ఆంధ్రప్రదేశ్‌

కాల్‌మనీ దందాను కూకటివేళ్లతో పెకలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 31: దశాబ్దాల తరబడి వడ్డీ వ్యాపారాలు జరుగుతుండటం చూశాం కానీ కాల్‌మనీ ముసుగులో మహిళలపై వేధింపులే గాక అరాచకాలు, అకృత్యాలకు పాల్పడుతున్న కాల్‌మనీ దందాను కూకటివేళ్లతో పెకిలించాలి.. బాధితులకు అన్ని వర్గాలు బాసటగా నిలవాలి.. పేదలు విద్య, వైద్యం వంటి అత్యవసరాల కోసం కాల్‌మనీదారుల వద్దకు వెళ్లకుండా జాతీయ బ్యాంకులు అండగా నిలవాలంటూ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ అధ్యక్షతన తొలిసారిగా ‘కాల్‌మనీ వ్యవహారం’పై మంగళవారం నాడిక్కడ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో జరిగిన ఓపెన్ హౌస్‌లో పాల్గొన్న పలు వర్గాల ప్రతినిధులు ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముందుగా పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ 2010 నుంచి 2015 డిసెంబర్ 16వ తేదీ వరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో కేవలం 8 కాల్‌మనీ కేసులు నమోదు కాగా ఆ తర్వాత ఇప్పటివరకు 136 కేసులు నమోదయ్యాయి, 127 మంది అరెస్ట్ అయ్యారని తెలిపారు. గత డిసెంబర్ 10వ తేదీ ఓ మహిళా బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి చేసిన ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ చేపట్టిన తర్వాత ఒకదాని వెంట మరొకటిగా మొత్తం 1234 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. కాల్‌మనీ సెల్ ద్వారా సమాజంలో పేరొందిన నల్గురు నాయకత్వంలో నాలుగు కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసి ఉభయులను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ద్వారా 441 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందన్నారు. 208 ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపి 110 కేసులు నమోదు చేశామన్నారు. 63 ఫిర్యాదులు ఫాల్స్‌గా గుర్తించి తిరస్కరించినట్లు తెలిపారు. తొలి రోజుల్లో 176 దాడులు జరిపి 51 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 1469 సంతకాలతో కూడిన ఖాళీ ప్రాంసరీ నోట్లను 911 సంతకాలతో కూడిన బ్లాంక్ చెక్‌లను, 59 పాస్‌బుక్‌లు, 83 ఎటిఎం కార్డులను స్వాధీనపరచుకోటం జరిగిందన్నారు.
ఇదే సమయంలో కాల్‌మనీదారులు తమ వద్దనున్న ఖాళీ ప్రాంసరీ నోట్లను తగలబెట్టినట్లు వార్తాకథనాలు వచ్చాయంటూ ఈ వ్యవహారంలో మొదటి నుంచి మీడియా క్రియాశీలక పాత్ర వహించిందంటూ అభినందించారు. బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కాల్‌మనీ కేసులో ఒక్కరికైనా జైలుశిక్ష పడగలదని తాను భావించడం లేదన్నారు. పోలీసులకు భయపడి కొందరు రాజీపడవచ్చని ఇలాంటి పంచాయతీలు చట్టవిరుద్ధమైనప్పటికీ కాల్‌మనీదారులు వ్యవహరించిన తీరువల్ల న్యాయవాదులు కూడా పోలీస్‌శాఖకు సంపూర్ణ మద్దతు నివ్వాల్సి వచ్చిందన్నారు. అసలు మనీ ఎక్కడ వుంటే అక్కడ కాల్‌మనీ ఉంటుందన్నారు. అవినీతిపరులైన పోలీస్ అధికారులను కాల్‌మనీ సెల్‌కు దూరంగా ఉంచాలని సూచించారు.
ఖాళీ ప్రాంసరీ నోట్లు, చెక్కులపై సంతకాలు చేసినప్పుడు వాటిపై ఎంత మొత్తాలు ఉంటే ఆ మొత్తాలను ఖచ్చితంగా సంబంధిత వ్యక్తులకు చెల్లించాల్సిందేనని ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని పలువురు న్యాయవాదులు స్పష్టం చేసారు. కౌన్సిలింగ్ బృందాలకు నాయకత్వం వహించిన డాక్టర్ కీర్తి, విద్యాసంస్థల అధినేత చౌదరిబాబు, న్యాయవాది సునీల, ఎంసి దాస్ తదితరులు తాము విచారించిన కేసులకు సంబంధించిన కొన్ని సంఘటనలు వివరిస్తుంటే కాల్‌మనీదారులు ఎంతటి నీచానికి ఒడిగట్టారోనంటూ పలువురు ఆగ్రహించారు. అవసరాల కోసం తమ వద్దకు వచ్చే వారి నుంచి ఖాళీ ప్రాంసరీ నోట్లు, చెక్‌లను, అలాగే ఆస్తుల తాకట్టు పత్రాలు, సేల్ అగ్రిమెంట్‌లను తీసుకుని నెలవారీ చెల్లింపులు జరిపినా వాటిని వెనక్కి ఇవ్వకుండా ఎలా వేధించారో వివరించారు. పారిశ్రామికవేత్తలు యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్, వీరమాచినేని రంగప్రసాద్‌లు మాట్లాడుతూ ముద్ర పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండా రూ.50వేల నుంచి ఐదు లక్షలు వరకు రుణం అందించేందుకై కేంద్రం రూ.20వేల కోట్లు కేటాయించిందని, దీన్ని బ్యాంకర్లు మానవతా దృక్పథంతో పేదలకు సహాయపడాలని కోరారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మి, మాజీ ఎంపి చెన్నుపాటి విద్య, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, బార్ అధ్యక్షులు మన్మథరావు, పలు రంగాల ప్రముఖులు మలినేని రాజయ్య, చెన్నుపాటి వజీర్, ఎస్‌బిఐ రీజనల్ మేనేజర్ గరికపాటి వెంకట్, తదితరులు మాట్లాడారు.