ఆంధ్రప్రదేశ్‌

హెచ్‌ఓడీలు బయటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 22: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి హైదరాబాద్‌లో ఎక్కడా పొంతనలేని విధంగా ఎడబాటుగా ఉంటూ వస్తున్న సచివాలయం సిబ్బంది, డైరెక్టరేట్ కార్యాలయాల సిబ్బందిని తొలిసారిగా అమరావతిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయంలో ఒకే గొడుగు కిందకు తీసుకురావటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇదే సమయంలో ఈ రెండు విభాగాల మధ్య కూడా చాపకిందనీరులా ఆధిపత్యపోరు కూడా చోటుచేసుకుంది. ఎంతోకాలంగా దూరంగా ఉంటూ వస్తున్న హెచ్‌ఒడి కార్యాలయాలను తాత్కాలిక సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు వీలు లేదంటూ సచివాలయ సిబ్బంది కూడా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతమయ్యారు. ముఖ్యమంత్రి మెడికల్ ఎంసెట్ ఫలితాల విడుదల సమయంలో అన్యాపదేశంగానే ముఖ్యమంత్రి, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సచివాలయం సిబ్బంది, డైరెక్టర్లు, హెచ్‌ఒడి కార్యాలయాల సిబ్బంది ఒకేచోట ఉంటే పరిపాలన మరింత వేగవంతమయ్యేదని ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. సమాన వేతనాలు పొందుతున్నప్పటికీ తమను ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తున్నారనే బాధను హెచ్‌ఒడి సిబ్బంది వ్యక్తం చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రుల పేషీలు, ముఖ్య కార్యదర్శి పేషీలతోపాటు 55 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఈ విభాగాలకు ఐఎఎస్ హోదా కలిగిన ప్రిన్సిపల్ సెక్రటరీలు అధిపతులుగా వ్యవహరిస్తున్నారు. పరిపాలనకు సంబంధించిన అన్ని జీవోలను తామే విడుదల చేస్తామని, అలాగే కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ తాము కీలకపాత్ర వహిస్తున్నామనే భావన సచివాలయంలో కన్పిస్తుంటుంది. ఈ కారణంతో ఎప్పుడైనా హెచ్‌ఓడి అధిపతులు లేదా అక్కడ పని చేసే సిబ్బంది ఏదైనా ఫైల్ పట్టుకుని సచివాలయానికి వస్తే చిన్నచూపు చూస్తుంటారని, పైగా కొందరైతే ‘ఇండెంట్’లు పెడుతుంటారని వారు వాపోతుంటారు. ఇక హెచ్‌ఒడిలకు విభాగాధిపతులు ఐఎఎస్ హోదా కలిగిన వారైతే కమిషనర్‌లుగా, ఇతరులైతే డైరెక్టర్‌లుగా వ్యవహరిస్తుంటారు. పరిపాలనలో చీఫ్ సెక్రటరీ అర్హతతో కీలకపాత్ర వహించే చీఫ్ సిఎల్‌ఆర్ కార్యాలయం ఎందుకనో మొదటినుంచి సచివాలయం వెలుపలే ఉంది. ఇక సచివాలయ సిబ్బందికి హెచ్‌ఓడి సిబ్బందితో పోలిస్తే రెండు ఇంక్రిమెంట్లు ఎక్కువే. త్వరితగతిన పదోన్నతులూ లభిస్తుంటాయి. ఇక్కడ క్లర్క్, టైపిస్టులకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎఎస్‌వో క్యాడర్‌గా వ్యవహరిస్తారు. పదోన్నతిపై సిటివో వంటి కీలక పోస్టులలో నియమితులు కావచ్చు. లేదా డెప్యూటీ సెక్రటరీలుగా అక్కడ పని చేయవచ్చు. అదే డైరెక్టర్ కార్యాలయాల్లో అయితే క్లర్క్‌లు, టైపిస్టులుగానే విధులు నిర్వర్తించాల్సి ఉంది. పదవీ విరమణకు ముందుగా ఏదైనా పదోన్నతి లభిస్తే సీనియర్ అసిస్టెంట్‌లు... మహా అయితే మరో పదోన్నతిపై సూపరింటెండెంట్‌లు కాగలరు. గంపెడు చాకిరీ ఉన్నప్పటికీ సచివాలయం సిబ్బందికి ఉన్న గౌరవం వీరికి లభించదు. రాష్ట్ర నూతన రాజధాని అమరావతి వెలగపూడిలో 45 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం పేరిట యుద్ధప్రాతిపదిన నిర్మితమవుతున్న ఆరు బ్లాక్‌ల నిర్మాణం కోసం ఇప్పటికే దాదాపు రూ. 800 కోట్లు ఖర్చు చేశారు. తొలుత గ్రౌండ్ ఫ్లోర్ ఆపై రెండు అంతస్తులతో వీటిని నిర్మాణం చేపట్టారు. డైరెక్టరేట్ కార్యాలయాలను కూడా ఇక్కడికే తరలించాలనే ఆలోచనతో ఆ బ్లాక్‌లలో అదనంగా మరో రెండు అంతస్తులను నిర్మించడానికి టెండర్లు ఆహ్వానించారు. అయితే కలిసి ఉండటానికి సచివాలయం సిబ్బంది పెట్టిన పేచీతో అమరావతి వెలువల అటు గుంటూరు లేదా ఇటు కృష్ణాలో అద్దె భవనాల్లో హెచ్‌ఓడి కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకోసం కృష్ణా జిల్లాలో 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాలను గుర్తించారు. అంటే హైదరాబాద్‌లో మాదిరిగానే హెచ్‌ఓడి కార్యాలయాలు ఒక దానితో మరొక దానికి సంబంధం లేకుండా విసిరేసినట్లే ఏర్పాటవుతాయి. కొనమెరుపు ఏమిటంటే తాత్కాలిక సచివాలయం అత్యాధునిక ఫర్నిచర్‌తో ముస్తాబవుతుండగా అద్దె భవనాల్లో ఏర్పాటు కానున్న డైరెక్టర్ కార్యాలయాలకు హైదరాబాద్‌లో ఉన్న పాత ఫర్నిచర్‌ను తరలించటం ప్రారంభించారు.