ఆంధ్రప్రదేశ్‌

ఫలించిన శిద్దా పోరాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: రాజధాని అవుతుందని ఆశించి, నిరాశచెందిన ప్రకాశం జిల్లా వాసులకు శుభవార్త. రాజధాని అవుతుందని భావించిన దొనకొండలో పదివేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకానుంది. దీనికోసం ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు బృందం అక్కడి కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. దీనితో జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు రెండేళ్ల నుంచి చేస్తున్న పోరాట ప్రయత్నం ఫలించినట్టయింది.
రాజధాని కావలసిన తమ జిల్లాకు అన్యాయం జరిగిందన్న భావనతో ప్రకాశం జిల్లా వాసులు ఉన్నందున, వారికి న్యాయం చేయడంతోపాటు, వెనుకబడిన ప్రాంతమయిన తమ జిల్లాకు ఉపాధినిచ్చే మెగా ప్రాజెక్టు ఒకటి ఇవ్వాలంటూ, శిద్దా గత రెండేళ్ల నుంచి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు పుష్కలంగా ఉన్నందున, వాటిని వినియోగంలోకి తీసుకువచ్చి, పెద్ద ప్రాజెక్టుతో యువతకు ఉపాధి కల్పించాలని, ఆయన బాబును సందర్భం వచ్చిన ప్రతిసారీ కోరుతూ వస్తున్నారు.
ఇటీవల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా.. జిల్లా ప్రజలంతాగుర్తుంచుకునే మేలు చేస్తామని, మాది చేతల ప్రభుత్వమని చెప్పారు. జిల్లాకు తమ పార్టీనే న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. తాజా నిర్ణయంతో లోకేష్ జిల్లా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టయింది. దీనితో మంత్రి శిద్దా రాఘవరావు గత రెండేళ్ల నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక పెద్ద ప్రాజెక్టు కల నెరవేరనున్నట్టయింది.కాగా, మానవ వనరులు, అటవీ సంపద పుష్కలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో పేదరికం కూడా అధికంగానే ఉంది. జిల్లాకు చెందిన కూలీలు తెలంగాణ, ఒడిషా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కూలీ పనిచేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాకు చెందిన నిరుద్యోగులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉద్యోగాల కోసం వలసలు వెళుతున్న పరిస్థితి కొనసాగుతోంది. అయితే దొనకొండలో రాజధాని నగరం వస్తోందని, శివరామకృష్ణన్ కమిటీ కూడా సిఫారసు చేసినందున, ఆమేరకు రాజధాని నగరం వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో జిల్లా వాసులు ఆశించారు.
ఆ మేరకు దొనకొండ ప్రాంతంలో పెట్టుబడి దారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనుగోలు చేశారు. చివరకు అమరావతికి రాజధాని నగరం వెళ్లడంతో నిరాశ చెందిన ప్రకాశం వాసులకు ఇప్పుడు 45 వేల మందికి ఉపాధి కల్పించే ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్కు రావడం సంతోషపరిచింది. మూడు దశల్లో 43,120 కోట్లు ప్రకాశం జిల్లాకు పెట్టుబడుల కింద రానున్నాయి. తొలి దశలో 10,106.2, రెండో విడత 12,127 కోట్లు, తుది విడతలో 314.148 కోట్ల రూపాయలు పెట్టుబడుల కింద రానున్నాయి. దీనితో ప్రత్యక్షంగా 45 వేల మంది, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి దొరికే అవకాశాలున్నాయని తెలియడంతో.. రాజధాని అవకాశం కోల్పోయిన తమకు ప్రభుత్వం ఈ రూపంలోనయినా మేలు చేసిందన్న సంతోషం వ్యక్తమవుతోంది.