సంపాదకీయం

‘ప్లాస్టిక్’పై యుద్ధం?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్లాస్టిక్ పదార్థాల వాడకాన్ని గణనీయంగా తగ్గించి వేయాలన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు ఏడు ‘సంపన్న దేశాల కూటమి’- గ్రూప్ సెవెన్-జీ7-లో విస్తృతవౌతున్న ఆర్థిక రాజకీయ విభేదాలు విచిత్రమైన నేపథ్యం. ప్రకృతి జీర్ణం చేసుకోలేకపోతున్న విష కాలుష్య వైపరీత్యం ప్లాస్టిక్ పదార్థ సమాహారం. ఒకసారి ‘ప్లాస్టిక్’ తయారయిన తరువాత దాన్ని నశింపచేయడం అసాధ్యం అయిపోయింది. పుట్టిన ప్రతిదీ ఎప్పటికో అప్పటికి నశిస్తోంది. కానీ ఈ ప్రాకృతిక వాస్తవం ప్లాస్టిక్ విషయంలో మాత్రం వాస్తవం కాలేదు. అందువల్ల ‘ప్లాస్టిక్’ పరిమాణం నిరంతరం పెరుగుతోంది. ఎందుకంటె ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ విషాలు యథాతథంగా ఉండిపోతున్నాయి, కొత్త ఉత్పత్తులు పుట్టుకొని వస్తూనే ఉన్నాయి. విశ్వమంతా విస్తరించిపోయిన ‘ప్లాస్టిక్’ వ్యర్థాలు సముద్రాలను కలుషితం చేసి చేపలను, తాబేళ్లను, తిమింగలాలను చంపేశాయి, చంపేస్తున్నాయి. గుట్టలు గుట్టలుగా ఈ జల చర కళేబరాలు సముద్ర తీరాలకు కొట్టుకొని వస్తున్నాయి. ప్లాస్టిక్‌ను నిరంతరం భోంచేసిన ఆవులు, పాడి పశువులు, గాడిదలు, కుక్కలు, పక్షులు వివిధ విచిత్ర వ్యాధులకు గురవుతున్నాయి. మన భాగ్యనగరంలోను దేశంలోని ఇతర నగరాలలోను ఆవులకు శస్తచ్రికిత్సలు జరిపి కడుపులో అట్టలుగా కట్టలుగా పేరుకొనిపోయిన ‘ప్లాస్టిక్’ వ్యర్థాలను తొలగించి, ఆవుల ప్రాణాలను- రక్షిస్తున్న స్వచ్ఛంద సంస్థలు ప్రకృతి ప్రేమికులు పనిచేస్తుండడం గురించి ప్రచారమైంది. ఇలా బతికి బయటపడిన పశువుల సంఖ్య బలైపోయిన పశువుల సంఖ్యతో పోలిస్తే చాలా స్వల్పం. హిమాలయం అంత ఎత్తునకు ఎదిగిన ‘ప్లాస్టిక్’ భూతం మంచు ముక్కలను కరగించి వేస్తోంది, హిమాలయం శిలాలయంగా దృశ్యమానం కావడానికి దోహదం చేస్తోంది. నాలుగు దశాబ్దులలో పదమూడు శాతం మంచు కరిగిపోయి రాళ్లగుట్టలు బయటపడినట్టు ప్రభుత్వం వెల్లడించిన తరువాత పదేళ్లు గడిచిపోయాయి. భూమండలం వేడిమి పెరిగిపోతుండడానికి అతి ప్రధాన కారణం ‘ప్లాస్టిక్’ విస్తరణ. అంతరిక్షంలో సైతం కోట్ల కొలది ‘ప్లాస్టిక్’ ముక్కలు నిండిపోయి ఉన్నట్టు వెల్లడికావడం మన ప్రభుత్వం ప్లాస్టిక్‌పై యుద్ధాన్ని ప్రకటించడానికి దోహదం చేసిన అనివార్యం... ‘ప్లాస్టిక్’ నీరు తాగడం ‘ప్లాస్టిక్’ భోజనం చేయడం దేశ ప్రజల వర్తమాన జీవన విధానం.
