ఆంధ్రప్రదేశ్‌

తిరుమల ప్రయాణంలో చిల్లర కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 9: అతని పేరు వెంకటరెడ్డి, కర్నూలు సమీపంలోని ఓ పల్లెటూరు వాసి. కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం వెంకన్న దర్శనానికి తిరుమల వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తిరుపతి బస్టాండ్‌కు చేరుకున్నాడు. కర్నూలుకు వెళ్లే బస్సు ఎక్కిన తరువాత పెద్ద నోట్ల రద్దు విషయం తెలిసింది. ప్రయాణికులతో కండక్టర్ వాగ్వివాదానికి దిగడంతో అసలు సంగతి తెలుసుకుని తన జేబు వైపు చూసుకోగా ఆరు రూ.500 నోట్లు కనిపించాయి. కండక్టర్‌కు ఇచ్చేందుకు రూ.100 నోటు ఒక్కటీ లేదు. ఎటిఎం కేంద్రం వద్దకు వెళ్లి ప్రయత్నిద్దామనుకుంటే అక్కడ పెద్ద క్యూ లైను కనిపించింది. అక్కడి నుంచి రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ల కోసం ప్రయత్నించగా అక్కడా చిల్లర కావాలని డిమాండ్ చేశారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, కర్నూలు చేరాలంటే రూ.100 నోట్లు ఖచ్చితంగా కావాల్సిందేనని గ్రహించాడు. ఈలోగా కర్నూలు వెళ్లే ప్రయాణికులు చిల్లర లేక ఇబ్బందులు పడుతున్న దృశ్యం కనిపించింది. అంతా ఒక చోట చేరారు. కుటుంబ సభ్యులను పోలీసు ఔట్ పోస్టు వద్ద కూర్చోబెట్టి బస్టాండ్ సమీపంలో హోటళ్లు, దుకాణాల వద్ద చిల్లర కోసం ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఏం చేయాలో పాలుపోక తిరిగి కుటుంబసభ్యుల వద్దకు చేరకున్నారు. అప్పటికి అర్ధరాత్రి అయింది. ఇంతలో వారిలో ఒకరికి ఓ ఆలోచన వచ్చింది. తిరుమల వెళ్లి హుండీలో కానుకలు వేసే భక్తుల నుంచి చిల్లర తెచ్చుకుందామని అన్నాడు. ఆ ఆలోచన వచ్చిందే తడువు తిరుమల వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడకు వెళ్లాలంటే కనీసం రెండు వంద నోట్లయినా కావాలి. బస్టాండులోని ఓ హోటల్ యజమానిని బతిమిలాడగా రెండు వంద రూపాయల నోట్లు ఇచ్చారు. అతనికి ఓ రూ.500 నోటు ఇచ్చి తిరుమల నుంచి వచ్చి రూ.200 ఇచ్చి తీసుకుంటామని హామీ ఇచ్చి వెంకటరెడ్డి మరో ఇద్దరు తిరుమల వెళ్లారు. అక్కడ ఒకరు క్యూ లైను వైపు, మరొకరు క్యూ కాంప్లెక్స్ వైపు, మరొకరు లడ్డూ కౌంటర్ వైపు వెళ్లారు. సుమారు గంట ప్రయత్నం తరువాత ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున రూ.100 నోట్లు లభించాయి. బతుకు జీవుడా అంటూ తిరుమల వెంకన్నకు బయటి నుంచే మరోమారు దండం పెట్టుకుని తిరుపతికి బుధవారం ఉదయం 5 గంటల సమయంలో చేరుకున్నారు. 6 గంటలకు బస్సు ఎక్కి కర్నూలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ కష్టాలు పగవాడికి కూడా వద్దని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకుని సమయం ఇచ్చి ఉంటే తమకు ఈ కష్టాలు తప్పేవని అభిప్రాయపడ్డారు. విషయం తెలియక తాము చిల్లర కోసం పడిన కష్టాలు ఊహించుకుంటేనే భయంగా ఉందని వెంకటేశ్వరుడి దయ వల్ల కష్టాలు పడినా ఇంటికి చేరుకోగలిగామని తెలిపారు.