ఆంధ్రప్రదేశ్‌

ఒంగోలులో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 19: చైనాతోపాటు, ఇతర దేశాలను గజగజలాడించిన కరోనా వైరస్ ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రజలను వణికిస్తోంది. అదేవిధంగా జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు కరోనా వైరస్‌తో బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్‌పైనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఇతర దేశాలనుండి వచ్చే వ్యక్తుల ద్వారానే ఈ వైరస్ వ్యాప్తిచెందుతుండటంతో అన్నివర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలాఉండగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని జడ్‌పీ కాలనీకి చెందిన 24 సంవత్సరాల ఒక యువకుడు లండన్ నుండి విమానంలో హైదరాబాదుకు వచ్చాడు. అక్కడ నుండి ఈనెల 16వ తేదీన బస్ ద్వారా ఒంగోలుకు చేరుకున్నాడు. ఆ యువకుడికి కరోనా లక్షణాలు ఉండటంతో తక్షణమే అతడిని తల్లిదండ్రులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి ముక్కు, నోటినుండి వచ్చే ద్రవాలు, రక్తనమూనాలను సేకరించి ప్రభుత్వ వైద్యులు వైద్యపరీక్షల నిమిత్తం పూణేకు పంపారు. ఆ యువకుడికి వైరస్ సోకినట్లు బుధవారం అర్ధరాత్రి నివేదిక వచ్చింది. ఆ నివేదికతో జిల్లా యంత్రాంగం మొత్తం హై అలర్ట్ అయింది. అప్పటినుండి వైద్యాధికారులు, పబ్లిక్ హెల్త్ బృందాలు జడ్‌పీ కాలనీని జల్లెడపడుతున్నారు. వ్యాధిసోకిన బాధితుడి ఇంటివద్ద నుండి సుమారు మూడు కిలోమీటర్ల మేర ఆ ప్రాంతాన్ని కంటోన్‌మెంట్ జోన్‌గా జిల్లా అధికారులు ప్రకటించారు. పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించారు. ఆ ప్రాంతాన్ని రెండు వారాలపాటు హైరిస్క్ జోన్‌గా పరిగణలోకి తీసుకున్నారు. బాధితుడి బంధుగణంపై దృష్టిపెట్టి వారికి వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారవర్గాల ద్వారా సమాచారం. కరోనా వైరస్ కేసు నమోదు కావటంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటినీ ఈనెల 31వతేదీ వరకు మూసివేశారు. అదేవిధంగా సినిమా థియేటర్లను సైతం మూసివేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కంట్రోల్‌రూంను ఏర్పాటుచేశారు. ఇదిలాఉండగా బాధితుడు లండన్ నుండి వచ్చిన తరువాత ఎవరితో మాట్లాడారు అన్న కోణంపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ప్రధానంగా ఒంగోలులోని జడ్‌పీకాలనీ చుట్టుపక్కల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొంతమంది అయితే సుదూర ప్రాంతాలకు వారి పిల్లలను, పెద్దలను తరలించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఆప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. కరోనా వైరస్‌తో జిల్లాలోని ఎక్కువశాతంమంది ప్రజలు మాస్క్‌లు ధరించి తిరుగుతున్నారు. జిల్లావ్యాప్తంగా మాస్క్‌లతోపాటు, చేతులు శుభ్రం చేసుకునే మందులకు భారీగా డిమాండ్ పెరిగింది.