ఆంధ్రప్రదేశ్‌

31 వరకూ లాక్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో రాష్ట్రంలోనూ ఈ నెల 31వరకూ లాక్‌డౌన్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్ ఒక్కటే మార్గమని, ఎవరూ తిరగకుండా ఉంచగలిగితే కట్టడి చేయగలమనే విశ్వాసం వ్యక్తం చేశారు. టెన్త్ పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని, ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోన్ వైరస్ నియంత్రణ చర్యలను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. మనం కూడా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. అయితే టెన్త్ పరీక్షలను, ఇతర పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయన్నారు. వ్యాపారులెవరైనా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధరలు పెరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. 10మందికి మించి ఎవరూ గుమిగూడవద్దని, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా 14రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని స్పష్టం చేశారు. రాబోయేరోజుల్లో నియోజకవర్గంలో 100 పడకలతో ఐసోలేషన్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 200 పడకలతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించానని తెలిపారు. దేశంలో 341 కేసులు నమోదు కాగా రాష్ట్రంలో 6కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. విదేశాల నుంచి వచ్చిన 11,670 మందిని ట్రాక్ చేయడంతో పాటు వారిపై నిఘా ఉంచామన్నారు. 10091 మందిని ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. 24మందికి ఆసుపత్రిలో సేవలు అందించామన్నారు. మరో 1550 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు, కళాశాలలను మూసివేశామని, అన్ని సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, సోషల్ ఈవెంట్స్ సెంటర్లను కూడా ఈ నెల 31వరకూ మూసివేయాలని ఆదేశించామని తెలిపారు. ఇప్పటికే 12రాష్ట్రాలు అంతర్రాష్ట రవాణా ప్రజారవాణా వ్యవస్థను నిలిపివేశాయన్నారు. మనం కూడా ఆ దిశగా అడుగులు వేయక తప్పదన్నారు. అంతర్రాష్ట్ర ప్రజారవాణా వ్యవస్థను ఆదివారం నుంచే నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆటోలు, టాక్సీలను అత్యవసర సర్వీసులకే వినియోగించుకోవాలన్నారు. అదికూడా కేవలం ఇద్దరినే ఎక్కించుకోవాలన్నారు. వస్త్ర దుకాణాలు, ఆభరణాల విక్రయ దుకాణాలు వంటివి ఈ నెల 31వరకూ మూసివేయాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం కూడా కేవలం కనీస సిబ్బందితో రొటేషన్ పద్ధతిలో పనిచేస్తుందని చెప్పారు.
మరీ అవసరమైతేనే..
మరీ అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే 12రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయని, మిగిలినవి కూడా సోమవారం ప్రకటించే వీలు ఉందన్నారు. 14రోజులు లాక్‌డౌన్ చేస్తే,
పరిస్థితి చక్కబడుతుందన్నారు. కనీసం ఈ నెల 31వరకూ దాన్ని అమలు చేయాల్సి ఉందన్నారు. తరువాత పరిస్థితి, కేంద్రం ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలా వచ్చినప్పుడు కనీసం 3అడుగుల దూరంలో ఉండాలన్నారు. పోలీసుల ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచుతామన్నారు. పోలీసు స్టేషన్లు కూడా తమ పరిధిలో ఏమిజరుగుతుందో చెప్పాలన్నారు. అందరూ ఇళ్లలోనే ఉండేలా గ్రామాల్లో కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ధరలు పెంచితే కఠిన చర్యలు
నిత్యావసర వస్తువుల ధరలు పెంచవద్దని, అలా పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. జైలుకు పంపేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. సరకులు, కూరగాయల ధరలు కలెక్టర్లు ప్రకటిస్తారని, ఆ ధరల కంటే ఎవరైనా ఎక్కువకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. టోల్‌ఫ్రీ నెంబరు ఇస్తున్నామని, దీనికి ఫోన్ చేస్తే పోలీసులు అప్రమత్తం అవుతారన్నారు. అత్యవసరాలు, నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్, ఔషధాల దుకాణాలు, పాలు, కూరగాయలు, కిరాణా షాపులు తెరిచే ఉంటాయన్నారు.
బడ్జెట్ నిర్వహణ కోసమే..
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను కొద్దిరోజులకే పరిమితం చేస్తూ నిర్వహిస్తామని చెప్పారు. నిజానికి అసెంబ్లీ కూడా ఉండకూదని, కానీ బడ్జెట్ కోసం నిర్వహిస్తున్నామన్నారు. వీలైనంత తక్కువ రోజులు నిర్వహిస్తామన్నారు. రైతులు, రైతు కూలీలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే పనులకు వెళ్లవద్దన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వయసు ఎక్కువ ఉన్నవారు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే ఎక్కువ ఇబ్బందని చెప్పారు. 80.9 శాతం మంది ఇళ్లలోనే ఉండి నయం చేసుకున్నారన్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ వేగంగా వ్యాపిస్తుందన్నారు. అవ్వాతాతలు బయటకు వెళ్లవద్దని, 10ఏళ్లలోపు పిల్లలను బయటకు పంపవద్దని సూచించారు. ఈ నెల 31వరకూ అందరూ దయచేసి ఇళ్లల్లోనే ఉండాలని, ఎక్కడికీ కదలొద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఈ నెల 29నాటికి రేషన్ అందుబాటులో ఉంచుతామని, రేషన్ సరకులు ఉచితంగా ఇస్తామన్నారు. ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఏప్రిల్ 4న వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. ఇందుకు 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ప్రజలు పరిస్థితులను గమనిస్తున్నారని, కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. అందరం ఒకటి కావాలని, దేశమంతా ఏకమవుతుందన్నారు. అందరూ ఒకే రకమైన అడుగులు వేస్తున్నారని, అవే అడుగులు మనం కూడా వేయగలిగితే దీన్ని కట్టడి చేయగలమన్నారు. అందువల్ల అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి