ఆంధ్రప్రదేశ్‌

ఆన్‌లైన్ వ్యాపారంలోకి జిసిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 2: రాష్ట్ర విభజన తరువాత ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వ్యాపారాన్ని పెంచుకుంటూ ఆదాయ లక్ష్యాలను సాధించడంలో గిరిజన సహకార సంస్థ (జిసిసి) ప్రత్యేకతను చాటుకుంటోంది. కేవలం అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారానే ఏడాదికి ఆర్జించే రూ.250 కోట్లతో సరిపెట్టకుండా అనేక రకాలైన వ్యాపారాలతో ఆర్థిక ప్రగతిని సాధించగలుగుతోంది. ఆదాయంతోపాటు, గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రెండు విధాలా ఫలితాలను సాధిస్తున్న జిసిసి ఇపుడు దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టగలుగుతోంది. అటవీ ఉత్పత్తులను ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా వ్యాపారం చేయడం, జిసిసి పెట్రోల్ బంక్‌ల నిర్వహణ, వీటికి అనుసంధానం చేస్తూ సూపర్‌బజార్ల నిర్వహణ, షాపింగ్‌మాల్స్ ద్వారా సంస్థ వ్యాపారాన్ని పెంచుకోగలుగుతోంది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో హెచ్‌పిసిఎల్ సహకారంతో 13 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే తొమ్మిది బంక్‌లను నిర్వహిస్తోంది. ఒక్కో పెట్రోల్ బంక్ కోసం కోటి రూపాయలు వెచ్చించగా ప్రతి బంక్ వద్ద దాదాపు పదిమంది గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించింది. విశాఖ జిల్లాలో హుకుంపేట, నర్సీపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో రంప చోడవరం, అడ్డతీగల తదితర ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కాగా, మరికొన్ని చోట్ల త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే వీటికి అనుసంధానం చేస్తూ ‘జిసిసి సూపర్‌బజార్ల’ను నిర్వహిస్తోంది. బంక్‌ల వద్దే సూపర్‌బజార్లు ఏర్పాటు చేసి వీటిలో అన్ని అటవీ ఉత్పత్తులను విరివిగా అమ్మకాలు సాగిస్తోంది. ముఖ్యంగా తేనె, వేసవి తాపాన్ని తీర్చే నన్నారి, బిల్వ షర్బత్‌లు, చింతపండు, వన మూలికలతో తయారైన పలు రకాలైన సబ్బులు, సుగంధాలు విక్రయిస్తోంది. ఐటిడిఏతో కలిసి కాఫీ ప్రాజెక్టును నిర్వహిస్తున్న జిసిసి రెండు వేల టన్నుల కాఫీ గింజలు సేకరించి దీనిని పౌడర్‌గా చేసి విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 40 శాతం మేర ఫలితాలను సాధించగలిగింది. ఈ ప్రాజెక్టు నిర్వహణలో గిరిజన నిరుద్యోగ యువతను భాగస్వాములు చేసింది. మరోపక్క గిరిజన రైతు సభ్యుల నుంచి మాత్రమే కాఫీ గింజలు సేకరిస్తోంది. ఈ విధంగా గిరిజనుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూనే మరోపక్క సంస్థ బలోపేతమవుతోంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విశాఖ కేంద్రంగా జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో ప్రత్యేక స్టాల్‌ను నిర్వహించిన జిసిసి దీని ద్వారా దేశ ప్రదాని నరేంద్రమోదీ, విదేశీ పారిశ్రామికవేత్తలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అరకు కాఫీ రుచి చూపించింది. దీంతో విశాఖ మన్యం కాఫీకి దేశీయ మార్కెట్‌లో విశిష్ట స్థానం లభించినట్టు అయ్యింది. గత ఆరు మాసాలుగా జిసిసి ఆన్‌లైన్ వ్యాపారంతోను, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉండే షాపింగ్ మాల్స్ ద్వారా అటవీ ఉత్పత్తుల వ్యాపారాన్ని పెంచుకోగలుగుతోంది. ఈ విధంగా వెయ్యి కోట్లకు మించి జిసిసి వ్యాపార లక్ష్యాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా ప్రవేశపెడుతున్న ప్రతిఒక్క పథకంలోను గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం వలన ఇప్పటి వరకు 500 మందికి పైగానే అవకాశాలు పొందగలిగారని సంబంధితాధికారి ఒకరు ఆంధ్రభూమికి గురువారం తెలిపారు.