ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగుల పిల్లల పేరిట సీట్లు రిజర్వ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 11: నూతన విద్యా సంవత్సరం ఆరంభం నాటికి హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ శాఖలన్నింటినీ రాజధాని అమరావతి ప్రాంతానికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈలోపుగానే తాత్కాలిక సచివాలయం నిర్మాణం కూడా పూర్తికానుంది. ప్రస్తుతానికి మరికొన్ని కార్యాలయాలను విజయవాడ, గుంటూరులో ఏర్పాటు చేయబోతున్నారు. పోలీసు సిబ్బందితో సహా మొత్తం 12వేల మంది ఉద్యోగులు తరలిరావాల్సి ఉండగా కనీసం 8వేల మంది తరలి వస్తారని భావిస్తున్నారు. వీరంతా ఇప్పటికే హైదరాబాద్‌లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉండటంతో వారు వారం వారం హైదరాబాద్ వెళ్లి రావటానికి వీలుగా ప్రభుత్వం వారానికి రెండు రోజుల సెలవుదినాలను ప్రకటించడమే కాకుండా 30శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లింపునకు కూడా అంగీకరించింది. వాస్తవానికి విజయవాడలో పనిచేసే ఉద్యోగులకు 20 శాతం హెచ్‌ఆర్‌ఏ మాత్రమే ఇస్తున్నారు.ఇదిలావుంటే నగరంలో పేరొందిన విద్యాసంస్థలు ఎల్‌కెజి నుంచి 10వ తరగతి, అలాగే ఇంటర్ తరగతుల్లో సీట్లను పూర్తిగా బ్లాక్ చేస్తున్నాయి. సీటు కోసం స్థానికులు ఆయా విద్యాసంస్థల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. డొనేషన్ రూపేణా సొమ్మును మరింత అధికంగా గుంజటానికి హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగుల పిల్లల కోసం సీట్లను రిజర్వ్ చేసి ఉంచాలంటూ రెవెన్యూ, విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి అనధికారికంగా తమపై ఒత్తిళ్లు వస్తున్నాయంటూ యాజమాన్యాలు బుకాయిస్తున్నాయి. లక్ష రూపాయల వరకు జీతాలు తీసుకునే అధికారులు, ఉద్యోగులే తరలిరావటానికి ఇష్టపడకపోతుంటే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎందరు వస్తారనేది చెప్పలేమని ఉద్యోగులే అంటున్నారు. మరోవైపు ఒకేసారి పెద్దసంఖ్యలో ఉద్యోగులు తరలి రానుండటంతో నగరంలో గృహ నిర్మాణ కార్యక్రమం రాత్రీపగలు తేడాలేకుండా సాగుతోంది. అప్పోసొప్పో చేసి పూరిళ్లు, పెంకుటిళ్లను పడవేసి వాటి స్థానంలో రెండు, మూడు అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. డాబాలు కలిగిన వారు అదనపు అంతస్తులను నిర్మిస్తున్నారు. ఇళ్ల యజమానులు అర్థంతరంగా అద్దెలు పెంచేసి ఇష్టం లేకపోతే ఖాళీ చేసిపోవాలంటూ అద్దెదారులను బెదిరిస్తున్నారు. ప్రస్తుతం రెండు బెడ్‌రూముల ఇంటి కోసం 10 నుంచి 12 వేల రూపాయల వరకు అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.