ఫ్రాన్స్‌లోని ‘బియారిట్జ్’ పట్టణంలో జరిగిన ‘జీ 7’ ప్రభుత్వాధినేతల సమావేశంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న నరేంద్ర మోదీ పునర్ వినియోగానికి పనికిరాని పలుచటి ‘ప్లాస్టిక్’ పదార్థాలను వాడడాన్ని నిర్మూలించనున్నట్టు ప్రకటించాడు. ఆదివారం ప్రసారమైన ‘మనసులోని మాట’- మన్‌కీబాత్-లో ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించిన నరేంద్ర మోదీ సోమవారం సంపన్న దేశాల ప్రభుత్వ అధినేతల సమక్షంలో ఈ సంకల్పాన్ని పునరుద్ఘాటించాడు! ‘ప్లాస్టిక్’ వాడకం ప్రతీక మాత్రమే. ప్రకృతిని గాయపరచి సంక్షుభితం చేసి జీవ వైవిధ్య విధ్వంసం కలిగిస్తున్న పారిశ్రామిక, పారిశ్రామికేతర రసాయన వ్యర్థాలను అరికట్టాలన్నది ‘పారిస్’లో కుదిరిన ‘పర్యావరణ పరిరక్షణ’ అంగీకారం స్ఫూర్తి! ఈ అంగీకారాన్ని మొదట అంగీకరించిన అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయిన తరువాత నీరుకార్చింది. అమెరికాకు మాత్రమే కాదు ‘సంపన్న దేశాల’ కూటమిలోని అధికాధిక దేశాలకు పర్యావరణ పరిరక్షణపట్ల చిత్తశుద్ధి లేదు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ దేశాలు ఈ సంపన్న కూటమి సభ్య దేశాలు. బోలిస్ ఎల్టిసిన్ రష్యా అధ్యక్షుడుగా ఉండిన సమయంలో రష్యా కూడ ఈ కూటమిలో చేరింది. ఏడు దేశాల కూటమి ఎనిమిది దేశాల బృందం అయింది. వాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడయిన తరువాత రష్యా ఈ కూటమి నుంచి నిష్క్రమించింది. ‘రష్యా, చైనాలు’ ఒకవైపున, ఈ ఏడు దేశాలు మరోవైపున పరస్పరం ఢీకొంటున్నాయి. ఈ ‘వాణిజ్య యుద్ధం’ ఫ్రాన్స్‌లో జరిగిన ‘జీ 7’ శిఖర సమావేశానికి మరో వికృత నేపథ్యం! ఈ కూటమి దేశాలకు ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ ప్రధాన అంశం కాదన్నది ఈ సమావేశంలో మరోసారి ధ్రువపడింది. ఆర్థిక ఆధిపత్యం వాణిజ్య విస్తరణ, చైనా వాణిజ్య దురాక్రమణను నిరోధించడం ఈ దేశాలకు ప్రస్తుత ప్రధాన కార్యక్రమాలు. ఐరోపా సమాఖ్యనుంచి బ్రిటన్ వైదొలగడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర సభ్య దేశాల ప్రభుత్వాలను నిరంతరం నిందిస్తూ ఉండడం ‘జీ7’ అంతర్గత వైరుధ్యాలకు కారణం. అందువల్ల చైనాతో ఈ దేశాలు కలసికట్టుగా తలపడడం సాధ్యమేనా? అన్నది ‘బియారిట్జ్’ సమావేశంలో ప్రస్ఫుటించిన సందేహం. ఈ సందేహచ్ఛాయలో కొలువుతీరిన అధినేతలు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ ప్రత్యేక ఆహ్వానంపై అతిథిగా హాజరైన మన ప్రధాని ప్రసంగాలను ఆసక్తితో ఆలకించారు. కానీ ‘ప్లాస్టిక్’పై పోరును ఈ దేశాలవారు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫ్రాన్స్ వంటి దేశాలు తమ దేశంలోని వ్యర్థాలను పనికిరాని పాత ఓడలలో నింపి ఆ ఓడలను మన దేశానికి సమీపంలోని సముద్ర జలాలలో ముంచేసి వెళ్లిన చరిత్ర ఉంది. కొన్ని కాలుష్యపు ఓడలను మన ‘నిఘా’వారు పసికట్టి తిప్పి పంపిన ఘటనలు గతంలో సంభవించాయి...
