ఆంధ్రప్రదేశ్‌

అంతటా అటెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 21: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై రాష్ట్రం అంతటా ప్రజానీకం అ‘టెన్షన్’ అవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా కరోనాపై యుద్ధం ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులోభాగంగా ఆదివారం ఉదయం 7నుంచి రాత్రి 10గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని పాటించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా పరిశీలనలో ఉన్న కేసులు, వాటి వివరాలపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం రోజువారీ రిపోర్టులను పర్యవేక్షిస్తోంది. శనివారం నుంచి మంత్రు లు తమ జిల్లాల్లో పరిస్థితిని స్వయంగా అంచనా వేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కరోనా నియంత్రణ దిశగా చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపడలేదు. మున్సిపాలిటీలు,
పల్లెల్లో బ్లీచింగ్ చల్లటం మచ్చుకైనా కనిపించటంలేదు. దీనిపై ముఖ్యమంత్రి సైతం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లో ప్రధాన రోడ్లలో సైతం పారిశుద్ధ్య చర్యలు లోపించాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రాత్రి వరకు ప్రజారవాణాను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ సర్వీసులను శనివారం రాత్రి నుంచే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు కూడా ఈమేరకు నోటీసులు అందాయి.
ఇదిలావుంటే, రాష్ట్రం మొత్తంగా ఇప్పటివరకు 135మంది రక్త నమూనాలు సేకరించగా అందులో ముగ్గురికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. 108 మందికి నెగెటివ్ రిపోర్టులు రాగా, మరో 24మందికి సంబంధించిన పరీక్షా ఫలితాలు అందాల్సి ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కొద్దిరోజులుగా 1006 మందిని పరీక్షలకు గుర్తించారు. వారిలో 259 మందికి 28రోజుల పరిశీలన పూర్తికాగా, మరో 711మంది ఇళ్లలోనే ఐసోలేషన్ చర్యలు పాటిస్తున్నారు. ఇంకా 36మంది ఆసుపత్రుల్లో చేరారు. మరోవైపు విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా 14రోజులు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా కోటీ 33మంది ఆరోగ్య వివరాలను సేకరించారు. జిల్లాలవారీగా రక్త నమూనాల పరిశీలన వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళంలో 3, విజయనగరంలో 1, విశాఖపట్నం 31, తూర్పుగోదావరి 26, పశ్చిమగోదావరి 4, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఐదేసి మంది, ప్రకాశలో 7, నెల్లూరులో 10, చిత్తూరులో 24, కడపలో 10, అనంతపురంలో 4, కర్నూలులో ఐదుగురు కరోనా అనుమానితులకు రక్తపరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా అనుమానితుల గురించి సమాచారం అందించేందుకు 104 హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతోపాటు వలంటీర్ల ద్వారా సేకరిస్తున్న వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా ఉన్నతాధికారులు, సీఎంఓ కార్యాలయం పర్యవేక్షిస్తోంది. జనతా కర్ఫ్యూలో భాగంగా ముందురోజు నుంచే కొన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి. శానిటైజర్లు, మాస్క్‌లు అధిక ధరలకు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరలకే విక్రయిస్తున్నారు. కాగా జనతా కర్ఫ్యూ అమలు విషయమై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ముఖ్యమంత్రి జగన్ తగిన ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కాగా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కరోనా నియంత్రణపై ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అణువణువు నిశితంగా పరిశీలన జరుపుతున్నారు.

*చిత్రం... ప్రయాణికుల్లేక ఖాళీగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం