ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమి కమిటీలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలను రద్దు చేయాలన్న ఆలోచనకు వచ్చింది. సోమవారం విజయవాడలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరుకు ఈ కమిటీ సభ్యులే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కమిటి సూచించిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయి. పట్టణ, నగరం ప్రాంతాల్లో ఈ కమిటీలు ఎమ్మెల్యేల కనుసన్నలలో పనిచేస్తున్నాయి. ఇక్కడ పెద్దగా వివాదం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు జన్మభూమి కమిటీ సభ్యులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దీనివలన గ్రామ ప్రాంతాల్లో సర్పంచ్‌లకు విలువ లేకుండా పోయింది. ఒకవేళ టిడిపియేతర సర్పంచ్‌లు ఉన్నచోట వివాదాలు మొదలవుతున్నాయి. అలాగే జన్మభూమి కమిటీ సభ్యులు లబ్ధిదారుల నుంచి డబ్బులు గుంజుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా గ్రామాల్లో జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తిగా మారిపోయిందన్న విమర్శలు లేకపోలేదు.
జన్మభూమి కమిటీల వలన అధికారులకు గ్రామాల్లో విలువ లేకుండా పోయింది. కమిటీ సభ్యులు అంతా తామై వ్యవహరించడంతో అధికారులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోపక్క కొన్ని జిల్లాల్లోని మంత్రులు జన్మభూమి కమిటీలపై అసంతృప్తితో ఉన్నారు. కమిటీలను తొలగించాలని మంత్రులు కూడా ముఖ్యమంత్రికి సూచించినట్టు తెలుస్తోంది. కేవలం ఫించన్లు, రేషన్ కార్డులపైనే కాకుండా, కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘నరేగా’ పనుల్లో కూడా జన్మభూమి కమిటీ సభ్యులు జోక్యం చేసుకోవడం మంత్రులకు సుతారమూ ఇష్టం లేదు.
రాష్ట్రంలో పాలనపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతంగా నిర్వహించుకున్న సర్వేలో మంత్రుల తీరుపై ప్రతికూలమైన నివేదికలు వచ్చాయి. అలాగే జన్మభూమి కమిటీలపై కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. జన్మభూమి కమిటీల వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని నివేదికలు తేల్చి చెప్పాయి. దీంతో జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించింది. దీనిపై సోమవారం క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, జన్మభూమి కమిటీలను రద్దు చేయడం వలన తాము ఇబ్బంది పడతామని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వార్డులు, గ్రామ జన్మభూమి కమిటీల్లో పార్టీలోని సీనియర్ కార్యకర్తలను నియమించారని, వీటి వల్ల గ్రామాల్లో అందరికీ అన్ని విధాల లబ్ధి అందుతోందని తెలిపారు. వివాదాలు ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ కమిటీలను రద్దు చేయడం సరికాదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జన్మభూమి కమిటీ బాధ్యతలు కూడా తామే చూడాలంటే కష్టమే అవుతుందని ఆ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రద్దు చేస్తే పరిస్థితి ఏంటి?
జన్మభూమి కమిటీలు రద్దు చేయడం ద్వారా అందులోని పార్టీ కార్యకర్తలకు పనిలేకుండా పోతుంది. వీరికి ప్రత్యామ్నాయంగా ఏ పని కల్పించాలన్నది ఇప్పుడు పార్టీ ముందు ఉన్న ప్రధాన సమస్యగా తయారైంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే జన్మభూమి కమిటీలను రద్దు చేయకపోతే ఇతరత్రా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందువలన కమిటీల నుంచి బయటకు వచ్చే సభ్యులను ఏవిధంగా ఉపయోగించుకోవాలన్న అంశంపై సోమవారం క్యాబినెట్ సమావేశం తరువాత పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు,ప్రధాన కార్యదర్శి లోకేష్‌తోపాటు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు సమావేశం కానున్నారు.