ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పార్లమెంటుకు పట్టని జనం పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటు ఉభయసభల్లో అర్థవంతమైన చర్చ జరిపి పరిష్కార మార్గాలను సూచించటంలో అధికార, ప్రతిపక్షాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇరుపక్షాలు ఈ వ్యవహారాన్ని తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాయే తప్ప ప్రజల ఇబ్బందులు, వాటి నివారణకు అనుసరించవలసిన మార్గాలపై దృష్టి కేంద్రీకరించలేకపోయాయి. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవలసిన ప్రతిపక్షం తమ రాజకీయ వాదన వినిపించింది. అధికార పక్షం తమ గొప్పలు చెప్పుకున్నది తప్ప వాస్తవానికి ప్రజలేమనుకుంటున్నారు? అని ఆలోచించడం లేదు. జనం ఇబ్బందులను తొలగించేందుకు ఏం చేయాలనే అంశాన్ని అధికార, ప్రతిపక్షాలు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మొదటి మూడు రోజులు పెద్దనోట్ల రద్దుపై ఇరుపక్షాలు సృష్టించిన గందరగోళంలో కొట్టుకుపోవటం శోచనీయం.
పాకిస్తాన్ ఉగ్రవాదులు ఊరీ సైనిక శిబిరంపై జరిపిన దాడిలో మరణించిన మన సైనికుల సంఖ్య కంటే నోట్ల కోసం ‘క్యూ’లో నిలబడి మరణించిన వారి సంఖ్య అధికంగా ఉందంటూ ప్రధాన ప్రతిపక్షం బాధ్యతారహితంగా మాట్లాడితే, నోట్ల రద్దుతో సగటు మనిషి కంటి నిద్రా కునుకుతీస్తున్నాడంటూ అధికార పక్షం గోబెల్స్ ప్రచారం చేసుకున్నది. అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేయటం అనివార్యం గనుక ఈ అంశంపై ఉభయపక్షలూ సమన్వయంతో పనిచేసి ఉండాల్సింది. ఉభయ సభల్లో పరస్పరం బురద చల్లుకునే బదులు బ్యాంకుల వద్ద కష్టాలు పడుతున్న ప్రజలకు సాంత్వన కలిగించేందుకు తాము ఏం చేస్తే బాగుంటుందనే అంశంపై చర్చ జరిపితే బాగుండేది. కానీ అలా జరగలేదు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభనైన మొదటి రోజే రాజ్యసభలో పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజల సమస్యలపై వాయిదా తీర్మానం చేపట్టి చర్చ జరిపినా సాధించింది మాత్రం శూన్యం. సామాన్య ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కడిగిపారేశాయి. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల స్థానంలో కొత్తనోట్లను వెంటనే పంపిణీ చేసేలా ఎందుకు ఏర్పాట్లు చేయలేదంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. పెద్దనోట్లను రద్దు చేయటం తమకు ఎంత మాత్రం ఇష్టం లేకున్నా, ఆ విషయాన్ని ప్రతిపక్షాలు బాహాటంగా చెప్పుకోలేకపోయాయి.
ప్రధాని మోదీ నిర్ణయాన్ని వ్యతరేకించటం అంటే అవినీతిని, నల్లధనాన్ని సమర్థించినట్లే అవుతుంది. అందుకే ప్రతిపక్షాలు పెద్దనోట్ల రద్దును సమర్థిస్తూనే, ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయలేదంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి తప్ప ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఎలాంటి సూచనలు చేయలేకపోయాయి. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏం చేస్తే బాగుంటుందనేది ప్రభుత్వానికి విపక్షం సూచిస్తే బాగుండేది. ప్రభుత్వాన్ని నిందించినంత మాత్రాన ప్రజల ఇబ్బందులు తొలగిపోవు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేసే బదులు అర్థవంతమై సూచనలు, సలహాలు చేస్తే బాగుండేది. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి ఎంత మాత్రం తగ్గవని ప్రతిపక్షాలు ఉభయ సభల్లో వాదించాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ప్రతిపక్షాలు వాదించాయి తప్ప, నల్లధనం నివారణకు అనుసరించవలసిన విధానాన్ని ప్రతిపక్షాలు సూచించలేకపోయాయి. బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడిన ప్రజల వద్దకు వెళ్లి వారికి ఉపశమనం కలిగించేందుకు ప్రతిపక్ష నేతలు ప్రయత్నించి ఉంటే బాగుండేది. ప్రభుత్వాన్ని విమర్శించటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందేలా ప్రయత్నించాయి తప్ప ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు అవసరమైన చర్యలను సూచించలేదు.
దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల సంఖ్య పదహారు లక్షలు కాగా ఇందులో ఐదు వందల, వెయ్యి రూపాయల నోట్ల సంఖ్య దాదాపు ఎనభై ఐదు శాతం. ప్రభుత్వం నిర్ణయంతో దాదాపు 14 లక్షల నోట్లు చెల్లకుండా పోయాయి. దీనివల్ల నల్లధనం కలిగి ఉన్న వారికి, అవినీతిపరులకు ఏ మేరకు నష్టం కలిగిందనేది చెప్పడం సాధ్యం కాదు. కానీ సగటు మనిషి మాత్రం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. ఇక నిర్లక్ష్యరాస్యుల సమస్యలు వర్ణనాతీతం. వీరిని ఆదుకునేందుకు అధికార, విపక్ష నేతలు ఎలాంటి సూచనలు,సలహాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజల వద్దకు వెళ్లినా అది తమ రాజకీయ ప్రయోజనాల కోసం, మీడియాలో ప్రచారానికే తప్ప సగటు మనిషి ఇబ్బందులను తగ్గించేందుకు కాదు. ప్రతిపక్షం నిర్వాకం ఇలా ఉంటే అధికార పక్షం కూడా పెద్దనోట్ల రద్దును తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నించటం సిగ్గుచేటు. పెద్దనోట్ల రద్దు తరువాత రెండో రోజు నుండి ఎటిఎంలు పనిచేస్తాయని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ తన మాటను నిలబెట్టుకోలేకపోయారు. పెద్దనోట్ల రద్దు అమలులోకి వచ్చి 13 రోజులు కావస్తున్నా అధికశాతం ఎటిఎంలు పనిచేయడం లేదు. ప్రజలు తమ డబ్బు తాము తీసుకునేందుకు కిలోమీటర్ల మేరకు క్యూలో నిలబడవలసి వస్తోంది. డబ్బు కోసం క్యూలో నిలబడి మరణించిన వారి సంఖ్య ఎనభై దాటింది. ఇంతమంది మరణించటం అత్యంత విషాదకరమైన అంశం.
మరోవైపు గ్రామీణ ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతం. ప్రభుత్వం దృష్టి పూర్తిగా ఐదు మెట్రోపాలిటిన్ నగరాలతోపాటు కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో డబ్బు పంపిణీ సక్రమంగా జరిగేలా చూడటంపై కేంద్రీకృతమైందే తప్ప గ్రామీణ జనం అగచాట్లను పట్టించుకోవడం లేదు. అధికార పక్షం ఈ వాస్తవాలను ఉభయ సభల్లో అంగీకరించి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏం చేస్తోందనేది వివరించి ఉంటే బాగుండేది. ‘మోదీ నిర్ణయన్ని దేశ ప్రజలంతా సమర్థిస్తున్నారు, కంటి నిండా నిద్ర పోతున్నారం’టూ కొందరు మంత్రులు గోబెల్స్ ప్రచారం చేసేందుకు ప్రయత్నించటం శోచనీయం. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంతో మంచిది, ఎంతో ధైర్యంతో తీసుకున్న నిర్ణయం. దీనిని నిజాయితీపరులెవ్వరూ వ్యతిరేకించరు. అయితే- సగటు మనిషికి ఎదురైన ఇబ్బందులను తొలగించటంలో అధికార పక్షం విఫలమైందనేది కాదనలేని నిజం.

కె. కైలాష్