సబ్ ఫీచర్

చెన్నై వరదలు నేర్పిన పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసెంబరు 2015 మొదటి వారంలో చెన్నై నగరం చిన్న ద్వీపంగా మారిపోయింది. అనూహ్యమైన వర్షాల కారణంగా అడయార్ నది పొంగింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. ఈ ప్రాకృతిక విపత్తుకు వెంటనే కేంద్రం స్పందించి సకాలంలో సహాయ సహకారాలు అందించింది. గత నూరు సంవత్సరాల కాలంలోను చెన్నై ఇలాంటి ఉపద్రవాన్ని చూచి ఎరుగదు.
ఐతే ఇటీవలి కాలంలో ఇలాంటి విపత్తులు కొన్ని జరిగాయి. మొదటిది ఉత్తరాఖండ్ వరదలు. అది పూర్తిగా మానవ తప్పిదమే. భారీగా అడవులను నిర్మూలించేసరికి భూమి తన పట్టును కోల్పోయి మెతకపడింది. దానివల్ల నష్టం జరిగింది. రెండవది బొంబాయి వరదలు. ఇది పశ్చిమ సముద్ర తీర నగరం. ఇక్కడి డ్రైనేజీ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. మూడవది నేపాల్ భూకంపం. దీనివల్ల కూడా అపారమైన నష్టం జరిగింది. నాల్గవది వేళాంగిని (తమిళనాడు) సునామీ. ఇవన్నీ ఇటీవల సంఘటనలే. 1977 ప్రాంతంలో దివిసీమ ఉప్పెనవలన జరిగిన జన నష్టం అపారం. కాశ్మీరు వరదలు కన్నీళ్లను మిగిల్చాయి. అలాగే కొయినా భూకంపం విషాదాన్ని మిగిల్చింది. రెండువందల సంవత్సరాలకు పూర్వం మచిలీపట్నం దీపావళినాడు అదృశ్యమయింది. తిరిగి నగర నిర్మాణం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగి వర్షాలకు సంబంధించిన హెచ్చరికలు ఇస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు ఆయా రాజకీయ పార్టీలు తప్పుమీదంటే మీది అని ఆడిపోసుకుంటున్నాయి. ఇది తగదు. ప్రకృతి విపత్తులను అధ్యయనంచేసి వాటికి పరిష్కారాలను కనుగొనాలి.
భారతదేశానికి మూడువైపులా సముద్రం ఉంది. దీనివలన లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది. సముద్ర జలాలు వ్యాపారానికి, సీఫుడ్స్‌కు ఉపయోగించుకుంటున్నారు. ఐతే సముద్ర తీరంలో మహానగరాల నిర్మాణం శ్రేయస్కరం కాదు. సింధూ నాగరికత అంతరించిపోవటానికి అది నదీ తీర సంస్కృతి కావటమే. అంటే మహానగరాలు మరో మొహంజొదారోలుగా మారకూడదు. చెన్నపట్టణం పూర్వం ఒక కుగ్రామం. అక్కడ జాలారిపల్లె ఉండేది. క్రమంగా అభివృద్ధి చెందింది. మద్రాసు ఈస్టిండియా కంపెనీవారి కాలంలో వ్యాపార కేంద్రమయింది. తెలుగువారి చలనచిత్ర పరిశ్రమ 1950వ దశకంలో మద్రాసులోనే విస్తరించింది. తర్వాత హైదరాబాదుకు తరలించారు. ఇప్పుడు విశాఖ దారి పట్టింది. విశాఖపట్టణానికి మాత్రం భవిష్యత్తులో ముంపు పొంచి ఉండదా? గత సంవత్సరం వచ్చిన తుఫాను నష్టంనుంచి విశాఖ ఇంకా కోలుకోలేదు. రెండవది కాలుష్య నివారణాచర్యలు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గాలేదు. నూరేండ్లనాడు మూడు లక్షల మందికోసం ఏర్పాటుచేసిన