ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అడ్డగోలు నిరసనలతో అదుపు తప్పిన ‘సభ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు ఉభయ సభలు రౌడీ రాజకీయానికి గురికావడం సిగ్గుచేటు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించటంతో జనవరి 29న ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి విడత భేటీ శుక్రవారం వరకు జరిగింది. బడ్జెట్ మలివిడత సమావేశాలు మార్చి ఐదు నుండి ఏప్రిల్ ఆరో తేదీ వరకు జరుగుతాయి. ఉభయ సభల్లో తొలి విడత సమావేశాలు ఐదు రోజులూ గందరగోళంలో జరిగాయి. బడ్జెట్ సమావేశాల్లో భాజపా, దాని మిత్రపక్షమైన తెలుగుదేశం, తటస్థంగా ఉంటే వైకాపా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన వామపక్షాలు రౌడీ రాజకీయానికి పాల్పడ్డాయి. ముఖ్యంగా తెలుగుదేశం సభ్యుల రౌడీ రాజకీయం ఈసారి పరాకాష్ఠకు చేరుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి ఒకటో తేదీన లోక్‌సభలో ప్రతిపాదించిన 2018-19 వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ తెలుగుదేశం సభ్యులు ఫిబ్రవరి రెండో తేదీ నుండి ఉభయ సభలను స్తంభింపజేస్తూ రౌడీ రాజకీయానికి తెరలేపారు. వారు లోక్‌సభలో స్పీకర్ పోడియం వద్ద నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. తెదేపా సభ్యుడు శివప్రసాద్ ఒక రోజు చిడతలతో దర్శనమిస్తే మరో రోజు డమరుకంతో సభకు వచ్చి గొడవ చేశారు. ఆఖరి రోజున ఆయన ఏకంగా పోతరాజు వేషధారణలో వచ్చి సభ పరువు తీశారు. శివప్రసాద్ అంతకు ముందు రోజు లోక్‌సభ కార్యాలయంలో సిబ్బంది టేబుల్ పై నుండి పుస్తకాలు తీసుకుని బైటికి వెళ్లిపోయారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలంటూ అప్రజాస్వామిక పద్ధతిలో ఆయన వ్యవహరించారు.
సభలో గొడవ చేస్తేనే ఏపీ ప్రయోజనాలు రక్షింపబడతాయా? రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు తెదేపా అధినాయకత్వం వద్ద మరో దారి లేదా? మరో వ్యూహం కనిపించటం లేదా? ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంటూ కేంద్ర మంత్రిమండలిలో పదవులు అనుభవిస్తూ తెదేపా వారు సభలను స్తంభింపజేయడంలో అర్థం ఏమిటి? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే తెదేపా ఎన్‌డీఏ నుంచి తప్పుకోవాలి, ఆ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులూ రాజీనామా చేయాలి. అలా చేయకుండా పార్లమెంటులో గొడవ చేయటం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఐదు రోజుల పాటు ఉభయ సభల్లో గొడవ చేసినా వారు సాధించిందేమిటి? ఇంత జరిగినా, నాబార్డ్ ద్వారా రుణ సౌకర్యం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని జైట్లీ హామీ ఇవ్వటం మినహా ఇతర ప్రయోజనమేదీ సాధ్యం కాలేదు. బడ్జెట్ లోటు భర్తీ విషయంలో కూడా ఆర్థిక మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఓ వైపు గొడవ చేస్తూనే మరో పక్క భాజపా అధినాయకత్వంతో తెదేపా వారు చర్చలు జరపటం విచిత్రం. భాజపా నుంచి ఎలాంటి ఆహ్వానం లేకున్నా, చర్చను తెదేపా నేతలే కొరుకోవటం ఏ లక్ష్యసాధన కోసం? పోడియం వద్ద నిలబడిన తెదేపా ఎంపీలు ప్లకార్డులను ఇతర విపక్ష సభ్యులకు అడ్డంగా పెట్టటం కూడా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకేనా? కెమెరాలో పడేలా ప్లకార్డులను అన్ని వైపులా తిప్పడం సంస్కారమా? లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగానికి అడ్డుతగులుతూ ఆయన టీవీలో కనిపించకుండా చూసేందుకు ప్లకార్డులను అడ్డం పెట్టిన తెదేపా సభ్యులు రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించినపుడు ఎందుకు అడ్డుతగలలేదు? బడ్జెట్‌పై చర్చకు బదులిచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగానికి వారు అడ్డుతగిలి ఉండాల్సింది. సభలో తెదేపా ఎంపీలు అధికార పక్షం పట్ల ఒకలా, విపక్షం పట్ల మరో విధంగా ప్రవర్తించారు.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తి నుండి దృష్టి మళ్లించేందుకు తెదేపా నాయకత్వం పార్లమెంటులో గొడవ చేయించిందా? జైట్లీ ఉభయ సభల్లో చేసిన ప్రకటనల ప్రకారం- ఏపీకి మరో ఐదారు వేల కోట్ల కంటే ఎక్కువ ఆర్థిక సహాయం చేసే సూచనలు కనిపించటం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిరంతరం ఆర్థిక సహాయం ఉంటుందని చెబుతున్నా అది నియమ,నిబంధనలకు లోబడే అనేది సుస్పష్టం. తెదేపా నాయకత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే పార్లమెంటును స్తంభింపజేసిందనే వాదనకు బలం చేకూరుతోంది.
