ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశంలో తొలి కరోనా కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో గురువారం తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా వైరస్‌ను జిల్లా నుంచి తరిమికొట్టేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. జిల్లాలో మరో ఏడు అనుమానాస్పద కేసులు నమోదు అయ్యాయని, వారికి ఐసోలేషన్ కేంద్రంలో వైద్యం అందిస్తున్నామన్నారు. కరోనా వైరస్ కేసు వెలుగుచూడటంతో గురువారం స్థానిక ప్రకాశం భవనంలోని తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్రమైన ఒంగోలు నగరంలో థియేటర్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. వివాహాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర వేడుకలను వాయిదా వేసుకోవాలన్నారు. పదిమంది కలిసి ఒకేచోట గుమికూడరాదని, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన అవసరంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఒంగోలు నగరం జడ్పీ కాలనీలో నమోదైన కేసును పరిగణలోకి తీసుకుని బాధితుడి గృహం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో సర్వేలెన్స్ బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.
వ్యాధికి గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులు, లండన్ నుండి వచ్చిన తరువాత ఎవరితో కలిసి మాట్లాడారో వారి వివరాలు సేకరించి పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. నగరమంతా అప్రమత్తంగా ఉండాలని, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, వార్డు వలంటీర్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 33, 37, 39 వార్డుల్లో అధికారుల పర్యవేక్షణలో సర్వేలెన్స్ బృందాలు, నగరపాలక సంస్థ బృందాలు కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాయన్నారు. నగరంలో వాల్‌పోస్టర్లు, కరపత్రాలతో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారు వైద్య, పోలీసు శాఖాధికారుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజలు సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు తీసుకుంటుందని, ప్రజలు సహకరించాలన్నారు. కరోనా వ్యాధికి మందులేదని, ముందస్తు జాగ్రత్త చర్యలతోనే నివారించవచ్చునని ఈ సమావేశంలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ముఖ్య సలహాదారు కమల్‌రాజు తెలిపారు. ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, వైద్యులు అందించాల్సిన సేవలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ సిద్దార్ధకౌశల్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ షన్మోహన్, జిల్లా సంయుక్త కలెక్టర్ -2 నరేంద్రప్రసాదు, డీఆర్‌ఒ వి వెంకటసుబ్బయ్య, జిల్లా అదనపు ఎస్పీ శరత్‌బాబు, వైద్య ఆరోగ్యశాఖాధికారిణి పద్మావతి, ప్రభుత్వ జనరల్ హాస్పటల్ సూపరింటెండెంట్ శ్రీరాములుతోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.