డ్రైనేజి నేడు కోటి మంది జనాభాగల చెన్నైకి సరిపోదు. హైదరాబాదు లేక్ సిటీగా పేరొందింది. ఇందులో 80 సరస్సులు ఉండేవి. నేడు అవన్నీ అదృశ్యమైనాయి. బతుకమ్మకుంట, నాగమయ్యకుంట, రామంతపురం చెరువు, మాసాబ్‌టాంక్ ఈ పేర్లనుబట్టే ఇవన్నీ ఒకప్పటి సరస్సులని తెలుస్తున్నది. జనాభా పెరుగుదల, పట్టణీకరణం- అనే రెండు కారణాలవలన ఇవన్నీ అదృశ్యమైనాయి. అలాగే మూడు లక్షల మందికోసం నిజాం కాలంలో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోటి మంది జనాభాగల హైదరాబాదు నగరంలో అభివృద్ధి చెందలేదు. చిన్న జల్లుకే నగరం చిత్తడిగా మారిపోతున్నది. ఎక్కడ చూచినా మురికి- మురుగు కాలువలే. మద్రాసు అడయార్ కాలువ వలె హైదరాబాదు హుస్సేన్‌సాగర్ చెరువు మారిపోయింది. నగరంలోని రకరకాల వ్యర్థాలు సాగర్‌లో కలిసిపోతున్నాయి. దానికి పరిష్కారం ఏమిటి? శాస్తజ్ఞ్రులు ఆలోచించాలి. మూడవ అంశం గ్రామీణ వ్యవస్థ దెబ్బతినటం. గ్రామాలు స్వయంసమృద్ధంగా లేకపోవటంవలన పల్లెలలో రాజులా బ్రతికిన వాడు నగరానకి వచ్చి కూలీగా మారిపోతున్నాడు. దీనిని నివారించాలంటే పట్టణీకరణం పట్ల జనులకు వ్యామోహం- అవసరం లేకుండా చేయాలి. ఇందుకు బృహత్ ప్రణాళికలు రూపొందింపవలసి ఉంది. నాల్గవది వికేంద్రీకరణ. బొంబాయి, కలకత్తా, చెన్నై, హైదరాబాదు నగరాలను వికేంద్రీకరిస్తే ఒత్తిడి మొత్తం ఈ నగరాల మీద పడదు.
హైదరాబాదులో మూసీనది ఉంది. దీనిని నది అనకూడదు పెద్ద మురికి కాలువ అంటే సరిపోతుంది. ఈ నది గట్టుమీద (నల్లకుంట) ఫీవర్ హాస్పటల్స్ వంటివి ఉన్నాయి. స్వచ్ఛ్భారత్ మాట అటుంచి కనీసం జన జీవనానికి కనీస రక్షణ కూడా లేని స్థితి ఏర్పడింది. నదులను కలుషితం చేయటంతోబాటు నదీ గర్భాలల్లో నివాసాలను ఏర్పాటుచేసుకోవటం ఎవరి తప్పు?? వరదలు ఆగినా అంటువ్యాధులు తర్వాత మొదలవుతాయి. వీటి నుండి రక్షణ ఏది??
తొలి అంచనాల ప్రకారం చెన్నై వరదలవలన ఆర్థిక నష్టం 15000 కోట్లు ఉన్నట్లు ఆర్థిక విభాగం తెలియజేసింది. మరి నగలు- నగదు- గృహోపకరణాలు ఇతర డాక్యుమెంట్లు వంటివి వేలాది కుటుంబాలవారు పోగొట్టుకున్నారు. ఈ నష్టం ఎంత? ఈ లెక్కలు తెలిస్తే పైన సూచించిన మొత్తం రెండింతలు లేదా మూడింతలు కూడా కావచ్చు. వందలాది మంది అటు తమిళనాడులోను ఇటు చిత్తూరు నెల్లూరు జిల్లాలల్లోనూ ప్రాణాలు కోల్పోయారు. ఒక శతాబ్దం తర్వాత చెన్నై వాకాడు, సూళ్లూరుపేట, దుగరాజపట్నం వంటివి సముద్రంలో కలిసిపోతాయని కొందరు అభిప్రాయపడ్డారు. షార్ వంటి అత్యంత ప్రాధాన్యంగలిగిన సంస్థలను సముద్ర తీరంలో ఉంచటం గూర్చి పునరాలోచన చేయవలసి ఉంది. అలాగే హైదరాబాదునుండి తరలిస్తున్న చలనచిత్ర పరిశ్రమను విశాఖ తీరంలోనో భీమునిపట్నంలోనో నెలకొల్పటం ముందుచూపు లేని చర్యగా అనుకోవలసి వస్తుంది.
