ఆంధ్రప్రదేశ్‌

సీమ జనం.. ఇళ్లకే పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు/అనంతపురం/కడప, మార్చి 22: కరోనా (కొవిడ్-19)వైరస్ ప్రస్తుతం దేశంలో 2వ దశలో వుందని, ఈ వైరస్ మరింత విస్తరించకుండా అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు రాయలసీమ ప్రజలు స్పందించి ఆదివారం స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు కరోనా భయంతో ఇళ్లను వదిలి బయటకు రాలేదు. ఒక రోజుకు కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతరత్రా వస్తువులను ప్రజలు ముందు రోజునే సమకూర్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ముందస్తు చర్యలు తీసుకుని స్వీయ గృహ నిర్బంధం పాటించారు. ఇక కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు సమాజానికి సేవ చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, తదితర ప్రభుత్వ సేవకులకు ప్రజలు సాయంత్రం 5 గంటల సమయంలో వారి ఇళ్ల ముందు నిల్చుని చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలిపారు.
ఒక్క పిలుపుతో ఒక్కటైన జనం..
కర్నూలు: దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ఒక్క పిలుపుతో దేశ ప్రజలంతా ఒక్కటై కరోనా వైరస్(కొవిడ్-19ను) ఎదుర్కొనేందుకు గట్టి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ప్రజలు కూడా తమవంతుగా జనతా కర్ఫ్యూలో పాల్గొని వైరస్‌ను ఎదుర్కొనేందుకు తాము సైతం అంటూ సంఘీభావం తెలిపారు. జిల్లాలో మారుమూల గ్రామం నుంచి కర్నూలు నగరం వరకూ వ్యవసాయ కూలీ నుంచి జిల్లా కలెక్టర్ వరకూ జనత కర్ఫ్యూలో భాగస్తులయ్యారు. జిల్లాలో ఎక్కడా కూడా జనసంచారం లేకుండా వీధులన్నీ బోసిపోయాయి. ఇక వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మరికొద్ది రోజులు ఇలాగే వుంటే బాగుంటుందన్న వైద్య నిపుణుల సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకూ అత్యవసర సర్వీసులు మినహా అన్నీ బంద్ చేయాలన్న ప్రకటనకు సైతం ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. కరోనా వైరస్ ధాటిని ఎదుర్కొనేందుకు రెండురోజుల క్రితమే జిల్లాలోని ప్రముఖ ఆలయాలైన శ్రీశైలం, మహానంది, యాగంటి, మంత్రాలయం మఠం వంటి పుణ్య క్షేత్రాల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని రద్దు చేశారు.
గడప దాటని ‘అనంత’ జనం..
అనంతపురం : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని పారదోలేందుకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఆదివారం అనంతపురం జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి విజయవంతం చేశారు. జనం అందరూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకూ ఇళ్లకే పరిమితమై గడప దాటి బయటకు రాకుండా స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఈ స్ఫూర్తితో కరోనా వ్యాధి సంక్రమణ గొలుసును తెంపేసేందుకు మరికొన్ని రోజులు కూడా సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించడం విశేషం. జిల్లా కేంద్రమైన అనంతపురం నగరంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాలు, పంచాయతీలు మొదలు మారుమూల గ్రామాల వరకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూకు సహకరించారు. అత్యవసర సేవలకు మినహా ఎవరూ బయట తిరగకపోవడం విశేషం. అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలు, చివరకు నిత్యావసరాలు విక్రయించే కిరాణా షాపులు కూడా బంద్ పాటించాయి. ఏ విధమైన రవాణా కూడా లేకపోవడంతో నిర్మాణుష్యం రాజ్యమేలింది. కాగా ఉదయం జిల్లాలో చాలా చోట్ల పాల ప్యాకెట్లు లభించక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు ఆహార పదార్థాలు లభించక ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో జనం అందరూ ఇళ్లలో ఉండగా, పోలీసులు రోడ్లపైకి వచ్చి కర్ఫ్యూను పర్యవేక్షించారు.
స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ..
కడప: ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు కడప ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. మీడియాలో కరోనా వైరస్ ప్రభావం, ప్రమాదంపై విస్తృతంగా ప్రచారం జరగడంతో ప్రజల్లో ఒక రకమైన భయం ఏర్పడి 95శాతం మంది ప్రజలు స్వచ్ఛందంగానే ఇళ్లకు పరిమితమయ్యారు. ఆదివారానికి అవసరమైన నిత్యావసర వస్తువులు శనివారమే కొనుగోలు చేశారు. ఏ పూటకు ఆ పూట నిత్యావసర వస్తువులు కొనే భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలీలు వంటి వారు కూడా ఈ జనతా కర్ఫ్యూకు సహకరించడం విశేషం. అయితే ఉదయం 7 తర్వాత కూడా అక్కడక్కడ కొంతమంది జనం బయట కనిపించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
*చిత్రాలు.. *జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం అనంతపురం నగరంలో నిర్మాణుష్యంగా మారిన టవర్ క్లాక్ సెంటర్
*కర్నూలు నగరంలో నిర్మానుష్యంగా మారిన కొండారెడ్డిబురుజు సర్కిల్