ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారనేది నానుడి. ఆగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో ముడుపులు పుచ్చుకున్న మన ఇంటి దొంగల్ని కూడా నానుడిలో చెప్పినట్లు పట్టుకోలేమా? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఇంటి దొంగల్ని వీలున్నంత త్వరగాపట్టుకుని నానుడి ఎల్లవేళలా నిజం కాదనేది నిరూపించగలుగుతారా? ఎందుకంటే ఇటలీలోని మిలాన్ నగరం కోర్టు హెలికాప్టర్ల కుంభకోణం నిందితులకు శిక్ష విధించింది. ముడుపులు ఇచ్చిన వారికి శిక్ష పడి పుచ్చుకున్న వారికి శిక్ష పడకపోతే మన దేశం పరువు ప్రతిష్ట మరింత దిగజారుతుంది. ఈ కుంభకోణం వెనక అప్పటి ప్రధాన మంత్రి కార్యాలయం, భారత వాయుదళం అధ్యక్షుడు, రక్షణ శాఖ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శితో పాటు కాంగ్రెస్‌కు చెందిన బడా నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రాష్టప్రతి, ప్రధాన మంత్రి, ఉపరాష్టప్రతి, రక్షణ శాఖ తదితర ముఖ్యమైన వ్యక్తుల ప్రయాణాల కోసం ఆగస్టా హెలికాప్టర్లు కొనుగోలు చేయాలనుకున్నారు. ఆరు వందల కోట్లకు లభించవలసిన పనె్నండు హెలికాప్టర్లను 3,600 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేసేందుకు సిద్ధమై దాదాపు 320 కోట్ల రూపాయల ముడుపులు పుచ్చుకున్నారు. అప్పటి వాయుసేనాధ్యక్షుడు త్యాగి కుటుంబానికి దాదాపు 80 కోట్ల రూపాయల ముడుపులు దొడ్డి దారిన ముట్టినట్లు మిలాన్ కోర్టు వెల్లడించింది. వాయుసేనాధ్యక్షుడితోపాటు రక్షణ శాఖ అప్పటి కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, నలుగురు సీనియర్ రాజకీయ నాయకులు ముడుపులు పుచ్చుకున్నట్లు మిలాన్ కోర్టు పత్రాలు సూచిస్తున్నాయి. ముడుపుల భాగోతం నడిపించిన మధ్యవర్తి క్రిష్టియన్ మైఖేల్ స్వదస్తూరీతో రాసిన పత్రాల ప్రకారం ముడుపులు పుచ్చుకున్న వారిలో ఏ.పి, ఏ.ఎఫ్, డి.ఎస్, జె.ఎస్, ఫ్యామిలీ ఉన్నట్లు తెలిసింది. ఏ.పి అంటే అహమద్ పటేల్ అంటే సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడు అని చెబుతున్నారు. అయితే అహమద్ పటేల్ మాత్రం తనకీ ముడుపులతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. నిరూపిస్తే రాజ్యసభకు రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. ఏ.ఎఫ్ అంటే ఏయిర్ ఫోర్స్ అని అంటే అప్పటి వాయుసేనాధ్యక్షుడు త్యాగి అని చెబుతున్నారు. త్యాగీని ప్రస్తుతం సి.బి.ఐ విచారిస్తోంది. డి.ఎస్ అంటే డిఫెన్స్ సెక్రటరీ అనీ, జె.ఎస్ జాయింట సెక్రెటరీ అని అంటున్నారు. ఇక ఫ్యామిలీ అంటే సోనియా గాంధీ ఫ్యామిలీ అని బి.జె.పి ఆరోపిస్తోంది.