2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్‌డీఏ నుండి తప్పుకునేందుకు అవసరమైన ప్రాతిపదికను సిద్ధం చేసుకునేందుకు తెలుగుదేశం అధినాయకత్వం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో గొడవ చేయటం ద్వారా శ్రీకారం చుట్టిందని చెప్పకతప్పదు. మల్లికార్జున ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకున్న తెదేపా ఎంపీలను వారించని అధికార పక్షం- మోదీ ప్రసంగానికి అడ్డుతగలకూడదని అనడం పక్షపాత వైఖరికి ప్రతీక. ఏపీ ప్రయోజనాలను పరిరక్షిస్తామంటూ జైట్లీ లోక్‌సభలో మొదట చేసిన ప్రకటన ఒక గంట ముందు వస్తే బాగుండేది. దానివల్ల ఖర్గే ప్రసంగానికి తెదేపా సభ్యులు అడ్డుతగిలేవారు కాదు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఖర్గే ప్రసంగిస్తున్నప్పుడు తెదేపా సభ్యులను మోదీ నివారించి ఉంటే ఆయన ప్రతిష్ట పెరిగేది. కానీ ఆయన అలా వ్యవహరించలేదు. అందుకే కాంగ్రెస్ సభ్యులు దాదాపు గంటన్నర పాటు మోదీ ప్రసగానికి అడ్డుతగిలారు. భాజపా ఇందుకు ప్రతిగా రాజ్యసభలో సీనియర్ నాయకుడు పి.చిదంబరం ప్రసంగిస్తుండగా అడ్డుతగిలారు. బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల్లోనూ భాజపా దురుసుగా వ్యవహరించిందని చెప్పకతప్పదు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్- ‘లోక్‌సభలో మోదీ ప్రసంగానికి కాంగ్రెస్ అడ్డుతగిలినందుకు భాజపా సభ్యులు చాలా కోపంతో ఉన్నారు, అందుకే వారు చిదంబరం ప్రంసగానికి అడ్డుతగులుతున్నార’ని బాహాటంగా చెప్పారు. సమావేశాలు సజావుగా సాగేందుకు కృషి చేయవలసిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఇలా మాట్లాడటం ఎంత మాత్రం సబబు కాదు. తమ సభ్యుల గొడవ మధ్యనే చిదంబరం ప్రసంగాన్ని కొనసాగించాలని అనంతకుమార్ సూచించటం బి.జె.పి దురుసుతనానికి నిదర్శనం. బి.జె.పి, తెలుగుదేశం, కాంగ్రెస్ తదితర పార్టీలు బడ్జెట్ సమావేశాల్లో తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాయే తప్ప దేశం, రాష్ట్రాల ప్రయోజనాల కోసం పని చేయలేదు. ఎవరికి వారు పోటీ రాజకీయాలు నిర్వహించటం ద్వారా ఉభయ సభల సమయాన్ని దారుణంగా వృథా చేశారు. ప్రతిపక్షం కొంత దుందుడుకుగా వ్యవహరించినా, అధికార పక్షం బాధ్యతతో వ్యవహరించినప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యకరంగా ముందుకు సాగుతుంది. దీనికి విరుద్ధంగా జరిగితే అది మరింత బలహీనమైపోతుంది. ప్రభుత్వం చేసే తప్పొప్పులను ఎత్తిచూపించేందుకు ప్రతిపక్షం కొంత దుందుడుకుగా వ్యవహరించినా రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాన మంత్రి సమాధానం ఇస్తునప్పుడు కాంగ్రెస్ అడ్డుతగిలి ఉండాల్సింది కాదు. ఇరుపక్షాలు కూడా కక్ష సాధింపు విధానానికి పెట్టపీట వేయం వలన పార్లమంటుకు హాని జరిగింది. రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వటంతో ఏడు పని దినాల పాటు కొనసాగిన బడ్జెట్ సమావేశాలు గొడవ, గందరగోళంలో కొట్టుకుపోవటం దురదృష్టకరం.
మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని అదుపు చేయలేకపోయినందుకు బి.జె.పి అధినాయకత్వం సిగ్గుపడాలి. ఇదిలా ఉంటే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కఠినంగా వ్యవహరించకపోవటం ఆశ్చర్యకరం. తెలుగుదేశం సభ్యులు స్పీకర్ ముఖానికి అడ్డంగా ప్లకార్డులు పెట్టటం ప్రజాస్వామ్యానికి పడుతున్న దుర్గతికి అద్దం పట్టింది. పోడియం వద్ద పూనకం వచ్చినట్లు వ్యవహించటం, డమరుకం, చిడతలు వాయిస్తూ పిల్లికూతలు కూసిన టి.డి.పి సభ్యులపై సుమిత్రా మహాజన్ ఎలాంటి చర్య తీసుకోకపోవటం ఆశ్చర్యకరం. రాజ్యసభలో ప్లకార్డులు ప్రదర్శించిన కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, టి.డి.పి సభ్యుడు సి.ఎం.రమేష్‌ను చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, డిప్యూటీ చైర్మన్ కురియన్ సభ నుండి బయటకు పంపారు. అయితే, లోక్‌సభ స్పీకర్ ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోయారు?

కె కైలాష్