మన పాలకులు ఉపభోగ్య నిర్మాణాల మీద చూపిన శ్రద్ధలో నూరు శాతం కూడా దేశభక్తి నిర్మాణం మీద చూపలేదు. వ్యక్తుల నిజస్వరూపాలు పరీక్షా సమయాలల్లో బయటపడుతాయి. వరదలో లక్షలాది ప్రజలు అల్లాడుతుంటే లీటరు పాలు వంద రూపాయలకు అమ్మారు. లీటరు నీళ్లు మూడింతల రేటు పలికింది. కిలోమీటరు దూరానికి ఒక ఆటోవాడు వెయ్యి రూపాయలు అడిగిన దృశ్యం టి.వి.లల్లో చూపించారు. దీనిని ఏమనాలి?! మానవునిలోని దానవుడు ఇలా బయటకువచ్చి సాటి మానవుణ్ణి దోచుకుంటున్నాడన్నమాట. అమ్మా కాంటీన్‌లు, లాప్‌టాప్‌లు కలర్ టీవిల పంపిణీల మీద చూపిన శ్రద్ధ వ్యక్తినిర్మాణం మీద మన రాజకీయ పార్టీలు చూపకపోవటం దురదృష్టం.
పరాయి వారి అనుభవం నుండి గుణపాఠం నేర్చుకునేవాడు ఉత్తముడు. స్వీయానుభవము నుండి పాఠం నేర్చుకునేవాడు మధ్యముడు. ఒకసారి అనుభవం కలిగినా బుద్ధిరానివాడు అధముడు. ఉత్తరాఖండ్, బొంబాయి, వేళాంగిని, నేపాల్, దివిసీమ వంటి ప్రకృతి బీభత్సాల తర్వాతకూడా మనవాళ్లు గుణపాఠాలు నేర్చుకోకపోవటం విచిత్రం!
చెన్నైలో దాదాపు 120 సెంటీమీటర్ల వర్షం పడింది. అంటే ఇది జలప్రళయం అని చెప్పవచ్చు. మూడు సెంటీమీటర్ల వానకే నేల చిత్తడిగా మారుతున్న హైదరాబాద్ నగర పాలక సంస్థ సత్వరమే చర్యలు తీసుకోకపోతే రాబోయే ప్రమాదాన్ని నివారించలేరు.
అంతేకాదు ప్రమాద సమయంలో రాహుల్‌గాంధీ చెన్నై వెళ్లి పార్టీ రాజకీయాలు మాట్లాడటం తగదు. అంతేకాదు తన తండ్రి వయస్సు వాడైన నారాయణస్వామి అనే సీనియర్ కాంగ్రెసు మంత్రి చేత చెప్పులు మోయించుకున్నాడు. ఇది అనౌచిత్యమేకాదు అహంకార పూరితం. వరదలూ, తుఫానులూ, భూకంపాలూ, జాతీయ విపత్తులుగా పరిగణించాలి. అమరావతి కాంక్రీట్ జంగిల్ కాబోతున్నది. కృష్ణానదికి వరదలు వస్తే అమరేశ్వరస్వామి దేవాలయంలోకి తరుచు నీళ్లు వస్తున్నాయి. దీనిని నగర నిర్మాతలు గమనించాలి.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్