ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విపక్షంలో ప్రధాని అభ్యర్థి ఎవరు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకముందే విపక్ష శిబిరంలో ప్రధాని అభ్యర్థి ఎవరన్న అంశంపై రాజకీయం ఊపందుకుంది. ఆఖరి విడత పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని అభ్యర్థిత్వంపై విపక్ష పార్టీల్లో తెరవెనక చర్చలు ప్రారంభమయ్యాయి. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకి లోక్‌సభలో మెజారిటీ రాదన్న నమ్మకంతో ప్రతిపక్షాలు ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పటికే దృష్టి సారించాయి. ఎన్డీఏకి మెజారిటీ లభిస్తే మోదీ రెండోసారి ప్రధాని పదవిని చేపడతారనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. మోదీ పట్ల భాజపా సహా ఎన్డీఏ మిత్రపక్షాల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఆయనే ప్రధాని పదవిని చేపట్టే అవకాశాలు ఎక్కువ. విపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే ప్రధాని ఎవరన్నది ప్రశ్నార్థకమే.
జమ్మూ కశ్మీర్‌లో పుల్వామా దాడికి ప్రతీకారంగా మన సైనికులు బాలాకోట్ (పాకిస్తాన్) లోని జైషే మహమ్మద్ స్థావరాలపై జరిపిన దాడికి వోటర్లు సానుకూలంగా స్పందిస్తే- ఎన్డీఏకు దాదాపు 300 ఎంపీ సీట్లు రావచ్చన్నది ఓ అంచనా. ‘బాలాకోట్’ ప్రభావం లేని పక్షంలో ఎన్డీఏకు 240 వరకు సీట్లు లభించవచ్చు. బిజూ జనతాదళ్ సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని భాజపా కలలు కంటోంది. అయితే, భాజపా వేస్తున్న లెక్కలతో విపక్షాలు ఏకీభవించటం లేదు. ‘హంగ్’ లోక్‌సభ ఏర్పడటం ఖాయం, ఎన్డీఏకు పరాభవం తథ్యం అనే విశ్వాసంతో ఉన్న విపక్ష పార్టీలు ఇప్పటికే ప్రధాని ఎవరన్న అంశంపై దృష్టి సారించాయి. ‘హంగ్’ అనివార్యమైతే- మోదీ చెబుతున్నట్టు ‘మహా మిలావట్’ (మహాకల్తీ) ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. విపక్షంలో ఏయే పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే అంశం ఇపుడు ఢిల్లీ రాజకీయాల్లో చర్చగా మారింది.
ప్రతిపక్షంలో మూడు అధికార కేంద్రాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఒక కూటమి ఏర్పడితే, ఎస్పీ-బీఎస్పీ- తృణమూల్ కాంగ్రెస్ కలయికతో రెండో కూటమి ఏర్పడే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రెండు కూటములను కలిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ప్రంట్‌లో వైకాపా, వామపక్షాలు, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు భాగస్వాములు కావచ్చు. కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలితే ముఖ్యమంత్రి కుమారస్వామి ఫెడరల్ ఫ్రం ట్‌లో చేరే అవకాశం ఉంది.
కాంగ్రెస్ కూటమి అధికారం చేపడితే రాహుల్ గాం ధీ ప్రధాని పదవిని దక్కించుకొనే అవకాశం ఉంది. అ యితే, యూపీఏకి ఎన్ని సీట్లు లభిస్తాయనేది కీలకం కా నుంది. కాంగ్రెస్ తనంత తానుగా ఎనభై ఐదు కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోలేదని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. రాహుల్ అమేథీలో ఓడిపోతే అతను ప్రధాని పదవికి పోటీ పడటం కష్టమైపోతుంది. ప్రధాని పదవికి రాహుల్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు, డీఎంకే అధినేత స్టాలిన్, ఆర్‌జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్, జేడీఎస్ అధినాయకుడు, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ సమర్థిస్తున్నారు. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం పతనమైతే దేవెగౌడ ఎవరికి మద్దతు ఇస్తారనేది వేచి చూడాలి. ఎనభై లోక్‌సభ సీట్లున్న ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాడుతోంది. కాంగ్రెస్‌కు 140 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు లభిస్తేనే రాహుల్‌కు ప్రధాని రేసులో నిలిచే ఛాన్స్ వస్తుంది. ఇది జరగని పక్షంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ లాంటి సీనియర్ నేతను ప్రధాన మంత్రి పదవికి పోటీలో నిలబెట్టే వీలుంది. ఇందుకు పవార్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సి ఉంటుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో పని చేయడం ఇష్టం లేకనే శరద్ పవార్ సొంతంగా పార్టీని పెట్టుకోవడం తెలిసిందే. ఇప్పుడాయన ప్రధాని పదవి కోసం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? తన అస్తిత్వాన్ని దెబ్బతీసుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే.