మహాత్మాగాంధీ సార్థ శత జయన్తి- నూట యాబయ్యవ పుట్టిన పండుగ- సంవత్సరంలో ‘ప్లాస్టిక్’కు వీడ్కోలు చెప్పడం హర్షణీయం. అక్టోబర్ రెండవ తేదీ- గాంధీ జయన్తి- పునర్ వినియోగ ప్రయోజనం లేని ‘ప్లాస్టిక్’లను వాడరాదన్నది మోదీ చెపుతున్న మాట. ఈ పలుచటి ప్లాస్టిక్ సంచులను ఒకసారి వాడి పారేస్తున్నారు. అందువల్ల ఇళ్లలోను వీధులలోను ప్లాస్టిక్ చెత్త పేరుకొనిపోవడానికి ఈ ‘ఏక పర్యాయ వినియోగ’ - సింగిల్ యూజ్- ‘ప్లాస్టిక్’ సంచులు ఇతర పదార్థాలు దోహదం చేస్తున్నాయి. కానీ పునర్ వినియోగానికి పనికివచ్చే ‘ప్లాస్టిక్’ పదార్థాల మాట ఏమిటి? పునర్వినియోగం రెండు రకాలు. మొదటిది- ప్లాస్టిక్ సీసాలను, డబ్బాలను, పాత్రలను, తట్టలను, బుట్టలను, ఇతర ఉపకరణాలను నెలలకొద్దీ సంవత్సరాలకొద్దీ ఇళ్లలో వాడుకోవచ్చునా?? వీటి మాట ఏమిటి? రెండవది - ప్లాస్టిక్ వ్యర్థాలను శుద్ధిచేసి మళ్లీ ‘ప్లాస్టిక్’ పదార్థాలను తయారుచేయడం. ఇలా శుద్ధిప్రక్రియ ద్వారా పునర్వినియోగం కాగల ‘ప్లాస్టిక్’లను యథావిధిగా వాడుకోవచ్చా?? నిజానికి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులను కూడ మళ్లీ ‘శుద్ధిప్రక్రియ’ద్వారా సరికొత్తగా సంతరించవచ్చు! ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఏక పర్యాయ వినియోగ ప్లాస్టిక్‌లను మాత్రమేకాక మొత్తం ప్లాస్టిక్ పదార్థాలను వాడడం నిషేధించడానికి సర్వసమగ్రమైన చట్టం జాతీయ స్థాయిలో ఏర్పడాలి. ఎందుకంటె నిరంతరం వాడుతున్న గట్టి ‘ప్లాస్టిక్’ల వల్లనే జన జీవనానికి జీవ జలానికి ప్రమాదం ఎక్కువ. ‘ప్లాస్టిక్’పాత్రలలో నిలువ ఉంచిన తిండి తినడంవల్ల, ‘ప్లాస్టిక్’ సీసాలలోని మంచినీటిని, శీతల పానీయాలను, ఔషధాలను సేవించడంవల్ల జనం క్రమంగా చిత్ర విచిత్ర వ్యాధులకు గురవుతున్నారన్నది ధ్రువపడిన నిజం! అడవుల గుండా ప్రవహించే నీరు వివిధ రకాల మొక్కల, తీగెల, చెట్ల, ఆకుల స్పర్శచేత ‘ఓషధీ జలాలు’గా మారుతున్నాయి, ఇలాంటి నీరు తాగడంవల్ల యుగయుగాలుగా మానవుల ఆరోగ్యం వర్ధిల్లింది. ఓషధుల స్పర్శవల్ల కూడ మేలు జరిగింది. కానీ ‘ప్లాస్టిక్’ స్పర్శవల్ల కీడు జరిగింది. మానవులకు జీవ జలానికి ‘ప్లాస్టిక్’ స్పర్శ అనారోగ్యాన్ని పెంపొందిస్తోంది.
సర్వవిధ ప్లాస్టిక్‌ల వినియోగాన్ని మాత్రమే కాదు ఉత్పత్తిని దిగుమతిని కూడ నిరోధించాలి, నిషేధించాలి. ‘ప్లాస్టిక్’ ఉత్పత్తికి విరుగుడు పత్తి ఉత్పత్తులు, జనుపనార ఉత్పత్తులు, కాగితం ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు. మహాత్మాగాంధీ పునరుద్ధరించిన ‘రాట్నం’ ‘నూలు’ ఖద్దరు, చేనేత ప్రకృతి ఆరోగ్య పరిపోషకాలు. కానీ ప్లాస్టిక్‌లను ఉత్పత్తిచేస్తున్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ఎప్పటికప్పుడు ‘ప్లాస్టిక్’ వినియోగ నిషేధాన్ని నిరోధిస్తున్నాయి. ఈ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలలో అత్యధికం ‘జి 7’ దేశాలకు చెందినవి, చైనాకు చెందినవి. ఇదీ ఫ్రాన్స్‌లో మన ప్రధాని ఇచ్చిన పిలుపునకు విచిత్ర నేపథ్యం..... ‘ప్లాస్టిక్’లేని గతంలో ప్రకృతి పువ్వుల పరిమళాలతో పరవశించింది. ఇప్పుడు ‘ప్లాస్టిక్’ వాసనలతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది.