరణ’ను అమెరికా విమర్శించలేదు. రెండున్నర ఏళ్లుగా ట్రంప్ ప్రపంచీకరణ వ్యవస్థను, ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నియమావళిని నిశితంగా విమర్శించాడు. ఇప్పుడు ‘ప్రపంచీకరణ’కు భవిష్యత్తు లేదని ఆయన ‘సమితి’ సభలో ప్రకటించడం పరాకాష్ఠ.. అమెరికాను కుట్టిన ‘తేలు’- చైనా. చైనా అనేక దేశాలను ‘‘కుట్టింది’’. అమెరికాను అనేక ఇతర దేశాలను అనవసరమైన నాసిరకం వస్తువులను చైనా వాణిజ్య సంస్థలు ముంచెత్తుతున్నాయి. అమెరికా ‘‘లబోదిబోమ’’ని ఏడుస్తోంది. చైనా ఇలా వాణిజ్య దురాక్రమణను సాగిస్తుండడం ‘ప్రపంచీకరణ’ ఫలితం. అమెరికాలో కంటె మన దేశంలో చైనా వాణిజ్య విస్తరణ మరింత ప్రమాదకరంగా కొనసాగుతోంది. మన కేంద్ర ప్రభుత్వం కాని రాష్ట్రాల ప్రభుత్వాలు కాని ‘‘లబోదిబో’’మని నిరసన తెలపడం లేదు. నిరసన తెలపాలన్న ధ్యాస కూడ మన ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటె ‘ప్రపంచీకరణ’ మాయామారీచ మృగం- బంగారపు జింక- కల్పించిన ‘ప్రగతి భ్రాంతి మత్తు’’ ఇప్పటికీ మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులను ‘ఆవహించి ఉంది.’ ‘ప్రపంచీకరణ’ మాయల జింకకు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’, ‘విదేశీయ సంస్థల పెట్టుబడులు’- ఫారిన్ డైరక్ట్ ఇనె్వస్ట్‌మెంట్- ఎఫ్‌డిఐ- అవయవాలు, కార్యక్రమాలు! అందువల్ల ‘మత్తు’ తొలగని మన ప్రభుత్వాలు ఇప్పటికీ ‘ప్రపంచీకరణ’ బంగారపు జింక వెంట పరుగులు తీస్తున్నాయి. ట్రంప్ ఇలా ‘ప్రపంచీకరణ’ వాణిజ్య వ్యవస్థను తొలగించాలని, జాతీయ ఆర్థిక వ్యవస్థలు బలపడాలని పిలుపునివ్వడం, మన ప్రధానమంత్రి ప్రపంచపు ‘పెట్టుబడి’ సంస్థలతో జరిపిన సమావేశానికి విచిత్రమైన నేపథ్యం.
మన ప్రధానమంత్రి న్యూయార్క్‌లో బుధ, గురువారాలలో జరిపిన పెట్టుబడుల సమావేశానికి వివిధ దేశాలకు చెందిన నలబయి వాణిజ్య సంస్థల ప్రతినిధులు హాజరయ్యారట. ఎన్ని వేల లేదా ఎన్ని లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు విదేశాల నుంచి మన దేశానికి తరలివస్తాయన్నది మాత్రం ఇతమిత్థంగా వెల్లడి కాలేదు. ‘‘రానున్న నెలలలో పెద్దఎత్తున పెట్టుబడులను- మన దేశంలో- పెట్టడానికి అనేక వాణిజ్య సంస్థలు ముందుకు వచ్చాయి...’’అని మాత్రమే పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య అభివృద్ధి మంత్రిత్వ విభాగం కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్రా వెల్లడించాడట. ఏళ్లతరబడి మన దేశంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న పెట్టుబడుల సమావేశాలలోను, మన ప్రధానులు, ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్లి నిర్వహించిన సమావేశాలలోను ‘‘ఇన్ని లక్షల కోట్ల విదేశీయుల నిధులు మన దేశపు పారిశ్రామిక వాణిజ్య రంగాలకు పెట్టుబడులుగా తరలి రానున్నాయి...’’ అన్న ఆర్భాటపు ప్రచారం జరిగేది. న్యూయార్క్ సమావేశంలో అలాంటి నిర్దిష్ట నిధుల గణాంకాలు ఏవీ నిర్ధారణ అయినట్టు లేదు. ఇలా నిర్ధారణ కాకపోవడం వాస్తవానికి దగ్గరి వ్యవహారం. ఎందుకంటె గత రెండు దశాబ్దుల పెట్టుబడుల సమావేశాలలో ‘‘వాగ్దత్తమయిన’’విదేశీయ నిధులలో ఎంతశాతం మన దేశానికి తరలివచ్చాయన్న విషయమై కచ్చితమైన గణాంకాలు లేవు. ఎన్ని ‘అంగీకారాలు’ వాస్తవ రూపం ధరించాయన్నది తెలియరావడం లేదు. 2004-2014 సంవత్సరాల మధ్య జరిగిన పెట్టుబడుల ప్రహసనమే 2014 తరువాత కూడ పునరావృత్తికి గురి అవుతోందన్న సందేహాలు అతార్కికం కాదు. పెట్టుబడుల ప్రహసనంలోని ప్రధాన అంశం విదేశాలకు చెందిన ‘బహుళ జాతీయ వాణిజ్యసంస్థలు’ స్వదేశీయ వాణిజ్య సంస్థలను దిగమింగి వేస్తుండడం! ఇది విస్తృత వంచన క్రీడలో ఒక అంశం మాత్రమే!
ఇలా దిగమింగడం వల్ల వేలాది స్వదేశీయ సంస్థలు మూతపడుతున్నాయి. చివరికి ప్రతి రంగంలో రెండు- మూడు- నాలుగు విదేశీయ సంస్థలు మాత్రమే మిగిలే స్థితి దాపురించింది. పంపిణీ రంగంలో ‘అమెజాన్’, ‘వాల్‌మార్ట్’ సంస్థలు మాత్రమే వాణిజ్య ఆధిపత్యం వహిస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఈ రంగంలో ఈ సంస్థలతో దీటుగా పోటీపడుతున్న స్వదేశీయ సంస్థలు ఉన్నాయా? ప్రభుత్వాలు చెప్పాలి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! తినుబండారాల రంగంలో ‘నెజల్’-నెస్లే-, మరికొన్ని విదేశీయ సంస్థలు ‘దోపిడీ’ కలాపాలను కొనసాగిస్తున్నాయి, విష రసాయన పూరితమైన తినుబండారాలను మన దేశపు వినియోగదారుల నోళ్లకెత్తుతున్నాయి. మనదేశపు స్థూల జాతీయ ఉత్పత్తి-గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్- జీడీపీ-లో ‘సేవల’రంగం వాటా యాబయి ఆరు శాతం కావడం మన ప్రగతి ప్రమాణాలలోని వైచిత్రి. సేవల రంగం ప్రగతి తాత్కాలికమైనది, వౌలికమైనది కాదు. వ్యవసాయ, వౌలిక పారిశ్రామిక రంగాలలో లభించే ప్రగతి నిజమైన ప్రగతి. బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశంలోకి చొఱబడే నాటికి ప్రపంచ వాణిజ్యంలో మన దేశపు వాటా నలబయి శాతం. చరిత్ర చెబుతున్న వాస్తవం ఇది. కానీ ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య రంగంలో మన వాటా నాలుగు శాతం కూడ లేదు. ఇందుకు ప్రధాన కారణం మన వౌలిక పారిశ్రామిక ఉత్పత్తులు మూడు శతాబ్దులలో క్రమంగా అడుగంటిపోవడం. ఇది మొదటి వైపరీత్యం. రెండవ వైపరీత్యం విదేశాల నుంచి వస్తున్న సంస్థలు వౌలిక పారిశ్రామిక రంగాలలో పెద్దగా పెట్టుబడులను పెట్టడం లేదు. పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అవసరం లేని పంపిణీ రంగంలోకి, సేవల రంగంలోకి ఈ సంస్థలు చొఱబడిపోయాయి. ‘బీమా’ రంగంలోను, విద్యారంగంలోను విదేశీయ సంస్థల చొఱబాటు కొనసాగుతోంది. విదేశీయ సంస్థలు మన దేశంలో విమానాలను ఉత్పత్తి చేయడం లేదు. కేవలం విమాన సేవలను నిర్వహించడం ద్వారా వినియోగదారులను దోపిడీ చేస్తున్నాయి. ఈ ‘దోపిడీ’ పేరు ‘‘డైనమిక్ ప్రయిజింగ్’’! అమెరికాతో ‘అణు విద్యుత్’ ఒప్పందాలు కుదిరాయి, ఫ్రాన్స్‌తో కుదిరాయి. పదేళ్లు గడిచిపోయినప్పటికీ ఈ దేశాల సంస్థలు ఎందుకని మన దేశంలో అణువిద్యుత్ ఉత్పత్తిచేయడం లేదు? విదేశీయ సంస్థల పెట్టుబడుల మాయాజాలం ఇది. విదేశీయ సంస్థలు మన దేశంలో సిమెంటును, ఉక్కును ఉత్పత్తి చేయడం లేదు. సేమ్యాలను, అప్పడాలను, ఆవకాయలను, శీతల పానీయాలను, రోగాలను పెంచే చాక్లెట్లను తయారు చేస్తున్నాయి.
ఇదంతా ప్రపంచీకరణ. ఈ ‘ప్రపంచీకరణ’ను ఆరంభించిన అమెరికా ప్రభుత్వమే ఇప్పుడు దీన్ని వదిలించుకొంటోంది. అందువల్ల అనుత్పాదక, సేవల రంగాలను, వ్యవసాయ రంగాన్ని మన ప్రభుత్వం ఇప్పుడైనా విదేశీయ సంస్థల ‘పెట్టుబడుల’ నుంచి విముక్తం చేయాలి!!