ఆంధ్రప్రదేశ్‌

వాజపేయి రాజకీయ జీవితం నేటి నాయకులకు ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు
విజయనగరం , డిసెంబర్ 24: మాజీ ప్రధాని వాజ్‌పేయి రాజకీయ జీవితాన్ని నేటి నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఈనెల 25వ తేదీన వాజ్‌పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని విజయనగరంలో ఎలయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో మైస్టాంప్ పథకం కింద రూపొందించిన వాజ్‌పేయి తపాలా బిళ్లను గురువారం అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన వాజ్‌పేయి తొమ్మిదిసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారని తెలిపారు. అలాగే రెండుసార్లు మన దేశానికి ప్రధానిగా వ్యవహరించారని చెప్పారు. పారదర్శక పరిపాలనతో భారతీయులకు ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు బి శివప్రసాదరెడ్డి, ఎలయన్స్‌క్లబ్ రీజనల్ అధ్యక్షుడు ఎస్‌విఎన్ గురుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అదృశ్యమైన బాలిక దారుణహత్య
కుటుంబ కలహాలతో మేనమామ ఘాతుకం
దేవరాపల్లి, డిసెంబర్ 24: విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక దారుణహత్యకు గురయింది. దేవరాపల్లికి చెందిన ఏడేళ్ల బాలిక వేపాడ దివ్య రెండురోజుల క్రితం అపహరణకు గురయింది. గురువారం బాలిక మృతదేహం ఊరికి దూరంగా క్వారీలో బయటపడింది. బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. కుటుంబ కలహాలతో బాలిక మేనమామ గుణశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడయింది. వేపాడ ధనలక్ష్మి, మురుగన్‌లు కొనే్నళ్ల క్రితం జీవనోపాధి కోసం దేవరాపల్లి వచ్చి స్థానిక అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న దివ్వ (7) రెండు రోజుల క్రితం అదృశ్యమయింది. కుటుంబ సభ్యులు కలిసి చుట్టు పక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. బాలిక మేనమామ గుణశేఖర్ ఆమెను ద్విచక్ర వాహనంపై మంగళవారం రాత్రి ఊరికి దూరంగా కొండలవైపు తీసుకువెళ్లాడన్న విషయం స్థానికుల ద్వారా తెలియడంతో తల్లి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో గుణశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బాలికను హత్య చేసిన విషయం బయటపడింది. పోలీసులు గురువారం ఉదయం కొండల్లోని క్వారీలో వెతకగా బాలిక మృత దేహం బయటపడింది. కుటుంబ కలహాలతో బాలికను మేనమామ హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.

తూ.గో.లో కుటుంబం
ఆత్మహత్యాయత్నం
ఒకరు మృతి.. చావుబతుకుల మధ్య ఇద్దరు
రంపచోడవరం, డిసెంబర్ 24: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ముగ్గురు సభ్యుల కుటుంబం గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీరిలో ఒకరు మృతిచెందగా, మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చావుబతుతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. బట్టల షాపు వ్యాపారంపై జీవిస్తున్న గ్రామానికి చెందిన సమయంతుల శివశంకరరావు(50), భార్య లక్ష్మీపల్లవి (45), వికలాంగ కుమారుడు వీరబాబు (25) గురువారం ఉదయం శీతలపానీయంలో పురుగుల మందు కలిపి తాగారు. స్థానికులు గమనించి రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. వీరిలో శివశంకరరావు మృతిచెందగా, మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగావుంది. రంపచోడవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కలెక్టరేట్ ఉద్యోగి ఇళ్ల దందా!
నకిలీ పత్రాలతో వసూళ్లు ౄ అరెస్టుచేసిన పోలీసులు
కాకినాడ, డిసెంబర్ 24: ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇళ్లు ఇప్పిస్తానంటూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌కు చెందిన ఓ ఉద్యోగి పేదలకు గేలం వేశాడు. ఏకంగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పేరుతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, లోగోలు సృష్టించి వాటిని పేదలకు ఇచ్చి ఈ నయా దందాకు పాల్పడ్డాడు. గృహ నిర్మాణ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు రాజమండ్రి పోలీసులు నిందితుడిని అరెస్టుచేశారు. ఇందుకు సంబంధించి అధికార వర్గాలు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ కలెక్టరేట్‌లోని ఇ-సెక్షన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తాతారావు ఇటీవల రాజమండ్రి కేంద్రంగా పేదలకు ఇళ్లు మంజూరు చేయిస్తానంటూ దందా ప్రారంభించాడు. తనకు సొమ్ములిస్తే రాజమండ్రి అర్బన్ హౌసింగ్ పరిధిలో ప్రభుత్వం త్వరలో నిర్మిస్తోన్న ఇళ్లు మంజూరుచేయిస్తానని పేద వర్గాలను నమ్మబలికాడు. హైదరాబాద్ స్థాయిలో తనకున్న పలుకుబడితో ఇళ్ళ మంజూరు పత్రాలు ఇస్తున్నట్టు నమ్మించాడు. నకిలీ మంజూరు పత్రాలను హౌసింగ్ ఎండి సంతకం, లోగోలతో సహా సృష్టించి, పంపిణీచేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తూర్పు గోదావరి జిల్లా గృహ నిర్మాణ సంస్థ మేనేజర్ డి సెల్వరాజ్ జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు, రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన రాజమండ్రి ప్రకాశ్‌నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌చేశారు. కాగా ఈ దందాలో భాగంగా నిందితుడు తాతారావు ఎంతమంది వద్ద, ఎంత మొత్తంలో సొమ్ము సేకరించాడో తమకు సమాచారం లేదని గృహ నిర్మాణ శాఖ జిల్లా మేనేజర్ సెల్వరాజ్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. నిందితుడిని విధుల నుండి సస్పెండ్ చేయాల్సిందిగా కలెక్టర్‌ను కోరినట్టు చెప్పారు.