ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రం.. నిర్మానుష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 22: కరోనా నియంత్రణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ‘జనతా కర్ఫ్యూ’ స్వచ్ఛందంగా జరిగింది. పూర్తిస్థాయిలో విజయవంతమైంది.. రాష్టవ్య్రాప్తంగా 90శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కర్ఫ్యూతో కరోనాను కట్టడి చేయవచ్చనే భావనతో ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇళ్లలోంచి బయటకు కదల్లేదు. ఆదివారం సెలవురోజు కావటంతో ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 7గంటల లోపు పాలు, ఇతర నిత్యావసరాలకు మాత్రమే ప్రజలను అధికారులు బయటకు అనుమతించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. సినిమా హాళ్లు, హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో నగరాలు, పట్టణాల్లోని రోడ్లు వెలవెలబోయాయి. శనివారం రాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు నిలిపివేయటంతో పాటు ప్రైవేట్ వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ నియంత్రించారు. రాష్ట్ర మంత్రులు, ఉన్న తాధికారులు కూడా సాయంత్రం వరకు ఇళ్లలోనే గడిపారు. కరోనా నియంత్రణపై తమ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, జనతా కర్ఫ్యూ అమలు తీరుతెన్నులను ఇంటి నుంచే పర్యవేక్షించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ నిబంధనలతో పాటు వారంరోజులు ప్రత్యామ్నాయ పనిదినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. సచివాలయానికి వచ్చే సందర్శకుల సంఖ్యను మరింత
తగ్గించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. విజయవాడలో మరో పాజిటివ్ కేసు తేలటంతో అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి ఇటీవల విజయవాడ నుంచి గుంటూరుకు క్యాబ్‌లో ప్రయాణించాడనే సమాచారం అందుకున్న నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు నాలుగు రోజులు నగరంలో 144 సెక్షన్‌తో పాటు జనతా కర్ఫ్యూ పొడిగించనున్నట్లు ప్రకటించారు. రాజధాని ప్రాంతం కావటంతో పాటు సమీపంలోనే తాడేపల్లిలో ముఖ్యమంత్రి, నగర పరిసర ప్రాంతాల్లో మంత్రులు, ఇతర వీవీఐపీలు, విజయవాడ నగరం నడిబొడ్డున గవర్నర్ కార్యాలయం ఉండటంతో కరోనా నిర్మూలన చర్యలపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటు విజయవాడలో తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా వైద్యులు, విధుల్లో ఉన్న అన్నిరంగాల ఉద్యోగుల సేవలను అభినందిస్తూ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు చప్పట్లతో సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు జనతా కర్ఫ్యూ కారణంగా వెలవెలబోయాయి. విశాఖపట్నం, గన్నవరం, రాజమండ్రి, కడప విమానాశ్రయాలు, ప్రధాన రైల్వేస్టేషన్లు, విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో జిల్లాల్లోని ప్రధాన కూడళ్లు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసి సర్వీస్‌లను రద్దు చేయటంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాత్రి వరకు స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేశారు. అత్యవసర సర్వీస్‌లలో భాగంగా మందుల దుకాణాలను మాత్రమే తెరచి ఉంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో కలిసి విధిగా జనతా కర్ఫ్యూ పాటించారు.

*చిత్రాలు.. వైద్యులు, ఇతర బృందాలకు సంఘీభావంగా చప్పట్లు కొడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
*ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సూచనలిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి