ఆంధ్రప్రదేశ్‌

తుంగభద్ర డ్యాంకు పూడిక ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మే 21: కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర డ్యాంకు పూడిక ముప్పు పొంచి ఉంది. డ్యాంలో రోజురోజుకూ పూడిక పేరుకుపోవడంతో నీటి మట్టం సామర్థ్యం తగ్గిపోతోంది. అంతేకాకుండా పూడిక పెరగడంతో రాష్ట్రాల వాటా తగ్గిపోయి మూడు రాష్ట్రాలకు నీటి సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. డ్యాం పూర్తి స్థాయిలో నిండినప్పటికీ ఆ నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డ్యాంను పరిరక్షించాల్సిన అవసరం కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలపై ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మూడు రాష్ట్రాలతో చర్చించి నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలి. లేనిపక్షంలో ఈ మూడు రాష్ట్రాల్లో ఆయకట్టు భూములకు నీరందక వేలాది ఎకరాలు బీడు భూములుగా మారే పరిస్థితి ఏర్పడింది. 1953లో డ్యాం ప్రారంభం సమయంలో 132 టిఎంసిల నీటి సామర్థ్యం ఉండేది. అయితే రోజురోజుకూ డ్యాంలో పూడిక పెరిగిపోవడం ఆందోళన కల్గిస్తోంది. 1978లో పూడిక పెరిగి డ్యాం నీటి సామర్థ్యం 117 టిఎంసిలకు తగ్గిపోయింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2015 నాటికి 100 టిఎంసిలకు పడిపోయింది. అంటే పూడిక 30 టిఎంసిల వరకూ పేరుకుపోయింది. అధికారుల నివేదిక ప్రకారం తుంగభద్ర డ్యాంలో నిల్వ చేసిన వరద నీటిలో 85 శాతం వ్యవసాయం, 10 శాతం తాగునీరు, 4 శాతం పరిశ్రమలకు, కేటాయించాలి. అయితేప్రతి ఏడాది 0.5 టిఎంసిల పూడిక డ్యాంలో చేరుతోంది. 2008లో జరిపిన హెడ్రోగ్రాఫిక్ అండ్ రిమోట్ సెన్సింగ్ సర్వే ప్రకారం డ్యాంలో 28 టిఎంసిల నీరు నిల్వ చేసేంత పూడిక పేరుకుపోయినట్లు స్పష్టమైంది. అయితే ప్రస్తుతం 34 టిఎంసిలకు పైగానే పూడిక ఉన్నట్లు అధికారుల అంచనా. ఈ పూడిక తొలగింపునకు 10 కోట్ల వ్యయం, 3 నెలల సమయం పడుతుంది. ముఖ్యంగా డ్యాంలో తీసిన పూడిక నిల్వ చేయడానికి 1000 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అధికారుల అంచనా. దీంతో పూడిక తీయడం సమస్యగా మారింది. ఇదిలా ఉండగా పూడిక పెరిగిపోవడం వల్ల డ్యాంలోకి వస్తున్న నీటిని వినియోగించుకోవడంలో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పూర్తిగా విఫలం అవుతున్నాయి. వరదలు వచ్చినా డ్యాం నుంచి నీటిని వినియోగించుకుంటున్నది 130 టిఎంసిలే ఉంటోంది. అది కూడా ఇటీవల కాలంలో పూర్తిగా తగ్గిపోయింది. 2015వ సంవత్సరంలో డ్యాం నిండి 100 టిఎంసిల నీరు వృథాగా శ్రీశైలం డ్యాంకు చేరాయి. కానీ రబీ పంటకు నీరు లేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కాలువలు పటిష్టంగా లేకపోవడం ప్రతి ఏడాది వాటి మరమ్మతుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా అవినీతి అక్రమాల వల్ల ఆయా కాలువలు బలహీనంగా ఉన్నాయి. అంతేకాకుండా తుంగభద్ర డ్యాం వెనుక వైపు పెద్దఎత్తున గనుల తవ్వకాల వల్ల వస్తున్న మట్టి డ్యాంకు పెనుముప్పుగా మారింది. ఇకనైనా మూడు రాష్ట్రాలు ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి తుంగభద్ర నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలి.బ్రిజేష్‌కుమార్ తీర్పు పరిగణలోకి తీసుకుని రాజోలిబండ ఆనకట్టలో రాష్ట్రానికి కేటాయించిన 5 టిఎంసిల నీటిని వినియోగించే కుడి కాలువను యుద్ధప్రతిపాదికన నిర్మించాల్సిన అవసరం ఉంది. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి సమాంతర కాలువ నిర్మాణం చేపడితే కర్ణాటకతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మూడు రాష్ట్రాలు ఒప్పందానికి వచ్చి డ్యాం ఎత్తు పెంచేందుకు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉందన్న విషయాన్ని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.

చిత్రం తుంగభద్ర డ్యాంలో పెద్దఎత్తున పేరుకుపోయిన పూడిక