సోనియా గాంధీ మాత్రం ఇలాంటి ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదంటూ ఏకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో రోడ్డెక్కారు. గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు ఉభయ సభను స్తంభింపజేస్తున్నారు. వచ్చే వారం కూడా పార్లమెంటును స్తంభింపజేయనున్నారు. విచిత్రం ఏమిటంటే ముడుపులు చెల్లించి హెలికాప్టర్లు అమ్ముకునేందుకు కుట్ర చేసిన ఇటలీకి చెందిన ఫిన్ మెకానికా సంస్థ సి.ఈ.ఓ జుస్పెప్పో ఓసీకి మిలాన్ కోర్టు నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఫిన్ మెకానికా నుండి హెలికాప్టర్లు తీసుకుని మనకు విక్రయించిన ఆగస్టా వెస్ట్‌లాండ్ సంస్థ చైర్మన్ బ్రూనో స్పెనిలీనీ కూడా ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. ముడుపుల రాయబారం నడిపి లంచాలు పంపిణీ చేసిన క్రిష్టయన్ మైఖేల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కానీ ముడుపులు పుచ్చుకున్న మన నాయకులు, అధికారులు, మధ్యవర్తులు మాత్రం హాయిగాతిరుగుతున్నారు.
రాష్టప్రతి, ప్రధాన మంత్రి తదితర అత్యంత ప్రముఖుల ప్రయాణం చేసేందుకు ఉద్దేశించిన హెలికాప్టర్ల కొనుగోలులో కూడా అవినీతికి పాల్పడ్డారంటే మన నాయకులు, అధికారులు ఎంతటి ఘనులో ఊహించుకోవచ్చు. హెలికాప్టర్ల కొనుగోలులో అవినీతి జరిగిందనేది అందరు అంగీకరించే సత్యం. అయితే ముడుపులు ఎవరికి ముట్టాయనే అంశంపై కొట్టుకు చస్తున్నారు. అవినీతికి పాల్పడినందుకు భయపడకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పార్లమెంటును స్తంభింపజేయటం కాంగ్రెస్‌కు ఎంత మాత్రం తగదు. హెలికాప్టర్ల విక్రయంలో ఫిన్ మెకానికా అవినీతికి పాల్పడిన విషయం వెలుగులోకి రాగానే అప్పుడు అధికారంలో ఉన్న యు.పి.ఏ ప్రభుత్వం వెంటనే దర్యాప్తుకు అదేశించి నిందితులపై చర్య తీసుకుంటే బాగుండేది. కానీ అలా చేయకుండా దాదాపు రెండు సంవత్సరాల పాటు తాత్సారం చేశారు.
అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, అప్పటి రక్షణ శాఖ మంత్రి ఏ.కె.ఆంటోని నిజాయితీ పరులనేది ఎంత నిజమో ముడుపులు ముట్టాయనేది కూడా అంతే నిజం. ముడుపులు ముట్టిన విషయాన్ని మన్మోహన్ సింగ్, అంటోని తదితరులందరు అంగీకరిస్తున్నప్పుడు ముడుపులు పుచ్చుకున్న వారిని శిక్షించవలసిన అవసరం చాలా ఉన్నది. వాయుసేనాధ్యక్షుడే అవినీతికి పాల్పడుతుంటే అప్పటి ప్రదాన మంత్రి, రక్షణ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్లు ? ముడుపుల భాగోతం వెనక ఒక అదృశ్య హస్తం ఉన్నదంటూ ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరిక్కర్ చేసిన వ్యాఖ్యల వెనక ఉన్న అర్థం ఏమిటి? ఎవరీ ఆదృశ్య శక్తి? గతంలో బోఫోర్సు కుంభకోణంపై జరిపిన దర్యాప్తులోనిందితులు ఎవరనేది ఇంత వరకు వెలుగు చూడలేదు. అగుస్టా హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తుకు కూడా అదే గతి పడుతుందా? అంటే లేదని కుండ బద్దల కొట్టినట్లు చెబుతున్నాడు పరిక్కర్. హెలికాప్టర్ల కుంభకోణం వెనక ఉన్న నిందితులను బట్టబయిలు చేస్తామని చెబుతున్నారు. పరిక్కర్ తన మాట నిలబెట్టుకుంటారని ఆశించాలి. లేకపోతే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనేది మరోసారి నిజమవుతుంది.