సంపాదకీయం

నిర్లజ్జకు రూపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పళనియప్పన్ చిదంబరం ఇరవై ఏడు గంటల పాటు ‘అదృశ్యం’ కావడం అవినీతి ప్రహసనంలో మరో విచిత్ర ఘట్టం. మంగళవారం సా యంత్రం నుంచి కనిపించకుండా పోయిన చిదంబరం బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అయితే, అవినీతి ఆరోపణలకు గురి అవుతున్న తనను అధికారులు నిర్బంధించకుండా నిరోధించడానికి ఆయన చేసిన ఈ అభినయం మరింత విచిత్రమైన పరిణామం. సీబీఐ అధికారులు ఆయన ఇంటి ప్రహరీ గోడ దూకి ప్రాంగణంలోకి ప్రవేశించవలసి వచ్చిందట! అవినీతి ప్రహసనం దేశంలో దశాబ్దులుగా కొనసాగుతోంది. ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్- వ్యవస్థీకృతమైన తరువాత అవినీతి స్వరూపం విస్తరించడం నడుస్తున్న చరిత్ర, అవినీతి స్వభావం మరింత హేయం కావడం నడుస్తున్న చరిత్ర. అందువల్ల అవినీతి అన్నది పళనియప్పన్ చిదంబరానికే పరిమితం కాలేదు. అధికారగ్రస్తులైన అనేక మంది రాజకీయవేత్తలు అవినీతికి పాల్పడడం చరిత్ర. ఇలాంటి వారిలో కొందరు అధికారంలో ఉన్నప్పుడే పట్టుబడి పదవులకు రాజీనామా చేశారు. చేశారంటే స్వచ్ఛందంగా చేయలేదు. న్యాయస్థానాల ఆదేశాలు వెలువడడం, నిర్బంధానికి కారాగృహవాసానికి గురికావలసి రావడం ఇలాంటివారి ‘‘పదవీ త్యాగాల’’కు కారణాలు. 2004-2014 సంవత్సరాల మధ్య మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వంలో కాంగ్రెస్ కూటమి- ఐక్యప్రగతి కూటమి- వారు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించిన సమయంలో అనేక మంది మంత్రివర్యులు ఇలా రాజీనామాలు చేయవలసి వచ్చింది. కానీ రాజీనామా చేయకుండా చివరి దాకా పదవులలో కొనసాగిన ‘‘ఆరోపణగ్రస్త’’ మంత్రివర్యులు కూడ ఉన్నారు. వారిలో పళనియప్పన్ చిదంబరం ప్రముఖుడు. ‘‘అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యముల్’’ అన్న లోకోక్తి ‘‘అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పనులు చేసి, అధికార పతనం తరువాత నిందితులుగా నిలబడి నేరస్థులుగా నిగ్గుతేలిన’’ వారి చరిత్రకు సంబంధించినది. నిందితులందరూ నేరస్థులు కాదు. కానీ ఘరానా రాజకీయ నేరస్థులు ‘‘నిందితులు’’ కాకుండా తప్పించుకుంటున్నారు. తప్పించుకోలేని ప్రముఖుల సంఖ్య తక్కువ. ఇలా తప్పించుకోలేని ప్రముఖులలో చిదంబరం ఒకరు. ఇదీ మంగళవారం సాయంత్రం చిదంబరం అదృశ్యం కావడానికి నేపథ్యం. చిదంబరానికి వ్యతిరేకంగా అనేక అవినీతి ఆరోపణలు నమోదయి ఉన్నాయి. ఆదాయం పన్నుల విభాగం వారి ‘కార్యాచరణ కార్యాలయం’- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్- ఈడీ-, కేంద్ర నేర పరిశోధక మండలి- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్- సిబిఐ- వంటి సంస్థలు ఆయనకు వ్యతిరేకంగా దర్యాప్తులు జరుపుతున్నాయి. ఈయనను నిర్బంధించకుండా న్యాయస్థానాలు జారీచేసిన ఉత్తరువులు అనేక నెలలపాటు అమలులో ఉన్నాయి. ఇలాంటి అవకాశం లభించిన సమయంలో చిదంబరం ‘దర్యాప్తు’ చేస్తున్న సంస్థల అధికారులకు సహకరించి ఉండినట్టయితే ఆయన ‘గాంభీర్యం’ నిలబడి ఉండేది. కానీ న్యాయస్థానాలు కల్పించిన ఈ అవకాశాన్ని చిదంబరం దుర్వినియోగం చేసుకున్నాడు. తాను నిర్దోషినన్న మేకపోతు గాంభీర్యం అభినయించాడు. కానీ చట్టం తన పని తాను చేసుకొనిపోతూ ఉంది. న్యాయస్థానాలు చిదంబరం అవినీతికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు నిర్ధారించాయి. ఫలితంగా దర్యాప్తు సంస్థలు ఈయనను నిర్బంధించడం ఖాయమన్నది స్పష్టమైంది. తనను నిర్బంధించినట్టయితే వెంటనే ‘జామీను’పై విడుదల చేయాలన్న చిదంబరం ‘న్యాయ యాచిక’ను ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించడంతో మంగళవారం సాయంత్రం నుండి బుధవారం రాత్రి వరకూ చిదంబరం ‘కనిపించ లేదు’.
ఉన్నత న్యాయస్థానం ఆదేశం, తరువాత మంగళవారం సాయంత్రం ‘యుద్ధప్రాతిపదిక’పై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన చిదంబరానికి అక్కడ కూడ ‘‘ఊరట’’ లభించకపోవడం హర్షణీయ పరిణామం! ‘‘బెయిల్’’ను పొంది నిర్బంధం నుంచి బయటపడుతున్న రాజకీయ ఘరానా నిందితులు న్యాయప్రక్రియను నిలదీయగలుగుతున్నారు. ఏళ్లతరబడి, అభియోగాలపై విచారణ ప్రక్రియ పూర్తికాకపోవడం నడచిపోతున్న న్యాయ వైపరీత్యం. అందువల్ల రాజకీయ వాదులకు, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా దాఖలయ్యే అభియోగాలను ‘సంవత్సరం కాలవ్యవధి’లోగా విచారించి తీర్పులను చెప్పాలని నిర్దేశిస్తూ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఇదివరకే ఆదేశించి ఉంది. వేగవంతంగా విచారణ జరిపే- ఫాస్ట్‌ట్రాక్- ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటుచేయాలని కూడ కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించి ఉంది. అయినప్పటికీ చిదంబరం వంటి ప్రముఖ రాజకీయవేత్తలు, ప్రజాప్రతినిధులు ఏళ్లతరబడి ఇలా ‘న్యాయప్రక్రియ’ నుంచి తప్పించుకోగలగడం మన వ్యవస్థలో నిహితమై ఉన్న ప్రధాన లోపం! ఏమయినప్పటికీ చిదంబరం వంటివారికి వ్యతిరేకంగా ‘న్యాయ చర్యల’కు ఇప్పటికైనా రంగం సిద్ధమైంది. ఢిల్లీ హైకోర్టు రెండు అభియోగాలకు సంబంధించి, తనను నిర్బంధించకుండా నిరోధించాలన్న చిదంబరం అభ్యర్థనను తోసిపుచ్చింది. మొదటిది ‘ఎయిర్‌సెల్ - మాక్సిస్’ అవినీతి.. రెండవది ‘ఐఎన్‌ఎక్స్ మీడియా’ అవినీతి! మూడు వేల ఐదువందల కోట్ల రూపాయలు అక్రమంగా చేతులు మారడం ‘ఎయిర్‌సెల్ మాక్సిస్’ అవినీతి! మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండిన సమయంలో ఆయన మంత్రివర్గ సహచరులు నడిపించి ‘అవినీతి కలాపాల’లో అతి పెద్దది ‘బొగ్గు బొరియల’- కోల్‌బ్లాక్స్- అక్రమ వినిమయం. లక్షా ఎనబయి ఆరువేల కోట్ల రూపాయల ప్రజాధనం అవినీతిపరుల పాలయిందన్నది ‘నియంత్రణ, సమీక్షా నిర్దేశక’- కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- సిఏజి- మండలి వారు చేసిన నిర్ధారణ! ‘రెండవ శ్రేణి దూరవాణి తరంగాల’- 2జి స్పెక్టరమ్- కేటాయింపులలో లక్షా డెబ్బయి వేల కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని కూడ ‘సిఏజి’ నిర్ధారించింది. ‘ఎయిల్‌సెల్ మాక్సిస్’ అవినీతి ఈ ‘దూరవాణి తరంగాల కేటాయింపుల’ అక్రమ కార్యక్రమంలో భాగం. ‘ఐఎన్‌ఎక్స్ మీడియా’ అవినీతి విలువ మూడువందల ఐదు కోట్లు రూపాయలు..
చిదంబరానికి మొత్తం ఆరు అవినీతి కలాపాలతో భాగస్వామ్యం ఉన్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో ఆయన ‘బెయిల్’ యాచిక విచారణ జరుగుతుండిన సమయంలోనే ‘పౌర విమాన’ సేకరణలో జరిగిన అవినీతి కూడ ప్రచారమైంది. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉండిన సమయంలో రెండు విదేశీయ సంస్థల నుంచి కొనుగోలు చేసిన విమానాలు అవినీతిగ్రస్తమయ్యాయట. ఈ వ్యవహారంలో భారీగా ‘లంచాలు’ చేతులు మారాయన్నది అభియోగం. చిదంబరం నాయకత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు డెబ్బయివేల కోట్ల రూపాయల విలువైన విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదరడం చరిత్ర. ‘ఎయిర్‌బస్’ సంస్థ నుంచి నలబయిమూడు విమానాలను, ‘బోయింగ్’ సంస్థ నుంచి అరవై ఎనిమిది విమానాలను కొనుగోలు చేయాలన్నది ‘చిదంబరం సంఘం’ చేసిన నిర్ణయం. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పడానికై చిదంబరం ఇరవై మూడవ తేదీన ‘ఇడి’కార్యాలయంలో హాజరుకావాలి. చిదంబరం ఆరోజున హాజరు అవుతాడా? అన్నది వేచి చూడదగిన అంశం! ‘ఐఎన్‌ఎక్స్ మీడియా’ అవినీతి ఆరోపణ విషయంలో ఆయన దాఖలు చేసిన ‘యాచిక’ను సర్వోన్నత న్యాయస్థానం ఇరవై మూడవ తేదీననే విచారించనుంది. చిదంబరం వంటి ప్రముఖుడు, మేధావి, మాజీ కేంద్రమంత్రి ఇలా ‘‘సామాన్య నేరస్థుని’’వలె ఇరవై ఏడు గంటల పాటు పలాయనం చిత్తగించడం సిగ్గుచేటైన విషయం. చిదంబరాన్ని నిర్బంధించడం, నిర్బంధించక పోవడం ఇప్పుడు ప్రాధాన్యం లేని అంశం. చిదంబరం ఇరవై ఏడు గంటల పాటు చేసిన అభినయం రాజ్యాంగ వ్యవస్థ పట్ల ఆయనకు విశ్వాసం లేదనడానికి నిదర్శనం.
ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ అన్న ‘దుష్ట’ద్వయం నెలకొల్పిన డొల్ల సంస్థ ‘ఐఎన్‌ఎక్స్ మీడియా’. ఈ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా విదేశీయ నిధులను పొందడానికి చిదంబరం ఆర్థికమంత్రిగా ఉండిన సమయంలో అనుమతి లభించింది. ఈ అనుమతి ‘విదేశీయ సంస్థల పెట్టుబడుల ప్రగతి పర్యవేక్షక మండలి’- ఫారిన్ ఇనె్వస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్- ఎఫ్‌ఐపిబి-లో చిదంబరం నిర్వహించిన అక్రమాలలో ఒకటి మాత్రమే కావచ్చు. ‘ఐఎన్‌ఎక్స్’ సంస్థకు విదేశీయ నిధుల అనుమతిని సమకూర్చి పెట్టినందుకు చిదంబరం కుమారుడు కార్తి భారీగా లంచం తీసుకున్నాడట. చిదంబరం ఈ మొత్తం వ్యవహారంలో ‘‘కీలక పాత్రధారి’’ అని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం తీవ్రమైన అభిశంసన. న్యాయస్థానం వ్యాఖ్యను విన్నవెంటనే చిదంబరం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి న్యాయస్థానంలో లొంగిపోయి ఉండాలి! కానీ నిర్లజ్జకు తాను సజీవ రూపమని చిదంబరం ఇలా నిరూపించాడు. అధికారుల కంట పడకుండా పారిపోతున్నాడు.. చిదంబరం ప్రతీక మాత్రమే. 1993లో మొదలైన వాణిజ్య ‘ప్రపంచీకరణ’లో నిహితమై ఉన్న భయంకరమైన అవినీతి అసలు ప్రమాదం. డొల్ల సంస్థలు, నకిలీ సంస్థలు, రాజకీయ దళారీలు, అక్రమ వాణిజ్య అనుసంధానాలు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు బంగారు జింకల వలె దేశమంతటా విశృంఖల విహారం చేస్తుండడం ప్రపంచీకరణ మాయ.