సంపాదకీయం

హూస్టన్ ఆతిథ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన హూస్టన్ నగరంలో ఆదివారం భారతీయ సంతతి సమావేశంలో మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించడం మరో చారిత్రక శుభ పరిణామం! పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండ తీవ్రతను ప్రపంచ దేశాల దృష్టికి తేవడం ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ భారతీయ సంతతి సమావేశంలో పాల్గొనడం మాత్రమే కాక ‘‘ఇస్లామీ బీభత్స ఉన్మాదాన్ని’’ మన ప్రధానితో కలసి అభిశంసించడం సమావేశానికి చారిత్రకతను సంతరించిపెట్టిన పరిణామం. అమెరికా ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని ‘‘ఇస్లామీ ఉన్మాద ప్రభుత్వాల’’ను మైత్రీ విధానంతో మన్నిస్తూ ఉండడం సమావేశానికి నేపథ్యం. సౌదీ అరేబియా ప్రభుత్వం పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ బీభత్సకాండకు సైద్ధాంతిక భూమికను సమకూర్చింది. సౌదీ అరేబియాలోని సంపన్నులు భారత వ్యతిరేక పాకిస్తానీ జిహాదీ బీభత్సపుముఠాలకు నిధులను సమకూర్చుతున్నారు. సౌదీ అరేబియా అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశం. అందువల్ల ‘‘ఇస్లామీ బీభత్స ఉన్మాదాన్ని’’ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలా మన ప్రధానితో కలసి ఒక సాంస్కృతిక వేదిక మీద సైతం అభిశంసించడం మన దేశానికి లభించిన వ్యూహాత్మక విజయం. దాదాపు ఐదువందల మంది సాయుధులు, జిహాదీ బీభత్సకారులు మన జమ్మూకశ్మీర్‌లోకి చొఱబడడానికి ‘అధీన రేఖ’వద్ద పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో పొంచి ఉండడం నరేంద్ర మోదీ హూస్టన్‌లో భారతీయ సంతతి సమావేశంలో చెప్పిన వాస్తవాలకు ధ్రువీకరణ. ఇలా ఐదువందల మంది బీభత్సకారులు ‘అధీనరేఖ’ వద్ద నక్కి ఉన్న వాస్తవాన్ని మన సైనిక దళాల ప్రధాన అధికారి విపిన్ రావత్ సోమవారం స్వయంగా వెల్లడించడం మోదీ మాటలకు నిరూపణ. జమ్మూకశ్మీర్‌లోని బీభత్సకారులతో పాకిస్తాన్ ప్రభుత్వ సంబంధాలు తెగిపోలేదని, ఇంకా కొనసాగుతున్నాయని సైనిక దళాల ప్రధాన అధికారి చెప్పిన మాట! రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దుచేయడం అంతర్గత భద్రతను పెంపొందించుకొనడంలో భాగమని హూస్టన్‌లో మన ప్రధాని చెప్పిన మాట.. ఈ వాస్తవాన్ని అమెరికా అధ్యక్షుడు అంగీకరించడం మనకు లభించిన మరో వ్యూహాత్మక విజయం. మూడువందల డెబ్బయ్యవ అధికరణాన్ని రద్దుచేసిన వెంటనే మన ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించిన ‘ఐరోపా సమాఖ్య’లోని కొన్ని దేశాలు ఇప్పుడు మన ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నాయి, జమ్మూకశ్మీర్‌లోకి బీభత్సకారులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వరూప స్వభావాలు వికృతంగా ఆవిష్కృతం అవుతుండడం ఇందుకు కారణం. ఐక్యరాజ్యసమితి వేదికగా ఈ దేశాలు పాకిస్తాన్‌ను అభిశంసించడానికి ‘హూస్టన్ దౌత్యం’ ద్వారా మోదీ రంగాన్ని సిద్ధం చేశాడు. డొనాల్డ్ ట్రంప్ మాటలు మన ప్రధాని మాటలకు ప్రతిధ్వనులు కావడం ఇలా రంగం సిద్ధమైందనడానికి సరికొత్త నిదర్శనం... అమెరికా విధానంలో వచ్చిన ‘విప్లవ పరివర్తనం’ హూస్టన్ సభలో ఆవిష్కృతమైంది.
మన ప్రభుత్వం ‘సాయుధ చికిత్స’- ‘సర్టికల్ స్ట్రయిక్’-ద్వారా ధ్వంసం చేసిన బీభత్స స్థావరాలను పాకిస్తాన్ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించడం కూడ హూస్టన్ సభకు మరో వికృత నేపథ్యం. అంతరంగ భద్రత గురించి, సరిహద్దుల రక్షణ గురించి మన దేశానికీ అమెరికా మధ్య ఏర్పడిన సమాన భావానికి బహుశా ఇది మరో కారణం. పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి చొఱబడుతున్న ‘జిహాదీ’ హంతకులతో- మెక్సికో నుంచి తమ దేశంలోకి చొఱబడుతున్న అక్రమ ప్రవేశకులను పోల్చడం ద్వారా ట్రంప్ ఉభయ దేశాల సరిహద్దుల మధ్య పోలికలను ప్రస్ఫుటింపచేశాడు. అమెరికా భద్రతకు అంతర్జాతీయ ప్రమాదం గురించి మాత్రమే రెండు శతాబ్దులకు పైగా అమెరికా ప్రభుత్వాలు ప్రస్తావించాయి. దక్షిణం వైపున ఉన్న మెక్సికో నుంచి కాని ఉత్తరం వైపున ఉన్న కెనడా నుంచి కానీ అమెరికా సరిహద్దుల భద్రతకు భంగం లేదు. తూర్పు పడమరలలో సముద్రం వ్యాపించి ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మెక్సికో వైపున ఉన్న తమ దేశపు దక్షిణ సరిహద్దులకు ఏర్పడిన ప్రమాదం గురించి ప్రస్తావించాడు. అమెరికా అధ్యక్షుడు తమ దక్షిణ సరిహద్దులకు ఏర్పడిన ప్రమాదం గురించి ఇలా ఇతర దేశాలతో ప్రస్తావించడం బహుశా ట్రంప్‌తోనే ఆరంభం.. మెక్సికోలోకి చేరుతున్న వివిధ దేశాలకు చెందినవారు మెక్సికో సరిహద్దుకు ఆనుకొని ఉన్న అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, అరిజోనా, న్యూమెక్సికో ప్రాంతాలలోకి చొరబడుతున్నారు. ఈ అక్రమ ప్రవేశకులలో బీభత్సకారులు, ప్రత్యేకించి ‘ఇస్లాం బీభత్స మతోన్మాదులు’- రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్టులు- ఉన్నారన్నది ట్రంప్ ధ్వనింపచేసిన ప్రమాదం. ఈ ప్రమాదాన్ని నిరోధించడానికి తమ ప్రభుత్వం అభూత పూర్వమైన చర్యలను తీసుకున్నట్టు ట్రంప్ చెప్పాడు. అమెరికా మెక్సికో సరిహద్దు పొడవునా ఉక్కు గోడను నిర్మించడానికి పూనుకొనడం ఈ అభూత పూర్వచర్య. తమ దేశపు సరిహద్దులకు మన దేశపు సరిహద్దులకున్నంత తీవ్రస్థాయిలో ప్రమాదం ఏర్పడి ఉందని ధ్వనింప చేయడం ‘ట్రంపు దొర’ అతి అభినయం కావచ్చు. కానీ మన దేశపు సరిహద్దులకు ‘జిహాదీ’బీభత్సకాండ వల్ల ప్రమాదం ఏర్పడుతోందన్న వాస్తవాన్ని మాత్రం హూస్టన్ సమావేశం ప్రసంగం ద్వారా ట్రంప్ నిర్ద్వంద్వంగా గుర్తించినట్టయింది.
ఇనే్నళ్లుగా పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండ వల్ల అఫ్ఘానిస్థాన్‌కు ఎక్కువగా ప్రమాదం ఏర్పడి ఉందన్నది అమెరికా ప్రభుత్వ విధానంలో నిహితమైఉన్న ధ్వని.. మన దేశానికి పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండ వల్ల ఏర్పడిన ప్రమాదం గురించి అమెరికా ప్రభుత్వానికి పెద్ద పట్టింపులేదన్నది వికృత వాస్తవం! అమెరికా పాకిస్తాన్‌కు సరఫరా చేస్తున్న యుద్ధ విమానాలను పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగా అనేకసార్లు ప్రయోగించింది. అయినప్పటికీ ఈ యుద్ధవిమానాల సరఫరాను అమెరికా శాశ్వతంగా ఆపలేదు. ఈ విమానాలను బీభత్సకారులకు వ్యతిరేకంగా మాత్రమే పాకిస్తాన్ వాడుతోందన్నది అమెరికా వాదం. అమెరికా ఇకనైనా ఈ ‘ఎఫ్ 16’ రకం యుద్ధ విమానాలను, విడి భాగాలను పాకిస్తాన్‌కు విక్రయించడం మానుకుంటుందా? అన్నది వేచి చూడదగిన అంశం. గత జూలై చివరిలో కూడ ‘ఎఫ్ 16’ యుద్ధవిమానాల విడి భాగాలను, సాంకేతిక ఉపకరణాలను అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు విక్రయించింది. ఈ విషయమై నిరసన తెలిపిన మన ప్రభుత్వానికి అమెరికా ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు...
అందువల్ల హూస్టన్ సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శించిన మైత్రి, నరేంద్ర మోదీపై కురిపించిన ప్రశంసలు అంతర్జాతీయ సమాజాన్ని సంభ్రమాశ్చర్య ఆనంద చకితులను చేసి ఉండవచ్చు... ముప్పయి కోట్లమంది భారతీయులను నరేంద్ర మోదీ ప్రభుత్వం దారిద్య్రం నుంచి విముక్తులను చేసిందని ట్రంప్ చెప్పడం మోదీ ప్రభుత్వానికి మరో అంతర్జాతీయ కీర్తి పతాకం! నరేంద్ర మోదీ పట్ల అమెరికాలోని భారతీయ సంతతికి గల వ్యక్తిగత ప్రేమానురాగాలు ఆవిష్కృతం కావడం హూస్టన్ సభలో ప్రస్ఫుటించిన మరో అద్భుతం. అమెరికాలోని భారతీయ సంతతిని తన కుటుంబం అని మోదీ ప్రకటించడం మరో అద్భుతం... ఈ ‘్భరతీయ సంతతి’ నిజానికి ట్రంప్ కుటుంబం కూడ... కానీ ఇది తమ కుటుంబమని మోదీ అమెరికా అధ్యక్షునికి పరిచయం చేయడం మన ‘వసుంధరా పరివార’ భావానికి నిదర్శనం. ‘‘ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకమ్...’’- ఉదార హృదయం కలవారికి మొత్తం ప్రపంచమే సొంత కుటుంబం- అన్న వాస్తవాన్ని, భారతీయ జీవన సత్యాన్ని నరేంద్ర మోదీ హూస్టన్ సభలో పునరావిష్కరించగలిగాడు..