మరోవైపు బిఎస్పీ అధినేత్రి మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కూడా ప్రధాని పదవిపై దృష్టి కేంద్రీకరించారు. అన్నీ కలిసివస్తే తాను లోక్‌సభకు పోటీ చేయవలసి వస్తుందంటూ మాయావతి ఇటీవల నర్మగర్భమైన ప్రకటన చేశారు. ఆమె ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ప్రధాని పదవిని చేపట్టిన పక్షంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ నియోజకవర్గం నుంచి ఉపఎన్నిక ద్వారా గెలవాలని ఆమె భావిస్తున్నారు. ప్రధాని పదవికి ఆమె అభ్యర్థిత్వాన్ని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గట్టిగా సమర్థిస్తున్నారు. యూపీలోని 80 సీట్లలో కనీసం యాభై సీట్లు దక్కించుకొనేందుకు ఎస్పీ-బీఎస్పీ కూటమి ప్రయత్నిస్తోంది. తమ కూటమికి 50 సీట్లు దక్కితే ప్రధా ని పీఠం తనదేనని మాయావతి ఆశపడుతున్నారు. ఈ కూటమి మద్దతు లేకుండా ప్రతిపక్షాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు అసాధ్యం. ఇక, బెంగాల్‌లోని నలభై రెండు ఎంపీ సీట్లలో కనీసం 35 స్థానాలను తాము గెలవడం ఖాయమని మమత భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో 19 సీట్లు గెలుచుకున్న తృణమూల్ కాంగ్రెస్ 2014లో 34 సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఈసారి 35 సీట్లు తృణమూల్ కాంగ్రెస్‌కు దక్కితే మమత మద్దతు లేకుండా విపక్షాలు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులభం కాదు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి 50 సీట్లు సాధిస్తే- బెంగాల్‌లో ఒక్క తృణమూల్ కాంగ్రెస్ 35 సీట్లు దక్కించుకొంటే- మమతకే ప్రధాని పదవి దక్కాలని ఆమె అభిమానులు వాదిస్తున్నారు.
కేంద్రంలో కాంగ్రెసేతర, భాజపాయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ తపన. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెరాస, వైకపా కలసి కనీసం 35 సీట్లు గెలుచుకుంటే- సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో తెరాస అధినేత కూడా కీలకం కానున్నారు. ఏపీలో తెదేపా అధిక స్థానాలు గెలిస్తే చంద్రబాబు కూడా ప్రముఖ పాత్ర వహించే అవకాశం ఉంది. తెదేపా ఐదారు సీట్లకు పరిమితమైతే జాతీయ, ప్రాంతీయ రాజకీయాలకు చంద్రబాబు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ‘హంగ్’ లోక్‌సభ ఏర్పడితే సంకీర్ణ ప్రభుత్వం ఆవిర్భవించేందుకు రాహుల్, పవార్, మాయావతి, మమత, చంద్రబాబు కీలక పాత్ర నిర్వహిస్తారు. మూడు శిబిరాలుగా కనిపిస్తున్న విపక్షాల్లో ఎవరు ప్రధాని పదవి చేపడతారనేది అసలు విషయం. రాహుల్, మాయావతి, మమత, పవార్ వంటి నేతలు ప్రధాని పదవిని చేపట్టేందుకు సుముఖంగా ఉన్నా- సొంతంగా ఎక్కువ సీట్లను సాధించవలసి ఉంది. కర్నాటకలో జేడీఎస్ పార్టీ తక్కువ సీట్లను గెలిచినా కుమారస్వామి ముఖ్యమంత్రి అయినట్టు- సొంత బలం లేని నేతను ప్రధానిగా ఎంపిక చేస్తే దేశం పరువుదిగజారుతుంది. ఇలాంటి ప్రయత్నం జరిగితే- సంకీర్ణ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగా మారి, కేంద్రంలో రాజకీయ అస్థిరత్వం చోటు చేసుకుంటుంది. యూపీఏ హయాంలో వలే జాతీయ, ప్రాంతీయ పార్టీలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడే ప్రమాదం ఉన్నది. ఫలితంగా అభివృద్ధి కుంటుపడటంతోపాటు దేశ భద్రత, సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది. సంకీర్ణ ప్రభుత్వం పతనమైతే సమీప భవిష్యత్తులో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు.
*

-కె.కైలాష్ 98115 73262