ఆంధ్రప్రదేశ్‌

నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 10: విశాఖ జిల్లా నక్కపల్లి సమీపం వెదుళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి తుని సమీపంలోని తలుపులమ్మతల్లి అమ్మవారి దర్శనానికి కారులో వెళ్తున్న 9 మందితో పాటు రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మరో ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు. కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడి, డివైడర్ అవతల వెళ్తున్న ట్రాలర్‌లో చిక్కుకుని నుజ్జునుజ్జయింది. కారులోని తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందగా, ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిలో బాలుడు ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డాడు. విశాఖ నగరంలోని బుచ్చిరాజుపాలెం, కరాస ప్రాంతాలకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన బంధువులు ఆదివారం ఉదయం తలుపులమ్మతల్లి దర్శనానికి కారులో బయలుదేరారు. కారులో నక్కా వెంకట లక్ష్మి (60), ఆమె పెద్దకుమార్తె కడియం పద్మ (40), మనవడు కుమార్ (19), మనవరాలు సాయిలక్ష్మి (16), రెండో కుమార్తె ఈదలాడ దేవి, ఈమె భర్త శ్రీనివాసరావు, పిల్లలు సాయి ధనుంజయ (13), పవన్ (10), దుర్గ అపర్ణ (6) ఉన్నారు. వీరు వెళ్తున్న కారు నక్కపల్లి సమీపంలోని వెదుళ్లపాలెం దగ్గరకు వచ్చేసరికి టైర్ పంక్చరైంది. వేగంగా వెళ్తున్న కారు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని విశాఖ వైపు భారీ ఇనుప పైపులతో వస్తున్న భారీ ట్రాలర్ కిందకు దూసుకెళ్లింది. వేగంగా వస్తున్న ట్రాలర్ బానెట్‌కు ట్రాలీకి మధ్య ఖాళీలో ఇరుక్కున్న కారును ట్రాలర్ 10 మీటర్ల వరకూ ఈడ్చుకుని పోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. ఇదే సందర్భంలో పాయకరావుపేట నుంచి పెదగుమ్ములూరుకు మోటార్ సైకిల్‌పై కుమారుడు అనంతసాగర వర్మ (7)తో కలిసి వెళ్తున్న దాట్ల చిరంజీవి రాజు (41)ను ట్రాలర్ ఢీకొట్టింది. దీంతో సాగరవర్మ అక్కడికక్కడే మృతి చెందగా, చిరంజీవి రాజు తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న చిరంజీవి రాజును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు.
ప్రమాదంలో భారీ ట్రాలర్ బాయినెట్‌కు, వెనుక ట్రాలీకి మధ్యలో చిక్కుకున్న కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అసలు కారులో ఎంతమంది ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి, ఎవరైనా ప్రాణాలతో మిగిలితే రక్షించేందుకు సైతం సాధ్యం కాని విధంగా ట్రాలర్ మధ్యలో కారు చిక్కుకుపోయింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న నక్కపల్లి, పాయకరావుపేట పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని కారును బయటకు తీసేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఇనుప పైపులను క్రేన్‌ల సహాయంతో తొలగించి ట్రాలర్ బాయినెట్ కింద చిక్కుకున్న కారును బయటకు తీశారు. అప్పటికే కారులో ఉన్నవారంతా మృత్యువాత పడినట్టునిర్ధారించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు సైతం పోలీసులకు, సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన వారికి కష్టతరమైంది. కారు భాగాలను వేరు చేసి మృత దేహాలను బయటకు తీశారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ యువరాజ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెసుకున్నారు. మృతుల కుటుంబాలకు సిఎం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాద మృతదేహాలకు తక్షణమే పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని నర్సీపట్నం ఆర్డీఓను ఆదేశించారు. సంఘటన స్థలానికి తక్షణమే వెళ్లి పోస్టుమార్టం పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే గోపాలపట్నం సమీపంలోని మృతుల కుటుంబాలకు అవసరమైన తక్షణ సాయాన్ని అందించాల్సిందిగా విశాఖపట్నం ఆర్డీవోను ఆదేశించారు. జరిగిన సంఘటన పట్ల జిల్లాకు చెందిన మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు.

చిత్రం... రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయన కారు