ఆంధ్రప్రదేశ్‌

రగులుతున్న తూర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 13: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. ముద్రగడ నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకోగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు ధర్నాలు, రాస్తారోకోలతో కదంతొక్కారు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్టు అమల్లో ఉన్న నేపథ్యంలో ఏ విధమైన నిరసన ప్రదర్శనలు నిర్వహించరాదని పోలీసులు హెచ్చరించినప్పటికీ నిరసనకారులు వెనుకడుగు వేయడం లేదు. అంతేస్థాయిలో పోలీసులో ఉద్యమాలను అణిచివేస్తున్నారు. ప్రాంతాల వారీగా కాపు సామాజికవర్గ నేతలు సోమవారం పెద్ద ఎత్తున ధర్నాలకు దిగారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవిప్రకాష్ స్వయంగా రాస్తారోకో, ధర్నాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లారు. జిల్లాలోని కరప మండల కేంద్రంలో ధర్నాలో పాల్గొన్న ఆందోళనకారులను ఎస్పీ రవిప్రకాష్ పర్యవేక్షణలో పోలీసులు అరెస్ట్‌చేశారు. ముద్రగడ పద్మనాభం దీక్షకు మద్దతుగా కరపలో నిరసనకారులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కిశోర్ ఆధ్వర్యంలో ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఈ సంఘటనలో 17 మందిని అదుపులోకి తీసుకుని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో తూర్పు గోదావరి జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు కుమారుడు జ్యోతికుమార్ ఉన్నారు. ఎస్పీ రవిప్రకాష్ స్వయంగా జ్యోతికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారుల్లో నలుగురిని కరప తహశీల్దారు కార్యాలయంలో బైండోవర్ చేశారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ ప్రధాన రహదారిపై ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దొంతమూరు, వెల్దుర్తి తదితర గ్రామాలకు చెందిన ఆందోళనకారులు వేల సంఖ్యలో జాతీయ రహదారిపై బైఠాయించారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. విషయం తెలుసుకున్న సాయుధ బలగాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, లాఠీఛార్జీ చేసి చెదరగొట్టాయి. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో ఉద్రిక్త్ర పరిస్థితులు కొనసాగుతున్నాయి. గ్రామంలోని ఏనుగుల వీధిలో కాపు నేతలు రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తుండగా పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో నిరసనకారులు చెల్లాచెదురయ్యారు. ఈ గ్రామంలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. ముద్రగడ ఆసుపత్రి నుండి తిరిగివచ్చేవరకు గ్రామంలో ఏ ఒక్క దుకాణం తెరవకుండా సంపూర్ణ బంద్ పాటించాలని నిర్ణయించారు. ఈ గ్రామంలో సుమారు నాలుగు వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. కిర్లంపూడి-దివిలి మధ్య రహదారిలో సాయుధ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు, గొల్లప్రోలు, యు కొత్తపల్లి, కొండెవరం, మల్లవరం, దొంతమూరు, కాకినాడ రూరల్ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

చిత్రం రాజమహేంద్రవరంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న అర్బన్ ఎస్పీ రాజకుమారి ..కరపలో కాపు నేతల అరెస్టులు